Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

13. అశోకుడు

గత సంచికలో అశోక చక్రవర్తి అయిదవ భార్య, చివరి భార్య ‘తిష్యరక్షిత’, ఆమె చేసిన దుష్కృత్యాలు, ఫలితంగా ఆమె అనుభవించిన మరణశిక్ష గురించి తెలుసుకున్నాము. ప్రస్తుత సంచిక లో ఆయన చివరి రోజులు, మరణం, మరణానికి కారణమైన పరిస్థితులు, వారసులు, తదితర విషయాల గురించి తెలుసుకుందాము.

చివరి రోజులు, అనంత దానాలు

రక్తంతో తడిసిన తిష్యరక్షిత జీవితం, మరణంతో పాటు తక్షశిలలో జరిగిన తిరుగుబాటును అణచివేసే క్రమంలో జరిగిన మారణహోమం తరువాత అశోకుడి శేష జీవితం చాలా ప్రశాంతంగా సాగింది. దీనికి ముఖ్య కారణం ‘దానం’. ఆయన బౌద్ధుడుగా మారినప్పటి నుంచి బౌద్ధ సంఘానికి అనేక దానాలు అనేక విధాలుగా చేయటం జరిగింది. ఈ విషయంలో ఆయనకు మార్గదర్శకుడు ‘అనంత పిండక’ అనే వ్యక్తి.

ఇప్పటి ఉత్తరప్రదేశ్ లోని శ్రవస్తి (Sravasti) వాసి అయిన ఈ అనంతపిండక అసలు పేరు 'సుదత్త' (Sudatta). అత్యంత ధనవంతుడైన ఈయన గౌతమ బుద్ధుడి శిష్యుడు, ప్రాపకుడు, పోషకుడు. ఈ సుదత్త తన జీవితంలో పేదలకు అనంత భిక్షలు (పిండాలు; దానాలు) ప్రేమతో, దయతో పెట్టినందువల్ల (చేసినందువల్ల) ఆయన నామం ‘అనంత-పిండక’ గా మారిపోయింది. ఒక సారి గౌతమ బుద్ధ రాజగృహ నగరం దర్శించినప్పుడు అనంతపిండక ఆయనను దర్శించి ఆకర్షించబడి ఆయన శిష్యుడుగా మారటం జరిగింది. ఈ శిష్యుడు వెంటనే కోసల రాజ్యంలో బౌద్ధ ‘జేతవన’ మఠం నిర్మించి తన శేషజీవితమంతా బౌద్ధమత వ్యాప్తికి విశేషంగా కృషిచేశాడు. ఒకసారి అనంతపిండక గౌతమ బుద్ధుడికి ‘వంద కోట్ల’ బంగారు నాణాలు దానం చేయటం జరిగింది. అనంతపిండక తో పాటు అయన భార్య ‘విశాఖ’ కూడా బుద్ధుడు శిష్యులయి ఆయనకు జీవితాంతం పోషకులు, ఉపకారకులుగా మారి సేవ చేశారు.

ప్రసిద్ధిపొందిన ఈ అనంతపిండక చూపిన మార్గంలోనే అశోకుడు నడిచి 96 కోట్ల బంగారు నాణాలు బౌద్ధమత వ్యాప్తికి దానం చేసి అందులో కొంత భాగాన్ని తాను బౌద్ధుడుగా మారిన తరువాత పురాతన పాటలీపుత్ర నగరానికి ఆగ్నేయ దిశలో నిర్మించిన ‘కుక్కుటారామ’ (కుక్కుట-ఆరామ) ఆశ్రమానికి ఇవ్వటం జరిగింది.

ఈ ఆశ్రమంలో జరిగిన ఉపన్యాసాలు, ప్రసంగాలు, సంభాషణలు ‘కుక్కుటారామ సూత్రాలు’ గా ఆకాలంలో ప్రసిద్ధికెక్కాయి. ఈ సూత్రాలను కౌశంబి నగరానికి చెందిన ‘కుక్కుటరమ’ అనే బౌద్ధ సన్యాసి ప్రవేశపెట్టడం జరిగింది.

