నన్ను పురుగుకన్నా హీనంగా
చూసి
హేళన చేసిన మనుషులకు
కష్టం వస్తే...
అది విని చలించిపోయి సాయం చేసే గుణం నాకు ఇచ్చావు...
నీ దయకు పాదాభివందనం శంకరా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మా పతనం కోరిన
మనుషులకు కూడా
సాయం చేసినప్పుడు కలిగే
ఆ ఆనందం
ఎంత గొప్ప ఆస్తి... ఎంత గొప్ప సంపదా...
ఈ అవకాశం ఇచ్చిన శివా...
నీకు ఋణపడి ఉంటా సదా...
నీ ఆటకు నేను పిధా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఆడుకునే వాడా...
నీ ఆటలో బొమ్మను
భావాల కొమ్మను
నీపై వాలే బిల్వపత్ర రెమ్మను
నిన్నే సర్వస్వం చేసుకుని బ్రతుకుతున్న జన్మను
నలుగురికి సాయం చేసే గుణం మాత్రం
నలుగురు నన్ను మోసేవరకు ఉండేలా చూడు శంకరా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఒకడు నన్ను మోసం చేస్తే బాధపడను
ఒకడు నన్ను అవసరానికి వాడుకుంటే బాధపడను
ఒకడు నన్ను అవమానిస్తే బాధపడను
నువ్వు నన్ను చూడకపోయినా
నువ్వు నాకు కనిపించకపోయినా
నువ్వు నాతో మాట్లాడకపోయినా
నువ్వు నాతో స్నేహం చేయకపోయినా
ఏడ్చేస్తాను శంకరా....
ఎందుకంటే నేను దేహాన్ని నువ్వే దీనిలోని ప్రాణం...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
రేపటికోసం తండ్లాడే దరిద్రం నాకివ్వలేదు
ఆస్తులు వెనకేయ మోసం చేసే బుద్ధి ఇవ్వలేదు
ఒకరిని ఎగతాళి చేసే తాటాకు నాలుకు నాకివ్వలేదు
ఒకరి ఎదుగుదలను చూసి ఏడ్చే పాడుగుణం ఇవ్వలేదు
ఇంతకంటే గొప్ప సంపద ఏముంది ఈశ్వరా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఎవడు ఏమన్నా
ఎవడు ఎగతాళి చేసినా
ఎవడు వచ్చినా
ఎవడు పోయినా
ఎప్పుడు నాతోనే తోడునీడై ఉండే తోడు నువ్వేకదా సదాశివ
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నీ జన్మకు మూలము లేదు
నీ మరణానికి తావులేదు
నీ ఆటకు అంతులేదు
నీ భక్తుడికి ఏమైనా భయచింతలేదు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నీకు అమ్మ ఎందుకు లేదు
నీకు నాన్న ఎందుకు లేడు
ఆది అంత్యాలను అర్థం చేసుకోలేని
అమ్మానాన్నలు దండగ అనుకున్నావా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
గెలుపు బాధను ఇస్తే
ఓటమి ఓదార్పును ఇస్తే
కష్టం కమ్మగా అనిపిస్తే
ద్రోహం ధైర్యం రెట్టింపు చేస్తే
అంతా నీ మాయ మలుపు కదా...!
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఊరికి శ్మశానం
ఊహకు శూన్యం
ఉత్సుకతకు ఉత్తేజం
ఉన్మాదమునకు ఉమ్ము
ఉమాశంకరునకు ఉమ్మెత్తపువ్వు
ఆహా..!
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...