వీతాశోక-2
గత సంచికలో సనాతన ధర్మం అనుసరించే తన సోదరుడు వీతాశోకను బౌద్ధమతంలోకి మార్చటానిక అశోకుడు ఒక కఠినమైన పరీక్ష పెట్టినట్లు తెలుసుకున్నాము. ఈ పరీక్షలో అతనికి మృత్యుభయం కలిగేటట్లుగా చేసి, దానిని ‘అధిగమించటానికి బౌద్ధ సన్యాసులలాగా ఎందుకు జీవించవు’ అని ప్రశ్నించాడు సోదరుడిని. “వారికి ఎంత సుఖం ఉన్నా వారి హృదయాలు మాత్రం విమోచన కొరకే ఎదురు చూస్తాయి; వారు భయం, భ్రాంతి లేకుండా జీవిస్తారు; అందువల్ల నీవు బౌద్ధ సన్యాసిగా ఎందుకు మారలేవు?” అని వీతాశోకను ప్రశ్నించాడు. చివరకు వీతాశోక గౌతమ బుద్ధ ఉపదేశించిన మార్గంలో పయనించటానికి సంసిద్ధుడయ్యాడు.
వీతాశోకుడి పరివర్తన
ఆ రోజునుంచి వీతాశోక బౌద్ధ సన్యాసులకు పరిమళద్రవ్యాలు, పూలదండలు సమర్పిస్తూ వారిని గౌరవించటం ప్రారంభించటం జరిగింది. బౌద్ధ సమావేశాల యెడల అత్యంత గౌరవం ప్రదర్శిస్తూ వాటికి హాజరు అవటం ప్రారంభించాడు. ఒకరోజు వీతాశోక పాటలీపుత్రలోని ‘కుక్కుట-ఆరామ’ ఆశ్రమాన్ని దర్శించినప్పుడు మానవ జీవితానికి ఉన్న పరమార్ధం గురించిన అంతర్దృష్టి (insight) సాధించి నిర్వాణం పొందిన ఒక పేరొందిన బౌద్ధ సాధువు (Arhant) ను దర్శించాడు.
ఆ బౌద్ధ ‘స్థవీర’ (Elder: పెద్ద) వీతాశోకను నిశితంగా పరిశీలించి బౌద్ధధర్మ మార్గం అనుసరించటానికి అతను అన్నివిధాలా అర్హుడని భావించి ఈ అశోకుడి సోదరుడు ఇప్పటి శరీరంలోనే (జన్మ) పరిణితి పొందిన బౌద్ధ సాధువు (Arhat) కాగలడని అయన వెల్లడించటం జరిగింది.
ఈ స్థవీర మాటలు విన్న వెంటనే అమిత సంతోషంతో వీతాశోక యాచకుడుగా మారాలనే కోరికతో ఆయనకు నమస్కరించి “అయ్యా! మీ ఆశీర్వాదంతో, అనుమతితో గౌతమ బుద్ధ మహాశయుడు ప్రభోధించిన మార్గంలో నడవటానికి నేను సంసిద్ధుడను. చివరకు మీ ముందు బౌద్ధ సన్యాసిగా మారటానికి కూడా నేను సంసిద్ధుడనే”
ఈ మాటలకు సంతసించిన స్థవీర: “ఆలా అయితే మిత్రుడా! ఈ నీ కోరికను మహారాజు అశోక కు తెలియజేయి” అని సూచించాడు.
వీతాశోక గురించి అశోకుడి ఆవేదన
వెంటనే వీతాశోక అశోకుడు దగ్గరకు వెళ్లి నమస్కరించి “మహారాజా! నేను బౌద్ధ సన్యాసిగా మారి బుద్ధ మహాశయుడు బోధించిన మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాను. దీనికి మీ అనుమతి కోరు చున్నాను” అని అంటూ “అంకుశం పోటు తెలియని ఏనుగు వలె నేను దారి తప్పాను. కాని శక్తివంత మైన మీ దయ వల్ల, గౌతమ బుద్ధుడి బోధనల వైపు ఆకర్షితుడయినాను. ఆ మార్గంలో పయనించటానికి మీ అనుమతి కోరుచున్నాను” అని వేడుకున్నాడు.
ఈ మాటలను విన్న అశోకుడు సోదరుడిని చూస్తూ అశ్రునయనాలతో “వీతశోకా! నీ నిశ్చయాన్ని పరిత్యజించు. యాచకులు అధమ జాతి వ్యక్తులతో కలిసి నివసించాలి, సహవాసం చేయాలి. బానిసలు ధరించి త్యజించిన వస్త్రాలను, చింపిరి దుస్తులు, దుమ్ము ధూళి నిండిన గుడ్డలను ధరించాలి. వీరు బిక్షాటన చేయాలి, ప్రతిరోజూ ఇతరుల నుంచి ఆహారం ఆశించాలి; పచ్చిక గడ్డి మీద శయనించాలి. నీవు రోగి అయితే కేవలం ఆకుల మీదనే పండుకోవాలి; ఇతరులు పారవేసిన పదార్ధాలను తిని బ్రతకాలి. ఔషదాలు లభించటం చాల కష్టమైన పని. బలహీనుడయిన నీవు ఆకలి, దప్పిక, చలి, వేడి మొదలైన వాటిని ఎలా తట్టుకోగలవు? అందువల్ల ఈ ఆలోచనను వదిలిపెట్టమని నిన్ను వేడుకొనుచున్నాను, బ్రతిమాలుచున్నాను” అని కోరటం జరిగింది.
వీతాశోక: “లేదు ప్రభూ! మీరు చెప్పినట్లు చేస్తే ఈ ప్రాపంచిక విషయాలమీద ఆసక్తి మరింత పెరుగుతుంది. సుఖంలో కంటే బాధలోనే, అందులోనూ ఆధ్యాత్మిక సంబంధిత బాధలోనే, అత్యంత సంతృప్తి కలుగుతుంది. కాంక్షకు అతీతమైన ఆధ్యాత్మిక జీవితంలో పేదరికం ఉండదు. నాకు పునర్జన్మ అంటే ఉన్న భయం వల్ల నాకు ఆధ్యాత్మికయే పూర్తి సంతోషం, సుఖం, భద్రత కలిగిస్తుంది."
ఆ మాటలు విని అశోకుడు నిట్టూర్చి దుఃఖంలో మునిగిపోయాడు. ఆయనను ఓదార్చటానికి వీతాశోక ఇలా పలికాడు: “ప్రభూ! ఒక్కసారి మనం ఈ భూమిమీదకు ప్రవేశించినప్పుడు మన జీవితాలు అశాశ్వతం అవుతాయి. ఈ నగ్న సత్యం తెలిసి కూడా మీకు ఈ భావోద్వేగం, మనోవికారం ఎందుకు? మనం ఎప్పుడో ఒకరోజు విడిపోక తప్పదు కదా! అందువల్ల ఈ దుఃఖం మీకు తగినది కాదు సోదరా."
అశోకుడు దుఃఖాన్ని విడనాడి: “ఆలా అయితే నీ ఆధ్యాత్మిక ప్రయాణం ఈ రాజ గృహంలోనే ప్రారంభించు; బుద్ధ సన్యాసి జీవితం ఇప్పుడే, ఇచ్చటే ప్రారంభించి కొనసాగించు” అని సూచించాడు. రాజ ప్రసాదంలో వృక్ష పరివేష్టితమైన ప్రదేశంలో ఒక చోట వీతాశోక ఆసీనుడయ్యాడు. ఆదిలో బౌద్ధ యాచకుడుగా అయన రాజ గృహంలో వివిధ చోట్లకు వెళ్లి భిక్ష అర్ధించగా, అచ్చటి స్త్రీలు మంచి రుచికరమైన ఆహారం వేశారు. ఇది గమనించిన అశోకుడు “సన్యాసులకు వేసే భిక్షను ఇతనికి వేయమని” రాజగృహ సేవకులను ఆదేశించాడు. ఆ తరువాత ప్రతి రోజూ వితాశోకకు చెడిపోయిన, పాచిపోయిన ఆహారాన్ని వేశారు. అది చూసి అశోకుడు వీతాశోకతో “యాచక జీవితం ప్రారంభించటానికి నీకు అనుమతి ఇచ్చాను. నీకు భిక్ష వేసినప్పుడు అది నాకు చూపించు” అనటం జరిగింది.
కుక్కుట-ఆరామ లో శిక్షణ, బౌద్ధ సన్యాసిగా పరివర్తన పూర్తి
కొన్నాళ్ళు గడిచిన తరువాత వీతాశోక “ఈ రాజప్రసాదంలో యాచకుడుగా ఉంటే నేను జనసమూహములో ఉన్నట్లే ఉంటుంది” అని భావించి ఆయన కౌశాంబి నగరంలో ఉన్న ‘కుక్కుట-ఆరామ’ ఆశ్రమానికి వెళ్ళాడు. అచ్చటికి వెళ్లిన తరువాత కొన్నాళ్ళకు ‘విదేహ’ (మిథిల; ఇప్పటి Tirhut) లో స్థిరపడి అచ్చట భిక్షాటన చేయటం ప్రారంభించాడు. కఠినమైన కృషి వల్ల వీతాశోక కొన్ని ఏళ్లకు బౌద్ధ సన్యాసి (Arhat)స్థితి సాధించాడు. ఈ విమోచనం ఆయనకు అనంతమైన సంతోషానికి కారణమైంది.
ఈ ఉన్నత స్థితికి చేరిన వెంటనే పాటలీపుత్ర వెళ్లి అశోకుడి రాజ సింహద్వారం వద్ద నిలబడి ద్వారపాలకుడితో “లోపలకు వెళ్లి మహారాజు అశోకుడితో వీతాశోక సింహద్వారం నిలబడియున్నాడు, మీ దర్శనానికి ఎదురు చూస్తున్నాడు అని చెప్పు” అని కోరాడు.
ఆ ద్వార పాలకుడు తిన్నగా అశోకుడి వద్దకు వెళ్లి “మహారాజా! మీకు ఒక శుభవార్త. మీ సోదరుడు వీతాశోక రాజ సింహద్వారం వద్ద నిలబడియున్నారు. అయన మిమ్ములను చూడాలని కోరుచున్నారు” అని తెలియజేశాడు.
అశోకుడు “వెంటనే వెళ్ళు; అతనిని నా వద్దకు తీసుకురా” అని ఆజ్ఞాపించాడు. వెనువెంటనే ద్వారపాలకుడు వీతాశోకుడిని నేరుగా రాజభవనంలోకి తీసుకెళ్లాడు. సోదరుడిని చూసిన వెంటనే సింహాసనం మీద నుంచి లేచి తిన్నగా మొదలు నరకబడిన వృక్షం అకస్మాత్తుగా నేల మీద పడినట్లు పడి ఈ బౌద్ధ సన్యాసి (వీతాశోక) కాళ్ళ మీద అశోకుడు సాష్టాంగపడిపోయాడు. ఈ మహారాజు విలపిస్తూ గొరవనీయుడైన వీతాశోకను అశ్రునయనాలతో చూస్తూ అలాగే చాలాసేపు ఉండి పోయాడు. తన సోదరుడు ఒక పరిణితి చెందిన బౌద్ధధర్మాన్ని ఆచరించే ఉత్తమశ్రేణి సాధువుగా మారినట్లు గమనించాడు.
