గత సంచికలో వీతాశోక ఉత్తమ శ్రేణి బౌద్ధ సన్యాసిగా పరివర్తన పొందటం, అశోకుడు తన సోదరుడి పాదాలమీద పడి ఆయనను సత్కరించటం తెలుసుకున్నాము. చివరకు అశోకుడు చేసిన ఆ పెద్ద పొర పాటు వల్ల ఈ మహాశయుడు మరణించటం కూడా తెలుసుకున్నాము. అశోకుడి ఆధ్యాత్మిక గురువు సర్వాస్థివాది (Sarvāstivādi) అయిన ఉపగుప్త ద్వారా వీతాశోక గత జన్మలు, ఏ కారణం వల్ల ఈ జన్మలో అయన అకస్మాత్తు మరణం సంభవించిందీ తెలుసుకొనటం జరిగింది. ప్రస్తుత సంచికలో అశోకుడి పుత్రుడు ‘మహీంద్ర’ గురించి తెలుసుకుందాము.
కాని, మహీంద్ర సింహళ దేశంలో ప్రవేశించక ముందే అచ్చట బౌద్ధ మతానికి గౌతమ బుద్ధ ద్వారా అంకురార్పణ జరిగింది. దీనిని గురించి ముందు తెలుసుకుందాము.
గౌతమ బుద్ధ సింహళ పర్యటన
బౌద్ధ చరిత్ర ఆధారాల ప్రకారం గౌతమ బుద్ధ మూడు సందర్భాలలో సింహళ దేశంలో 16 ప్రదేశాలను పర్యటించటం జరిగింది. వీటిని సింహళ భాషలో 'సోలోస్మస్థాన (Solosmasthana: 16 స్థానాలు) అంటారు.
గౌతమ బుద్ధ క్రీ.పూ. 531 లో డిశంబర్ 8 వ తేదీన జ్ఞానోదయం (Enlightenment) పొందిన తరువాత 9 నెలలకు (క్రీ.పూ. 530 సెప్టెంబర్ లో) మొదట సారి సింహళ Mahiyangana (Uva రాష్ట్రం లోని Badulla జిల్లా) సందర్శించాడు. ఆ సమయంలో అయనను ప్రతిఘటించిన యక్షులను జయించి వారిని 'గిరి' (Giri) అనే దీవిలో స్థిరపరచి సింహళలో బౌద్ధ ధర్మం స్థాపనకు మొదటి అడుగు వేయటం జరిగింది. ఆ సమయంలోనే ఆయనకు తాను స్థాపించిన బౌద్ధ ధర్మం ఈ దేశంలో వెలుగొందుతుందని గోచరించింది.
రెండవ పర్యాయం ఆయన జ్ఞానోదయం పొందిన తరువాత 5 వ సంవత్సరంలో (క్రీ.పూ. 526 లో) ‘నాగద్వీపం’ రావటం జరిగింది. అప్పుడు ఇద్దరు రాజులు 'చులోధర' (Chulodhara), 'మహోదర (Mahodhara) మధ్య రత్నఖచితమైన సింహాసనం కోసం జరుగుచున్న వివాదాన్ని పరిష్కరించటం జరిగింది.
మూడవ సారి, చివరి సారి, గౌతమ బుద్ధ జ్ఞానోదయం పొందిన తరువాత 8వ ఏట (క్రీ.పూ. 523 లో) 500 మంది బౌద్ధ భిక్షువులతో సింహళ పర్యటన నాగరాజు ‘Maniakkika’ అభ్యర్ధన మేరకు జరిగింది. ఈ పర్యటనలో ఈ నాగరాజు నివాసంలో ఆయన ఉండి సమంతకూట (సమంతగిరి), Diva Guhava (దివ్య గుహ), Dighavapi (దీర్ఘవాపి: Dirghavapi) లను దర్శించటం జరిగింది. ఈ ప్రదేశాలలో బుద్ధ ధర్మాన్ని స్వీకరించిన అప్పటి రాజులు గౌతమ బుద్ధ జ్ఞాపకార్ధం కొన్ని స్థూపాలు నిర్మించారు. ఈ నేపథ్యంలో మహీంద్ర ఈ బౌద్ధ ధర్మం స్థాపకుడు చివరి పర్యటన తరువాత 272 ఏళ్లకు సింహళ దేశం రావటం జరిగింది.
