అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
మహేశ్వరుఁడు
చతుష్ప్రాసకందము
హరునకు నక్షరునకుఁ బుర
హరునకు నగజామనోఽబ్జహరునకు గంగా
ధరునకు నతసురునకు నీ
శ్వరునకు నర్పింతు నాదు వందనశతముల్ 134
ఉత్సాహము
బాలచంద్రశేఖరా! యపారతేజ! దేవతా
జాలవందితాంఘ్రియుగ్మ! సర్వలోకపాలకా!
వ్యాలనికరభూషితా! యనంగగర్వహారకా!
కాలకంఠ! మౌనివినుత! కావరా దయామయా! 135
ఉత్సాహము
రజతగిరినివాస! శైలరాజజామనోహరా!
విజితశత్రునివహ! జాహ్నవీలసజ్జటాధరా!
భుజగరాజశయనమిత్ర! భూతసంఘనాయకా!
గజనిశాటరాడ్విదార! కరుణఁ జూడు మీశ్వరా! 136
సీ. ప్రణుతతాండవకేళి రాజరాజితమౌళి
ఫణికలాపకలాపు భవ్యరూపు
శైలరాట్పుత్రీశుఁ గైలాసగిరివాసు
భూతవ్రజాధీశు వ్యోమకేశు
భస్మదిగ్ధసుదేహు ఫాలేక్షణోద్భవా
దభ్రాగ్నిదగ్ధకందర్పదేహు
కలుషౌఘపరిహారకమనీయగంగాత
రంగరంగజ్జటారాశిధరుని
తే.గీ. మత్తదంతావలాజినాంబరుని హరుని
అమరమౌనీంద్రహృత్సారసాలి శూలి
నిత్యభక్తావనోత్కంఠు నీలకంఠు
సతతభవ్యార్థినై మదిన్ సన్నుతింతు 137
కం. ప్రతిపద్యము హృద్యంబై
ప్రతిపదమును బార్వతీశపదఘట్టనమై
ప్రతిశబ్దముఁ దద్భవమై
ప్రతిపఠనముఁ బుణ్య మొుసఁగి భవహర మగుఁగా 138
ఉ. అద్రిజ మాకుఁ దల్లియగు నద్రిసుతేశుఁడు తండ్రియౌఁగదా
భద్రగజాననుండు, శిఖివాహను లిర్వురు భ్రాతలై సదా
భద్రముఁ గూర్చుచుండఁగను భక్తవశంకరనామకీర్తనే
నిద్రను వీడకుండు మము నీలగళుండు తరింపఁజేయఁడే? 139
పం. ధరాధరాత్మజాతనూలతాప్రతీతభూరుహా !
సురాసురాశ్రయా! జటాప్రసూనసోమశోభితా!
చరాచరాన్వితప్రపంచసర్వభూతశాసనా!
పరాత్పరా! నమో లయప్రబద్ధతాండవప్రియా! 140