అశోకుడి ప్రధాన మంత్రి ‘రాధాగుప్త’ చిరిగిన వస్త్రములు, చింపిరి కేశములు, దీర్ఘ గడ్డం, చేతిలో మట్టి భిక్ష పాత్ర ఉన్న గౌరవనీయుడైన వీతాశోకను గమనించాడు. నేలమీద పడియున్న అశోకుడి కాళ్ళ మీద పడి నమస్కరించి ఆయనతో ఇలా అన్నాడు:
“ఓ మహారాజా! అత్యంత గౌరవనీయుడైన ఈ సన్యాసి కోరిక-రహితుడు, కోరికలకు అతీతుడు. అయన అనుకున్నది సాధించిన మహనీయుడు. చెత్తకుప్ప నుంచి సేకరించిన చిరిగిన వస్త్రములు ధరించిన ఈ ఉత్తమ సన్యాసి చెట్ల క్రిందనే నివసిస్తాడు. సంకెళ్లు రహితుడై, అనారోగ్య రహితుడై, తనకు ఇష్ట మైన రీతిలో జీవించే ఈ మహామనిషిని మనం దర్శించిన ఈ దినం మరువలేనిది.”
ఈ మాటలు విన్న అశోకుడు లేచి ఆనందంతో నిండి హృదయంతో ఈ విధంగా వ్యాఖ్యానించాడు: “ఏ మాత్రం గర్వం లేని ఈ మహామనిషి మౌర్యుల కుటుంబాన్ని, మగధ సామ్రాజ్యాన్ని, అందులో ఉన్న అత్యంత విలువైన సంపదను పరిత్యజించి ఉత్తమ బౌద్ధ సన్యాసిగా మారటం జరిగింది. ఈయన దర్శనంతో నా రాజధాని పునీతమైంది. అయ్యా! మీరు మాకు గౌతమ బుద్ధుడి బోధనలను మాకు వివరించండి” అని వేడుకున్నాడు.
వెనువెంటనే మహారాజు తన సోదరుడిని చేతులలోకి తీసుకుని అయన కోసం సిద్ధం చేసిన ఆసనం మీద కూర్చోబెట్టాడు. తన స్వహస్తాలతో ఆయన కొరకు తయారుచేసిన ఆహారం తినిపించాడు. ఈ మహాసాధువు భుజించిన తరువాత, అశోకుడు తన సోదరుడికి ఎదురుగా ఆసీనుడయి బుద్ధుడి ఉపదేశాలను వినటానికి సంసిద్ధుడయ్యాడు.
అప్పుడు ఈ బౌద్ధ సన్యాసి అశోకుడితో "మహారాజా! రాజ విధులు శ్రద్ధగా నిర్వహించండి. మానవ జీవితంలో మూడు పారమార్ధిక విషయాలు సాధించటం కష్టమైన పని. వాటిని సాధించటానికి ఎల్లప్పుడూ కృషిచేయాలి. వెంటనే గౌతమ బుద్ధుడు శోధించి మానవ ఉన్నతికి వెలిబుచ్చిన ‘నాలుగు ఉత్తమ నిజాలు’ (Four Noble Truths) గురించి వివరిస్తూ వాటి గురించి ప్రతి మానవుడు తెలుసుకోవాలి అన్ని వెల్లడించాడు.
దుఃఖం, సముదాయం, నిరోధ మార్గం
ఈ పూజ్యుడైన మహా బౌద్ధసన్యాసి అశోకుడికి బౌద్ధుడి ఉపదేశం వివరిస్తూ, విపులీకరిస్తూ, “మహారాజా! మీరు రాజ్యాధికారవిధులను శ్రద్ధగా నిర్వహించండి; ఈ నిర్వహణలో మూడు విలువైన విషయాలుంటాయి; మీరు వాటిని ఎల్లప్పుడూ గౌరవించండి ప్రభూ” అని సలహా ఇవ్వటం జరిగింది. వెంటనే వీతాశోక లేచి రాజ గృహం విడిచి వెళ్లుచున్నప్పుడు ఆయన ఉద్బోధనకు సంతోషించిన అశోకుడు 500 మంది మంత్రిగణంతో పాటు వేలాది ప్రజలు అత్యంత గౌరవంతో ఈ ఉత్తమ సన్యాసి వెంట నడిచారు.
