Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
వేంకటేశ్వరుఁడు
శా. ధన్యం బయ్యెను జ్ఞానచక్షువులు శ్రీతన్వీసముద్రాంబరా
      మాన్యశ్రీయుతవక్ష(1) మంతికమునన్(2) మద్భాగ్యమై పొల్వఁగా(3)
      నన్యాలోకము(4) దీని కెవ్విధి సమంబౌ? సప్తశైలేశకా
      రుణ్యావాప్తము నాప్త(5), మియ్యదియె నిర్మూలించు ఘోరాఘముల్
          (1) శ్రీదేవి, భూదేవి యొక్క మాన్యమైన కాంతి కల్గిన వక్షస్స్థలము
          (2) సమీపమున (3) ప్రత్యక్షము కాగా (4) ఇతరము చూచుట
          (5) యథార్థము 198

ఉ. వాసవశంకరాదిసురవర్గమునీంద్రమనోనివాస! శ్రీ
      భాసురవాసురాసదనవత్స! యకాంతకమందహాస! య
      బ్జాసనసేవితాసమసుమాంఘ్రివిభాస! సనత్కలిక్షమా
      వాసుకసప్తశైలవరవాస! క్షమింపుమ దాసుదోసముల్
          (1) వాసుర = భూదేవి (2) వత్సము = ఱొమ్ము
          (3) అకము = పాపము, దుఃఖము
          (4) వాసుకము = వైకుంఠము
భావము -
ఇంద్రుడు, శివుడు మొదలగు దేవతాసమూహము, మునిశ్రేష్ఠుల మనస్సులలో
నివసించువాడా! శ్రీదేవికి, భూదేవికి, ఇల్లయిన వక్షము కలవాడా! చిర్నగవుతో
పాపమును/దుఃఖమును అంత మొందించువాడా! బ్రహ్మదేవునిచే సేవింపబడిన,
సమానములేని, పువ్వుల వలె మృదువైన పాదములతో ప్రకాశించువాడా! ఎల్లపుడు
కలికాలములో భూలోకవైకుంఠమైన ఏడు శ్రేష్ఠమైన కొండలపై వసించువాడా! ఈ
దాసుని దోషములను క్షమింపుమయ్యా! 199

చం. ‌మఱచితి నన్ని మీ చరణమంజులదర్శనవేళ నన్ను నే
      మఱచితి నయ్య సర్వసురమానవమానితమాధరాపతీ!
      మఱచితి దుఃఖసంచయము మా యెద నిండిన నిన్ గనంగ, మై
      మఱపులఁ గూర్చు నీ మలయమారుతమై మలయప్ప! నీ కృపే 200

సీ. నిద్రించు నీ మోము ముద్రవేయు నగాల
          నెద నిల్పితిమి వేంకటేశ! మమ్ము
   భద్రంబుగాఁ జూచు బాధ్యత నీ దయ్య
         భక్తజనావన! పరమపురుష!
   కలియుగదైవమై కలకాలమును గాచు
         రమ్యసజీవవిగ్రహము నీది
   దరహాస మొలికించి దాసకోటులఁ గావ
         నలు పెఱుఁగక నిల్చు నయ్య వీవు

తే.గీ. తల్లి పద్మావతీదేవి తనవిధాన
       వత్సలత చూపి మమ్మేలు వర్ధిలంగ
       మీ కృపాపాత్రులను జేయ మాకు మీరె
       సర్వ, మన్యంబుఁ గోరము, శరణు శరణు 201

