బేక్టీరియంలు, విషాణువులు
ఒకొక్కప్పుడు సమీపార్థాలు ఉన్న రెండేసి ఇంగ్లీషు మాటలు తారసపడుతూ ఉంటాయి. ఉదాహరణకి: “ఇన్వెన్షన్, డిస్కవరి” (invention, discovery); “ఇన్ఫెక్షన్, కంటేజియన్” (infection, contagion); “ఛానల్, కెనాల్” (channel, canal); బేక్టీరియం, వైరస్ (bacterium, virus) మొదలైన పదబంధాలు విన్నప్పుడు ఈ జంటల మధ్య ఏ రకమైన సంబంధం ఉందో తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఈ విషయాల గురించి తెలుగులో రాయవలసి వచ్చినప్పుడు “ఈ మాటలకి సమానార్థకాలైన తెలుగు మాటలు ఏమిటి?” అనే సమస్య ఎదురవుతుంది.
ఇక్కడ ప్రస్తుతానికి బేక్టీరియం, వైరస్ అనే మాటల జంటని పరీక్షిద్దాం. ఈ రెండూ కంటికి కనబడనంత సూక్ష్మమైన శాల్తీలు. బేక్టీరియంల కంటే వైరస్ లు 200 రెట్లు చిన్నవి. బేక్టీరియం అనేది ప్రాణం ఉన్న శాల్తీయే కనుక దీనిని “సూక్ష్మజీవి” అనొచ్చు. వైరస్ అనేది ప్రాణం ఉన్న శాల్తీ కాదు; అలాగని జీవం లేని జడపదార్థమూ కాదు. వైరస్ అనేది త్రిశంకు లోకంలో ఉండి, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే ఒక ఆషాఢభూతి. “వైరస్” అనే మాటకి మూలం సంస్కృతంలోని “విషం,” లేటిన్ లోని “విస్కమ్.” దీనికి తెలుగులో “విషాణువు” అని పేరు పెడదాం.
కలరా, ప్లేగు, క్షయ, కుష్టు మొదలైనవి బేక్టీరియం వంటి సూక్ష్మజీవుల వల్ల వచ్చే జబ్బులు. మసూచికం, పోలియో, జలుబు, ఫ్లూ, మొదలైనవి విషాణువుల వల్ల వచ్చే రోగాలు. బేక్టీరియంలు అన్నీ రోగకారకులు కావు; కొన్ని మంచి చేసేవి కూడా ఉన్నాయి. విషాణువులు కూడా అన్నీ - నాకు తెలిసినంత మట్టుకి - రోగ కారకులు కావు. బేక్టీరియంలు వల్ల వచ్చే రోగాలని కుదర్చటానికి మందులు ఉన్నాయి. ఉదాహరణకి రకరకాల “ఏంటీ బయటిక్స్.” విషాణువులు వల్ల వచ్చే రోగాలని కుదర్చటానికి మందులు లేవనే చెప్పాలి; రోగం అంటకుండా జాగ్రత పడడానికి టీకాల మందులు తయారు చేసుకోవచ్చు కానీ వస్తే అనుభవించాలి తప్ప సుగమమైన మరో మార్గం లేదనే అనుకోవచ్చు. ఉదాహరణకి మసూచికం, పోలియో వంటి రోగాలు వస్తే మందులు లేవు - అవి సోకకుండా కాపాడుకోవడమే ఉత్తమమైన మార్గం.
ఇప్పుడు కోవిడ్-19 (COVID-19) అనే రోగానికి కారణభూతమైన SARS-CoV-2 అనే పేరుగల విషాణువుల గురించి - మరి కొంచెం తెలుసుకుందాం. COVID-19 అంటే Corona Virus Disease-2019 - అనగా 2019 లో బయటపడ్డ కిరీటం వంటి ఆకారం గల విషాణువు కలుగజేసే రోగం. ఈ విషాణువు పేరు SARS-CoV-2 (అనగా, Severe Acute Respiratory Syndrome ని కలుగజేసే రెండవ కరోనా వైరస్).
