Menu Close

Adarshamoorthulu

ఆంగ్ సాన్ సూకీ

ఆంగ్ సాన్ సూకీ

ప్రపంచ చరిత్రలో ఎంతో మంది ధీరోదాత్త మహిళలు తమ సంకల్ప బలంతో, అకుంఠిత సేవా భావంతో, తమ జీవితానుభవాలను, సామాజిక స్పృహను ఆయుధాలుగా వాడి ఎన్నో ఉద్యమాలను నడిపి, రాచరికపు ఆనవాళ్ళతో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించే స్వార్థపూరిత ప్రభుత్వాల నుండి సామాన్య ప్రజలను కాపాడి వారు సుఖమయ జీవితాన్ని గడిపేందుకు ఎంతో కృషి సల్పారు. పాలకుల నిరంకుశ పాలనను ప్రశ్నించినందులకు రాజకీయ ఖైదీగా శిక్షను అనుభవించారు. అయినను తమ ఆశయాల కొఱకు శ్రమించి సాధించారు. అటువంటి గొప్ప మహిళల పట్టికలో మొదటి పది అంకెలలోపే ఉండి ప్రపంచ ప్రఖ్యాతి గాంచి, నోబెల్ శాంతి బహుమతిని కూడా పొందిన నాటి బర్మా, నేటి మయన్మార్ దేశ ప్రముఖ రాజకీయ వేత్త, ప్రజా ప్రతినిధి శ్రీమతి ఆంగ్ సాన్ సూకీ, నేటి మన సిరిమల్లె ఆదర్శమహిళ.

ఆంగ్ సాన్ సూకీఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ మాసంలో జన్మించింది. బాల్యం నుండే ఆమెలో స్వతంత్ర భావాలు, రాజకీయ చతురతలు అలవడ్డాయి. అందుకు కారణం ఆమె తండ్రి అయిన ఆంగ్ సాన్. ఆయన బర్మా సైన్యాన్ని స్థాపించి బర్మీయుల స్వాతంత్ర్యం కొఱకు ఆంగ్లేయులతో స్వాతంత్ర్య సమరం చేశాడు. బాల్యంలో ఉండగానే ఆమె దురదృష్టవశాత్తూ తండ్రిని కోల్పోయింది. మెథడిస్ట్ ఇంగ్లీషు ఉన్నత పాఠశాలలో చదివినందున ఆమెకు ఆంగ్ల భాషలో మంచి పట్టు లభించింది. తరువాతి కాలంలో ఆమె బౌద్ధమత వ్యాప్తికొరకు కృషి సల్పింది. ఆమె విద్యాభ్యాసం వివిధదేశాలలో జరిగింది. న్యూఢిల్లీ లోని శ్రీరాం కళాశాల నుండి 1964లో పొలిటికల్ సైన్సు లో ఆమె పట్టభద్రురాలైంది. అదే స్ఫూర్తితో సూకీ తన విద్యాభ్యాసం కొనసాగించి 1969లో ఆక్స్‌ఫర్డ్ హౌస్ కాలేజ్ నుండి ఫిలాసఫీ, పాలిటిక్స్ మరియు ఎకనమిక్స్ మాస్టర్ డిగ్రీ కూడా పొందింది. ఆ విద్యాసంపదలు ఆమెకు తరువాత తన రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

విద్యాభ్యాసం తరువాత ఆమె అమెరికా, లండన్, ఇండియా తదితర దేశాలలో కూడా తాత్కాలిక ఉద్యోగాలు చేస్తూ, పరిశోధక విద్యార్థిని గా కూడా పనిచేసింది. ఆ సమయంలోనే 1971లో సూకీ టిబెటన్ సంస్కృతి స్కాలర్" డాక్టర్ మైకేల్ ఆరిస్"ను వివాహమాడింది.

1988లో బర్మాకు తిరిగి వచ్చిన సూకీ నాటి పాలకుల నిరంకుశ ధోరణికి బలౌతున్న ప్రజలకొఱకు ‘నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ’ పార్టీని స్థాపించి మెల్లగా ప్రజాస్వామ్య ఉద్యమానికి తెరతీసింది. 1990 సాధారణ ఎన్నికలలో ఆమె పార్టీకి మంచి విజయం లభించినను ఆమెకు అధికారం దక్కకపోగా ఆమెను బర్మా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. అయిననూ వెరవక ఆమె సదా పోరాడుతూనే ఉన్నది. 1987 నుండి 2010లో విడుదల అయ్యేవరకూ దాదాపు 15 సంవత్సరాలకాలం గృహనిర్బంధంలోనే గడిపి ప్రపంచంలో ప్రముఖ రాజకీయఖైదీగా గుర్తించబడింది. 2012 లో ఆమె పార్టీ బర్మా దిగువ సభ 45 ఖాళీ స్థానాలలో 43 స్థానాలను ఎన్నికలలో గెలుచుకుని అధికారం సంపాదించింది.

రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ధైర్యంగా పోరాడి గెలిచిన ఆమె ప్రతిభకు తార్కాణంగా అన్ని దేశాలు ఆమెను వివిధరకాల పురస్కారాలతో సత్కరించాయి. మన భారత ప్రభుత్వం కూడా ఆమె అంతర్జాతీయ అవగాహన పటిమకు గుర్తుగా ఆమెను ‘జవహర్ లాల్’ పురస్కారంతో సత్కరించింది. 1991లో నోబుల్ శాంతి బహుమతిని అందుకున్నది. ఆమె జైలులో ఉండగానే 2008 సంవత్సరంలో నాటి యు.ఎస్.ఎ. ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యు బుష్ ఆమెను ‘కంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ తో సత్కరించారు.

ఆంగ్ సాన్ సూకీ

ఎన్నో దేశాలను సందర్శించి అక్కడ నివసించిన ఈ ఆదర్శ మహిళ, తన అనుభవాల ద్వారా సంపాదించిన సామాజిక స్పృహతో, చైతన్యంతో, బూర్జువా పాలనలో, ఎన్నో ఆకృత్యాలకు గురౌతున్న తన దేశ ప్రజల స్థితి గతులను మార్చి వారికి మంచి జీవన సౌకర్యాన్ని కలిగించాలని ధృడసంకల్పంతో మయన్మార్ మిలిటరీ పాలనపై ధ్వజమెత్తింది. కనీస వసతులతో తన దేశ ప్రజలు స్వతంత్ర జీవనాన్ని గడపాలని ఉద్యమించింది. పర్యవసానం, నాటి నిరంకుశ పాలకులు ఆమెను గృహనిర్భంధం చేశారు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను సంవత్సరాలు. అయినను ఆమె చలించక తన కృషిని కొనసాగిస్తూనే ఉన్నది. చివరకు ప్రపంచ దేశాల సహాయంతో సొంత దేశంలో ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టి, ప్రజల సమ్మతితో రాజకీయ ప్రతినిధిగా ఎదిగి తన ఆశయాలను ఆచరణలోకి తీసుకొని వస్తున్నది. అందులో ఆమె సఫలీకృతురాలై బడుగు ప్రజల జీవితాలు బాగుపడాలని కోరుకుందాం. తన లక్ష్యసాధనలో తన జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసేందుకు కూడా వెనుకాడని ఆ మాతృమూర్తిని, ఈ మాతృదినోత్సవ సంచికలో మనసారా అభినందించి, ఆమె ఆదర్శాలకు చేయూతనిద్దాం.

Posted in May 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!