మహీంద్ర (పాలీ: మహీంద)
అశోకుడి జ్యేష్ఠ పుత్రుడయిన మహీంద్ర మాతృమూర్తి ‘విదిష’ వాస్తవ్యురాలయిన ‘దేవి’. వైశ్య వర్ణస్థు రాలయినందువల్ల ఈమెకు ‘వైశ్యపుత్రీ-దేవి’ అనే నామం కూడా ఉంది. అశోకుడు తన తండ్రి (బిందుసార) ఉజ్జయిని రాజ్య ప్రతినిధిగా ఉన్నప్పుడు ఈ అత్యంత సుందరిని ప్రేమించి వివాహం చేసుకొనటం జరిగింది. ఈమె అశోకుడి జ్యేష్ఠ భార్య. సుందరుడయిన మహీంద్ర క్రీ.పూ. 280 లోజన్మించాడు. రెండు ఏళ్ల తరువాత (క్రీ.పూ. 278) ఒక పుత్రిక కలిగింది. ఆమె పేరు ‘సంఘమిత్ర’. మహీంద్ర, సంఘమిత్ర జననం అశోకుడి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం, అయన భవిషత్తు జీవితాన్ని మలుపు తిప్పిన విష యం.
బౌద్ధ మతస్తురాలయిన దేవి తన పిల్లలు బాల్య వయస్సు దాటిన తరువాత వీరిని సాంచి పట్టణానికి తీసుకువెళ్లి వీరిచే బౌద్ధ సన్యాస దీక్ష ‘పబ్బజ్జ’ (పాలీ భాష: Pabbajjā; సంస్కృతం: ప్రవరాజ్య: Pravarajya) స్వీకరింపజేసింది. దీని అర్ధం ‘ప్రపంచాన్ని విడనాడటం.’
బౌద్ధ మతం స్వీకరించే వారు ఈ ప్రధమ దశ దాటిన తరువాత 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు పూర్తి సన్యాసత్వం స్వీకరించి భిక్షువులు అవుతారు. మహీంద్ర, సంఘమిత్రలు తల్లి కారణంగా ఈ విధంగా బౌద్ధ భిక్షవులు అవటం జరిగింది. తరువాత కాలంలో అశోకుడు మౌర్య రాజు అయినప్పుడు కూడా దేవి తన ఇద్దరు పిల్లలతో చాలాకాలం ఉజ్జయినిలోనే ఉండిపోయింది.
మహీంద్ర బౌద్ధ మతం స్వీకరించిన తరువాత తన జ్యేష్ఠపుత్రుడిని తనకు ఉత్తరాధికారిగా నియమించాలని భావించి అశోకుడు అతనిని బౌద్ధ మతాన్ని పరిత్యజించమని అనేక ప్రయత్నాలు చేయటం జరిగింది. ఆ కాలంలో భారతావనిలో సాంప్రదాయ సనాతన ధర్మస్థులు అత్యధికులు కాబట్టి బౌద్ధ ధర్మాన్ని అనుసరించే వ్యక్తిని, అందులోనూ ఒక వైశ్య స్త్రీ పుతృడిని యువరాజుగా వారు ఆమోదించరు గాబట్టి అశోకుడు మహీంద్రను సనాతన ధర్మస్థుడుగా మార్చటానికి చాలా ప్రయత్నం చేయటం జరిగింది. బిందుసార మరణం ముందు ఏ పుతృడిని అయన యువరాజుగా నియమించలేదు. అందువల్ల అయన మరణం తదుపరి జ్యేష్ట పుత్రుడు ‘సుషిమ’ (Sushima) కు రాజు కాగల యోగ్యత, అర్హత ఉన్నా అతనిని, ఇతర సోదరులను అశోకుడు వధించి సింహాసనం స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఈ భయం తన పుత్రుడు మహీంద్ర విషయంలో జరగవచ్చని భావించి అతనిని తాను జీవించి ఉండగానే యువరాజును చేయాలనే తాపత్రయం కలిగింది.
కాని మహీంద్రకు రాజ్య కాంక్ష ఏమాత్రం లేదు. తండ్రి ప్రయత్నాలను తిప్పి కొట్టి తాను ఎన్నుకున్న బౌద్ధ ధర్మ మార్గంలోనే పయనించటం జరిగింది. అప్పటికీ, అశోకుడు పట్టు వదలక మహీంద్ర పొరుగు దేశం ‘సింహళ’ (లంక; ఇప్పటి శ్రీ లంక; Sri Lanka) కు పంపిస్తే తన తరువాత సింహాసనం కోసం పెనుగులాటలు జరిగితే ఈ తన ప్రియ పుత్రుడికి రక్షణ ఉంటుందని భావించాడు. ఆ కాలంలో అశోకుడు సింహళ దేశాధిపతి ‘దేవనామప్రియ-తిస్స’ (పాలీ: Devanampiya Tissa) మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.