ఇటువంటి భారీ దానాలు చేస్తున్న కారణంగా ఖజానా తరిగిపోతున్న ఈ దశలో తన మనుమడు, కాబోయే మౌర్య రాజు ‘దశరధ’ (Dasaradha), మంత్రులు ఖజానా అధికారులకు దానాల కొరకు ధనం ఇవ్వవద్దని ఆజ్ఞాపించారు. కాని చక్రవర్తి అశోకుడు ఈ నిషేధాన్ని ఉల్లంఘించి దానాల కోసం ప్రత్నామ్యాయ మార్గాలను వెతకటం జరిగింది. మొదట తాను భోజనం చేసే బంగారు పళ్లాలను, తరువాత వెండి పళ్లాలను, చివరకు రాగి పళ్లాలను కూడా దానం చేశాడు.

అర్ధ ఉసిరికాయకు ప్రభువు

తన అధికారం ఈ విధంగా కత్తిరించబడినప్పుడు అశోకుడికి “అదృష్టం దురదృష్టానికి కారణం” అని తన దేవుడు “బుద్ధుడు” ప్రవచించిన సూక్తి నిజమేనని బోధపడింది. “ఈ రోజున నా ఆజ్ఞలు మన్నించబడటం లేదు. నేను నా ఆజ్ఞలను ఎన్ని రకాలుగా ఇచ్చినా అవి ఒక నది ప్రవాహం ఎత్తైన పర్వతాన్ని ఢీ కొట్టి వెనుకకు మరలినట్లు తిరిగి నావద్దకే వస్తున్నాయి” అని ఆవేదన చెందటం జరిగింది.

అడ్డగించబడి, బలహీనబడి, నిర్వీర్యుడయిన ఈ మహారాజు అధీనంలో ఇంకా ఒక ‘సంపద’ మాత్రం మిగిలి ఉంది. అది ఒక ‘సగం ఉసిరికాయ’ (Half Myrobalan). ఒక నమ్మకమైన వ్యక్తిని పిలిచి ఈ అర్ధ ఉసిరికాయను ‘కుక్కుటారామ’ ఆశ్రమానికి తీసుకువెళ్లి ఈ తన చివరి దానాన్ని “అచ్చట ఉన్న సంఘ వ్యక్తులందరు సంతృప్తి పడేవిధంగా పంచిపెట్టు” అని ఆదేశించాడు. ఆ వ్యక్తి ఈ అర్ధ ఉసిరి కాయను గుజ్జుగా చేసి దానిని నీళ్లతో మిశ్రమం చేసి ఈ మిశ్రమాన్ని ఆ సంఘ వ్యక్తులందరికి సమానంగా పంచి త్రాగించాడు.

దీనిని త్రాగిన ఆ సంఘ పెద్ద అచ్చట సమావేశమైన సన్యాసులకు ఎంతో అసంతృప్తితో ఉన్న ఈ మహా చక్రవర్తి మనస్సులో దొర్లుచున్న భావోద్వేగాలను ఈ విధంగా వర్ణించాడు:

"మానవుల ఈ ప్రభువు, ఒక మహా దాత.
ఘన కీర్తిని పొందిన ఈ అశోక మౌర్య.
జంబూద్వీపానికి ప్రభువు హోదా నుంచి
ఒక అర్ధ ఉసిరికాయకు ప్రభువుగా మారాడు.
ఈ రోజున ఈ భూమికి యజమాని అయిన ఆయన నుంచి
సార్వభౌమాధికారం అయన సేవకులు దొంగిలించినప్పుడు
ఒక అర్ధ ఉసిరికాయను దానం చేశాడు.
దీని ద్వారా సంతరించుకున్న ఈ గొప్ప శోభకు
ఆయనను ప్రేమించిన సామాన్య ప్రజల గుండెలు ఉప్పొంగిపోయాయి."

