Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
శ్రీవేంకటేశ్వరాత్మీయదర్శనము

చం. మకుటలసద్వరాంగపరిమండితకర్ణకృపాకరేక్షణ
      ప్రకటితసుస్మితోష్ఠకటరాత్రికరాంచితనర్మఠస్ఫుర
      న్నకుటలలాటలగ్నమృగనాభిసుధానిధిచిత్ర మొప్పఁగా
      నికటము నందుఁ గన్పడిన నీవు వినా మన శక్యమే? హరీ!
భావము-
      కిరీటముతోప్రకాశించుచున్నశీర్షము, చక్కగా అలంకరింపబడిన చెవులు,
      కృపకు నిలయమైన కన్నులు, స్పష్టమైన మంచినవ్వుకలిగిన పెదవులు
      మఱియు చెక్కిళ్ళు, కర్పూరముతో పూజింపబడిన గడ్డము, మెఱయుచున్న
      నాసిక, నుదుటిపై స్థిరముగా ఉన్న కస్తూరి, కర్పూరముతోడి నామము,
      ఒప్పుచు, నాకు దగ్గఱగా కనుపించిన నీవు లేక బ్రతుక సాధ్యము కాదు,
      నారాయణా! 207

శ్రీవారి నవరాత్రిబ్రహ్మోత్సవగరుడసేవ

శా. ఈ సౌందర్యముకన్న మిన్న యెట నీక్షింపంగ శక్యంబు? మా
     ధ్యాసన్ మీపయి నిల్పి కొల్చెదము నిత్యానందసంధాయకా!
     దాసాంభోనిధిచంద్ర! పక్షివిభుహస్తన్యస్తపాదాంబుజా!
     మీ సాన్నిధ్యమె మంగళప్రదము స్వామీ! వేంకటాద్రీశ్వరా! 208

తొలిసంజసోయగాలు

సీ. తొలిసూర్యకిరణాలు గిలిగింతలనుఁ బెట్ట
         మేల్కొని వికసించు మేలుఁదమ్మి,
     వివిధవర్ణమ్ముల వింతైన చిత్రాలు
         రచియించు గగనమ్ము రమ్యముగను,
     కిలకిలధ్వనులతోఁ బలుకరించుచు నెదల్
         తట్టి మేల్కొల్పెడు పిట్టకొలువు,
     వినువీధి విహగాళి కనువిందు సేయుచు
         బారులై వెడలు నాహారమునకు,

తే.గీ. ఇళ్ళ ముంగిళ్ళఁ గళ్ళాపిఁ జల్లి రంగ
        వల్లులను దిద్దు పడుచుల వ్రేళ్ళగరిమ,
        చల్ల చిలికెడు భామల సౌరు, కంక
        ణాల రవళులు ప్రకృతివరాలు గావె? 209
      
శ్రీసీతారామకల్యాణము - ఒంటిమెట్ట

శా. లోకాతీత మనన్యమంగళకరశ్లోకప్రభాపూర్ణమౌ(1)
     నీ కల్యాణము నొంటిమెట్టఁ గని మా నేత్రంబులే ధన్యమై
     నీకున్ సీతమకున్ ముహుఃప్రణతులన్(2) నీరాజనం బెత్త రా
     మా! కైళంబుల(3) మేళవంబు(4) నుడువన్ మా కైత లేపాటివౌ?
            (1) సాటిలేని శుభములను కలిగించు కీర్తికాంతులతో నిండిన
            (2) మఱల మఱల చేయు నమస్కారములతో
            (3) వేడుకలు, వినోదాలు (4) కలయిక 210
Posted in May 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *