అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
శివరాత్రి శా. పుష్పాలంకృతలింగదర్శనము మత్పుణ్యప్రసాదం బనన్ నిష్పారం(1) బగు నీ కటాక్షభవమై నేఁ డిట్లు గల్గంగ ము ద్బాష్పోత్సేకము(2) తోడఁ జూచితిని దృక్పర్వంబె పర్వంబుగాన్ నిష్పాదించు(3) విభూతి నీ స్మరణమే నీరంధ్రగంగాధరా! (1) ఎల్ల లేనిది (2) ఆనందాశ్రువుల అతిశయము (2) సిద్ధింపజేయు భావము- పువ్వులతో అలంకరింపబడిన శివలింగదర్శనము నా పుణ్యవశాన, అపారమైన నీ కృపవలన ఈనాడు (శివరాత్రి ప్రభాతవేళ) ఈ విధంగా సంభవించింది. అప్పుడు చాలా ఆనందబాష్పాలతో కనుపండుగే పండుగగా నిన్ను చూసేను. గొప్ప ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసేది నీ నామస్మరణమే కదా, ఆకాశగంగను ధరించినస్వామీ, మహేశ్వరా! (అన్నిపుట్టుకలకీ కారణమైన వాడు, అభిషేకప్రియుడు శివుడు అన్నభావాలు ఇందులో నిక్షిప్తాలు) 176 పదప్రయోగము చం. పదములు సత్యవిస్తృతప్రభావవిభూతిమయాప్తభావనా నదములు భర్గనృత్యభవనాదపదమ్ములు(1) దివ్యవాక్సుధా హ్రదములు నిత్యనూతనశుభాస్పదముల్ రసనర్తకక్షరీ కదములు(2) సూరిరాట్సభలగౌరవమొందిన శబ్దమంజరుల్ (1) శివతాండవములో ఉద్భవించిన శబ్దములు గుర్తుగా కలిగినవి (2) రసమను నెమలికి వర్షాకాలపు మేఘములు 177 చం. రవి కనలేని దైనఁ గడుప్రస్ఫుటమౌ కవి కంచుఁ బల్కరే? రవిశశితారకం బిలను రాజిలు సత్కవితల్ రచించి యీ భువి విడి యేఁగినన్, సుకవిపోషకులెందఱొ ఖ్యాతి గాంచరే? కవి నుడువంగఁ(1) బాఱెఁ గద కట్టలు ద్రెంచుక దేవగంగయే (1) “కదలు మిట మాని దివిజగంగాభవాని!” అన్నకవి అడిదము సూరకవి 178 మృతామృతాలు చం. కరజములున్ శిరోజములు కావు మృతంబులు వృద్ధి నొందుటన్ కరజములున్ శిరోజములు కావు సజీవము లేలయో యనన్ తఱిగిన నొప్పి గల్గదు కదా, యవె కప్పును లోటు గల్గినన్ తఱుఁగని మక్కు వందులకె నాతికి వాటిపయిన్ దలంపఁగన్ 179 అక్షరసముద్రము కం. అర్ణార్ణవమునఁ(1) బుట్టిన వర్ణనలే యెదలఁ దాఁకు భంగులు(2); కవితల్ పూర్ణిమవెన్నెల గాఁగాఁ గర్ణములే కనుల కన్నఁ గర్వము నొందున్(3) (1) అక్షరములనెడు సముద్రములో (2) అలలు (3) పున్నమినాడు ఉప్పొంగే అక్షరసముద్రపు అలలైన వర్ణనలు హృదయాలను తాకు నపుడు కలుగు శబ్దతరంగాలను ఒడిసిపట్టే చెవులు దృశ్యాన్ని చూచే కళ్ళకంటే ఎక్కువ ఆనందము అనుభవించి గర్విస్తున్నాయి 180