మరణం ఆసన్నమయే ముందు మంత్రులు ఆయన రాజ్యాధికారం పునరుద్ధరించినప్పుడు ఈ చక్రవర్తి ‘ఖజానా మినహా’ ఈ సమస్త భూప్రదేశాన్ని (అంటే తన సమస్త రాజ్యాన్ని) ఈ బౌద్ధ సంఘానికి దానమివ్వటానికి ముందుకు సాగాడు. క్రీ.పూ. 232 లో ఒక రోజు ఈ దానానికి సంబంధించిన రాజాజ్ఞను వ్రాయించి ఆ మూలపత్రం (document) మీద అశోకుడు సంతకం చేసి దాని మీద రాజముద్ర వేసిన మరుక్షణం ఈ ‘మహా దాన చక్రవర్తి’ శ్వాస ఆగిపోయింది.

ఈ ‘కలియుగ కర్ణుడి’ మరణం తరువాత ఆయన వారసుడు, నూతన మౌర్య చక్రవర్తి ‘దశరధ’ మంత్రుల సహాయంతో అశోకుడు దానం చేసిన “ఈ సమస్త భూప్రదేశాన్ని” (సమస్త మౌర్య రాజ్యాన్ని) వెనక్కు తీసుకుని దానికి బదులుగా 4 కోట్ల బంగారు నాణాలను కుక్కుటారామ బౌద్ధ ఆశ్రమానికి దాన మివ్వటం జరిగింది.

సాధారణంగా ఒక రాజు మరణం ఒక గంభీరమైన పరిస్థితికి, నాటకీయమైన పరిణామానికి, సంక్షోభానికి తెరతీసే సమయం. కాని అశోకుడి తండ్రి (బిందుసార) మరణం తరువాత సంభవించిన రాజకీయ సంక్షోభం ప్రస్తుతం లేదు. దీనికి ముఖ్య కారణం రాజకుటుంబంలోని వ్యక్తులకు, మంత్రిగణానికి అశోకుడి మీద ఉన్న ప్రేమ, భక్తి ముఖ్య కారణం.

ఆయన చివరి మాటలలో పునర్జన్మ కోరుకోలేదు, రాజరికరపు ప్రఖ్యాతిని కాంక్షించలేదు; కేవలం మనస్సు మీద పూర్తి అధికారం, గెలుపే ఆకాంక్షించినట్లు బోధపడుతుంది. ఎందుకంటే ఆయన మాటల్లో “ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు పొందిన బహుమతి దొంగిలించబడనది; ఇది ఆర్యులచేత గౌరవించబడునది; మనస్సుకు సార్వభౌమాధికారం కలుగజేయునది.”

చివరి శ్వాసతో ఈ మౌర్య మహాచక్రవర్తి తన సామ్రాజ్యాన్ని---అందులోనూ తన సోదరులను హత్య చేసి బలంతో క్రీ.పూ. 268లో ఆక్రమించుకున్న సామ్రాజ్యాన్ని---36 ఏళ్ల తరువాత ఆయన నమ్మిన బుద్ధుడి (దైవ) నిర్ణయంతో పరిత్యాగం చేయటం జరిగింది.

చరిత్రకారుల కధనం ప్రకారం ఆయన దేహం పూర్తిగా దహనం అవటానికి 7 పగళ్లు 7 రాత్రుళ్ళు పట్టింది. అది అతిశయోక్తేమో తెలియదు.

అశోకుడి ధర్మం

తొలినాళ్లలో అశోకుడు చేసిన, చేయించిన దుష్కృత్యాల వల్ల ‘చండ-అశోక’ గా పేరుగాంచిన ఈ మౌర్య చక్రవర్తి తదుపరి కాలంలో నిర్వహించిన సత్కృత్యాలు, ధర్మ కార్యాలవల్ల ‘ధర్మ-అశోక’ గా రూపొంది ప్రపంచమంతటా పేరొందాడు.

