ఒక మధ్యాహ్నం ముఖలింగానికి ఛాతీలో భరించలేని నొప్పి కలిగింది. పొరుగున ఉన్నాయన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళేడు. వార్త తెలియగానే కోటి పరుగున ఆసుపత్రి చేరుకొన్నాడు. ముఖలింగం ఆసుపత్రి చేరిన క్షణాల్లోనే గుండెపోటు మూలాన్న తుదిశ్వాస విడిచేడు. వార్త తెలిసిన వెంటనే నవరంగపట్నంనుండి నరసమ్మ బ్రహ్మన్నపురం చేరుకొంది. తండ్రి అంత్యక్రియలన్నీ, కోటి శ్రద్ధగా జరిపేడు. తల్లిని, చెల్లినీ, తన ఇంటికి మరల మారమని సలహా ఇచ్చేడు. ప్రస్తుతం ఉన్న ఇంట్లోనే ఉండడమా, లేక కొడుకు ఇంటికి మళ్ళీ వెళ్లిపోవడమా, అని గంగమ్మ ఆలోచనలో పడ్డాది. నరసమ్మను సంప్రదించింది. కొడుకు ఇంట్లో పడ్డ నరకయాతన మరువలేకపోతోంది. అన్నపూర్ణ కూడా అన్న ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. తన భర్త పోయిన ఇంట్లోనే, తన తనువు చాలించ తలచేనని చెప్పి, గంగమ్మ తనయుని మనసును నొప్పింపక ఒప్పించింది. తుదకు ఇద్దరూ ఉన్న చోటే ఉండడానికి నిర్ణయమయింది.
కోటి రెండు మూడు రోజులకొకసారి తల్లిని, చెల్లిని కలసి యోగక్షేమాలు కనుక్కొంటున్నాడు. క్రమంగా భార్య ప్రభావం వల్ల, నెలకొకసారి కూడా కలియడం అరుదయింది. తల్లీ, కూతురూ ఇరుగు పొరుగు వారి సాయంతో కాలం గడుపుతున్నారు. ఒక రాత్రి నిద్దట్లో గంగమ్మ పరలోకం చేరుకొంది. నరసమ్మకు ఆ విషయం తెలియడంలో జాప్యం జరిగింది. తత్కారణంగా గంగమ్మ చనిపోయిన తొమ్మిదవ రోజుకు బ్రహ్మన్నపురం చేరుకొంది. గంగమ్మ అంత్యక్రియలు ముగిసేయి. నరసమ్మ తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఆ రాత్రి అన్నపూర్ణ మేనత్త ఒళ్ళో తలపెట్టి, "నన్ను నీతో తీసుకుపో అత్తా." అని వెక్కి వెక్కి ఏడుస్తూ బ్రతిమలాడింది. నరసమ్మ మనసు కరిగిపోయింది. మేనకోడలును తనతో తీసుకుపోడానికి నిశ్చయించింది. మరునాడు తన నిర్ణయం మేనల్లుడుకి చెప్పింది. ప్రక్కనే ఉన్న, అనసూయ,"మీతో ఎందుకండీ. ఇది దాని అన్న ఇల్లు. ఏ ఇబ్బందీ ఉండదు.” అని ఒక నిగూఢమయిన ఆలోచనతో అన్నపూర్ణపై ప్రేమ ఒలకబోస్తూ కలుగజేసుకొంది. అన్నపూర్ణకు వంటలు బాగా వచ్చునని తెలిసి, వంటలక్కగా వాడుకోవచ్చని నాటకమాడింది. నరసమ్మకు అది నాటకమని తెలుసు. "కొన్నాళ్ళు నా దగ్గర ఉండనీ. దానికి కొంత మార్పు ఉంటుంది. తరువాత మీ దగ్గరకే వస్తుంది." అని ఎత్తుకు పై ఎత్తు వేసింది. కోటి ఆలోచించేడు. ఆ అవస్థలో చెల్లెలు ఆప్యాయంగా ఆదరించే వ్యక్తి వద్ద ఉండడం అవసరం. తను రోజంతా ఇంటిబయటనే ఉంటాడు. తన భార్య విషయం తనకు తెలుసు. అందుచేత అన్నపూర్ణ కొన్నాళ్లవరకు మేనత్త వద్ద ఉండడం మంచిదనుకొన్నాడు. మేనత్త అభిప్రాయంతో ఏకీభవించేడు. నరసమ్మ అన్నపూర్ణతోబాటు నవరంగపట్నం చేరుకొంది.
అన్నపూర్ణ భవిష్యత్తు గురించి నరసమ్మ తీవ్రంగా ఆలోచించసాగింది. కోటిగాడి దగ్గరకు దానిని శాశ్వతంగా పంపదలచుకోలేదు. అన్నపూర్ణ కూడా అన్న వద్దకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. మేనకోడలుకు వివాహమయ్యే అవకాశాలు లేవని నరసమ్మకు తెలుసు. తనకున్న కొద్దిపాటి ఆస్తి తన తదనంతరం దానికి వచ్చేటట్లు రాసిచ్చినా, బంధువులెవరయినా తమకు చెందుతుందని కేసు పెడితే, అమాయకురాలు అదేమి చేయగలుగుతుంది. అయితే దాని భవిష్యత్తు ఏమిటి. దానికేదయినా జీవనాధారం చూపించాలి. అన్నపూర్ణతో కలసి ఆలోచించింది. నవరంగపట్నం త్వరగా పెరుగుతోంది. భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు ఎక్కువవుతున్నాయి. వారికి ఇంటివద్ద వంటలు చేసుకోడానికి సమయం ఉండడం లేదు. అట్టివారికి భోజన సదుపాయం చేస్తే గిరాకీ ఉంటుంది. అన్నపూర్ణకు రుచికరమయిన వంటలు చేయడంలో అనుభవముంది. ఇవన్నీ ఆలోచించి, అన్నపూర్ణ కేటరింగ్ వ్యాపారం మొదలెడితే లాభకరంగా ఉంటుందని నిశ్చయానికి వచ్చేరు. తను కూడా మేనకోడలుకు పనిలో సాయం చేయదలచుకొంది. మంచిరోజు చూసుకొని అన్నపూర్ణ కేటరింగ్ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. మొదట్లో నలుగురయిదుగురితో ప్రారంభమయింది. రుచికరమయిన వంటలు అందజేస్తోందని నలుగురి నోటా పడ్డాది. వ్యాపారం ఊపందుకొంది. అన్నపూర్ణ బ్యాంకు ఖాతాలో నిల్వలు బాగా పెరుగుతున్నాయి. మేనకోడలు దాని కాళ్లమీద అది నిలబడ్డాదని నరసమ్మ సంతోషించింది.
రెండు మూడు సంవత్సరాలు గడిచేయి. నరసమ్మ ఆరోగ్యం ఆందోళనకు గురి అయింది. డాక్టరు సలహా మేరకు, నరసమ్మను పూర్తిగా విశ్రాంతి తీసుకోమని అన్నపూర్ణ చెప్పింది. ఆవిడ సేవకు ఓ నర్సును ఏర్పాటు చేసింది. వృత్తిలో తన సహాయానికి తనకు తెలిసిన సావిత్రమ్మను నియమించుకొంది. నరసమ్మ తన అవసానకాలం ఆసన్నమయిందని గ్రహించింది. తన ఆస్తిపాస్తులు ఎట్టి ఇబ్బందులు లేకుండా అన్నపూర్ణకు చెందే ఏర్పాట్లు చేయదలచింది. తనకు తెలిసిన ఒక లాయరుగారి సహాయంతో చట్టపరమయిన కట్టుదిట్టాలతో తన కోరిక నెరవేర్చుకొంది. ఒక సాయంత్రం నరసమ్మ సునాయాసంగా పరలోకం చేరుకొంది. అన్నపూర్ణ శోకసముద్రంలో మునిగిపోయింది. దారీ తెన్నూ లేని తన జీవితానికి ఒక దారి చూపిందని వాపోతూ, మేనత్త తనకు చేసిన ప్రతీ సాయం నెమరువేసుకొంది. మేనత్త మరణవార్త తెలిసి, కోటి నవరంగపురం వచ్చి, చెల్లిని ఓదార్చేడు. తనతోబాటు బ్రహ్మన్నపురం రమ్మన్నాడు. తన కేటరింగ్ వ్యాపారం వదలి రాలేనంది. కనీసం కొన్నాళ్ళకయినా రమ్మన్నాడు. అదికూడా కుదరదంది. ఆ సమయంలో వ్యాపారం దెబ్బతింటుందంది. చెల్లెలి తెలివితేటలను, అన్నయ్య మెచ్చుకున్నాడు. బరువయిన గుండెతో సరే అన్నాడు. పదిరోజులయ్యేక గృహోన్ముఖుడయ్యేడు. కోటి తరచూ చెల్లెలి యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు.