ముందస్తుగా ప్రాణం లేని విషాణువు మన ప్రాణాలకి ఎలా ముప్పు తెస్తుందో చూద్దాం. విషాణువు తామరతంపరలా విస్తరిల్లి వ్యాపించాలంటే అది తలదాచుకోడానికి ఒక గృహస్థు చోటు ఇవ్వాలి. మన శరీరంలోఉన్న జీవకణాలు ఈ పని చెయ్యడానికి సర్వ సమర్థులు. మన జీవకణాలు కర్మాగారాల లాంటివి; మన మనుగడకి కావలసిన సాధనసంపత్తి అంతా ఈ జీవకణాలలో ఉంది. విషాణువు జీవకణంలో ప్రవేశించి, ఈ సాధనసంపత్తిని వశపరచుకుని, తనని పోలిన నకళ్లని వేలకొద్దీ తయారు చేసుకుని వాటిని రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తుంది. ఈ నకళ్లు అన్నీ ఇతర జీవకణాల మీదకి దండయాత్ర చేస్తాయి. ఇలా అతి త్వరలో విషాణువులు జీవన ప్రక్రియలకి మూల స్తంభాలయిన జీవకణాలు తాము చెయ్యవలసిన పనిని చెయ్యలేక పోయేటట్లు చేస్తాయి.
కోవిడ్-19 ఎంత ప్రమాదకరమైన రోగం? తిష్ట రోగాలు (infections) అంటురోగాలు (contagious) అయినప్పుడు రెండు రకాల శక్తులు రంగంలోకి దిగుతాయి. ఉదాహరణకి పిచ్చికుక్క కాటు వల్ల వచ్చే తిష్ట మరొకరికి అంటుకోదు కానీ, తిష్ట తగిలిన వ్యక్తి బతకడం కష్టం. ఫ్లూ తేలికగా మరొకరికి అంటుకుంటుంది కానీ ఫ్లూ వచ్చినవాళ్లు అంత తేలికగా చచ్చిపోరు. ఈ కోణంలో ఆలోచిస్తే ఫ్లూ కీ కోవిడ్-19 మధ్య పెద్ద తేడా కనిపించకపోవచ్చు. కానీ ఏటేటా మనని పరామర్శ చేసి వెళుతున్న ఫ్లూ ని చూసి మనం భయపడడం లేదు కానీ కోవిడ్-19 పేరు వింటేనే భయం వేస్తున్నది. ఎందువల్ల? ఫ్లూ మనకి పరిచయం అయిన రోగం. దానిని ఎదుర్కోడానికి మన దగ్గర టీకాల మందు ఉంది. కోవిడ్-19 సరి కొత్త రోగం. దీని వ్యవహారం మనకి ఇంకా సమగ్రంగా అర్థం కాలేదు. ఈ తిష్ట సోకకుండా అడ్డుకోడానికి మన దగ్గర టీకాల మందు లేదు.
ఈ తిష్ట సోకిన వారి ప్రాణాలు కాపాడడం ఎలాగో మనకి ఇంకా అర్థం కావడం లేదు. ఒకరినుండి మరొకరికి అంటుకోకుండా ఈ తిష్ట సోకిన వారిని దూరంగా ఉంచుదామా అంటే ఇది ఎవరికీ సోకిందో, ఎవరికీ సోకలేదో తేల్చి చెప్పడానికి మన దగ్గర పరీక్షాపరికరాలు చాలినన్ని లేవు. ఇవన్నీ సమకూరిననాడు ఫ్లూని అదుపులో పెట్టినట్లే కోవిడ్-19 కూడా అదుపులో పెట్టవచ్చు. ఆ రోజు రాడానికి కొంచెం సమయం (ఒక సంవత్సరం వరకు) పడుతుంది. ఈ లోగా ఎవరి జాగ్రతలలో వారు ఉండడం కంటే చేయగలిగేది ఏదీ లేదు.
సామాన్యూలకు కూడా అర్ధమయ్యే భాషలో చాలా బాగా వ్రాసారు.