ఈ అసాధారణ దృశ్యాన్ని గమనించిన ప్రజలు “తమ్ముడి వెనక ఆయన అన్నగారు, మహారాజు, ఎంతో భక్తితో, గౌరవంతో వెంట నడుస్తున్నారు; ఇది చాలా అరుదైన సంఘటన; ఇది పండుగ చేసుకో వలసిన రోజు. ఈ దినం నుంచి మన మహారాజు తన శేష జీవితాన్ని ధార్మిక మార్గంలో నడిపించటం ప్రారంభించారు” అని వ్యాఖ్యానించారు.
ఈ అశేష జనావళి మధ్యలో ఉన్న వీతాశోక తన శక్తిని వారికి తెలియజేయటానికి తన లోకాతీత శక్తితో గాలిలోకి (ఆకాశంలోకి) ఎగరటం జరిగింది. వేలాది ప్రజల మధ్య ఉన్న అశోకుడు నమస్కరించి ఆకాశం వైపు చూసి నమస్కరిస్తూ వీతాశోక గురించి ఈ విధంగా పలికాడు:
“కుటుంబంతో తనకున్న బంధాన్ని త్రెంచుకొని ఈ మహాత్ముడు ఒక పక్షి వలె ఎగిరిపోయాడు. కాని మమ్ములను ఈ భవబంధాల మధ్యలో విడిచి పెట్టటం జరిగింది…..ఆత్మ నిగ్రహం, ప్రశాంతతతో జీవించే ఈ మహాజ్ఞానితో పోల్చితే ప్రతిక్షణం కోరికలతో రగులుతూ ఉండే మన జీవితాలు ఏపాటి? ఆయనతో మనం ఎలా పోల్చుకోగలం”
“అతీంద్రియ శక్తులున్న ఈ అపౌరుషేయుడు మనలను సిగ్గుతో తలవంచుకునేటట్లు చేశాడు. అల్పజీవులైన మనం అహంకారంతో విర్రవీగుతుంటాము. మన తెలివి, వివేకం గురించి మనమే గర్వ పడుతుంటాము.”
“జీవిత సాఫల్యం సాధించిన ఈ మహర్షి గురించి ఆలోచిస్తే మనం అంధత్వంతో కొట్టుమిట్టాడు తుంటాము. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనం ఎందుకు స్వేచ్చాజీవితం గడపలేక పోతున్నామో అనే విచారం నన్ను చుట్టేసింది. ఈ సమయంలో నా నేత్రాలు కన్నీటితో నిండి చీకటిమయం అయింది.”
వీతాశోక మరణం
కొంతసేపటికి వీతాశోక పాటలీపుత్రను వదలి మౌర్య సామ్రాజ్య సరిహద్దులను దాటి ఒక చోట స్థిరపడ్డాడు. కొన్నాళ్ళ తరువాత ఆయన కుష్టు వ్యాధి బారిన పడటం జరిగింది. దీనివల్ల కేశములన్నీ ఊడిపోయాయి. ఇది విన్న అశోకుడు కొన్ని మందులను, సేవకులను పంపించాడు. కురుపులతో నిండిన శరీరం కొన్నాళ్ల తరువాత స్వస్థత పొందినప్పుడు సమీపంలో ఉన్న ఒక గోశాలలో సన్యాసిగా తరువాత స్థిరపడ్డారు.
సరిగ్గా ఇదే సమయంలో ‘పుండ్రవర్ధన’ నగరానికి (ఇప్పటి ఉత్తర బంగ్లాదేశ్ లో ఉంది) సనాతన ధర్మం పాటించే ఒక యాచకుడు రావటం జరిగింది. అతను ఒక బౌద్ధ యాచకుడికి సంబంధించిన గౌతమ బుద్ధ విగ్రహాన్ని పడగొట్టి పగలగొట్టాడు. ఈ దుర్మార్గాన్ని సహించని ఆ బౌద్ధ యాచకుడు అశోకుడికి తెలియజేశాడు. కోపించిన అశోకుడు ఆ సనాతన యాచకుడిని తన వద్దకు తీసుకురమ్మని భటులను ఆదేశించాడు. ఈ అపరాధిని అశోకుడు వద్దకు తీసుకువచ్చినప్పుడు అతనిని చూసి ‘పుండ్రవర్ధన’ లో నివసించే అందరు వ్యక్తులను హతమార్చమని మంత్రులను ఆదేశించాడు.
