Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
నాథహరి(1)భజన

కం. ఛందోమృగపంచక మొక
      టందంబగు గమనగతులు యతినియమములే
      చందనముగ నలఁదుచుఁ బర
      ముం దమతమశక్తి కొలఁది పూజించు నిదే 153
            (1) జంతువు

1.శార్దూలము
      నీసందర్శనభాగ్యమున్నఁ గలుగున్ నిత్యంబుఁ గల్యాణముల్
      దాసత్రాణపరాయణా! వరద! సంతాపార్తివిధ్వంసకా
      హ్వా! సాకేతనివాస! భూమితనయాస్యాంభోజభృంగా! మద
     భ్యాసం బెన్నఁడు మిమ్ముఁ గాంచుటకె రామా! భక్తచింతామణీ! 154
లక్షణము –
     గణములు: మ-స-జ-స-త-త-గ యతి: 13వ అక్షరము

2.మత్తేభము
      ఘనసారాశుగమర్దితోగ్రకుమతిక్రవ్యాదసంఘాత!(1) శ్రీ
      ఘనసారాసితసౌష్ఠవాంగరుచితా!(2) కల్హారపత్రాక్ష! శ్రీ
      ఘనసారాభమృదుస్వభావమిథిలాకన్యామణీకాంత!(3) నిన్
      మనసారన్ గను భాగ్య మిమ్ము రఘురామా! దాంతసారం బదే 155
           (1) మిక్కిలి బలముగల బాణముతో దుర్మార్గులను, రాక్షస
                 సముహమును, మర్దించినవాడా
           (2) శుభకరమైన (వర్షించు) మేఘమువలె శ్రేష్ఠమైన, నీలమైన
                 చక్కని శరీరాంగములతో ప్రకాశించువాడా
           (3) మీగడ పెరుగు[శ్రీఘనము] యొక్క సారమైన వెన్నను పోలిన
                 కోమలస్వభావముకల మిథిలానగరకన్యకామణికి(సీతకు) నాథుడా
లక్షణము –
గణములు: స-భ-ర-న-మ-య-వ యతి: 14వ అక్షరము

3.తురగము
       మునివరు నభిశపనముఁ బడసి విముక్తిఁ గోరు నహల్యకున్
       తనపదరజమున మఱలను లలనాస్వరూప మొసంగి యా
       జనకుని సభ శివధనువు విఱిచి జానకిన్ గొని ధర్మమే
       తనువుగ జనులకుఁ బితరుఁడె యగు ధారుణీపతిఁ గొల్చెదన్ 156
లక్షణము –
గణములు: న-న-న-న-స-జ-జ-గ యతి: 15వ అక్షరము

4.వరాహము
       రాజీవేంద్రుని(1) మొఱవిని రయముగ మకరము నణపఁగఁ బురమున్(2) వీడెన్
       రాజీవాక్షుఁడు(3), పదపడి(4) రమయు గరుడి(5) క్రమమున నరిదరముల్(6) సాగన్
       తేజశ్చక్రము(7) దిరుగుచు దిగి సరసిఁ(8) బ్రతిభటభయద(9) మయి నక్రంబున్
       వాజం(10) బొప్పుచుఁ దునుమఁగఁ బనిచిన హరిపదసరసిజముల సేవింతున్ 157
            (1) గజేంద్రుని (2) వైకుంఠము (3) కమలాక్షుడు[హరి] (4) వెనుక 
            (5) గరుత్మంతుడు (6) చక్రము, శంఖము (7) పదును/ప్రకాశము/వేడి 
            కలిగిన చక్రాయుధము (8) కొలనులో (9) శత్రువునకు భయము కలిగించు
            (10) చేవ
లక్షణము –
గణములు: మ-న-న-న-న-న-న-స-గగ యతి: 10, 16వ అక్షరములు

5.సింహోన్నతము 
       శ్రీరామచంద్రవిభు సీతమ వాయుపుత్రున్
       ధారాళమై యుబుకు తత్పదభక్తి బాష్పా
       కారంబుఁ దాల్చి మసకన్ గలిగింప దృష్టిన్
       నా రీతి నామభజనన్ గొలువంగ నెంతున్ 158
లక్షణము –
గణములు: త-భ-జ-జ-గగ యతి: 8వ అక్షరము

కమలవైశిష్ట్యము
చం. కమలమె బ్రహ్మ కాసనము; గాదె యదే నిలయంబు లక్ష్మికిన్?
      కమలమె నాభి నుద్భవముఁ గాంచెను విష్ణున; కాప్త మయ్యె న
      ర్యమునకుఁ(1) దానె; ఫుల్ల మయి(2) యాస్యదృగంఘ్రికరాకృతుల్(3) కృతుల్
      సమముగఁ దెల్పు పోలికగు; సారసజన్మమె ధన్య మెందునన్(4) 159 
            (1) సూర్యునకు (2) వికసించి (3) ముఖము, నేత్రములు, 
            పాదములు, హస్తములు - వీని ఆకారములు (4) ఏ లోకములో 
            నైనను

కమలకమలానాథము*
కం. తమ్మిదొరదాయ(1) లక్షులు(2)
      తమ్మియె యిరవైన తల్లి(3) తగు నిల్లాలౌ
      తమ్మినిఁ గూర్చొనుఁ గొమరుఁడు(4)
      తమ్మియు నఱకాలి గుఱుతు(5) తరిదాల్పునకున్(6) 160
            (1) తమ్మిదొరయైన సూర్యుడు, తమ్మిదాయ(పగతుడు)యైన చంద్రుడు 
            (2) కన్నులు (3) లక్ష్మి (4) బ్రహ్మ (5) పాదము క్రిందివైపు
            రేఖాచిహ్నములలో నొకటి (6) విష్ణువునకు 
      *పద్మము, లక్ష్మీపతికి సంబంధించినది
Posted in August 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!