Menu Close
Kadambam Page Title
పోలయ్య కూకట్లపల్లి (కవి రత్న)
అతిచనువు అగ్గిపుల్లైతే..?
పోలయ్య కూకట్లపల్లి (కవి రత్న)

“చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా ఉంది
పగలు రేయిగా మారింది
పరువం ఉరకలు వేసింది"

అంటూ... అందాలన్నీ
ఆరబోస్తూ అతిచనువుగా
తనువు తనువు తాకుతూ
తిక్కరేగి వీధుల్లో విచ్చలవిడిగా
అచ్చోసిన ఆంబోతుల్లా
అర్థనగ్నంగా తిరుగుతూ
పోకిరిగాళ్ళు వేసే
కుళ్ళు జోకులకు
విరగబడి నవ్వుతూ...

మెరుపు తీగలా
మెలికలు తిరుగుతూ
ఓరచూపులతో పెదాలను
మత్తుగా కొరుకుతూ
మయూరిలా కులుకుతూ...

రేపు పోకిరోళ్ళు
మూమూ అంటూ
ముద్దులడగవచ్చు...
నో నో అంటూనే నీవు
ఒకటికి రెండివ్వొచ్చు...

నిన్ను పార్కుల్లో
ఖరీదైన కార్లలో తిప్పవచ్చు
డ్రింక్స్ కి డ్రగ్స్ కి నిన్ను
బానిసను చేసి
పీకలదాకా ఏదో మాయలో
తెలియని మత్తులో ముంచి...

నీప్రాణమిచ్చేలా...
నీకు పిచ్చిముదిరేలా...
అడగకుండానే అన్నీ ఇచ్చేలా...
నిన్ను కీలుబొమ్మగా
మార్చివేయవచ్చు
నిన్ను ఉన్మాదంలో ఉంచవచ్చు
నీవు ఊబిలో కూరుకుపోయావని
నీవు "వల్లో చిక్కుకున్నొక లేడివని"
నీవు తెలియక పోవచ్చు...

ఆపై నీపై
ఆధిపత్యం
సాధించినట్టు...
నీతో పడుకున్నట్టు...
నీతో ఆడుకున్నట్టు...
నిన్ను వాడుకున్నట్టు...
ఏదో అఘాయిత్యం జరిగినట్టు...
నీకు తెలియకనే పోవచ్చు...

అందుకే
అజ్ఞానమే ఆస్తిగా...
లోకజ్ఞానమే నాస్తిగా...
ఆకర్షణే ఆభరణరంగా...
బ్రతికే ఓ బంగారు బొమ్మల్లారా..!
ఓ అమాయకపు అమ్మాయిల్లారా..!
మీ చుట్టూ నయవంచకులుంటారు
గుర్తుంచుకోండి నమ్మి మోసపోకండి..!
నలుగురిలో నవ్వులపాలు కాకండి...!
"అతిచనువు అగ్గిపుల్లైతే"...
బ్రతుకు భగ్గుమంటుంది
భవిష్యత్ భస్మమైపోతుంది జాగ్రత్త సుమీ!

Posted in July 2024, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!