ఈ పుండ్రవర్ధన జైన ఆచార్యుడు ‘భద్రబాహు’ జన్మించిన నగరం. ఈ మహావ్యక్తి అశోకుడి తాత చంద్రగుప్త మౌర్యకు ఆధ్యాత్మిక గురువు. అశోకుడి ఆజ్ఞ కారణంగా పుండ్రవర్ధన లో నివసించే 18,000 ప్రజలను మృత్యువును చవిచూశారు.
కొన్నాళ్ళు తరువాత సనాతన ధర్మం ఆచరించే మరొక వ్యక్తి పాటలీపుత్రలో ఉన్న ఒక గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఒక హిందూ సన్యాసి కాళ్ళ వద్ద పడదోయగా, ఈ సన్యాసి ఆ విగ్రహాన్ని ముక్కలు చేయటం జరిగింది. దీనికి ఆగ్రహించిన అశోకుడు ఆ సన్యాసి, అతని మిత్రులు, బంధువుల గృహాలకు వెళ్లి ఆ ఇళ్లతో పాటు ఆ వ్యక్తులను కూడా అగ్నికి ఆహుతి చేయించాడు. తదుపరి “ఇటువంటి హిందూ సన్యాసుల నాయకుడి తల నరికి దాన్ని నా వద్దకు తీసుకువచ్చిన వ్యక్తికి బహుమతిగా 5 బంగారు నాణాలు నా వద్దనుంచి లభిస్తాయి” అనే ఆజ్ఞను జారీ చేశాడు.
అదే సమయంలో బౌద్ధ సన్యాసి వీతాశోక ఒక గొర్రెల కాపరి గుడిసెలో నివసించటం జరిగింది. కొన్నాళ్ళు ఆయన అస్వస్థతకు లోనయ్యినప్పుడు చూపరులకు చింపిరి దుస్తులతో, బాగా పెరిగిన గడ్డంతో, దీర్ఘ కేశాలతో కనిపించాడు. ఆయనను చూసిన గొర్రెల కాపరి భార్య తన భర్తతో “మన గుడిసెలో తల దాచుకోటానికి వచ్చిన ఈ వ్యక్తి హిందూ సన్యాసి అయి ఉంటాడు. అందువల్ల నాథా! మనకు అయాచితంగా ధనం లభించే అవకాశం వచ్చింది. మీరు సందేహించక ఈ సన్యాసి తలను నరికి దానిని అశోక మహారాజుకు చూపించి 5 బంగారు నాణాలు బహుమతిగా తీసుకురండి” అని కోరింది.
ఆ గొర్రెల కాపరి వెంటనే ఏమీ ఆలోచించక ఒక ఖడ్గం చేత పుచ్చుకుని వీతాశోక వద్దకు వెళ్ళా డు. పూజ్యుడైన వీతాశోక దీనిని గమనించి గత జన్మలో తనకు ఏమి జరిగింది, ఈ జన్మలో దాని ఫలితం అనుభవించక తప్పదు అని గ్రహించి తాను ఉన్న పద్మాసన స్థితిలో కదలకుండా కూర్చుని యున్నాడు. గొర్రెల కాపరి వీతాశోక దగ్గరకు వెళ్లి ఆయన తలను నరికి దానిని అశోకుడుకి చూపించి “మహారాజా! మీ ఆజ్ఞ ప్రకారం నాకు 5 బంగారు నాణాలు ప్రసాదించండి” అని వేడుకున్నాడు.
