Menu Close
ఉప్పలూరి మధుపత్ర శైలజ
అనురాగబంధం (కథ)
-- మధుపత్ర శైలజ --

అందమైన బాపుగారి కుంచె నుండి జాలువారిన సీతారాముల వర్ణచిత్రంతో కన్నుల పండుగగా ఆ వీధికే వన్నె తెచ్చింది. “శ్రీ సీతారామ మ్యారేజ్ కౌన్స్‌లింగ్ సెంటర్” అన్న బోర్డ్. ఈ సెంటర్ దేశంలోనే ఉత్తమమైన కౌన్స్‌లింగ్ సెంటర్‌గా పేరెన్నిక గాంచి, అవార్డులను సాధిస్తూ ఎన్నో కుటుంబాలలోని సమస్యలను పరిష్కరిస్తోంది.

న్యాయశాస్త్రంలో గోల్డ్‌మెడల్ సాధించి ఫ్యామిలీకోర్టులో న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్న చక్రధర్, కేసులను డీల్ చేసే పధ్ధతి మిగిలిన వారికి భిన్నంగా ఉండి, వచ్చిన క్లయింట్స్‌కు మనోనిబ్బరాన్ని అందిస్తుంది. ఉమ్మడి కుటుంబంలో ప్రేమ ఆత్మీయతల మధ్య బంధాలకు, అనుబంధాలకు విలువలనిస్తూ పెరిగిన చక్రధర్, తన అనుభవ సారాన్ని రంగరించి తన క్లయింట్స్‌కు సూచనలనిస్తూంటాడు.

‘చక్రధర్’ ఏదో కేసు గురించిన వివరాలను ఫైలుతీసి చదువుతున్నా, ఉదయం తనదగ్గరకు వచ్చిన ఆ జంట సమస్య గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

“నా భర్త నాకు అనుకూలంగా ఉండరు, నా మాటను వినరు, ఏ పని చేసినా వారికి చెప్పిచేయాలంటారు, నాకు ఆర్ధిక స్వాతంత్ర్యం అసలు ఇవ్వటంలేదు” అంటూ యువతులు;

“నా భార్య విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంది, లేడీస్ క్లబ్‌లు, కిట్టిపార్టీలు అంటూ నలుగురిని వెంటేసుకుని తిరుగుతోంది, నా తల్లిదండ్రులను అసలు లెక్కచేయటంలేదు” అని యువకులు;

ఇలాంటి చిన్నచిన్న కారణాలకే విడాకుల దాకా వచ్చిన జంటలకు సర్దిచెప్పటం చాలా తేలిక అయిన విషయమే. అందుకే ఎన్నో కేసులను పాజిటివ్‌గా పరిష్కరించిన తనకు ఈ రోజు వచ్చిన కేసు ఒక ప్రశ్నలా మిగిలింది. దానిని ఎలా పరిష్కరించాలో ఊహకు కూడా అందకుండా ఉండి, వారి మధ్యన జరిగిన సంభాషణ మదిలో తరంగంలా మెదిలింది.

“మేడం లోపలికి రండి” అంటూ పిలుస్తున్న తన స్టాఫ్ మాటలకు తలెత్తి చూశాడు చక్రధర్. ఎదురు దాదాపు 24ఏళ్ళ వయస్సున్న ఓ యువతి తన తల్లిదండ్రులతో కలసి వచ్చింది.

“సార్! నా పేరు శేఖర్. ఈమె నా భార్య పార్వతి, ఈ అమ్మాయి నా కూతురు రేవతి” అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు శేఖర్.

“రండి. కూర్చోండి. ఏమిటి మీ సమస్య?” అంటూ అడిగాడు చక్రధర్.

“మా అమ్మాయి రేవతికి ఆరునెలలకిందట వివాహమయ్యింది. అదికూడా ప్రేమ వివాహం. నా అల్లుడు రేవంత్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.

వాళ్ళిద్దరి జంట చాలా ఆనందంగా ఉండటం చూసిన విధికి కన్నుకుట్టింది కాబోలు. స్కూటర్‌పై ఇంటికొస్తున్న ఆ జంటకు యాక్సిడెంట్ అయ్యింది. వెనక కూర్చున్న రేవతికి పెద్దగా దెబ్బలేమి తగల్లేదు. కానీ డ్రైవ్ చేస్తున్న రేవంత్‌కు మాత్రం తీవ్రంగా దెబ్బలు తగిలాయి. నడుము కింద భాగం దెబ్బతిని, వీల్‌ఛైర్‌కే పరిమితమైన అతనిక దాంపత్య జీవితానికి పనికిరాడని డాక్టర్స్ తేల్చిచెప్పారు.

