మూడు ముళ్ళ బంధానికి
అతను వాక్యమై అల్లుకోవడంతో
ఆమె పదమై పరిమళించడంతో
దాంపత్య ఆవరణలో పిల్లలు అక్షరాలై
ఆడుకుంటున్నారు
అతని దృష్టిలో
ఆమె ఎప్పుడూ కరివేపాకె
ఆమె దృష్టిలో
అతనెప్పుడూ వేపాకె
పిల్లల దృష్టిలో
వారెప్పుడూ చింతాకే
ఆమెకు తెలుసు
అతని కాళ్ళకింద చెప్పునైయ్యానని
అందుకే ఆ కాళ్ళను దాటాలనుకుంటుంది
తన కాళ్ళకు నలుసులు అడ్డుపడడంతో
పెళుసు బారిన మనసుతో
మరలా సంసారపుతాడును చేతిలోకి తీసుకుని
ఆ కాళ్ళతోనే ముందుకుసాగుతుంది
ఎన్నడూ లేనిది
అతని కంట్లో నీళ్ళు పారాడుతున్నాయి నేడు
ఇక ఆమె కళ్ళముందు పారాడదని తెలిసి
ఆమెను బంధించిన పసుపుతాడు
కొత్తదే
అతన్ని బంధించిన మత్తుతాడే
పాతది
అందుకేనేమో
ఏ తాడును తెంపలేక
మద్యం చేత కాల్చబడుతున్న
తన మన్మథుడుని చూస్తూ
కోరికలు తీరని రతి దేవై మిగిలిపోయిందామె
బియ్యానికి నోచుకోని యెసరై ఆవిరవుతూ..
ఆమె సముద్రమే
ఆమె కళ్ళల్లో అలలు
రెప్పల చెలియలి కట్టను దాటుతున్నాయి
ఆమె హృదయం ఎంత విశాల సముద్రమో
ఎన్నో బడబాగ్నీలను దాచుకుంది
హృదయంలో
పారిజాత వృక్షాన్ని కట్టుకోవాలనుకున్న అతను
కాలం గారడీతో
రేగు వృక్షాన్ని కట్టుకున్నాడు
ఇంకేముంది
బ్రతుకంత సమస్యల ముళ్ళే