Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

వీతాశోక-1

గత సంచికలో తన చివరి రోజులలో అశోకుడు చేసిన అనంత దానాలు, ‘దశ రాజ ధర్మం’, గౌతమ బుద్ధ బోధించిన ధర్మ తత్త్వ జ్ఞానాన్ని ఆయన ప్రజలకు అందించటం గురించి తెలుకోవటం జరిగింది. ఈ ‘ధర్మ-అశోకుడి’ శ్వాస క్రీ.పూ. 232 లో ఒక రోజు ఆగిపోయిందని కూడా తెలుసుకున్నాము.

ప్రస్తుత సంచికలో, తరవాత సంచికలో ఆయన సహోదరుడు (తమ్ముడు) ‘వీతాశోక’ గురించి తెలుసు కుందాము.

రెండవ మౌర్య చక్రవర్తి బిందుసార-పట్టపురాణి శుభద్రాంగికి జన్మించిన ‘వీతాశోక’ (Vītaśoka: Free-from-sorrow; శోకంనుంచి స్వేచ్ఛ) అశోకుడి తమ్ముడు. బిందుసార మరణం తరువాత మౌర్య సింహాసనం కోసం జరిగిన సంఘర్షణలో అశోకుడు అనేకమంది సోదరులను (తండ్రి ఇతర భార్యల పుత్రులను) హతమార్చినా తన సహోదరుడు వీతాశోకకు ఏమాత్రం హాని కలిగించలేదు.

రాజ్యకాంక్ష లేని వీతాశోక తన జీవితమంతా ఆధ్యాత్మిక మార్గంలోనే పయనించాడు. జీవితం ప్రధమార్ధంలో అయన ‘బ్రాహ్మనిజం’ (బ్రాహ్మణిజం; సనాతనధర్మం) లోని ‘తీర్థిక’ (Tirthika) మార్గాన్నిఅనుసరించటం జరిగింది. ఈమార్గం లో ఉన్నవారు సంసార జీవితానికి అతీతులు. వీరు బాధ, వేదన లోనే ఆనందం పొందుతారు.

ఒక రోజు అశోకుడు తన సోదరుడితో “నీ ఆధ్యాత్మిక మనస్తత్వానికి సనాతనధర్మంచేత ప్రభావితమైన, పునాది రహితమైన ‘తీర్థిక’ మార్గం నీకు తగినదికాదు. నీవు గౌతమ బుద్ధుడు ప్రవచించిన, చూపించిన మార్గమే సరియైనది. దీనినే అనుసరించు” అని సూచించాడు. అన్న ఇచ్చిన ఈ సూచన వీతాశోకుడికి అంతగా నచ్చలేదు.

వీతాశోక-బౌద్ధ సన్యాసి సంభాషణ

ఒక రోజు అశోకుడు అడవికి వెళ్లి జింకలను వేటాడుచున్న సమయంలో కొంత దూరంలో వీతాశోక ఒక ఋషిని చూశాడు. ఆయన తనచుట్టూ అయిదు అగ్నిజ్వాలలలో నిలబడి తనకు తాను శిక్ష విధించుకొనటం జరుగుతూ ఉంది. ఈ రాజకుమారుడు ఆయనను సమీపించి ఆయన పాదాలకు నమస్కరించి కొన్ని ప్రశ్నలు సంధించాడు. అవి:

వీతాశోక: “అయ్యా! ఎంతకాలం నుంచి మీరు ఈ అడవిలో ఉంటున్నారు?”

ఋషి: “12 సంవత్సరాలు”

వీతాశోక: “మీరు ఏమి తిని బ్రతుకుతున్నారు?”

ఋషి: “పండ్లు, వేరు దుంపలు”

వీతాశోక: “మీరు ఏ వస్త్రాలు ధరిస్తారు?”

ఋషి: “చింపిరి దుస్తులు, దర్భ ఆకులు”

వీతాశోక: “మరి దేనిమీద నిద్రిస్తారు?”

