శ్రీవేంకటేశ్వరదివ్యమంగళస్వరూపము
సీ. శాతకుంభద్యుతిస్నాపితనవరత్న
ఖచితసుందరశీర్షకంబు, నిత్య
భక్తావనాలోకపరితృప్తకరుణార్ద్ర
కమలదళాయతాక్షములు, శుద్ధ
ఘనసారకస్తూరికాలసన్నామంబు,
ప్రార్థన లాలించు శ్రవణయుగము,
కర్ణభూషణఘృణికమ్రగండమ్ములు,
శ్వేతధామాంచితచిబుకమంద
హాసాన్వితాస్యంబు, నంబుజన్మోపమ
కమనీయశుభకరకంధరమ్ము,
స్వజనసంరక్షణపండితచక్రశం
ఖవిరాజమానోర్ధ్వకరయుగంబు,
శ్రీదేవి, భూదేవి చెన్నొందు వక్షంబు,
నాగభూషణములు, నవ్యదీప్త
హారయజ్ఞోపవీతానేకమండన
కౌశేయధరదివ్యగాత్ర మొప్ప,
శ్రితజనత్రాణసంసిద్ధాంఘ్రికమలాల
శరణు జొచ్చఁగఁ దెల్పు కరయుగంబు,
కమలజక్షాళితవిమలమంజులనత
శరణప్రదాంఘ్రికంజద్వయంబు,
వకుళాదికానన్యవరపుష్పమాలికా
లంకృతసర్వాంగలలితమూర్తి
తే.గీ. సముఖమున నిల్చు భాగ్యంబు సంతరించి
ఆత్మబంధువుగా మమ్ము నాదుకొనెడు
విశ్వమంతయు నిండిన విభుఁడ వీవె
వెంట నీ వున్నఁ జాలు శ్రీవేంకటేశ! 167
భావము-
బంగారు కాంతులతో స్నానము చేయింపబడిన, నవరత్నాలు పొదిగిన, అందమైన కిరీటము; ఎల్లప్పుడు భక్తులను రక్షించు చూపులతో చక్కగా తృప్తి పొందెడు కరుణ నిండిన, తామరరేకులవలె విశాలమైన కన్నులు, శుద్ధమైన కర్పూరము, కస్తూరితో ప్రకాశించే (నుదుటి) నామము, భక్తజనులు చేయు ప్రార్థనలు ఆలకించు/ ప్రార్థనను లాలించు రెండు చెవులు, చెవుల ఆభరణముల కాంతితో మనోహరమైన చెక్కిళ్ళు, కర్పూరము అద్దిన గడ్డము కలిగి, చిరునవ్వుతో ఒప్పు ముఖము; శంఖాన్నిపోలిన, ఇంపైన, శుభాలను కలిగించు కంఠము; తనవారిని (భక్తులను) రక్షించడంలో ఆరితేరిన చక్రము, శంఖముతో ప్రకాశించే పై రెండు చేతులు; లక్ష్మీదేవి, భూదేవితో శోభిల్లే వక్షము; భుజాలకు అలంకారమైన నాగభూషణాలు, క్రొత్తకాంతులు వెదజల్లే హారాలు, యజ్ఞోపవీతం, ఎన్నో ఆభరణాలు, పట్టువస్త్రము, ధరించిన లోకాతీతమైన శరీరము ప్రకాశించగా; ఆశ్రయించినవారిని రక్షించడానికి సిద్ధంగా ఉన్న పాదకమలాలను శరణు జొచ్చుడని సూచించే రెండు చేతులు; బ్రహ్మ కడిగినవి, నిర్మలము, చక్కనైనవి, వంగి నమస్కరించువారికి శరణ మిచ్చే పాదకమలాల జంట; శిరస్సుపైనుండి ఇరుప్రక్కల క్రిందికి వ్రేలాడు వకుళమాల మొదలగు సాటిలేని, శ్రేష్ఠమైన పువ్వులతో కూర్చిన దండలతో అలంకరింపబడిన సర్వాంగములు కలిగి, సొగసైన దేవతాస్వరూపానికి ఎదురుగా నిలబడే అదృష్టాన్ని కల్పించి, ఆత్మబంధువై మమ్ములను ఆదుకొనే విభుడవు, విశ్వమంతా నిండి, పాపాలను పోగొట్టి శుభాలను చేకూర్చే స్వామివి (శ్రీవేంకటేశుడవు) నీవే. మా వెంట నీవు ఉంటే చాలునయ్యా.
ఓం నమో వేంకటేశాయ
పలుప్రొద్దుపండుగవేడుకలు
మ.కో. మూఁడురోజుల పెద్దపండువు పొల్పు(1) మీ కిడుఁ గావుతన్ వేఁడివేఁడిగ బోగిమంటల వ్రేల్వఁ గిల్బిషభీతులన్ తోడునీడగువార లెల్లరితోడ నాడుచుఁ బాడుచున్ కూడి పుణ్యదినాలకాలము కోరి యీశ్వరుఁ గొల్చుచున్ మేడమిద్దెలపైఁ ‘బతంగుల’(2) మేళవింపులఁ గాంచుటల్ పాడిపంటల భాగ్యరాశులు, పాడియాడెడు దాసులున్, వాడి కౌశలమెంతొ కూర్చిన ప్రాంగణమ్ముల రంగులే చూడు, చూడని పిల్వ నల్వురి, సుందరమ్మగు గొబ్బియల్, కాడియెద్దులకోడియొడ్డులు(3), గంగిరెద్దులమేళముల్ పోఁడిమిన్(4) వెదజల్లు బొమ్మలు, బోగిపండ్లును, బాలలున్ వాడవాడల మించు పొంగలి, శ్వశ్రుధామ(5)వినోదముల్, వేడుకల్ రుచులెల్ల నాల్కల విందు సేయఁగఁ, దూర్యముల్(6) చూడముచ్చటయైన జంటలు, శోభ గూర్పఁగఁ బల్లెలన్, వీడి యా దివి దేవతల్ భువి వీడలే కిట నిల్వరే? 168 (1) ఆహ్లాదము/వృద్ధి (2) గాలిపటముల (3) పందెములు (4) అందము/కాంతి (5) అత్తవారింటి (6) వాద్యపుమ్రోతలు
బాలరాముడు – అయోధ్య
ఉ. చేత ధనుస్సు బాణమును జిర్నగ వొల్కెడు మోము, దృక్కులన్ ఖ్యాతి గడించినట్టి కరుణార్ద్రత, సౌష్ఠవ మొప్పు రూపమున్ పీతదుకూలమున్ శ్రితుల వేదనలన్ హరియించు పాదముల్ చేతము రంజిలంగ నిలిచెన్ సముఖమ్మున బాలరాముఁడై 169
కం. దోఃకలితనాగభూష! శి రఃకీలితవకుళమాల! రమ్యతమాలా!(1) దోఃకాంతాంతఃకమలా!(2) ద్యౌఃకీర్తినిధీందునయన! దయఁ గన రావే! 170 (1) తమాలము=బొట్టు, (2) కాంతము=మనోహరమైనది అంతః=మధ్యప్రదేశము, కమల=లక్ష్మి (3)ద్యౌః=ఆకాశము, కీర్తి=ప్రకాశము
భావము-
భుజముల కూడుకొని యున్న నాగభూషణములు కలవాడా!
శిరస్సునుండి అమర్చిన వకుళమాల కలవాడా! సుందరమైన బొట్టు
కలవాడా! భుజముల అందమైన మధ్య ప్రదేశమున లక్ష్మి కలవాడా!
ఆకాశములో ప్రకాశమునకు నిధి యైన సూర్యుడు, చంద్రుడు
నేత్రములుగా కలవాడా! దయతో చూడ రావయ్యా.