“వయస్సు దృష్ట్యా నీకింకా చాలా భవిష్యత్తు ఉంది తల్లీ. రేవంత్‌తో నీకు సుఖపడే యోగంలేదు. మీరు విడాకులు తీసుకుంటే, నీకు వేరే పెళ్ళి ప్రయత్నాలను చేస్తాం. అమ్మానాన్నలుగా మా కూతురు పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు కళకళలాడుతూ తిరగాలని కోరుకోవటంలో తప్పులేదుగా” అని  నా భార్య, నేనూ నెత్తినోరూ కొట్టుకుని చెప్పినా, నా కూతురు వినటం లేదండి. మీరైనా కాస్త..” అంటూండగానే వచ్చిన మరో జంటను చూసిన శేఖర్ “వచ్చారా! మీ మాటే లాయరుగారికి చెప్పబోతున్నాను” అన్నాడు శేఖర్. వచ్చిన వారిని, “కూర్చోండి” అన్నాడు చక్రధర్.

“బావగారూ! నేను కూడా కొన్ని విషయాలను లాయరుగారికి చెప్పాలి” అంటూ చక్రధర్‌గారి వైపు తిరిగి “మా అబ్బాయి రేవంత్‌, వీళ్ళమ్మాయి రేవతి గత రెండేళ్ళుగా ప్రేమించుకుంటూ, మా అందరి అంగీకారంతో అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. రేవతి మాతో చక్కగా కలసిపోయి, మాకు కూతురులేని లోటును తీర్చింది. ఇంతలో ఈ ఘోరం జరిగింది.

మా వాడి కారణంగా రేవతి జీవితం అన్యాయంకాకూడదు. దురదృష్టవశాత్తు వారికి ఇంకా పిల్లాపాపలు కలుగలేదు. పిల్లలయినా వుంటే వారిని చూసుకుంటూనైనా రేవతి కాలం గడిపేసేది. కానీ ఒకవిధంగా అది ఆమెకు వరంగా మారబోతోంది.

“మంచానికే పరిమితమైన మా రేవంత్, మేము కూడా నిరంతరం రేవతి గురించే ఆలోచిస్తున్నాం. తన అభిప్రాయాన్ని మీకు తెల్పమంటూ రేవంత్ ఓ ఉత్తరం రాసిచ్చాడు. ఓ సారి చదవండి” అంటూ చక్రధర్ చేతికి ఓ కాగితాన్ని అందించాడు రేవంత్ తండ్రి.

అందులో రేవంత్, “లాయర్‌గారూ! రేవతి నేను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాం. ఆమె ఎంతమంచిదంటే, ఈ యాక్సిడెంట్ తరువాత ఆమె నాకు హాస్పిటల్‌లో మనోస్థైర్యాన్ని అందించింది. నేను ఇంటికివచ్చే దాకా నా తల్లిదండ్రులకు ధైర్యం చెపుతూ అండగా నిలచింది. నాకు ఇలా జరగటంతో ఆమె జీవితం మోడు బారకూడదు.

అలాంటి మంచి అమ్మాయిని నా భార్య అనే కారణంతో, మా కుటుంబంలో జీవితకాలం బందీను చేయలేను. ఆమెను మరో పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో హాయిగా ఉండమని చెపుతున్నాను. అందుకు వీలుగా మాకు విడాకులను ఇప్పించమని మిమ్మల్ని కోరుతున్నాను. నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడే స్థితిలో లేను. అందుకే ఈ ఉత్తరం ద్వారా నా అభిప్రాయాన్ని మీకు చెపుతున్నాను. సమస్యను నా కోణంలో ఆలోచించి, ఆమె దీనికి అంగీకరించేలా చెయ్యండి” అంటూ ముగించాడు.

ఉత్తరం చదివిన చక్రధర్ విస్తుపోయాడు. “వీళ్ళ మధ్య ఉన్నది ఎంత గొప్ప అనుబంధం” అని మనసులో అనుకుని, “ఇక రేవతి అంతరంగాన్ని తెలుసుకుంటేగానీ ఈ సమస్య విషయంలో ముందుకెళ్ళలేం” అనుకున్నాడు.

