సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
అతి వినయం ధూర్త లక్షణం
మాదాపురంలో మల్లన్న అనే రైతుకు పాతికెకరాల మాగాణి పొలం ఉంది. నీటి వసతి బాగా ఉండటాన, ప్రతి ఏడాదీ రెండు పంటలు పండించే వాడు. పిల్లలంతా చదువుకుని నగరాల్లో స్థిరపడటాన, అతడికీ వయస్సు మీరు తుండటాన ఎవరైనా మంచి పాలేరుని ఇంట్లో ఉంచుకుంటే సాయానికి సాయం పొలం పనులకు పనులూ సాగుతాయని యోచించ సాగాడు.
మల్లన్నా, అతని భార్య, మాంచాలీ ఇద్దరూ మంచి మనస్సున్నవారు. అమాయకులు కూడా. తమ వద్ద ఉన్నది దాచుకోక అవసరానికి వచ్చిన వారిని ఆదుకునేవారు. పెద్దలోగిలి ఉన్న ఇల్లు, పాడీ పంటా అన్నీ ఉన్నా వయస్సు వల్ల వచ్చే బలహీనత మల్లన్న, మాంచాలీ లలో కూడా వచ్చింది. వయస్సులో ఉండగా పాతికెకరాలూ తానే దున్ని పొలానికి నీరుపెట్టేవాడు. మాంచాలీ తగినంత సాయం చేసేది. ఒళ్ళుదాచుకున్నవారు కాదు. ఇప్పుడేమో ఒళ్ళు దాచుకోమంటోంది వయస్సు వస్తుండటాన.
పిల్లలేమో ఐనకాడికి పొలం అమ్మేసి నగరానికి వచ్చేయమని పోరసాగారు.
"ఎందుకు నాన్నా! ఇంకా పాకులాడుతారు? మేం సంపాదిస్తున్నాం కదా! మీరు మాకు బరువా? నగరానికి వచ్చేయండి" అని పెద్ద పండక్కు వచ్చిన ప్రతి ఏడాదీ మరీ మరీ చెప్పసాగారు.
మాంచాలి "నిజమే నాయన్లారా! కానీ మాకు అక్కడ కాలం గడవదయ్యా! ఇలా మట్టి పనుల్లో పుట్టి పెరిగిన వాళ్ళం. మాకు పనిలేకపోతే ప్రాణం నిలవదు. మీకూ ఇబ్బందే, కానీ చూద్దాం" అంటూ చెప్పేది.
ఒక కార్తీక మాసంలో పొలం పనిలో మంచుకు తిరిగిన మల్లన్నకు జ్వరమొచ్చి బాగా బలహీనమయ్యాడు. ఆ సమయంలో తనకు బాగా ఎరిగున్న రైతు స్నేహితులకు 'ఒక పాలేరును, బాగా తెలిసిన వాడిని చూడండయ్యా! మాకు సాయానికి' అని చెప్పగా, పక్క ఊర్లో ఉన్న ఒక మనిషిని పిలిపించాడు తోటిరైతు రామన్న.
"రామన్నా! నీకు ఇతగాడు బాగా తెలుసు కదా! మేమా వయసుడుగుతున్న వాళ్ళం. నీతీ, నిజాయితీ ఉంటే ఫరవాలేదు కానీ లేకుంటే మాకు ఇబ్బంది కదా!" అని అడిగాడు.
దానికి రామన్న "లేదు మల్లన్నా! మా బావమరిది దగ్గర ఐదేళ్ళు చేశాడు. వాడూ పొలం అమ్ముకుని నగరమెళ్ళి పోయాక ఊరికే ఉన్నాడు. అందుకే పిలిపించాను. నాకు తెలిసినంత వరకూ ఈ కామయ్య నిజాయితీ పరుడే. మీరే చూడండి మల్లన్నా , నచ్చకపోతే పంపించేద్దాం" అని చెప్పాక, కామయ్యను పనికి పెట్టు కున్నారు.
కామయ్య ఉదయాన్నే మల్లన్నకు ముఖ ప్రక్షాళనకు నీళ్ళు అందించే దగ్గర నుంచీ, స్నానానికి ఏర్పాట్లూ, నిద్రపోయేప్పుడు పక్కలేయడం, కాళ్ళు పిసకడం వరకూ చేసేవాడు. ఇంత ప్రేమగా అడక్కుండానే పనులు చేసిపెడుతున్న కామయ్యంటే మల్లన్నకూ, మాంచాలికీ ఇద్దరికీ నెలరోజుల్లోనే అతనిపై సద్భావం ఏర్పడింది.
క్రమ క్రమేపీ చాలా పనులు కామయ్యకే అప్పగించసాగాడు మల్లన్న. ఎరువులు కొనడం, కూలీలకు రోజు కూలీ పంచడం వంటి డబ్బుతో కూడిన పనులన్నీ అప్ప గించ సాగాడు.
ఆ పెద్ద పండక్కు మల్లన్న పిల్లలంతా దిగారు. ఇల్లంతా కళకళ లాడ సాగింది.
మల్లన్నపిల్లలు కామయ్య తన తండ్రికే కాక తమకూ అడక్కుండానే చేసే అనవసరపు పనులన్నీ చూసి కొంత అనుమానం రాసాగింది. చేతులు కట్టుకుని నిల్చోడం, తమకూ కాళ్ళు వత్తుతానని రావడం వంటి పనులు వారికి కొంత అనుమానం కలిగించాయి.
తండ్రిని అడిగి ఆ సంవత్సరం పొలం పనులకెంత ఖర్చైందీ, ఇలా పొలం సాగు చేయడం మేలా, వృధానా చూద్దామని లెక్కలు అడిగి చూశారు. దాన్లో వారికి కొంత మోసం కనిపించింది.
రహస్యంగా మల్లన్నతో "నాన్నా! ఈ కామయ్య నమ్మదగిన వ్యక్తిగా అనిపించడం లేదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. మేమున్న ఈ వారంలో పరీక్షిస్తాం. ఇతని ప్రవర్తన 'అతివినయం ధూర్త లక్షణం' అన్నట్లుంది. నీవు మామూలుగానే ఉండు" అని హెచ్చరించి పొలంలో పండిన వడ్ల బస్తాలు ఇంటికి చేరేసే సమయం లో రహస్యంగా గమనించారు. ఐదోవంతు ధాన్యం పక్కకు వెళ్ళడం, అది పొరుగూరు చేరడం, కొబ్బరి తోటలో దింపిన కొబ్బరి బోండాలు కూడా కొన్ని బస్తాలు పక్క ఊరు చేరడం గమనించాక, ఇహ ఏమారడం మంచిదికాదని తలచి,
"నాన్నా! పొలమంతా కౌలుకిచ్చి మీరు సంవత్సరంలో కొద్దిరోజులు మాదగ్గరా, కొద్ది రోజులు ఇక్కడా గడపండి. అదే మేలు." అని పొలాన్నంతా కౌలుకిచ్చేసి, కామయ్యను పనిమానిపించి అమ్మా నాన్నలను కొద్ది కాలం అని చెప్పి తమతో తీసుకెళ్ళారు పిల్లలు. అమాయకులైన మల్లన్న దంపతులు కామయ్య చేయనున్న ప్రమాదం నుంచీ తప్పించుకున్నారు.
అందుకే పెద్దలన్నారు ‘అతివినయం ధూర్త లక్షణం' అని.