Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
సీ. పురహరుం డీతండు మురహరుం డాతండు
      గజభేది యితఁడు రక్షకుఁ డతండు
   చర్మాంబరుఁ డితండు భర్మాంబరుఁ డతండు
      స్వర్ణదీశుఁ డితండు జనకుఁ డతఁడు
   నీలకంఠుఁ డితండు నీలకాయుఁ డతండు
      సర్పభూషుఁ డితండు శయనుఁ డతఁడు
   కామవైరి యితండు కామవప్త(1) యతండు
      గిరిధన్వుఁ డీతండు ధరుఁ డతండు

తే.గీ. శ్వశురగృహధాము లిర్వురుఁ బతితపావ
     నాహ్వయులు భవాబ్ధితరు లనంతు లజులు
     నట్టి శివకేశవుల మది నాశ్రయింపఁ
     గలుగు భాగ్యంబు వర్ణింప నలవి యగునె? 141
            (1) తండ్రి

చతుష్ప్రాససుగంధి
     శ్రీరసాధరాధివాస!(1) చిద్విలాస! కావరా
     శ్రీరసాధరాప్తమిత్ర!(2) కృత్తివాస!(3) హైమవత్
     శ్రీరసాధరాత్మజావిశేషచిత్తచోర!(4) యీ
     శా! రసాధరార్చితాహ్వయా!(5) శశాంకశేఖరా!(6) 142 
          (1) శ్రీశైలవాస (రసాధరము = భూధరము =శైలము)
          (2) శ్రీ(లక్ష్మిని), రసా(భూదేవిని) ఎదపై ధరించిన 
              విష్ణువునకు ఆప్తమిత్రుడా
          (3) చర్మమే(కృత్తి) వస్త్రము(వాసము)గా కలవాడా
          (4) మంచుతో శోభించు కొండ (హిమవత్పర్వతము)
              పుత్రిక యొక్క విశేషమైన మనస్సును దొంగిలించినవాడా
          (5) రసా(నాలుక) అధర(పెదవుల)తో (=నోరార)
              అర్చింపబడిన పేరు కలవాడా
          (6) చంద్రుని(శశాంక) శిరస్సున ధరించినవాడా(శేఖరా)

కం. హిమకరరుచిరజటాసం
    భ్రమదభ్రధునీగతాఘభక్తప్రకరా!
    మముఁ గరుణిం పుము గిరిజా
    సుమనోఽబ్జదినేశ! యీశ! శుభదాదేశా! 143

శ్లో. శ్రీకైలాసనివాసినం నతజనక్షేమంకరం సుందరం
   నాగేందూజ్జ్వలభూషణం వృషభగం శ్రీపార్వతీవల్లభమ్
   హేమక్ష్మాధరశృంగనాట్యముదితం నాదప్రియం శాశ్వతం
   భూతాధీశ్వర మీశ్వరం భవహరం వందే విభూతిప్రదమ్ II 144

ఉ. గట్టుల(1)ఱేనిపట్టి(2)కయి(3) గట్టిగఁ బట్టిన దిట్ట మా కయిన్(4)
   జట్టులఁ(5) బోలు రట్టులనుఁ(6) జట్టన(7) మట్టముసేసి(8) తానె యి
   క్కట్టులఁ గట్టిపెట్టిఁ కనుఁ గట్టును(9) గిట్టగు(10)నట్టి ప్రేమ చూ
   పట్టఁగ నెట్టిపట్టులను(11) బట్టుల(12) పట్టులఁ(13) బట్టుపట్టుచున్ 145
        (1) కొండల (2) కూతురు (3) చేయి (4) కొఱకు (5) పర్వతముల
        (6) ఆపదలను (7) శీఘ్రముగా (8) నశింపజేసి (9) మిక్కిలియు
        (10) కిట్టగు=అనుకూలమగు (11) వేళలలో (12) పిల్లల (13) పట్ల

మౌక్తికమాల
     మౌక్తికమాలన్(1) సమముగ భక్తిన్
     సూక్తులతోడన్ విను శ్రుతు లొప్పన్
     వ్యక్తము సేయన్ భవహర మౌ; నా
     శక్తికొలందిన్ రచనలు సాగెన్ 146
          (1) ముత్యాలదండ

శా. ఈ ముత్యాలసరంబు నీదు గళమం దింపొందఁగాఁ దీర్చు(1) సీ
    తామాతాకరపల్లవారుణప్రభల్ ధన్యత్వమున్ గూర్పఁగా
    నీ మూర్తిన్ గను భక్తబృందములకున్ నిత్యంబుఁ గల్యాణరా
    మా! మూర్తిన్ బరివారమున్ గృపఁ గనన్ బ్రార్థించెదన్ నెమ్మదిన్ 147
        (1) సరిదిద్దు లేదా అమర్చు
    ఈ పద్యములో “నీదుగళము”, “భక్త”, “నెమ్మది” అనే పదాలు 
    “పూజింతునా నిన్ను, భూషింతునా.....” అనే పూర్వపు భక్తిపాటలోని వగుట 
     విశేషము.
     భావము –
     ఈ పద్యశ్లోకాలు అనే ముత్యాలతో కూర్చిన దండను నీ మేడలో శోభిల్లే
     విధంగా అమర్చే సీతా అమ్మవారి చిగురుటాకులవంటి చేతుల ఎఱ్ఱని
     కాంతులు, నీ స్వరూపమును దర్శించు భక్తుల సమూహమును
     ఎల్లప్పుడూ ధన్యులను చేసి, ఈ మూర్తిని, తనపరివారసభ్యులను
     కరుణతో చూచునట్లు ఓ కల్యాణరామా! నిన్ను మనస్సులో ప్రార్థిస్తున్నాను.
Posted in June 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!