పాలన ఆరంభదశలో అశోకుడు ఒక విశ్రామం లేని, వ్యాకులంతో ఉన్న నిండిన చక్రవర్తి. దీని నుండి బయటపడటానికి అయన ఒక ఉత్తమమైన ఆధ్యాత్మిక జ్ఞాని కొరకు జరిగిన అన్వేషణలో ఒక బౌద్ధ భిక్షువు ‘నిగ్రోధ’ (Nigrodha) తారసపడటం జరిగింది. వీరిరువురి మధ్య జరిగిన చర్చలో నిగ్రోధ “మనః పూర్వకమైన స్వభావమే అమరత్వానికి సోపానం” అని చెప్తూ, “ఉదాసీనత మరణానికి మార్గం; మనస్సు మరణించదు; నిరుత్సాహకులు నిర్జీవులు” అని సంక్షిప్తంగా వెల్లడించాడు. ఆ తరువాత ఆయన గౌతమ బుద్ధ వచించిన ధర్మ సూత్రాలు, వీటికి సంబంధిన అనేక విషయాలు విశదీకరించటం జరిగింది. అప్పటినుంచి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ప్రచారం చేయటం, విస్తరించటం, వ్యాప్తి కొరకు కృషి చేయటం ఆయన పాలనలో అతి ముఖ్య భాగమయింది.

నిగ్రోధ ద్వారా ఉపదేశం పొందినా, బౌద్ధ మతం స్వీకరించినా అశోకుడి మనస్సు బౌద్ధమతం వైపు పూర్తిగా లగ్నమవలేదు. ఆయన మనస్సు ఇంకా రాజ్యాన్ని విస్తరించే దిశలోనే ఉంది. సమస్త ప్రపంచాన్ని జయించి దానిని పరిపాలించబోయే చక్రవర్తిగా ఊహించుకున్నాడు. క్రీ.పూ. 261 లో మొదట గా 900 కి.మీ. దూరంలో ఉన్న కళింగులమీద జరిగిన మహామారణ యుద్ధం వల్ల యుద్ధభూమి శవాల గుట్టలతో నిండి, రక్తశిక్తమయి, రక్తం ఏరులు కట్టి, వరదలై పారి సమీపాన ఉన్న ‘దయా’ నదిలోకి ఉధృతంగా ప్రవహించటం జరిగింది. ఈ దారుణ రక్తపాతంలో సైనికులతో పాటు సామాన్య ప్రజలు, బ్రాహ్మణ పురోహితులు, గురువులు, బౌద్ధ సన్యాసులకు జరిగిన నష్టాన్ని చూసి విపరీతంగా చలించి పశ్చాతాపం చెందిన అశోకుడు ఇక భవిష్యత్తులో ఇతర రాజ్యాల మీద దండెత్తకూడదని నిర్ణయించటం జరిగింది.

క్రీ.పూ. 263 లో అశోకుడు బౌద్ధ మతాన్ని తన రాష్ట్ర మతం (State Religion) చేసి దానిని మనఃపూర్వకంగా ఆచరించాడు, బోధించాడు, వ్యాప్తిచేశాడు. తాను నమ్మి ఆచరించిన ధర్మమే అశోక ధర్మం. ఈ ధర్మాన్ని సమస్త భూమండలం మీద వ్యాప్తిచేయుటకే తన శేష జీవితం (29 ఏళ్ళు) వినియోగించటం జరిగింది.

తాను ఆచరించిన ధర్మాన్ని ప్రజలలో వ్యాప్తి చేసి స్థిరపరచటానికి గౌతమ బుద్ధ సూచించిన ‘దశ రాజ ధర్మం’ (The Ten King 's Dharma) అశోకుడు ప్రవేశపెట్టడం జరిగింది. అవి:

  1. స్వార్థపరత్వం విడనాడి ఔదార్యంతో మెలగాలి.
  2. అత్యుత్తమైన నైతిక స్వభావం కలిగియుండాలి.
  3. ప్రజల శ్రేయస్సు కొరకు తన ఐహిక ఆనంద సంతోషాలను త్యాగం చేయాలి.
  4. నిజాయితీగా ఉండి సంపూర్ణ నీతి, సమగ్రతను అనుసరించాలి, పోషించాలి.
  5. ఇతరుల యెడల దయ, కారుణ్యం, శాంతం చూపాలి.
  6. ప్రజలు అనుకరించటానికి సాధారణ జీవితం గడపాలి.
  7. అసూయ, ద్వేషం నుంచి బయటపడాలి.
  8. అహింస పాటించాలి.
  9. ఇతరుల యెడల ఓర్పు, క్షమ అవలంబించాలి, ప్రదర్శించాలి.
  10. ప్రజాభిప్రాయాన్ని మన్నించి, శాంతి, సామరస్యం ప్రోత్సహించాలి.

గౌతమ బుద్ధ బోధించిన ఈ 10 సూత్రాలను అశోకుడు ఆచరిస్తూ తన రాజ్యాన్ని వీటికి అనుగుణంగా పరిపాలించటం జరిగింది. అలాగే తన ప్రజలు వీటిని తప్పనిసరిగా ఆచరించాలని నిర్దేశించటం కూడా జరిగింది. మానవ జీవితం ఈ సూత్రాలమీద ఆధారపడింది కాబట్టి వీటిని అనుసరించి, శాంతియుతమైన, ఫలప్రదమైన జీవితాలను పొందమని అశోకుడు తన ప్రజలను ప్రోత్సహించాడు.

ఈ బౌద్ధ ధర్మ తత్త్వ జ్ఞానాన్ని ప్రజలకు అందించటానికి రాజ్యమంతటా 14 శిలాశాసనాలను చెక్కించటం జరిగింది. ఈ శాసనాలలో ఉన్న ముఖ్య విషయాలు ఇలా ఉన్నాయి.

  1. ఏ ప్రాణినీ బలి ఇవ్వకూడదు, వధించకూడదు.
  2. మానవులకు, జంతువులకు అవసరమైన వైద్య సదుపాయం రాజ్యమంతటా ఉండాలి.
  3. బౌద్ధ సన్యాసులు 5 సంవత్సరాలకు ఒక సారి రాజ్యమంతా పర్యటించి ధర్మం సూత్రాలను ప్రజలకు బోధించాలి.
  4. ప్రతి వ్యక్తి తన తలిదండ్రులు, పూజారులు, సన్యాసులను ఎల్లప్పుడూ గౌరవించాలి.
  5. కారాగారాలలోఉన్న దోషులను మానవత్వంతో ఆదరించాలి.
  6. ప్రజలు ప్రభుత్వంలో జరిగే అనైతిక, అక్రమ చర్యలు, నిర్ణయాలను ఏ వ్యక్తి అయినా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నాకు నేరుగా తెలియజేసే స్వేచ్ఛ మీకు ఉంది.
  7. ఆత్మనిగ్రహం, పవిత్రమైన హృదయానికి తావిచ్చి ప్రోత్సహించే ఏ మతాన్ని అయినా ఈ అశోకుడు ప్రోత్సహించటం జరుగుతుంది.
  8. ఈ చక్రవర్తి సన్యాసులకు బ్రాహ్మణులకు, పురోహితులకు విరివిగా ఆర్ధిక సహాయం చేయటం స్వాగతిస్తారు.
  9. వివాహం లేక తదితర ప్రాపంచిక వేడుకలకంటే ధర్మం యెడల భక్తి, ఉపాధ్యాయుల యెడల సరి అయిన వైఖరి ఉత్తమమని చక్రవర్తి నమ్ముతారు.
  10. ధర్మాన్ని గౌరవించని ప్రజలు ఎంత కీర్తి సంపాదించినా అది నిరుపయోగం అని చక్రవర్తి భావించటం జరిగింది.
  11. పరులకు ఇవ్వటానికి ధర్మాన్ని మించిన బహుమతి లేదు.
  12. ఇతర మాటలను నిరసిస్తూ, నిందిస్తూ, తన మతాన్ని భక్తితో ఉపాసిస్తూ, ప్రశంసిస్తూ “నా మతమే గొప్పది, కీర్తి ప్రతిష్టలు కలది” అని భావిస్తే అది నీ మతానికే హాని కలుగజేస్తుంది. అందువల్ల మత సామరస్యం ఉత్తమమైనది. గమ్యం చేరటానికి అనేక దారులు ఉన్నట్లే దేవుడిని చేరటానికి అనేక దారులు ఉంటాయి.
  13. బలంతో సాధించే విజయం కంటే ధర్మంతో సాధించే విజయమే ఉన్నతమైనది, చిరకాలం నిలబడేది. ఒకవేళ బలం ఉపయోగించటం తప్పదు అనుకుంటే అది అతి ఓపికతో, స్వల్ప హానితో నిర్వహించాలి, ఉపయోగించాలి.
  14. పైన పేర్కొన్న శాసనాలలో ఉన్న సలహాలు, ఆజ్ఞలను ప్రజలు అనుసరిస్తారని, పాటిస్తారని నమ్ముతూ వీటిని శిలల మీద చెక్కించటం జరిగింది.

