ఎటుచూసినా తప్పెడ చప్పుడు
కళ్ళను మూసి
మనసు తెరిచి ఆ చప్పుడు మూలానికి వెళ్ళాను
ఓంకార శబ్దం ఉవ్వెత్తున ఎగిసి మనసును అభిషేకం చేసింది
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
దాని పేరు మొహరమట
అందులో పీరీల గుంపట
ఆ గుంపు అన్యాయానికి ప్రాణం కోల్పోయింట
ఏటేటా వీరుల త్యాగమై బతికిందట
అధికార మంటల్లో అస్తమించిన ఆ అభాగ్యులను ఆది దేవుని భక్తులతో పూజలట
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
భోగం మత్తుయని
రోగం బాదయని
యోగం శాంతియని
త్యాగం గొప్పదిని
ధర్మం శాశ్వతమని పీరీలతో కూడా చెప్పించావా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నా దృష్టిలో అలాయి గుంతొక పాణమట్టం
అందులో నిప్పు సెగ అరుణాచల అగ్నిలింగం
చిందుల కోలాలం మూడత్వ మూర్ఖభక్తుల చిహ్నం
చిందులేసే పీరీ నాట్యం శివతాండవం
చెడులోను మంచిని చూసే దృష్టికోణం చాలు కదా బాగుపడడానికి...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మతం మంటలో రేగేది భూదే కదా
ఆ భూది నీ ఒంటికి చేరితే విభూదే కదా
పీరీలా నిప్పుల కొలిమి భూదిని చూసి నాది అనే వ్యాదిని భూది చేసుకోమని చెప్పావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
పూలమాలలో చంద్రుడితో ఇంటికొచ్చిన పీరీలో
భోళాశంకరుడి ఛాయ స్వరూపం దర్శనమిచ్చింది...
మనసు మంచిదైనపుడు
చెడులోను మంచిని చూసే దృష్టికోణం ఇస్తావా...?
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
పనిలోను పదనిసలోను
పరాయి మతాల పండుగలోను
పసలేని పనికిమాలిన మనుషులలోను
అంతటా నీవై
సృష్టి నావను నడుపుతూ
నన్ను చూసి నవ్వుతూ ఆటపట్టిస్తున్నావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
కోలాహలపు తలపు హాలాహలం
హాలహలపు తలపులో కోలాహలం
ఏ హలమైన నీ ఆటకు పూసిన పరిమళ ఫలం
పువ్వై కాయై పండై పండే నీ ఆట పండుగలకు వందనం
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మొహరం మాటున మసీదు సంబరాల్లో
మల్లెపూల సమేత మల్లికార్జునుడు
శ్రీశైలం ఎపుడొస్తావని అడిగాడు
ఉల్కిపడి నాలో నేను నవ్వుకున్నాను
ఆ నవ్వు అభిషేకపు శివలింగమాయే...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఆచారం మంచిదో చెడ్డదో
దాని వెనుక కథ నిజమే కాదో
మొహరమను ఈ కథలో ఊచకోతకు గురైన
71 మంది ధర్మపరులు మోక్షం పొందారా స్వామి
పొంది ఉంటారులే.., లేకపోతే ఇంతకాలం వారిని మోయదు కదా భూమి...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...