ఋషి: “పచ్చని గడ్డి”

వీతాశోక: “మీ ఈ ప్రాయశ్చిత్తంలో ఏదైనా కష్టాలున్నాయా?”

ఋషి: “ఉన్నాయి. ఈ జింకలు సంభోగించినప్పుడు, నా మనస్సు కోరికతో రగిలిపోతూ ఉంటుంది”

ఈ సమాధానం విని వీతాశోక స్వరం పెంచి “ఈ ఋషి, సన్యాసి తన మనోవికారం (కామం) అణచివేయటంలో విఫలమైనప్పుడు, ఒక శాక్య (బౌద్ధ సన్యాసి) కి మెత్తని పాన్పులు, సున్నితమైన దుప్పట్లు అవసరం ఏముంది? వారు తమ మనోవికారాన్ని ఎలా జయించగలరు?”

అంతటితో ఆగక ఈ అశోకుడి సోదరుడు ఇలా వ్యాఖ్యానించాడు:

“ఏకాంతంగా అడవులలో నివసిస్తూ కేవలం గాలి, నీరు, వేరు దుంపల మీద జీవిస్తూ, కఠిన నియమాలను పాటిస్తున్న ఋషులు అసమర్ధులై తమ కోరికలను మాత్రం అణచుకోలేరు. అటువంటప్పుడు మాంసం, పెరుగు, వెన్న, రుచికరమైన భోజనం భుజించే ఈ శాక్యులు (బౌద్ధ సన్యాసులు) తమ ఇంద్రియాలను ఎలా నియత్రించుకోగలరు? అది సాధ్యమయినప్పుడు వింధ్య పర్వతం సముద్రాన్ని దాటటం ఎందుకు సాధ్యంకాదు?”

“అవును నన్ను బౌద్ధ మార్గాన్ని అనుసరించమని సూచించిన మహారాజు అశోకుడు ఈ బౌద్ధ సన్యాసుల చేత మోసపోవటం జరిగింది” అని బిగ్గరగా పలికాడు వీతశోకుడు.

ఈ మాటలు విన్న అశోకుడు “వీతాశోక సనాతనధర్మ సన్యాసులు మినహా మిగతా ఎవరిని లెక్క చేయడు; ఉపాయంతో అతనికి గౌతమ బుద్ధ ప్రవచించిన న్యాయమార్గాన్ని కూడా విశ్వసించే పరిస్థితికి తీసుకురావాలి” అని తన మంత్రులకు చెప్పటం జరిగింది.

“మీరు ఆజ్ఞాపించండి మహారాజా” అని మంత్రులు బదులిచ్చారు.

వీతాశోకను బౌద్ధ ధర్మ మార్గానికి తీసుకురావటానికి అశోకుడి పన్నాగం

అశోకుడు “నేను స్నానాలగదికి వెళ్ళినప్పుడు నా తలపాగా, కిరీటం, రాజ చిహ్నాలు, మొదలగునవి తీసివేసినప్పుడు, మీరు వాటిని వీతాశోక వద్దకు తీసుకువెళ్లి యుక్తితో అతను ఇవి ధరించేటట్లుచేసి, అతనిని నా సింహాసనం మీద కూర్చోబెట్టాలి” అని మంత్రులను ఆజ్ఞాపించాడు.

మంత్రులు “అలాగే మహారాజా” అని జవాబిచ్చారు.

అశోకుడు తన తలపాగా, కిరీటం, రాజ చిహ్నాలు, మొదలగునవి తీసివేసి స్నానాలగదిలోకి వెళ్ళినప్పుడు మంత్రులు వీతాశోక వద్దకు వెళ్లి “అయ్యా!  మీ సోదరుడు అశోక మహారాజు మరణించినప్పుడు మీరు మహారాజు అవుతారు; అందువల్ల ఈ లోపల మీరు ఒకసారి ఈ రాజాభరణాలను ధరించండి. మీశిరస్సు మీద మీ సోదరుడి తలపాగా, కిరీటం, రాజ చిహ్నాలు, వగైరా ధరిస్తే మేము మిమ్ములను సింహాసనం మీద ఆసీనులను చేసి మీరు ఎలా ఉంటారో చూడాలని ఉంది” అని విన్నవించుకున్నారు.