“అమ్మా రేవతి! రేవంత్ ఉత్తరంలోని సారాంశం నీకు అర్ధమయ్యింది కదా. మరి నీ మనసులోని మాటను కూడా చెపితే మనం ఈ విషయంలో మాట్లాడుకోవచ్చు” అన్నాడు చక్రధర్. అప్పటిదాకా మౌనంగా కూర్చున్న రేవతికి కళ్ళవెంట గంగా, కావేరులు ప్రవహిస్తున్నాయి.

పార్వతి రేవతిని ఓదారుస్తూ, “బాధపడకమ్మా! నిన్ను మేమేమి వేధించటంలేదు. కానీ నీ సంతోషం గురించే ఈ బంధాన్ని వదిలి, కొత్త అనుబంధానికి ప్రయత్నించమంటున్నాం” అంది.

బాధను దిగమింగుకున్న రేవతి, “లాయర్‌గారూ! నా రేవంత్‌తో సహా, నా వాళ్ళందరూ నన్ను విడాకులు తీసుకుని మరో పెళ్ళి చేసుకోమంటున్నారు. కానీ వారందరికి నాదో ప్రశ్న. ఆ యాక్సిడెంట్‌లో నేనే మంచంలో పడిఉంటే, రేవంత్ నన్ను వదిలి వేరే పెళ్ళి చేసుకునే వాడా? వీళ్ళు దానికి ఒప్పుకునేవారా?” అంటూ అడిగింది. ఆ ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు.

“లాయరుగారు! ఇదిగో రేవంత్ ఫోను నెంబర్. ఇదే ప్రశ్నను వారినడిగి చూడండి” అంటూ ఫోను చక్రధర్‌కు ఇచ్చింది రేవతి. చక్రధర్ “మీ భార్య రేవతి అడగమన్నారంటూ, రేవతి అడిగిన ప్రశ్నను రేవంత్‌కు సంధించాడు.

అటునుండి “నో! నా రేవతికి ఈ పరిస్థితి ఎప్పటికి రాకూడదు. మా ప్రేమ వయస్సు రెండేళ్ళే కావచ్చు. కానీ మా మధ్యన నూరేళ్ళ బంధముంది. ప్రేమ ప్రేమను ప్రేమిస్తూందని అందరూ అంటూంటారు. ఆమె మీద ప్రేమతోనే, ఆమెను ఎప్పటికి సంతోషంగా చూడాలని నేనా కోరికను కోరింది” అంటూ తన ప్రేమావేదనను వినిపించాడందరికి.

వారి భావాలను అర్ధం చేసుకున్న చక్రధర్‌ “ఇదేకదా ప్రేమంటే! ఎదుటి మనిషి భావాలను గౌరవిస్తూ, ఒకరినొకరు అర్ధంచేసుకుంటూ, వారి మనసును ఆరాధిస్తూ, జీవించటమే నిజమైన ప్రేమ కదా. నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నామని చెపుతూ, నాలుగు రోజులలో విడాకులకు తయారవుతున్న ఈ కాలపు పిల్లలకు రేవతి, రేవంత్‌ల ప్రేమను ఆదర్శంగా చెప్పాలి” అనుకున్నాడు.

“విన్నారుగా లాయరుగారు! నాకు రేవంత్ మీద అంతకంటే ఎక్కువ ప్రేమ. ప్రేమంటే పరస్పర ఆకర్షణ, శారీరక సౌఖ్యం కాదు. హృదయామృతాన్ని ఒకరికొకరు పంచుకోవటం. అలాంటి ప్రేమే మమ్మల్ని కలిపింది. బంధాన్ని ఏర్పరచింది. నూరేళ్ళు ఒకరికొకరమై ప్రయాణం సాగిస్తాం. పిల్లాపాపలతోనే ఆనందమంటే, ఇక నుండి నాకో బుజ్జిబాబు రేవంత్ రూపంలో ఉన్నాడనుకుంటాను. అతని ప్రతి పనిని నేనే చేస్తాను. ఇంకా అత్తయ్య, మామయ్యలు నాకు అండగా నిలబడతారు. విడాకులనే అస్త్రంతో మా అనుబంధాన్ని త్రెంచివేయకండి. ఏమంటావ్ రేవంత్?” అని అడిగింది రేవతి.

అటునుండి ఫోనులో “రేవతి ఇష్టమే నా ఇష్టం” అంటూ పలికిన రేవంత్ మాటలు మధుర గానంలా వినిపించాయి రేవతికి.

********

Posted in September 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!