అశోకుడు ఆ శిరస్సును చూసి నిశ్చేష్టుడై మ్రాన్పడిపోవటం జరిగింది. అప్పటికీ ఆ శిరస్సు తన సోదరుడిది కాదని మనస్సులో తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు. వెంటనే వైద్యులను, సేవకులను పిలిచి వారి అభిప్రాయం కోరాడు. వారు శిరస్సును చూసి “ప్రభూ! ఇది నిఖచ్చిగా వీతాశోక శిరస్సే” అని చెప్పారు.
ఇది విని అశోకుడు మూర్చిల్లి నేలమీద పడిపోయాడు. ఆయన ముఖం మీద నీళ్లు జల్లగా తెప్పరిల్లి లేచి కూర్చున్నాడు. అప్పుడు మంత్రులు ఆయనతో “మహారాజా! భావావేశాన్ని, కోపాన్ని జయించిన, నియంత్రించుకోగల ఈ మహా సన్యాసిని దారుణంగా అంతమొందిచటం అమానుషం. మీరు వెంటనే హిందూ సన్యాసులను చంపమని ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞను వెంటనే ఉపసంహరించి వారికి రక్షణ ఇవ్వండి” అని వేడుకున్నారు. వెంటనే అశోకుడు “ఏ మానవుడిని అయినా చంపటం నిషేధం” అనే ఆజ్ఞ జారీచేసి రాజ్యంలో శాంతిని నెలకొల్పాడు.
వీతాశోక పూర్వ జన్మలు
ఈ సంఘటన జరిగిన వెంటనే కొంతమంది బౌద్ధ సన్యాసులు అత్యంత గౌరవనీయుడైన, మహా సన్యాసి, అశోకుడి ఆధ్యాత్మిక గురువు ‘ఉపగుప్త’ ను దర్శించి “ఈ వీతాశోక ఏ తప్పుచేశాడని ఈ విధంగా మరణం పొందాడు స్వామీ” అని ప్రశ్నించారు.
సర్వాస్థివాది (Sarvāstivādi) అయిన ఈ ఉపగుప్త అశోకుడికి ఆధ్యాత్మిక గురువు. సమాధానంగా అయన వారితో “మహనీయులారా పూర్వజన్మలలో ఈ వీతాశోక చేసిన కార్యాలు వినండి.”
“పూర్వం చాలా కాలం క్రితం హిందూదేశంలో వేరు వేరు కాలాలలో ఏడుగురు బుద్ధ మహాశయులు ఉండేవారు. వీరిని ‘ప్రత్యేక ‘బుద్ద'లు అంటారు. ఎవరు స్వయంకృషితో జ్ఞానోదయం పొందుతారో (బుద్ధుడు అవుతారో) అతనిని ‘ప్రత్యేక బుద్ధ’ అని పిలుస్తారు. ఈ ప్రత్యేక బుద్ధ ఆ కాలపు బుద్ధుడి ఉపదేశాలు వినకుండా స్వయం కృషితోనే జ్ఞానోదయం పొంది తన గమ్యం చేరతాడు.
ఒక ప్రత్యేక బుద్ధ జీవించిన కాలంలో ఒక వేటగాడు జింకలను వేటాడుతూ జీవిస్తూ ఉండేవాడు. అతను పన్నిన వలలో జింకలు పడితే వాటిని చంపి జీవిస్తూ ఉండేవాడు. ఒక రోజు ప్రత్యేక బుద్ధ ఆహారం కొరకు ఒక వృక్షం క్రింద నీటి బుగ్గ (spring) దగ్గరలో పద్మాసనం వేసుకుని జింకల కోసం ఎదురు చూశాడు. ఇతని ఉనికిని పసిగట్టిన జింకలు నీటి బుగ్గ వద్దకు రాకుండా దూరంగా నిలబడి ఉన్నాయి.