వీతాశోక అంగికరించగా వెంటనే మంత్రులు అయన శిరస్సుమీద ఈ రాజాభరణాలను ధరింప జేసి సింహాసనం మీద కూర్చుబెట్టారు.

ఈ సంగతి మంత్రులు అశోకుడికి తెలుపగా, తన తలపాగా, కిరీటం, రాజచిహ్నాలను ధరించి సింహాసనంమీద ఆసీనుడైన వీతాశోకను చూసి "ఆహా! నేను జీవించివుండగా నా రాజరికాన్ని ఆక్ర మించుకున్నావా” అని ఆగ్రహం నటిస్తూ “ఇలా నావద్దకు రా” అని అరిచాడు.

ఖిన్నుడయిన వీతాశోక అన్న వద్దకు వెళ్ళబోయే ముందు నీలి వస్త్రాలు ధరించి దీర్ఘకేశాలున్న తలారులు అశోకుడి పాదాలకు నమస్కరించి అయన ముందు సాష్టాంగపడి “మీ ఆజ్ఞ ఏమిటి ప్రభూ” అని అర్ధించారు.

అశోకుడు: “ఈ వీతాశోకను నా వద్దకు తీసుకువచ్చి వధించండి.”

తలారులు వీతాశోక వద్దకు వెళ్లి అతనితో “మేము తలారులం; మిమ్ములను మా ఆధీనంలోకి తీసుకుని వధించబోతున్నాము” అని అన్నారు.

అప్పుడు మంత్రులు అశోకుడి కాళ్ళమీద పడి “ప్రభూ! క్షమించండి, వీతాశోక మీ సహోదరుడు, ఆయనను కనికరించండి’ అని వేడుకున్నారు.

అశోకుడు “సరే, నేను అతనిని క్షమిస్తాను; కాని 7 రాజులు మాత్రమే. వీతాశోక నా సహోదరుడే. అతని మీద నాకు ఉన్న ప్రేమ వల్ల రాజ్యాధికారం 7 రోజులు మాత్రమే ఇవ్వగలను.”

వెనువెంటనే తప్పెట్లు తాళాలతో బిగ్గరగా వాద్యకారులు అరచుకుంటూ వీతాశోకకు నమస్కరించి “దీర్ఘకాలం జీవించు మహారాజా” అని అభినందనలు తెలిపారు. సభలో కూర్చున్న వేలాది మంది తమ హస్తాలను పైకి ఎత్తి గౌరవంతో ఈ ‘నూతన మౌర్య మహారాజు కు’ శుభాకాంక్షలు అందజేశారు. వందలాది స్త్రీలు సంతోషం వెలిబుచ్చుతూ ఆయనను చుట్టుముట్టారు.

ఇది చూసిన తలారులు రాజగృహ ద్వారం వద్ద నిలబడ్డారు. తొలిరోజు ముగిసిన తరువాత ఈ తలారులు వీతాశోక వద్దకు వచ్చి “ఒక రోజు ముగిసింది వీతాశోక; ఇంకా 6 రోజులు మిగిలి ఉన్నాయి" అని చెప్పటం జరిగింది. రెండవ రోజు ముగిసినప్పుడు ఈతలారులు “ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి” అని వీతాశోక కు విన్నవించారు. అలాగే తరువాత 4 రోజులు కూడా! 7 వ రోజు ముగిసే ముందు వారు వీతాశోకను అశోకుడి వద్దకు తీసుకువెళ్లడం జరిగింది.

అప్పుడు అశోకుడు: “వీతాశోక: ఈ 7 రోజులలో నీ ముందు జరిగిన గానం, నృత్యం, వాద్య కచ్చేరి ఎలా ఉన్నాయి? వాటిని గురించి నీవు ఏమి అనుకుంటున్నావు?” అని ప్రశ్నించాడు.

