భక్తి – జ్ఞానం
- పారనంది శాంతకుమారి
అందరు ఇష్టపడేది భక్తి
అందరూ అనుకరించేది జ్ఞానం
కనులుమూసుకొని చేసేది భక్తి,
మనసుతెరుచుకొని చూసేది జ్ఞానం
భక్తి అందరినీ వరిస్తుంది
జ్ఞానం కొందరికి మాత్రమే సొంతం
నమ్మకంతో చరిస్తుంది భక్తి
అనుభవమైతేనే దరిచేరుతుంది జ్ఞానం
భక్తికి విగ్రహం ముఖ్యం,
జ్ఞానానికి నిగ్రహం ముఖ్యం.
భక్తి బాహ్యాన్ని పరికిస్తుంది,
జ్ఞానం ఆంతర్యాన్ని పరిశీలిస్తుంది.
భక్తికి భావన ముఖ్యం,
జ్ఞానానికి మౌనం ముఖ్యం.
భక్తికి కనిపించేది ముఖ్యం,
జ్ఞానానికి అనిపించేది ముఖ్యం.
వేరుగా చూసేది భక్తి,
ఒకటిగా చూసేది జ్ఞానం.
వేరుగా ఉన్న భగవంతుని చేరుకొవాలని
చేసే ప్రయత్నమే భక్తి,
అతనే నేనని తెలుసుకోవాలని
చేసే ప్రయత్నమే జ్ఞానం.