అదే సమయంలో ఈ వేటగాడు ప్రత్యేక బుద్ధకు దగ్గరలో జింకలకోసం వల పన్నాడు. ఈ జింకలు నిలబడి తాను ఏర్పాటు చేసిన వలలో పడలేదని వేటగాడు చూసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రత్యేక బుద్ధ ఆసీనుడయిన చోటుకు వచ్చాడు. ఆయనను చూసిన వేటగాడు “ఈ వ్యక్తే నేను పట్టవలసిన జింకలను నా వలలో పడకుండా దూరంగా తోలేశాడు” అని భావించి వెంటనే ఒక ఖడ్గాన్ని చేతబట్టుకుని ప్రత్యేక బుద్ధ తల నరికేశాడు.
“గౌరవనీయులారా! ఈ ప్రత్యేక ‘బుద్ధ’ను వధించిన వ్యక్తియే ఈ జన్మలో జన్మించిన వీతాశోక. గత జన్మలోఅనేక లేళ్ళను వధించినందువల్ల అతనికి ఒక భయంకర వ్యాధి సోకింది. తరువాత ఒక ప్రత్యేక బుద్ధను వధించినందువల్ల అతను కొన్ని వేల సంవత్సరాలు నరకం బారిన పడ్డాడు. ఆ తరువాత 500 ఏళ్ళు అనేక సార్లు జన్మించి మరణించాడు. ప్రతిసారి ఖడ్గంతోనే చంపబడ్డాడు. చివరిసారి (ఈ జన్మ లో) కూడా జ్ఞానోదయం పొంది ఒక Arhat గా పేరొందినా కూడా అతని జీవితం ఖడ్గంతోనే అంతమైంది.”
“కానీ మహనీయులారా! ఇంతకు ముందే మరణించిన ఈ వ్యక్తి (వీతాశోక) ఈ విశిష్ట కుటుంబంలో జన్మించి ఏమి చేశాడని Arhat హోదా సాధించాడనే సందేహం మీకు రావచ్చు. దీనికి నా సమాధానం వినండి. పైన వివరించిన ప్రత్యేక బుద్ధ మహాశయులలో 6వ బుద్ధుడి పేరు ‘కాశ్యప’ (1వ బుద్ధ: Vipassī; 2వ బుద్ధ: Sikhī; 3వ బుద్ధ: Vessabhū; 4వ బుద్ధ: Kakusandha; 5వ బుద్ధ: Konagamana; 7వ బుద్ధ: Gautama) ఒక పరిపూర్ణమైన బుద్ధుడు. ఎంతో ఔదార్యం గల ఈ ‘ప్రధాన ఋషి’ (కాశ్యప) జీవితమంతా ఆధ్యాత్మిక లోకంలోనే గడిపాడు. ఎంతో మంది ఔదార్యం గల దాతలు ఆయన సభలకు హాజరయిన వారందరికి ఆహారం అందించేవారు. అయన కృషివల్లనే దేశంలో ఆ కాలంలో అనేక స్థూపాలు నిర్మించబడ్డాయి.”
“ఈ చర్యలకు ప్రతిఫలంగా అయన ఉన్నతమైన ఈ మౌర్య రాజ కుటుంబంలో జన్మించటం జరిగింది. 10,000 సంవత్సరాలు భక్తిమార్గంలో పయనించి తన విధులను సక్రమంగా నిర్వహించినందు వల్ల ఆయన ఇప్పుడే ముగిసిన జన్మలో ఒక Arhat గా జీవించారు.”
……..
కళింగ యుద్ధం తరువాత అశోకుడు బౌద్ధ మార్గంలో పయనించడానికి వీతాశోక ప్రభావం చాలా ఉంది. అటువంటి వ్యక్తి జీవితం తన తప్పిదం వల్ల ఆకస్మికంగా ముగిసిందని ఈ మౌర్య మహారాజు ఆవేదన వర్ణణాతీతం. అశోకుడి పుత్రుడు 'మహీంద్ర', పుత్రిక 'సంఘమిత్ర' చేసిన కృషి వల్ల శ్రీ లంకలో బౌద్ధమత వ్యాప్తి గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాము.