Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

అన్నీ ఉన్న విస్తరి అణగి మణిగి ఉంటుంది. ఏమీలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.

"తాతగారండీ! వచ్చేశానోచ్! నిన్న అక్క బామ్మ నడిగి కధ చెప్పించుకుంది. నేను మా ఫ్రండ్ ఇంటికి పార్టీ కెళ్ళాను కదా! అక్క బామ్మతో కథ చెప్పించుకుని నన్ను ఊరించి ఊరించి చెప్పిందిలెండి. అక్క రాకుండా వేగంగా నాకు కధ చెప్పేయరూ!" అంటూ వచ్చిన మనవడితో, "సరే కానీ నిన్న పార్టీ బాగా ఐందా!" అడిగారు తాతగారు.

"ఓ! ఐతే ఒక తమాషా జరిగింది. ముందుగా టేబుల్స్ మీద బనానా లీవ్స్ వేశారు లంచ్ వడ్డించను. ఎవరో వచ్చి ఫాన్స్ అన్నీ ఆన్ చేసేసరికి ఆ బనాన లీవ్స్ అన్నీ గాలికి ఎగిరి క్రింద పడ్డాయి. మళ్ళీ అవన్నీ కడిగి భోజనం వడ్డించాక ఫాన్స్ వేశార్లెండి."

"మరప్పుడు బనానా లీవ్స్ ఎగర్లేదా?"

"ఎలా ఎగురుతాయండీ! వాటి నిండా కూరలు, వడలూ, పప్పు, అన్నం ఇంకా చాలా వడ్డించారాయె."

"అందుకేరా ఈ సామెత వచ్చింది. "అన్నీ ఉన్న విస్తరి అణగి మణిగి ఉంటూంది, ఏమీలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది." అని."

"అంటే ఏంటి తాతగారు. కొంచెం వివరంగా చెప్పరూ?”

