నేను రోజు
గుడికే వెళ్ళేవాణ్ణి
మా వాడు గర్భగుడికి వెళ్ళి
ఏ గర్భంలో పడని
వాడితో ఆడుకుంటున్నాడు...
ఈ ఆట ఎంత బాగుందో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నేను నిత్యం
గుడిలో కూర్చునేవాడిని...
మా వాడు గర్భగుడిలో కూర్చుని
నవ్వుతుంటే ఎంతబాగుందో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నేను సంధ్యావేళ
సదాశివుడిని చూస్తూ ఉండేవాణ్ణి
మా వాడు ముట్టుకుని మురిసిపోతుంటే ఎంత బాగుందో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నేను ఎప్పుడూ
అలంకారం చూసి ఆనందించేవాణ్ణి
మా వాడు అలంకారపు పూలను తీసి
నా మీదకేస్తుంటే ఎంత బాగుందో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నేను ప్రతిసారి గడప అంచుకు నిలబడి
నమస్కారం చేసేవాణ్ణి
మా వాడు గర్భగుడిలోకి రమ్మని
పిలవడం ఎంత బాగుందో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నా జీవన ఆటలు
మా వాడి అమాయకపు ఆటలు
అన్నీ నీ ఆటకు అలంకారాలు కదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
పెద్దోడు గణపతి చుట్టూ తిరుగుతుంటే
చిన్నోడు శివలింగం చుట్టూ బుల్లి నడకలు వేస్తుంటే
నా మనసు తడిసిముద్దవుతుంటే
మేఘము వచ్చి మా దేహాలను తడిపి ఇంటికి పంపడం ఎంత బాగుందో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నీ గుడిలో
నా గుండెగుడి
లేత హృదయాల ఆటతడితో
తడిసి సదాశివా అనడం ఎంత బాగుందో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నేను పూజ పువ్వును
పిల్లలు నీ పూజకు పరిమళించిన నీ ప్రసాద పరిమళాలు...
పరిమళపు అల్లరి నీ ఆట ఎంత బాగుందో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మా అమ్మ ఇచ్చిన జన్మ
ఆ అమ్మలకే అమ్మ
ఆదిఅమ్మతో కూడిన నీ నీడలో
నవ్వి ధర్మపు దారిలో నడవడం ఎంత బాగుందో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...