అనేక సార్లు వీరిద్దరు ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు. బౌద్ధ తత్త్వాన్ని స్వీకరించిన తరువాత అశోకుడు తొమ్మిది దిక్కులలో ఉన్న రాజ్యాలకు బౌద్ధ ధర్మ బోధకులను, సన్యాసులను పంపించటం జరిగింది. సింహళ దేశాధీశుడు దేవనామప్రియ తిస్స కోరిక ప్రకారం ‘మహీంద్ర’ ను లంక దేశానికి పంపించాలని నిర్ణయించాడు. అచ్చటికి వెళ్తే సింహాసన పెనుగులాటలలో తన జ్యేష్ఠ పుత్రుడికి పూర్తి రక్షణ ఉంటుందని అశోకుడు భావించటం జరిగింది.
క్రీ.పూ. 251 లో మహీంద్ర వెంట ఆరుగురు బౌద్ధ Arhat లను పంపించాడు. వీరు: ఇత్తియ (Ittiya), ఉత్తియ (Uttiya), సంబల (Sambala), బద్దశల (Bhaddasala), మహీంద్ర మేనల్లుడు యువకుడు ‘సమనేర’ (Samanera), మహీంద్ర బంధువు ‘భందుక’ (Bhanduka). వీరి ముఖ్యకార్యక్రమం లంక దేశం లో బౌద్ధ ధర్మం వ్యాప్తి చేయటం. వీరందరు అశోకుడి రాజ కుటుంబంలోని వారే. వీరు మొదట మహీంద్ర తల్లి ‘దేవి’ని దర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకోవాలని తలంచి ఉజ్జయిని రాజ్యంలోని ‘వేదస గిరి’ (Vedasa Giri) విహార వెళ్లారు. ఈ వేదసగిరి కి ప్రత్యమ్నాయం ‘విదిస’ లేక ‘విదిష’. తరువాత కాలంలో అది ‘సాంచి’ (Sanchi) గా పేరొందింది. ఇది భోపాల్ నగరానికి 46 కి.మీ. దూరం లో ఉంది.
తన అనుచరులతో 29 ఏళ్ల మహీంద్ర [లంక భాష సింహళ లో ఆయన పేరు: మిహిందు: (Mihindu)] లంక దేశంలోని ‘అనురాధపుర’ పట్టణం చేరగా, వారికి మహారాజు దేవనామ తిస్స, ఆయన తమ్ముడి భార్య ‘అనుల’ (Princess Anula), ఆమెతో పాటు 500 మంది స్త్రీ పరివార గణం ‘మహా మేఘ’ ఉద్యానవనం (Mahameghavana) లో స్వాగతం పలికారు. మహీంద్ర, ఆయన అనుచరులు అనురాధ పుర Poson నెల (May 22-June 21 మధ్య; భారతదేశంలో జ్యేష్ఠ మాసం) లో పౌర్ణమి రోజున రావటం జరిగింది. కేశములు లేని శిరస్సు (Shaven-headed) గల ‘మహీంద్ర’, ఆయన అనుచరులను చూసి లంక రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన బౌద్ధ సన్యాసులను ఎప్పుడూ చూడలేదు. ఆయన అనుమానాలను మహీంద్ర నివృత్తి చేసి గౌతమ బుద్ధ ప్రవచించిన కొన్ని సూత్రాలను బోధించి ఆ తరువాత సింహళ రాజు ‘తిస్స’ తోపాటు కొంతమంది రాజ కుటుంబీకులు, తదితరులను బౌద్ధ మతంలోకి మార్చటం జరిగింది. అనంతరం మహీంద్ర, అతని అనుచరులను సింహళ రాజధాని ‘అనూరాధపుర’ కు లంక రాజు ఆహ్వానించగా అచ్చట అశోక పుత్రుడు బౌద్ధ ధర్మం గురించి అనేక ఉపన్యాసాలను ఇవ్వటం జరిగింది.