"ఒకమారు మేమంతా ఒక పుణ్యక్షేత్రానికి దర్శనం కోసం వెళ్లాం. అక్కడ చాలా మంది స్కార్వ్స్ ధరించి వచ్చిన వారికంతా దారి చూపుతూ ఇంకా అనేక విషయాల్లో సాయం చేస్తున్నారు. మా ఫ్రండ్ ఒకడు, “వీళ్ళంతా పెయిడ్ సర్వెంట్స్ అయి ఉంటారు. లేకపోతే ఇలా మన పాద రక్షలు చేత్తోపట్టుకుని సంచుల్లో ఉంచి మనకు టోకెన్స్ ఇవ్వడం, మళ్ళా వాటిని చేత్తో పట్టుకుని మనకు ఇవ్వడం, తోరణాలు కట్టడం, భోజనాలు వడ్డించడం, ఎంగిలాకులు తీసేయడం, చిమ్మడం, అంతా శుభ్రం చేయడం, ముఖ్యంగా రెస్ట్ రూమ్స్ కడగడం ఇవన్నీ ఇతరులెవ్వరూ చేయరు. ఈరోజు పెద్ద ఉత్సవం కనుక వారందరికీ వైట్ డ్రెస్ ఉచితంగా ఇచ్చి, ఈ స్కార్వ్స్ ఇచ్చి పనిచేయించుకుంటున్నారు. కనీసం ఈ ఒక్క రోజుకే వారందరికీ ఐదేసి వందలన్నా ఇస్తారు. లేకపోతే ఎవరు చేస్తారండీ!" అన్నాడు. నాకు మాత్రం వారంతా వాలంటీర్స్ అని అనిపించింది. లేకపోతే అంత మర్యాదగా చిరునవ్వు ముఖంతో చేయరు. ఐనా నాస్నేహితుని మాట ఎందుకు తీసేయాలి, కొద్దిసేపు ఉంటే యదార్ధం తెలుస్తుంది లెమ్మని ఊరుకున్నాను. సాయంకాలం దాకా అక్కడ జరిగే గాన సభలూ, సత్సంగాలూ అన్నీ ఆనందంగా వింటూ సాయంకాలం దాకా గడిపి ఆలయం చుట్టూ ఉన్న అనేక దర్శనీయ ప్రాంతాలు దర్శించి ఒకచోట కూర్చున్నాం. జనమంతా ఎక్కడ ఉంటే అక్కడికి ఆ వాలంటీర్స్ మజ్జిగా, మంచినీరూ అన్నీ సప్లై చేస్తూనే ఉన్నారు. చివరగా సాయంకాల హారతి అందుకుని బయటికి వస్తుండగా, నాస్నేహితుడు కాలు జారి పడ్డాడు, నేను ఊహించని పరిణామం కనుక అతడిని పట్టుకోలేకపోయాను. కొద్ది దూరంలో ఉన్న వాలెంటీర్స్ పరుగు పరుగున వచ్చి స్ట్రెచెర్ తెచ్చి అతడిని అక్కడ ఏర్పటు చేసిన ‘కెన్ ఐ హెల్ప్ యూ' అనే బ్యానర్ తో ఉన్న శిబిరానికి తీసుకెళ్లారు. "డాక్టర్ రావు గారిని పిలవండీ! అర్జంట్" అన్నారెవరో." రావు గారు రెస్ట్ రూమ్స్ క్లీన్ చేస్తున్నారండీ" అన్నారు మరొకరు. పోనీ డాక్టర్ వీరాజీ గారిని పిలవండి." అన్నారు." ఆయనా ఎంగిలాకులు ఎత్తేసి అక్కడ చిమ్ముతున్నారండీ" అని చెప్పారు. "మరి మురళీగారో !" ఆయన అందరికీ మజ్జిగ అందిస్తున్నారండీ." "ఓహ్! మన బీటెక్కులూ, యంటెక్కులూ, యంబియ్యేలూ నిష్పలం, వైద్యో నారాయణో హరిః" అనుకుంటూ ఉండగా రెస్ట్ రూమ్స్ క్లీన్ చేసిన వ్యక్తి వచ్చి గబగబా కాలు చూసి చికిత్సచేశారు. "ఏమి కంగారు లేదు. మా వాళ్ళు మిమ్మల్ని కార్లో ఇంటికి చేరుస్తారు. రెండురోజులు రెస్ట్ తీసుకోండి. తగ్గిపోతుంది. పడటం వలన కాలు డోక్కుపోయింది, అందుకని కొంచెం నెప్పి ఉంటుంది” అని ప్రేమపూర్వకంగా వైద్య సహకారం అందించారు. మావాడికి కళ్ళనీళ్ళ పర్యంతమైంది. "మన్నించండి సార్! మీరక్కడ రెస్ట్ రూమ్స్ కడుగుతుంటే ఎవరో అనుకున్నాను. అనుచితంగ ప్రవర్తిస్తే మన్నించండి." అని ఆ వైద్యుని చేతులు పట్టుకుని అన్నాడు. ఆయన చాలా కాజువల్గా "అదేం లేదండీ! మేం ప్రతి సంవత్సరం ఇలా సేవలు చేసి, కాస్త పుణ్యం సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటాం. అయినా మా భ్రమ కానీ, ఒక్కరోజు సేవకు పుణ్యం ఎలా వస్తుంది చెప్పండీ" అంటూ ఎంతో మర్యాదగా, భక్తిగా మృదువుగా మాట్లాడాడు. ఆ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు వెయ్యిరూపాయలుట. ఐతే ప్రతి ఆదివారం మాత్రం ఉచిత సేవలు అందజేస్తుంటారని తెలిసింది. మావాడు ఒక ఆఫీసులో క్లర్క్, నేను ఉపాధ్యాయుడ్ని. తిరిగి వచ్చేప్పుడు మాఫ్రండ్ అన్నాడు. అందుకే రా అన్నారు పెద్దలు "అన్నీ ఉన్న విస్తరి అణగి మణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అని."

ఇప్పుడు అర్థము అయిందా మనవడా పై సామెత?”

"ఓ బ్రహ్మాండంగా ఐంది తాతగారూ. వస్తామరి. ఈ రోజు నా ఖాతాలో కధ పడిపోయిందిగా. సెలవ్" అంటూ తాతకు బై చెప్పి వెళ్ళాడు.

Posted in June 2018, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!