అనంతం ఏలే ఆదిదేవా...
అంతా భస్మమే భూదిదేవా
ఈ ప్రపంచమే అజ్ఞాన సోది దేవా
సోది నిండిన తొమ్మిది చిల్లుల దేహం
నీది చేసుకో దేవదేవా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
జీవితమే కర్మఫలాల లెక్క
నేనేమో కన్నీటి చుక్క
నువ్వేమో పన్నీటి చుక్క
సుఖ దుఃఖ అతీతమే రుద్రాక్ష ముక్క
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
తనువో తుమ్మచెట్టు
మనసో మద్ది చెట్టు
ఆత్మో అశ్వద్ద చెట్టు
చూపవయ్య ఈ చెట్ల మాటున దాగిన నీ లోగుట్టు...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఏది ఆశించి పుట్టెనో ఈ దేహము
ఈ దేహము నిండా ఉన్నది దాహము
దాహము నిండా ఉన్నది మోహము
మోహము నిండా ఉన్నది లోభము
లోభము నిండా ఉన్నది క్రోధము
ఈ దేహ దాహ, మోహ, లోభ, క్రోధాలను తినేది కాలమా...!
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
అనంతమే లింగాకారము
అనంతము నుంచి జారి నన్ను తడిపే
చినుకుల జలము
ఆ జలము నీ అభిషేక ఫలము
అందుకున్న నా జన్మ అద్వైత ఆనందము...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నీ మహిమే ఇల
నీవు కానరాకుండా అలుముకున్నది మాయావల
నిన్ను చేరి తరించడడమే నా కల
ఇలలో మాయ వలవేసి మరి
కలలతో ఆడుకునే నీ ఆట భళా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
తనువొక నీళ్ళకుండ
నీళ్ళకుండలో ఉంది మనసు బండ
మనసు బండకవతల ఆత్మకొండ
కుండలో బండను బండలో కాండను దాచిన
పరమాత్మ నీ ఆట భళా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మనిషి కన్నులు ఏరులవుతున్నవి
మనిషి మనసులు ఏడారులవుతున్నవి
మనిషి బ్రతుకులు ఏకాకులవుతున్నది
మనిషి కలలు వరదలో ఏకమవుతున్నవి
మనిషి హద్దులు వానచినుకుతో చెబితివా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నువ్వు దేవుడివి ఎపుడైతివి
నేను జీవుడిని ఎపుడైతిని
జీవుడి అజ్ఞానమును జీర్ణం చేసి
దేవుడయ్యే జిజ్ఞానను ఇవ్వవయ్యా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నిను చూడకుండ ఓ రోజు ఉండలేను
అట్టినాకు నీ దరికి చేరకుండా శిక్షనా...
గుడిలోనే నిన్ను చూసే నన్ను
అనంతంలో నిన్ను చూసే పరిణతి ఇస్తివా...
మైలను గెలిచే పరిక్షపెట్టినా పరమేశ్వరా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...