నా కంటనీరు నీ జటలో చినుకే కదా
నా ఇంట పువ్వు నీ పూజ ప్రసాదమే కదా
నా తనువు తపన నీ ఒంటి బూదే కదా
నా... నీ... బేధాన్ని భేదించి
నిన్ను కౌగిలించుకునే క్షణం ఇవ్వు ఈశ్వరా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నీడ నీలకంఠుడు
తోడు త్రయంకుడు
కూడు కపర్ధీశుడు
గూడు ఘుష్ణ్మేసుడు
కాడు సఖుడు స్నేహితుడు సదాశివుడు
ఇది చాలు కదా...!
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
చూపున్న వాడు చూడనిది గుడ్డివాడు చూస్తాడా
చెవులున్న వాడు విననిది చెవిటివాడు వింటాడా
మాటలున్న వాడు చేయనిది మూగవాడు చేస్తడా
లోపంలోను లోకంచూడని లౌఖ్యం దాచిన లోకేశ్వరా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నన్ను కొట్టినా భరిస్తాను
నన్ను తిట్టినా సహిస్తాను
నన్ను ఎగతాళి చేసినా పడతాను
నా ముందే ధర్మానికి హాని కలిగితే తిరగబడతాను
చేతకాకపోతే కంటనీటితో తడబడతాను
అధర్మ జాడను నా కంటి నీడకు చూపకయ్యా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నాకు ఊపిరి ఎందుకు ఇచ్చావు
నాలో నిజాయితీ ఎందుకు పెట్టావు
నాలో చెడును ప్రశ్నించే గుణం ఎందుకు పెట్టావు
ఎద్దుపై తిరిగే మొద్దు నిన్నే అడిగేది
దుర్మార్గుల మధ్యన నన్ను ఎందుకు ఉంచావు
ముద్దుగా సమాధానం చెప్పు శివయ్యా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నవమాసాలు
రొమ్ములో చనుబాలు
అమ్మ చెంత చిరునవ్వులు
నాన్న చెంత నడకలు
బాల్యానికి ఆటపాటలు
ఇచ్చిన నీ ఆటకు కృతజ్ఞతలు...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఒడిలో ఆత్మీయ దీవెనలు
బడిలో అక్షరాలు
గుడిలో సంస్కృతులు
బ్రతుకుబడిలో అనుభవాలు
అందించిన నీకు కృతజ్ఞతలు...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
అబద్ధాలు నటనలు
బడాయితనాలు
బలాదూర్ తిరుగుళ్ళు
బంధనాల బందీలు
నా జీవన దారిలో
తక్కువగా పెట్టినందుకు కృతజ్ఞతలు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మోసాలు
కుట్రలు
స్వార్థాలు
అవసరానికి వాడుకోవడాలు
అవహేళనలు
నాలో లేకుండా నన్ను తయారు చేసిన నీకు కృతజ్ఞతలు...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మోసాలను, స్వార్థాలను
కష్టాలను, కన్నీళ్ళను
భరిస్తూ తిరగబడి వాటినే చేయకుండా
సన్మార్గంలో నడిచే బుద్ధిని ఇచ్చిన నీకు కృతజ్ఞతలు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...