వీతాశోక జవాబు: “నేను ఏమీ చూడలేదు, ఏమీ వినలేదు. పాటలను నేను ఆలకించలేదు, నాట్యకత్తెల నాట్యాలను గమనించలేదు. ఈ సౌఖ్యాలను నేను చవిచూడనప్పుడు, అనుభవించనప్పుడు వీటి గురించి నా అభిప్రాయం ఎలా చెప్పగలను?"

అశోకుడు: “వీతాశోకా, నేను నీకు 7 రోజులు రాజాధికారం, రాజభోగం ఇచ్చాను; నీ ఎదుటే వంద లాది వాద్యాలు మోగించబడ్డాయి; ‘రాజు చిరకాలం వర్ధిల్లు గాక’ అని నీ ముందే గట్టిగాపలికారు; నీ మీద గౌరవంతో అనేక మంది నీకు నమస్కరించి నీ ముందే నిలబడ్డారు; వందలాది స్త్రీలు నీకు పరి చర్యలు చేశారు. అటువంటప్పుడు ‘నేను కనలేదు, నేను వినలేదు’ అని ఎలా చెప్పగలవు?”

వీతాశోక: “లేదు, నేను నాట్యాలను చూడలేదు; గానాల, వాద్యాల ధ్వనిని వినలేదు; అలాగే సువాసనలను పీల్చలేదు; తీపి పదార్ధాలను రుచిచూడలేదు; నేను తాకిన కంఠాభరణాలు, ధరించిన ఇతర నగలు ఎలాంటివో గ్రహించలేదు; మృత్యు దండన విధించబడిన నన్ను సమ్మోహన పరచటానికి అనేక మంది స్త్రీలు వ్యర్ధ ప్రయత్నం చేశారు.”

"అంతేకాదు. నీలి వస్త్రాలు ధరించి ఖడ్గాలు చేతబట్టిన తలారులు నా వెనుక నిలిచి ఉన్నప్పుడు ఈ స్త్రీలు, నాట్యం, గానం, రాజ భవనం, అందులో ఉన్న విశ్రాంతి గదులు, పరుపులు, హంస తూలికా తల్పాలు, వాటి అందం, ఇతర భోగాలను నేను అనుభవించలేదు; అద్భుతమైన ఈ భూమి, అందులో దాగిఉన్న అంతులేని సంపద; అంతా నాకు శూన్యం అనిపించింది, నన్ను నిస్సత్తువ ఆవహించింది. నామనస్సులో అంతా వారు (తలారులు) నన్ను ఏమి చేస్తారో అనే ఆలోచనే మెదులుతూ ఉంది.”

“మహారాజా! ఈ తలారులు నా మరణసమయం ఆసన్నమైందని గంట మోగించినప్పుడు ప్రాణ భయం నన్ను పూర్తిగా ఆవహించింది. వారు నన్ను ముల్లుగర్రతో పొడుస్తున్నారు అని అనిపించిన ఆ సమయంలో పారవశ్యంతో పాడిన పాటలు, నృత్యాలు, నా చెవులకు వినపడలేదు, కళ్ళకు కనపడలేదు. మరణ భయానికి లొంగిపోయాను. నాకు నిద్ర లేదు, చావు గురించి భయపడుతూ రాత్రుళ్ళు రోగగ్రస్తుడయిన వ్యక్తిలాగా గడిపాను.”

