12. అశోకుడు
గత సంచికలో (మే 2024) అశోక చక్రవర్తికి అయిదుగురు రాణులు ఉన్నట్లు తెలుసుకున్నాము. వీరిలో ‘దేవి’ (విదిష-మహాదేవి; శాక్యకుమారి), ‘కౌరవాకి’ (కారువకి; చారువాకి), ‘అసంధిమిత్ర’, ‘పద్మావతి’ అతి ముఖ్యులు. మరొక రాణి ‘తిష్యరక్షిత’ గురించి ఈ సంచికలో తెలుసుకుందాము. ఆమె ప్రవేశంతో అశోకుడి జీవితంలో చాలా మార్పులు సంభవించాయి. వీటిని గురించి తెలుసుకుందాము.
తిష్యరక్షిత (Tishyarakshita)
తిష్యరక్షిత (Tishyarakshita; తిష్యరక్ష/Tishyaraksha) అశోకుడి అయిదవ భార్య, చివరి భార్య. ఆమె అశోకుడు మరణానికి నాలుగు ఏళ్ళు ముందు (అంటే క్రీ.పూ. 236 లో) పరిణయమాడింది.
ఈమె రాణి హోదా పొందటానికి ముందు చాలా ఏళ్ళు నాలుగవ రాణి ‘అసందిమిత్ర’ కు సేవకురాలు, చెలికత్తెగా అంతఃపురంలో ఉండేది. ఈమె కుడా అసందిమిత్ర ‘అసంధివత్’ అనే చిన్న రాజ్యానికి చెందిన స్త్రీయే. అశోకుడితో ఈ నాలుగవ రాణి వివాహం తరువాత తిష్యరక్షతి కూడా ఆమె వెంట పాటలీపుత్ర రావటం జరిగింది.
క్రీ.పూ. 240 లో అసందిమిత్ర మరణం తరువాత నాట్యకత్తె తన నాట్యంతో, అందంతో అశోకుడి ని మెప్పించి ఆయనకు దగ్గరయింది. తద్వారా ఆమె వయస్సు మీరుచున్న ఈ మౌర్య చక్రవర్తికి ప్రియురాలుగా మారి, అయనకు పరిచర్యలు చేస్తూ, అయన ఆరోగ్య సంబంధిత సేవలు చేస్తూ ఉంది. కొన్నాళ్ల తరువాత అశోకుడు తిష్యరక్షతిని క్రీ.పూ. 236 లో వివాహం చేసుకుని ఈ అయిదవ భార్యకు రాణి హోదా ఇవ్వటం జరిగింది.
బోధి వృక్షం వినాశన ప్రయత్నం
సహజంగా అమిత స్వార్ధపరురాలు, అసూయాపరురాలు అయిన తిష్యరక్షితకి గౌతమ బుద్ధుడి యెడల అశోకుడికి ఉన్న భక్తి ఆగ్రహాన్ని తెప్పించింది. దీనితో పాటు, ఆగ్రహాన్ని తెప్పించే మరికొన్ని విషయాలతో పాటు, మానసిక ఆందోళన, వ్యాకులత, అశాంతికి కారణమైన తిష్యరక్షిత వల్ల అయన అనారోగ్య సమస్యలతో మనః శాంతి కి దూరమవటం జరిగింది. తద్వారా ఆమె అయన జీవితంలో ప్రవేశించటంవల్ల ఈ మహా చక్రవర్తి అప్పటి నుంచి నాలుగు ఏళ్లలోనే మరణానికి చేరువ అవటం జరిగింది.
ఈ దుష్టబుద్ధి తిష్యరక్షిత రాణి అయిన కొద్ది రోజులలోనే అశోకుడి అతి ఇష్టమైన, పవిత్రమైన బోధి వృక్షాన్ని నాశనం చేసింది. దీనిని బట్టి ఈ మౌర్య చక్రవర్తి తన రాజ్య వ్యవహారాలమీద పట్టు కోల్పోయినట్లు అర్ధమవుతుంది, అవగతమవుతుంది.
దుర్మార్గురాలయిన తిష్యరక్షితకు గయలోని ‘మహా బోధివృక్షం’ యెడల పగ, శత్రుత్వం ఉంది. ఈమెకు ఆ పవిత్రవృక్షం యెడల అసూయకు కారణం అజ్ఞానం. ఒకసారి అశోకుడు ఈ బోధివృక్షానికి అత్యంత విలువైన ఆభరణాలు సమర్పిస్తే, తిష్యరక్షిత ఆ వృక్షం తనకు శత్రువుగా భావించింది. రాజు తన నుండి సుఖాలు పొంది ఆభరణాలు మాత్రం ఈ ‘దరిద్ర బోధి కే పంపిస్తాడు’ అని కోపించింది. ఈ క్రోధంతో ఒక రోజు ఒక మంత్రగత్తెను పిలిచి ధనం ఇచ్చి ఆ బోధిని నాశనం చేయమని ఆజ్ఞాపించింది.
