Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
సప్తస్వరకందము

     నిగమనిగదపదసనిని(1) స
     రిగ గరిమగఁ గని(2) సరి గనిరి(3) పదగ(4), మరి దా
     సగదసదగద(5) మరినిద(6) మ
     రిగమసని(7), దగ సని(8), మని గరిగఁ గనిరి సదా(9) 161 
ప్రతిపదార్థము –
     నిగమ=వేదము, నిగద=స్పష్టముగా చెప్పిన, పద= పాద,
      సని=సేవ, సరి=పూర్ణము, గరిమ=శ్రేష్ఠము, కని=గ్రహించి,
      సరి=శరణము, కనిరి=పొందిరి, ప=ఆపన్నులు, ద=పరిశుద్ధులు,
      మరి=మఱియు, దాస= దాసులు, గద=అనారోగ్యము, సత్=మంచి,
      అగద=మందు, అరి=అంతశ్శత్రువులు, నిద=విషము,
      అరి=చక్రము, గమ=ప్రయాణము, సని=కాంతి, దగ=తాపము,
      చని=పోయి, మని=దేవుడు, గరి=ఎక్కువ, కనిరి=చూచిరి,
      సదా=ఎల్లప్పుడు.
భావము –
     (1)వేదము స్పష్టముగా చెప్పిన పాదసేవను (2)పూర్ణముగా శ్రేష్ఠముగా గ్రహించి,
      (4)ఆపన్నులు పరిశుద్ధులుగా (3)శరణము పొందిరి. (5)మఱియు, దాసుల
          అనారోగ్యమునకు మంచి మందు, (6)అంతశ్శత్రువులకు విషము, అయిన
      (7)చక్రము (సుదర్శనము) యొక్క ప్రయాణపు కాంతిచేత (8)తాపము పోయి 
      (9)ఎల్లప్పుడు దేవుని ఎక్కువగా చూచిరి.

ఉ. సాదరవీక్షణమ్ముల నిరంతరమున్ మముఁ గాంచు మాప్రభో!(1)
    నీ దరహాసవాసముఖనీరజమున్ గననిమ్ము తృప్తిమై
    మా దొర వీవె కావె? తిరుమంజనమండితమంజులాకృతీ!(2)
    నీ దరి నొక్క లిప్త(3)యిన నిల్చినఁ జాలును వేంకటేశ్వరా! 162

     (1) మాయొక్క నాథా/లక్ష్మీనాథా/కాంచుమా స్వామీ
      (2) పవిత్రమైన చందనకస్తూరాదిద్రవ్యములతో చేసిన మైపూతలతో 
         అలంకరింపబడిన మనోహరాకారము కలవాడా (అభిషేకమూర్తి)
      (3) గడియ(24 నిముషాలకాలము)లో 60వ వంతు అయిన విగడియలో
          60వ వంతు=ఒక నిముషములో 150వ వంతు

చం. పదముల(1) చెల్మి సేయఁగల భాగ్య మొసంగెను మాత వాణి, నీ
     పదముల(2) చెల్మి సేయఁగల భాగ్య మొసంగు రమేశ! భక్తష
     ట్పదములు(3) చెల్మి సేయఁగల వారిజముల్ వెదకంగ నేల నీ
     పదముల(4) చెల్మి సేయఁ? గలవారి, దరిద్రుల దిక్క వీవెగా 163
      (1) మాటలతో (2) పాదములతో (3) భక్తులనే తుమ్మెదలు
       (4) పాదములతో
ఇందులో విశేషార్థము –
భక్తులనే తుమ్మెదలు స్నేహము చేయగల కమలాలను వెదకవలసిన
అవసర మేమున్నది? ఎందుకంటే ఆ తుమ్మెదలు నీ పాదాలతో 
(విష్ణుపాదాలు కమలాలవంటివికదా) సఖ్యము చేస్తాయి కదా.

తే.గీ. తొమ్మిదిన్నర యడుగుల దొడ్డమూర్తి
       రండు శరణంబుఁ జొచ్చు డీ రెండుపదము
       లంచుఁ గరముల(1) సూచించి యలు పెఱుఁగక
       యేడుకొండల నిలుచు మా యేడుగడగ(2) 164
           (1) చేతులతో (2) దిక్కుగా/రక్షకునిగా

ఉ. మంగళగాత్ర(1)దర్శనము మంగళగాత్రము(2)తోడఁ దెల్ప మీ
    కుం గడుసంతసం బొదవు గొప్ప మనం బిడినట్టి యా సదా
    మంగళమూర్తి(3) మూర్తిపదమంజరి(4) కిచ్చిన శక్తి మూలమౌ,
    భృంగమునై తదంఘ్రియుగళేనప్రియంబుల(5) నాశ్రయించుటన్ 165
       (1) శరీరము (వేంకటేశ్వరుని) (2) కంఠస్వరము (నా యొక్క) 
        (3) ఎల్లప్పుడు శుభకరమైన (వేంకటేశ్వరుని) విగ్రహము 
        (4) నా మాటల పూలగుత్తి (5) ఆ స్వామి యొక్క పాదము లనెడు,
            సూర్యునకు ప్రియములైన కమలముల జంటను / సూర్యనారాయణ
            నామధేయుడనైన నాకు ప్రియములైన జంటను

కం. పేరెంతమృదువొ యీష
     త్కారుణ్యము లేని దిదియె; కదప్రాస యిదే;
     గౌరసమనిర్మలము; ధా
     రారాజిత; మిదియె వంగి గ్రక్కున మించున్ 166
     [సుదర్శనచక్రము, కౌమాదకీగద, పాంచజన్యశంఖము,
     నందకఖడ్గము, శార్ఙ్గచాపము]
Posted in September 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!