అప్పుడు అశోకుడు ఈ విధంగా ప్రశ్నించాడు: “అలాగా వీతాశోకా! మరణ భయం నిన్ను వెంటాడి రాజ్యరికంలో ఉన్న ఆనందం అనుభవించకుండా చేసినప్పుడు, ఆధ్యాత్మికత నిండిన జీవితానికి ఏ మాత్రం ప్రాణ భయం ఉండదా? సన్యాసులు, సాధువులు, మహర్షులకు జననం, మృత్యువు సాధారణమని తెలియదా? మృత్యువు తరువాత జననం తప్పదని నీకు తెలియదా? మానవ శరీరానికి అంతం నరకంలో అగ్ని జ్వాలలే! కౄర జంతువులకు అంతం ఒకదానిని మరొకటి భక్షించటమే. ప్రేతాలకు అంతం ఆకలి బాధ, దప్పిక; మానవుల అంతానికి కఠినమైన శ్రమతో కూడిన జీవితమే ప్రముఖమైనది. దేవతలకు తాము ఉన్న స్థితినుంచి క్రిందికి పడిపోతామేమోనని, సంతోషాన్ని కోల్పోతామేమోనని భయం; దుఃఖం ఒక్కటే ఈ మూడు లోకాలకు సంకెళ్లు వేయగలిగేది………… అస్థిరత, చాంచల్యం మూడు లోకాలను మింగివేస్తాయి. ఆ సమయంలో కూడా ఆ లోకాలలో ఉన్న వారికి కూడా మనోవికారం కలుగుతుంది. మరి నీకు మనోవికారం ఎందుకు కలుగలేదు?” అని ప్రశ్నించాడు.

“మరణ భయం నిన్ను పీడించి నీకు ఉల్లాసం, సంతోషం దూరంచేస్తే, మరి భగవద్భకులు, బౌద్ధ సన్యాసులు ఈ భయాన్ని లెక్కచేయకుండా ఎలా సంతోషంగా జీవిస్తున్నారు? అది కూడా అనేక తరాల నుంచి. దేవుడు వారికి ఎన్ని సుఖవస్త్రాలు, పరుపులు, బంగారు పాత్రలు ప్రసాదించినా, వారి హృద యాలు మాత్రం విమోచన కొరకే ఎదురుచూస్తాయి. విమోచనే అన్నిటికంటే అతి ముఖ్యమని భావించే ఈ బౌద్ధ సన్యాసులు తామర ఆకు మీద, పద్మం మీద నీటి బొట్టులా ఈ భూమిమీద భయం, భ్రాంతి లేకుండా జీవిస్తారు. అందువల్ల నీవు బౌద్ధ సన్యాసిగా ఎందుకు మారలేవు?”

తన సోదరుడి మాటలను, ఉపదేశాన్ని వీతాశోక విని సానుకూలంగా తల ఊపి తన సమ్మతిని తెలియజేశాడు. ఆలా అశోకుడు తన పన్నాగంతో వీతాశోకను బౌద్ధ ధర్మ యెడల అనుకూలంగా ఉండేటట్లు మార్చటం జరిగింది.

అశోక మహారాజుకు వీతాశోక నమస్కరించి “ప్రభూ, నేను ‘తధాగతుడి’ (గౌతమ బుద్ధుడి) శరణు కోరుచున్నాను. నేను శరణు కోరుతున్న వ్యక్తి నేత్రాలు అప్పుడే విచ్చుకున్న పద్మాలువలె ఉంటాయి; ఆయనను దేవుళ్ళు, ఋషులు, ఉత్తమ మానవులు ఎల్లప్పుడూ గౌరవిస్తారు. అటువంటి మహావ్యక్తికి శరణా గతుడవుతూ అయన ప్రవచించిన, ఉపదేశించిన మార్గంలో పయనించడానికి నేను సంసిద్ధుడను.”

అశోకుడు తన సహోదరుడి మెడ వైపు చూస్తూ “లేదు, నిన్ను నేను త్యజించలేదు వీతాశోకా! నీ హృదయంలో బుద్ధ మహాశయుడి యెడల ప్రేమను నాటాలనే కాంక్షతోనే ఇటువంటి పన్నాగం పన్నాను.”

ఆ తరువాత వీతాశోక బౌద్ధ సన్యాసిగా మారి, పరిణితి పొంది అశోకుడి మన్ననలు ఎలా పొందాడో; సహోదరుడి అనాలోచిత చర్య వల్ల ఎలా మృతికి దగ్గర అయ్యాడో వచ్చే సంచికలో తెలుసుకుందాము.

****సశేషం****

Posted in August 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!