సీ. శాతకుంభ(1)ద్యుతిస్నాపితనవరత్న
          ఖచితసుందరశీర్షకంబు(2), నిత్య
   భక్తావనాలోకపరితృప్తకరుణార్ద్ర
          కమలదళాయతాక్షములు, శుద్ధ
   ఘనసార(3)కస్తూరికాలసన్నామంబు,
         ప్రార్థన లాలించు(4) శ్రవణయుగము,
   కర్ణభూషణఘృణికమ్రగండమ్ములు,
         శ్వేతధామాంచిత(5)చిబుకమంద
   హాసాన్వితాస్యంబు, నంబుజన్మోపమ(6)
         కమనీయశుభకరకంధరమ్ము(7),
   స్వజనసంరక్షణపండితచక్రశం
         ఖవిరాజమానోర్ధ్వకరయుగంబు,
   శ్రీదేవి, భూదేవి చెన్నొందు వక్షంబు,
         నాగభూషణములు, నవ్యదీప్త(8)
   హారయజ్ఞోపవీతానేకమండన(9)
         కౌశేయ(10)ధరదివ్యగాత్ర మొప్ప,
   శ్రితజనత్రాణసంసిద్ధాంఘ్రికమలాల
         శరణు జొచ్చఁగఁ దెల్పు కరయుగంబు,
   కమలజ(11)క్షాళితవిమలమంజులనత
         శరణప్రదాంఘ్రికంజద్వయంబు,
   వకుళాదికా(12)నన్యవరపుష్పమాలికా
         లంకృతసర్వాంగలలితమూర్తి

తే.గీ. సముఖమున నిల్చు భాగ్యంబు సంతరించి
      ఆత్మబంధువుగా మమ్ము నాదుకొన్న
      విశ్వమంతయు నిండిన విభుఁడ వీవె
      వెంట నీ వున్నఁ జాలు శ్రీవేంకటేశ!
          (1) బంగారము (2) కిరీటము (3) కర్పూరము (4) ప్రార్థనలు ఆలించు(విను)/
              ప్రార్థనను లాలించు (5) కర్పూరముతో సేవింపబడిన (6) శంఖము వంటి
          (7) కంఠము (8) ప్రకాశించు/బంగారు (9)ఆభరణము (10) పట్టువస్త్రము
          (11) బ్రహ్మ (12) శీర్షమునుండి ఇరుప్రక్కల క్రిందికి వ్రేలాడు
               వకుళమాల మొదలగు 202

శ్లో. రాజన్మఙ్గళవిగ్రహాయ కరుణావారాశినే నాగభూ
     షాలఙ్కారయుతాఽసమోత్తమభుజద్వన్ద్వాయ శ్రీశేషశై
     లాధీశాయ భుజాన్తరస్థితధరాలక్ష్మీసమేతాయ ని
     త్యాస్మన్మానసమన్దిరాయ త్రిజగన్నాథాయ తస్మై నమః II 203

మ. దివిజానీకము నిల్చు వాకిట భవద్దేదీప్యమానాస్యమున్
     ధ్రువలక్ష్మీ(1)గృహవక్షమున్ సుజనసందోహాప్తపాణిద్వయిన్
     భువనానన్యవిశేషశేషశిఖరీ(2)భూషాంఘ్రిపద్మమ్ములన్
     స్తవమున్ జేయుచుఁ గాంచి యేఁగెదరు హర్షప్రాప్తి సంతృప్తులై
          (1) భూదేవికి, శ్రీదేవికి / స్థిరముగానున్న లక్ష్మికి
          (2) శేషాచలము 204

తరలము
వకుళమాల(1)నుఁ గాంచినాఁడఁ బ్రభాతవేళను నీ కృపన్
సకలమంగళభాగ్యదాయకచక్షురుత్సవమౌ భవ
న్నికటసుస్మితవక్త్రవారిజనిత్యశీతకరాం(2)చిత
ప్రకటనర్మఠ(3)వీక్షణామృతపాన మిచ్చితె? శ్రీహరీ!
      (1) మూలవిరాట్టు కిరీటము పైనుండి రెండుప్రక్కల భుజముల మీదుగా
          క్రిందకు వ్రేలాడు అతిదీర్ఘమైన పుష్పమాల.
      (2) కర్పూరము. గతంలో అనంతాళ్వార్ విసరిన గడ్డపలుగు తగిలి
          గాయపడిన స్వామివారి గడ్డానికి ఇది నిత్యం చల్లదనం చేకూరుస్తుంది
      (3) గడ్డము 205

తే.గీ. ప్రచురమణిరత్నఖచితసువర్ణరుచిర
       భూషణాయుధవాహనభూరమాస
       మేతుఁ గేళీవినోదసమ్మిళితనతజ
       నౌఘమధ్యస్థుఁ గంటి బ్రహ్మోత్సవమున 206
Posted in April 2025, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!