తదుపరి దేవనామప్రియ తిస్స కోరిక ప్రకారం రాజ చావడి (Royal Hall) లోను, రాజ ఉద్యాన వనం లోను మహీంద్ర ప్రజలకొరకు బౌద్ధ ధర్మం మీద రెండు ఉపన్యాసాలు ఇచ్చాడు. వీటి ఫలితంగా అనేకమంది లంక ప్రజలు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. ‘మహామేఘవనం’ గా (Mahamegha vana) (సింహళ భాషలో: Mahamevuna Uyana) గా ప్రసిద్ధి చెందిన ఈ రాజ ఉద్యానవనం మహీంద్రకు ఆయన అనుచరులకు నివాసంగా సింహళ రాజు కేటాయించటం జరిగింది.
ఈ స్థలమే తదుపరి కాలక్రమేణా మహామేఘవనం ‘మహావిహార’ (Mahavihara) గా ప్రసిద్ధి చెందింది. ఇదే శ్రీలంక లో బౌద్ధ సంస్కృతికి, పాండిత్యానికి మొట్టమొదటి కేంద్రం. దీని తరువాత కొన్ని ఏళ్ల కు అది ‘మిహింతలే’ గా పేరొందింది. మిహిందు నివసించిన స్థలం కాబట్టి సింహళ భాషలో దీనిని ‘మిహిన్-స్థలి’ (మిహిన్-తలె: Mihintale) గా ప్రాచుర్యం పొందింది. ‘మిహిన్-తలె’ (Mihin-Thale:Plateau of Mihindu) పదానికి అర్ధం ‘మిహిందు-తలె’ (మహీంద్ర పీఠభూమి) ఈ ‘మిహింతలె’ లోనే చైత్యగిరి విహార ఆశ్రమాన్ని మహీంద్ర నెలకొల్పటం జరిగింది. మహీంద్ర, అనుచరులు క్రీ.పూ. 251 లో Poson (జ్యేష్ఠ మాసం) నెలలో వచ్చినందువల్ల అప్పటి నుంచి బౌద్ధ మత స్థులు ప్రతి సంవత్సరం Poson నెలలో అనురాధపురం నుంచి మిహిన్-స్థలి కి తీర్థ యాత్రలు చేస్తారు ఇప్పటికీ.
బౌద్ధ ధర్మాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టిన మహీంద్ర కాల క్రమేణా పురుషులకు ‘భిక్షువు’ శ్రేణి (Order) ప్రవేశపెట్టాడు. కాని అనేకమంది స్త్రీలు కూడా భిక్షుణిలు గా మారాలని ఆకాంక్షించారు. అప్పటికే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన ‘అనుల’ (రాజు తిస్స మరదలు) తనను భిక్షుణి గా నియమించమని మహీంద్రను కోరగా ఆయన తన నిస్సహాయతను తెలియజేశాడు. స్త్రీలను భిక్షుణిలుగా నియమించగల వారు కేవలం స్త్రీ Arhat లకే సాధ్యం.
అందువల్ల ఈ కార్యక్రమం నిర్వహించటానికి తన సహోదరి, బౌద్ధ భిక్షుణి అయిన ‘సంఘమిత్ర’ ను ఇచ్చటకి పంపించమని తన తండ్రి అశోకుడికి ఒక లేఖ వ్రాయమని మహీంద్ర సింహళ రాజు ‘తిస్స’ కు సలహా ఇచ్చాడు.
ఆమెతోపాటు గయ లో గౌతమ బుద్ధ ధ్యానం చేసిన బోధి వృక్షం కొమ్మ ఒకటి పంపించమని కూడా నా తండ్రిని కోరండి అని సూచించాడు. ఈ తన కోరికలను అశోకుడి తెలియజేయటానికి సింహళ రాజు తన మేనల్లుడు ‘అరిత్త’ (Arittha) ను పాటలీపుత్రకు పంపించటం జరిగింది. ఒక సింహళ మంత్రి “నన్ను కూడా ఆమెతో పంపి తిరిగి వచ్చిన తరువాత నన్ను మహీంద్ర భిక్షువు గా నియమిస్తే నేను వెళ్తాను” అని రాజు తిస్సకు తెలియజేశాడు. దీనికి తిస్స అంగీకరించి తన మేనల్లుడుతో పాటు ఈ మంత్రిని కూడా పంపించాడు.
పురాతనకాలం నుంచి ఈ మిహిన్-తలె పర్వతం ఎక్కటానికి చాలా కష్టతరంగా ఉండేది. అది సులభంగా ఎక్కటానికి మహీంద్ర ఇచ్చట స్థిర పడిన తరువాత దేవనామప్రియ-తిస్స పెద్ద పెద్ద మెట్లు ఏర్పాటు చేసి భిక్షువులు నివసించడానికి 68 గుహలు నిర్మించాడు. దీనివల్ల కాలక్రమేణా బౌద్ధ సన్యాసులకు ఆశ్రమాలు మరియు విహారాలతో పాటు అనేక నివాసయోగ్య ఇళ్లను, భవనాలను నిర్మించటం జరిగింది.