ఈ 14 శాసనాలను శిలలమీద, శిలాస్తంభాల మీద చెక్కించి రాజ్యంలో అనువైన చోట్ల ఉంచటం జరిగింది.

బౌద్ధ ధర్మం వ్యాప్తి

కళింగయుద్ధం తరువాత అశోకుడు శేష జీవితమంతా అహింస తన సామ్రాజ్యపు అధికార విధానంగా అనుసరించటం జరిగింది. జంతువధ, అంగచ్చేదన నిషేధం. ఆయన దృష్టిలో కుల వ్యవస్థ రద్దుచేశానని ఆయన భావించినా అది పూర్తిగా ప్రజలలో కొనసాగుతూనే ఉంది. ఆయన దృష్టిలో మానవులందరు సమానులే. శాఖాహారాన్ని ఆయన ప్రోత్సహించటం జరిగింది. తన రాజ్యంలో ప్రతి వ్యక్తిని సమానంగా ఆదరించాడు. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, ఓరిమి, సమానత్వం అతని/ఆమె హక్కులుగా అశోకుడు ఇవ్వటం జరిగింది.

గౌతమ బుద్ధుడి కాలంనుంచి బౌద్ధ ధర్మం ధ్యానం, ఏకాగ్రత మీదనే దృష్టి పెట్టటం జరిగింది. అప్పటి నుంచి 200 ఏళ్ళు ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. అశోకుడి ఆధ్వర్యంలో మూడవ బౌద్ధ ప్రతినిధుల సభ పాటలీపుత్రలో జరిగినప్పుడు బౌద్ధమతంలో ‘విభజయవాద’ (Vibhajayawada; పాలి భాష:విభజ్జవాద) కు తన మద్దతు ఇవ్వటం జరిగింది. దీనినే తరువాతి కాలంలో 'తెరవాద' (Theravada : School of the Elders) అని పలకటం జరిగింది. ఆదిలో ఈ శాఖను పాటలీపుత్రలో జన్మించిన బౌద్ధ సన్యాసి, పండితుడు, ‘మొగలిపుత్ర తిస్స’ (Moggaliputta Tissa) ఈ సభలో ప్రతిపాదించగా అశోకుడితో పాటు అత్యధిక ప్రతినిధులు సమర్ధించారు.

ఈ సమావేశం తరువాత అశోకుడు బౌద్ధమతం ఆదర్శాలు, గౌతమ బుద్ధ బోధనలను వ్యాప్తి చేయటానికి అనేక మంది బౌద్ధమత బోధకులను సుదూర ప్రదేశాలకు పంపించాడు. వీరిలో ముఖ్యులైన తన జ్యేష్ఠ పుత్రుడు ‘మహేంద్ర’, జ్యేష్ఠ పుత్రిక ‘సంఘమిత్ర’ లను ‘లంక’ (శ్రీ లంక) కు పంపించటం జరిగింది. ఇతరులు పశ్చిమ ఆసియాలో Seleucid Empire కు, ఈజిప్ట్, మాసిడోనియా, Cyrene (Libiya), Epirus (గ్రీస్-ఆల్బేనియా) మొదలగు దేశాలకు పంపబడ్డారు.

భారతావనిలోని ఇతర ప్రాంతాలకు, రాజ్యాలకు అశోకుడు తన ఉన్నతోద్యోగులను పంపించటం జరిగింది. వీరు:

  • మజ్ఝన్తిక (Majjhantika): గాంధార
  • మహాదేవ: మహిశమండల (మైసూరు)
  • రక్షిత: వనవాసి (తమిళనాడు)
  • ధర్మరక్షిత: అపరాంతక (గుజరాత్, సింధు)
  • మహాధర్మరక్షిత: మహారత్త (మహారాష్ట్ర)
  • మజ్ఝిమ: హిమవంత (నేపాల్)
  • సోనా, ఉత్తర: సువర్ణభూమి/బర్మా (థాయిలాండ్, మయాన్మార్)

అశోకుడు చేసిన ఈ కృషి వల్లనే గౌతమ బుద్ధుడి మరణం (క్రీ.పూ. 483లో) తరువాత సుమారు 200 ఏళ్ళు భారత దేశానికే పరిమితమైన బౌద్ధధర్మం దేశం ఎల్లలు దాటి విస్తరించింది. అప్పటినుంచి ఈ ధర్మం ఒక మతంగా మారి శాఖోపశాఖలుగా విస్తరించి ప్రపంచ ఆధ్యాత్మిక వనంలో ఒక ‘మహా బోధి’ వృక్షం గా నిలబడింది.

ఒక నాయకుడు, రాజనీతిజ్ఞుడు, రాజకీయదురంధరుడుగా పేరొందిన ఈ చక్రవర్తి ప్రపంచం మీద చెరగని తన ఆధ్యాత్మిక పాదముద్రను వదలివెళ్లటం జరిగింది. అది ఒక ధర్మచక్రం ఉన్న సింహ ఫలకం (Lion Capital) రూపంలో ఉంది. క్రీ.పూ. 250 లో సారనాథ్ లో అశోకుడు నెలకొల్పిన ధర్మ స్థంభం శిఖర అగ్ర భాగాన ఉన్న ఫలకం పైన నాలుగు సింహాలు నిలబెట్టబడ్డాయి. ఈ నాలుగు సింహాలు శక్తి, ధైర్యం, గర్వం, నమ్మకం (విశ్వాసం) లకు ప్రతీకలు. ఈ ఫలకం మధ్య భాగం (Abacus) చుట్టూ నాలుగు జంతువుల రూపాలు ఉన్నాయి. అవి: ఎద్దు (వృషభం), అశ్వం, సింహం, గజం (ఏనుగు). వీటి మధ్యలో నాలుగు ధర్మచక్రాలు ఉన్నాయి. ఒక్కొక్క ధర్మచక్రంలో 24 ఆకులు చెక్కబడి ఉన్నాయి. ఈ 24 ఆకులు ఒక రోజులో 24 గంటలకు గుర్తులు. ఈ 24 ఆకులతో ఉన్న ధర్మ చక్రమే ‘అశోక చక్రం’. ఈ అశోక చక్రమే ఈ రోజు భారతదేశం పతాకాన్ని అలంకరిస్తూ ఉంది.

Sarnath-capital
Photo Credit: Wikimedia Commons

సారనాథ్ ధర్మ స్థంభం చివర ఉన్న నాలుగు,సింహాలు, ధర్మచక్రం ఉన్న ఫలకం

ఎంతోమంది చరిత్రకారులు ఆయన ఘనకీర్తిని ప్రశంసించినా, 1922లో ఆంగ్లేయ చరిత్రకారుడు H.G. Wells చేసిన వ్యాఖ్య ఇలా ఉంది “ప్రపంచ చరిత్రలో వేలాదిమంది చక్రవర్తులయ్యారు.........కాని వీరిలో ఒక్క అశోక చక్రవర్తి మాత్రమే ఎల్లప్పుడూ మెరుస్తూ ఉంటాడు. అది కూడా ఏకాకిగా.…… అదీ ఆకాశంలో ఒక ధ్రువ నక్షత్రం లాగా!” ఇది యదార్ధం కాదా?

అశోకుడి సహోదరుడు (తమ్ముడు) వితాశోక (Vitasoka) గురించి ఆసక్తికరమైన విషయాలు వచ్చే సంచికలో తెలుసుకుందాము.

****సశేషం****

Posted in July 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!