ఆ మంత్రగత్తె గయ వెళ్లి కొన్ని మంత్రాలను ఉచ్ఛరించి ఒక దారాన్ని బోధి వృక్షం చుట్టూ కట్టింది. కొన్నాళ్లకు ఆ వృక్షం వాడిపోవటం మొదలయింది. ఈ వార్తను అశోకుడు విన్న వెంటనే మూర్ఛ పోవటం జరిగింది. తేరుకున్న తరువాత బ్రద్దలయిన హృదయంతో అశోకుడు “ఈ వృక్షం నశిస్తే నేనూ మరణిస్తాను” అని తన ఆంతరింగులకు చెప్పాడు.
ఆ విషయం విని తిష్యరక్షిత “బోధి మరణిస్తే నేను ఉన్నాను, మీకు అనేక సౌఖ్యాలు అందించటానికి. విచారపడకండి” అని ఓదార్చటానికి ప్రయత్నించింది. ఆమె అజ్ఞానం తెలుసుకున్న అశోకుడు వెంటనే “బోధి స్త్రీ కాదు. అది ఒక వృక్షం. ఈ మహావృక్షం క్రిందే ఆ మహనీయుడు, నా దేముడు గౌతమ బుద్ధ మహాశయుడికి అతీత జ్ఞానోదయం కలిగింది.” అని ఆ మూర్ఖురాలికి చెప్పటం జరిగింది. తన చేసిన తప్పును తెలుసుకున్న తిష్యరక్షిత మంత్రగత్తెను రప్పించి బోధి వృక్షాన్ని పునరుజ్జీవం చేయమని ఆదేశించింది. కొద్దిరోజులకు ఆ మహావృక్షం జీవం పోసుకుని పునరుద్ధరించబడింది.
కునాల (Kunala), అతని యెడల మొహం
అశోకుడికి మూడవ రాణి పద్మావతి ద్వారా కలిగిన పుత్రుడు ‘కునాల’. పద్మావతి తన పుత్రుడి నేత్రాలు ‘చారల రంగుల హిమాలయ పక్షి’ (Avifauna) కళ్ళు లాగా, అందంగా, ప్రకాశంవంతంగా, చూసేవారిని ఆకర్షించేటట్లు ఉండటంవల్ల ఆ పక్షి పేరు ‘కునాల’ అతనికి పెట్టటం జరిగింది. ఈ బాలుడు ఏకాంతాన్ని, ప్రకృతిని ప్రేమించే రాజకుమారుడుగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతను బాలుడుగా ఉన్నప్పుడే తల్లి మరణించింది. పెరిగి పెద్దవాడయిన ఇతను యుక్తవయస్సులో వివాహం ‘కాంచనమాల’ అనే కన్యను వివాహం చేసుకుని ఒక పుత్రుడికి తండ్రి అవటం జరిగింది.
ఆ సమయంలో ఈ సుందర రాజకుమారుడిని తిష్యరక్షిత మోహించి అతని పొందుకోసం తహ తహలాడింది. అందమైన, అత్యంత ఆకర్షణీయమైన కునాల కళ్ళు తిష్యరక్షతిని ఆకర్షించాయి. కాని భక్తిపరుడయిన కునాల రాణి హోదా కలిగిన తిష్యరక్షతిని తల్లిగా గౌరవించాడు.
ఒకసారి కునాల ధ్యానస్థితిలో ఒంటరిగా ఉన్నప్పుడు తిష్యరక్షిత తన కామేచ్ఛను అణచుకోలేక అతనిని కౌగలించుకుని తనకోరికను వెల్లడించి “అడవిలో అగ్ని ఎండిన కొయ్యను భగభగ దహించినట్లు నీ యెడల నాకు ఉన్న కోరిక నన్ను దహించివేస్తున్నది. నన్ను తిరస్కరించకు రాజకుమారా” అని ప్రాధేయపడింది. ఆమె అధర్మమయిన కోరికను కునాల తిరస్కరిస్తూ “నీవు నాకు తల్లితో సమానం కాబట్టి, ఇది అత్యంత హేయకరమైన విషయం” అని వెళ్లిపోయాడు. ఈ తిరస్కరణ భరించలేని తిష్యరక్షిత “నీవు ఎక్కువకాలం జీవించి ఉండవు” అని కునాలతో ప్రతిజ్ఞ చేసింది. ఆగ్రహంతో ఆమె కునాలను అంధుడిని చేయాలని నిర్ణయించింది.
ఆ సమయంలో తక్షశిలలో ప్రజలు అశోకుడి పాలనమీద తిరుగుబాటు లేవనెత్తారు. దీనిని అణ చటానికి అశోకుడు తన మంత్రి ‘రాధాగుప్త’ తో సంప్రదించి కునాలను తక్షశిలకు పంపించటానికి నిర్ణ యించటం జరిగింది. వెంటనే కునాల తన సైన్యంతో తక్షశిలకు బయలుదేరి వెళ్ళాడు.
‘రెండు మణులు’ అంటే ‘రెండు కళ్ళు'’
కునాల తక్షశిలకు బయలుదేరేముందు తిష్యరక్షిత అతనిని అంధుడిని చేయటానికి ఒక కుట్ర పన్నింది. ఈ పన్నాగం ప్రకారం అశోకుడి పేరుతో తనకు ‘రెండు అతివిలువైన మణులను’ కునాల ద్వారా పంపించమని ఒక ఒక లేఖ వ్రాసింది. ఈ ఉత్తరాన్ని అశోకుడు చదవకుండా తన భార్యను నమ్మి దాని మీద సంతకం చేశాడు. ఆ సమయంలో అశోకుడు ఈ తన అయిదవ భార్యను పూర్తిగా నమ్మే స్థితిలో ఉన్నాడు. ఆ లేఖ మీద తిష్యరక్షిత రాజముద్ర వేసి కునాల చేతికిచ్చి, దానిని తక్షశిల పరిపాలకుడికి (గవర్నర్) ఇవ్వమని ఆదేశించింది.
ఈ లేఖను ముందుగా చదివిన ఒక తక్షశిల ఉద్యోగి అశోకుడు వ్రాసిన (తిష్యరక్షిత వ్రాసిన) వాక్యాలలో దాగియున్న విషయాన్ని తెలుసుకుని దిగ్భ్రాంతి చెంది దానిని కునాలకు చూపించటం జరిగింది. కునాల ఆ లేఖను చదివి తన తండ్రి వెల్లడించిన (యదార్ధానికి తిష్యరక్షిత వెల్లడించిన) క్రూరమైన అభిప్రాయాన్ని అర్ధం చేసుకున్నాడు. ఈ ఉత్తరంలో వ్రాసిన సమాచారంలో ‘రెండు మణులు' అనే పదాలకు వేరే అర్ధం దాగి ఉంది. అది: ‘రెండు మణులు’ అంటే ‘రెండు కళ్ళు'’. అంతవరకు మౌర్య రాజకుమారులు తమ తండ్రుల ఆజ్ఞలను ఉల్లంఘించే ధైర్యం, సంప్రదాయం లేదు కాబట్టి మగధ రాజ్యానికి విధేయతతో ఉన్న తాను కూడా అదే మార్గంలో నడవాలని నిర్ణయించుకోవటం జరిగింది. అంటే తన నేత్రాలకు అంధత్వం ఇవ్వటం.
అశోకుడి తీవ్ర అస్వస్థత; ఏడు రోజుల మహారాజ్ఞి
కునాల తక్షశిల వెళ్లిన కొద్ది రోజులకే అశోకుడు ఒక తీవ్ర వ్యాధి బారిన పడటం జరిగింది. దీని వల్ల నోటి నుంచి మలం (పురీషం) బయటకు రావటం ప్రారంభించింది. దీనితో పాటు శరీర రంధ్రాలనుంచి (రోమ రంధ్రాల నుంచి) ఒక అశుద్ధ ద్రవం కారటం మొదలెట్టింది. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఈ అంతు పట్టని వ్యాధిని నిర్మూలించలేకపోయారు. ఇక అయన మరణం తధ్యమని వారు ధృవీకరించినప్పుడు అశోకుడు తన ప్రియ పుత్రుడు కునాల ను తిరిగి పాటలీపుత్రకు రప్పించి అతనిని పట్టాభిషిక్తుడిని చేయాలని కాంక్షించి తగిన ఆదేశాలను జారీ చేయటం జరిగింది.
తిష్యరక్షిత ఈ సంగతి తెలుసుకుని ఇది జరిగితే తనకు ప్రాణ ముప్పు ఉందని గ్రహించి కునాల తిరిగి వచ్చే లోపల అశోకుడి ఆరోగ్యం బాగుచేయాలని నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమంలో ముందుగా అశోకుడి వైద్యులను బహిష్కరించింది. పాటలీపుత్రలో ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న వారిని తన వద్దకు తీసుకురమ్మని వైద్యులను ఆదేశించింది.
వైద్యులతో ఆమె ఇలా చెప్పింది: “ఏ పురుషుడయినా, స్త్రీ అయినా మీ వద్దకు వస్తే, వారు ఈ మహారాజుకి వచ్చిన వ్యాధితో బాధపడుతుంటే వారిని నా వద్దకు తీసుకురండి. అంతేగాక, ఏ వ్యక్తి అయినా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు మీకు తెలిసినా వారిని వెంటనే తీసుకురండి. నేను వారిని చూడాలి”
ఆ సమయంలోనే పాటలీపుత్ర లో అభిర జాతి (Abhira Tribe) వ్యక్తి ఇదే వ్యాధితో బాధపడటం జరిగింది. అతని భార్య ఒక వైద్యుడి వద్దకు వచ్చి ఈ విషయం చెప్పింది. వైద్యుడు “అతనిని వెంటనే నా వద్దకు తీసుకురా; అతనిని పరీక్షించి తగిన మందు ఇచ్చి చికిత్స చేస్తాను” అని చెప్పగా ఆమె తన భర్తను తీసుకువచ్చింది. ఆ వ్యక్తిని తీసుకువచ్చిన వెంటనే వైద్యుడు అతనిని తిష్యరక్షిత వద్దకు తీసు కువెళ్లాడు.
ఆమె ఆ వ్యక్తిని ఒక రహస్య గదిలోకి తీసుకువెళ్లి అతనిని చంపించింది. వెంటనే అతని కడుపుని చీల్చి, లోపల ఏమి ఉందో అని పరిశీలించగా ఒక పెద్ద పురుగు (worm) కనిపించింది. ఈ పురుగు కదులుచున్నప్పుడు అది విసర్జించిన మలం ఆ వ్యక్తి నోటినుంచి బయటకి స్రవించటం (కారటం) గమనించింది తిష్యరక్షిత.
ఈమె వెంటనే మిరియపు గింజలను చూర్ణం చేసి, ఆ చూర్ణాన్ని ఆ పురుగుకు దగ్గర పెట్టింది. కాని పురుగు చావలేదు. తరువాత ఎండు మిరపకాయల పొడి, అల్లం చూర్ణం పురుగు దగ్గర పెట్టినా అది మరణించలేదు. చివరకు ఉల్లిపాయను కోసి కొన్ని చిన్న ముక్కలను పురుగుకు దగ్గరగా పెట్టగా, వాటిని తిన్న వెంటనే ఆ క్రిమి మరణించి, ప్రేగులద్వారా ప్రయాణించి చివరకు విసర్జించబడింది.
దీనిని గమనించిన ఈ అయిదవ రాణి అశోకుడి దగ్గరకు వెళ్లి
“నాధా! ఈ ఉల్లిపాయ ముక్కలను తినండి, మీరు వెంటనే కోలుకుంటారు.” అని వేడుకుంది.
దానికి ఆయన "రాణి, నేను క్షత్రియుడను. అందువల్ల నేను ఎలా ఉల్లిపాయను ఎలా తినగలను” అని తిరస్కరించాడు. ప్రత్యుత్తరంగా, తిష్యరక్షిత
“ప్రభూ, దీనిని మందుగా పరిగణించి మీ ప్రాణం కొరకు, మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఉల్లిపాయను భుజించండి” అని ప్రార్ధించింది. అశోకుడు నిరాసక్తంగా దానిని తినగా, కొంతసేపటికి లోపల ఉన్న పురుగు (క్రిమి) ప్రేగుల ద్వారా బయటకు విసర్జించబడింది. ఇలా రెండు రోజులు ఉల్లిపాయలు తినగా ఆయన పూర్తిగా కోలుకోవటం జరిగింది.
తన భర్తను రక్షించుకోడానికి పర స్త్రీకి చెందిన భర్తను చంపటం ధర్మరహితమైనా అశోకుడి లాంటి మహారాజును రక్షించటం సముచితమైన విషయం కావచ్చు. అయినా ఈ స్వార్ధపరమైన స్వభావమే ఆమెను కునాల తో పొందుకోసం తహతహలాడించింది. రాజగృహాలలో ఇటువంటి స్త్రీలు/రాణులు చరిత్రలో మనకు ఎక్కువమందే కనపడతారు. వారి కోరికలకు వారు ఎంతదూరమైనా వెళ్ళగలరు, దేనికైనా తెగిస్తారు.
ఈమె దుర్మార్గం, దుర్భుద్ధి అశోకుడి స్వస్థత పొందిన తరువాత మరింత బయటపడింది. తన ప్రాణాన్ని నిలబెట్టినందుకు తిష్యరక్షితకు కృతజ్ఞతగా ఆమెను ఒక వరం కోరుకోమని అడగటం జరిగింది. ఆమె వెంటనే తనను మౌర్య రాజ్యానికి ‘ఏడు రోజులు మహారాజ్ఞి’ గా చేయమని కోరింది. ఆ కోరిక అశోకుడు మంజూరు చేసిన వెంటనే కాలయాపన చేయక తన సహజ దుష్టబుద్ధి, దుస్వభావంతో కునాలను నాశనం చేయటానికి ఉపక్రమించింది. ఈ ప్రణాళికలో భాగమే ఈ రాజకుమారుడిని, కాబోయే మౌర్య చక్రవర్తిని (అశోకుడి ఆకాంక్ష ప్రకారం) అంధుడిని చేయటం.
లక్క గృహంలో తిస్యరక్షతి అగ్నికి ఆహుతి
తక్షశిలలో తిరుగుబాటును అణచివేచి విజయవంతంగా పాటలీపుత్ర తిరిగి వచ్చేముందు తక్షశిల అధికారి మహారాజ్ఞి తిష్యరక్షతి ఆజ్ఞ ప్రకారం ఈ రాజకుమారుడి కళ్ళను ఒక ఉలితో పెకలించి వేయటం జరిగింది. ఈ సంగతి అంతకు ముందే తెలిసిన కునాల ఏమి అధైర్యపడలేదు, అడ్డుచెప్పలేదు. తక్షశిల అధికారి ‘ఆ రెండు మణులను’ అశోకుడికి పంపించటం జరిగింది.
అంధుడైన కునాల, ఆయన భార్య (కాంచనమాల) పాటలీపుత్ర తిరిగి వెళ్లినప్పుడు తన ప్రియ పుతృడిని చూసి, అతని అంధత్వానికి కారణం తిష్యరక్షతి అని తెలుసుకుని ఆగ్రహించిన అశోకుడు తాను నమ్మిన బుద్ధ ధర్మాన్ని, బుద్ధుడి ప్రవచనాలను ప్రక్కన బెట్టి, తిష్యరక్షతిను పరిత్యజించి “ఆమె కళ్ళను పెరికివేసి, శరీరాన్ని పదునైన కత్తితో నిలువుగా చీల్చివేసి, నాసికను రంపంతో కోసి, నాలికను కత్తితో కోసి, చీల్చిన శరీరంలో విషాన్ని నింపి చంపండి” అని ఒక అధికారిని ఆజ్ఞాపించాడు.
ఇది తెలుసుకున్న కునాల బౌద్ధ ధర్మాన్ని పాటించే తన సహజ ప్రవృత్తితో ఆమెను క్షమించమని ప్రాధేయపడటం జరిగింది. తిష్యరక్షతి తనకు అన్యాయం చేసినా తాను చూపిన ఈ ఉదాత్తమైన ఔదార్యం అతనికి వెంటనే తాను నమ్మిన దైవం చూపును ప్రసాదించటం జరిగింది.
కాని అశోకుడు వెనక్కి తగ్గక తిష్యరక్షతిని ఒక ‘లక్క గృహం’ లో అగ్నికి ఆహుతి చేయమని ఆజ్ఞాపించటం జరిగింది. ఆ విధంగా ఉన్నతికి చేరిన ఒక సంవత్సరంలోనే అశోకుడి ఈ అయిదవ భార్య జీవితం క్రీ.పూ.235 లో ముగిసింది.
అశోకుడి శేష జీవితం
పైన జరిగిన పరిణామాల దృష్ట్యా అశోకుడు ఒక బలహీనపడిన రాజుగా పరివర్తన చెందటం జరిగింది. ఈ స్థితిలో రాజప్రసాదం లో అయన వారసుడు ఎవరు అనే విషయంలో తర్జన భర్జన మొదలయింది. ఎవరికి వారు తమకు అనుకూలమయిన వ్యక్తి అశోకుడికి వారసుడుగా ఉండాలనే ఆరాటంతో ఉన్నారు. ఈ పరిస్థితిలో జ్యేష్ఠ భార్య, పట్టమహిషి అయిన ‘దేవి’ ప్రముఖ పాత్ర వహించటం జరిగింది.
అశోకుడి శేషజీవితంలోని మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వచ్చే సంచికలో తెలుసుకుందాము.
మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు నా ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com