అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
విష్ణుదర్శనము శా. శ్రీనారాయణదివ్యవిగ్రహము మచ్చేతోఽక్షిపర్వంబుగాఁ గానన్ గల్గితి నీ యుషస్సునఁ గనత్కౌమోదకీచక్రశం ఖానన్యాద్భుతపీతవస్త్రవనమాలాలంకృతంబై పరి త్రాణోద్యుక్తపదోద్భవామృతము చిందన్ మ్రొక్కి ప్రార్థించెదన్ 171 లలితాదర్శనము మ. వివిధాస్త్రాన్వితబాహుమండలమహావిభ్రాట్స్వరూపంబు వే కువఁ బారీంద్ర(1)సువాహనంబుపయిఁ జక్షుఃపర్వమై కన్పడెన్ రవిచంద్రాగ్నివిలోచనంబులఁ(2) గనన్ బాపౌఘవిధ్వంసమై భువి నా జన్మ తరించె, దర్శన మితఃపూర్వార్చనావాప్తమే(3) 172 (1) సింహము (2) కన్నులతో అమ్మవారు నన్ను/అమ్మవారి కన్నులను నేను (3) ఇంతకు ముందు చేసిన పూజ వలన ప్రాప్తమైనదే రథసప్తమి సీ. సప్తాశ్వరథ మెక్కి సర్వలోకంబులఁ గాంతిచ్ఛటల్ నింపు ఘనుఁడ వీవె ఉదయారుణకరాల(1) నెదఁ దట్టి సరసిజా తమ్ముల మేల్కొల్పు ధవుఁడ వీవె చీకట్లు పోకార్చి సృష్టినిఁ జైతన్య వంతమ్ము సేయు దైవమ్మ వీవె ధర్మస్వరూపుఁడౌ దశరథాత్మజువంశ కర్తవు, కిల్బిషహర్త వీవె తే.గీ. గ్రహపతివి నీవె, నీ యనుగ్రహము వడసి దివ్యశక్తుల నెన్నొ సాధించి ఋషులు మే లొనర్చిరి, రథసప్తమీదినానఁ బ్రణతు లర్పించు(2) భాగ్యంబె భాగ్య మన్న (1) కిరణములతో/ చేతులతో (2) సూర్యనారాయణుడు నమస్కారప్రియుడు 173 శివలింగదర్శనము ఉ. భాసురలింగమూర్తివయి ప్రత్యుషవేళను గానుపించి యీ దాసునిఁ జూడవచ్చితివె? తాపసమానసవాస! యీశ! యీ మాసము పెండ్లిపర్వముల మాసము మాఘము, తత్క్షణంబె మా త్రాసతమిస్రపాటనము(1), రక్షణఁ గూర్పవె కాశికాపతీ! (1) నిర్హరణ 174 నామస్మరణ శా. “జైశ్రీరామ! నమశ్శివాయ!” యనుచున్ సద్భక్తితో లేచి నే నశ్రాంతమ్ము శ్రమించి యా పయిని నిద్రాసక్తునౌ వేళలో నా శ్రీరాముఁ దలంచి సోలెదను శయ్యన్ నిత్య మీరీతిగా నా శ్రద్ధన్ గమనించి శాంతమనమున్ దైవంబె నా కీయఁగా 175