కొంతకాలం తదుపరి మహీంద్ర ఒక బౌద్ధ స్థూపాన్ని నిర్మింప చేయించి, ఆ తరువాత గౌతమ బుద్ధుడి కొన్ని అవశేషాలను గయ నుంచి సింహళ కు తరలించాడు. దేవనామ తిస్స మేనల్లుడు, బౌద్ధ భిక్షువు ‘అరిత్త’ చేత సన్యాసుల ‘వినయ పితాక’ (Vinaya Pithaka) లో నిర్దేశించబడిన ప్రవర్తన, జీవన, నియమావళిని వివరింపజేసి సింహళ లో బౌద్ధ ధర్మం మరింత వృద్ధి చేయటానికి మహీంద్ర తోడ్పడ్డాడు.
మహీంద్ర సింహళ దేశం లో ప్రవేశించి బౌద్ధ ధర్మం వ్యాప్తిచేయుటకు ముందు అచ్చటి ప్రజలు సనాతన హైందవ ధర్మం, జైన ధర్మం అనుసరిస్తూ ఉన్నారు. రాజు దేవనామ తిస్స, అయన పరివారంతో సహా అత్యధిక ప్రజల జీవితాలు సనాతన హైందవ ధర్మంతోనే ముడిపడి ఉన్నాయి. సనాతన ధర్మస్థులే సమాజంలో ప్రముఖ స్థానాలలో ఉన్నారు. మహీంద్ర, అయన అనుచరగణం వచ్చినప్పటినుంచి సింహ ళ లో బౌద్ధ ధర్మం ప్రముఖ స్థానం పొందటం జరిగింది.
దాదాపు 40 ఏళ్ల పాలించిన తరువాత దేవనామప్రియ తిస్స క్రీ.పూ. 247 లో మరణించటం జరిగింది. ఆయన తదుపరి తిస్స సోదరుడు “ఉత్తియ” (Uttiya) సింహళ దేశాన్ని పరిపాలించాడు.
20 వ శతాబ్దపు శ్రీ లంక బౌద్ధ సన్యాసి మహీంద్రను ‘వినయ త్రిపీఠక’ ను సింహళ భాషలో తర్జుమా చేసి తన దేశంలో ప్రవేశపెట్టి బౌద్ధ మతస్థులందరికి, ఇతరులకు అందజేసిన ‘ప్రధమ భిక్షువు’ అని వర్ణించాడు. అంతేగాక ఆయనే మౌర్య సంస్కృతిని మొట్ట మొదట సింహళ ద్వీపానికి తీసుకురావటం జరిగింది. ఒక కెనడా దేశపు బౌద్ధ సన్యాసి, చరిత్రకారుడు Suwanda H.J. Sugunasiri “ప్రపంచంలో అతి ప్రాచీన బుద్ధపూజ ప్రవేశపెట్టిన మహావ్యక్తి మహీంద్ర” అని వ్యాఖ్యానించటం జరిగింది.
క్రీ.పూ. 251 లో సింహళ దేశం వచ్చిన మహీంద్ర తిరిగి పాటలీపుత్ర వెళ్ళలేదు, తండ్రి అశోకుడిని చూడలేదు. ఆదిలో బౌద్ధ ధర్మాన్ని గౌతమ బుద్ధుడే సింహళ దేశానికి తీసుకువెళ్లి ప్రవేశపెట్టినా, దానిని దేశం నలుమూలలా వ్యాప్తి చేసిన ఘనత మహీంద్రకే దక్కుతుందనే విషయం నిర్వివాదం. ఆలా 47 ఏళ్ళు బౌద్ధ ధర్మ వ్యాప్తికి కృషి చేసిన ఈ 76 ఏళ్ల అశోకుడి జ్యేష్ఠ పుత్రుడు మహీంద్ర క్రీ.పూ. 204 లో అనూరాధపురలో నిర్వాణం పొంది ఈ భువిని వదలి వెళ్ళటం జరిగింది.
అశోకుడి పుత్రిక ‘సంఘమిత్ర’, ఆమె చేసిన కృషి వల్ల సింహళ దేశ స్త్రీలలో బౌద్ధ ధర్మం మరింత వ్యాప్తి చెందటం గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాము.