ఆశల దొంతర్లలో దొరకని అమృతం
ఓ మనిషీ,
ప్రపంచం అంతా నిన్నేమెచ్చాలని ఆశ పడ్డావు కానీ
ఏ ఆధిక్యతా నీలో కాగడాతో వెదికినా అగుబడదే మరి!
ప్రజలలో కీర్తి కాంక్షతో వెంపరలాడావు
అడ్డదారులు కాక ఋజు మార్గంలో లభించదే అది మరి!
కోట్లకు పడగెత్తాలని ఆశ పడ్డావు
మోసం చెయ్యక ఆర్జించే మార్గం దొరకదాయె మరి!
హిమాలయాల కంటే ఎత్తు ఎగరాలని ఆశించావు
రెక్కలకోసం తడుముకు చూస్తే అవి కనబడవే మరి!
పోనీ గురువుల బోధతో మోక్షాన్ని సాధిద్దామంటే
మనసు మోహ కోరికల పరుగులాపి పరమాత్మ వైపు చూడదు మరి!
వేటినీ అందుకోలేని తపనే మిగిలిందా మానవా
నీ దురాశ రెక్కలు విరిచి నేలపై సాము చేయవోయి…
కష్టే ఫలి అనే నిజాన్ని గుర్తించవోయి
గురుతర బాధ్యతలను గుర్తెరిగి నడుచుకోవోయి...
స్వయంకృషితో ఆత్మసంతృప్తిని పొందవోయి
సాటివారికి స్వార్థరహిత సహాయాన్ని అందించావోయి...