అటు పలాసలో కోటేశ్వరరావు బావమరిది, విలాసరావు మూడుపదులు దాటినా పనీపాట లేక ఉండడం తండ్రి రామచంద్రరావుకు సమస్యగా మారింది. కూతురుతోను, అల్లుడితోనూ మాట్లాడేడు. వృద్ధి చెందుతున్న వ్యాపారం దృష్ట్యా, తనకు తోడ్పడడానికి, బావమరిదిని తనవద్దకు రప్పించాలని కోటి ఆలోచించేడు. భార్య అనసూయ ఒత్తిడి కూడా తోడ్పడింది. విలాసరావు బ్రహ్మన్నపురంలో అడుగుపెట్టేడు. అనసూయ ఆనందానికి హద్దులు లేకపోయాయి. ఇద్దరూ రోజూ సినిమాలకు, షికార్లకు వెళ్ళ నారంభించేరు. కోటి వారం పదిరోజులు చూసేడు. తను జోక్యం చేసుకోకపోతే, విలాసరావును రప్పించండం వృధా అవుతుందనుకొన్నాడు. ఒకరోజు ఉదయం, విలాసరావును తనతో సైటుకు రమ్మన్నాడు. అనసూయ, "మొన్ననే కదా వచ్చేడు. ఓ పదిరోజులు పోనీండి." అని చిరునవ్వుతో చెప్పింది. కోటి ఇహ ఆలస్యం చేస్తే, చెయ్యి దాటిపోతుందనుకొన్నాడు. "విలాస్, పది నిమిషాల్లో తయారవు. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను." అని, నొక్కి చెప్పేడు. చెప్పవలసిన రీతిలో చెప్పడంతో, కిమ్మనకుండా పది నిమిషాలలో తయారయి, బావగారితోబాటు సైటుకు వెళ్ళేడు. అది రోజూ అలవాటయింది. క్రమంగా వృత్తిలో బావగారికి తోడ్పడసాగేడు. కోటికి కొంత సహాయమయింది.
కొన్నాళ్ళకు బావగారితో మాట్లాడి, విలాసరావు సిమెంటు మొదలగు భారీ కొనుగోళ్లు స్వయంగా చేయనారంభించేడు. అలా రెండేళ్లు గడిచేయి. అలా సాఫీగా వెళుతున్న వ్యాపారానికి ఊహించని సమస్యలెదురయ్యేయి. కోటి ఈ మధ్యన నిర్మించిన కట్టడాలన్నీ నాణ్యత లోపించినట్లు ఫిర్యాదులొచ్చేయి. చాలా అపార్టుమెంటుల్లో గోడలు బీటలువారేయి. ఫ్లోరింగుల పరిస్థితీ బాగులేదు. కొనుగోరుదార్లు కోటిని స్వయంగా కలసి ఫిర్యాదు చేసేరు. వెంటనే తగురీతిని వాటిని బాగుచేయించెదనని వాగ్దానం చేసి జరుగుతున్న పనులు ఆపి, ఆ పనులు వెంటనే చేపట్టేడు. అనుకోని ఆ పరిణామంతో కొత్త ప్రోజెక్టు ఏదీ ప్రారంభింపలేకపోయేడు. ఆ ప్రాజెక్టులలో అడ్వాన్సు ఇచ్చిన వారు తమ సొమ్ము వాపసు తీసుకొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పోటీలేని కోటీశ్వరరావు, ఇమేజ్ చెడిపోవడంతో, మార్కెట్ లో నిలవలేకపోతున్నాడు. ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది.
నాణ్యతకు పేరుగాంచిన తను నిర్మించిన ఎపార్టుమెంట్ల నాణ్యత, ఎందుకు దిగజారిపోయిందో కోటికి బోధపడలేదు. కారణమేమని పనివాళ్లతో చర్చించేడు. నిజానిజాలు చెప్పడానికి వారికి ధైర్యం చాలలేదు. ఇద్దరు మేస్త్రీలు, కోటిని ప్రత్యేకంగా అతని కేబిన్ లో కలుసుకొని జరిగినదంతా చెప్పేరు. అందులో తేలిందేమిటంటే - విలాసరావు సిమెంటు మొదలగు కొనుగోళ్లు, ఇదివరకు నాణ్యమయిన సామగ్రి సప్లై చేస్తున్నవారిని తప్పించి, నాణ్యతలేని చవకరకం సామగ్రి కొననారంభించేడు. ఒకరిద్దరు మేస్త్రీలు, విలాసరావుకు సామగ్రి నాణ్యత లోపిస్తున్నాదని చెప్పినా లాభం లేకపోయింది. అది కోటేశ్వరరావు సలహాతోనే చేస్తున్నాని విలాసరావు చెప్పడంతో, వారు మరి నోరెత్తలేదు. అది విని కోటి నిర్ఘాంతపోయేడు. ఎకౌంట్స్ పుస్తకాలు తనిఖీ చేసేడు. కొనుగోళ్లలో మార్పు, విలాసరావు అధీనంలోకి వచ్చిన ఏడాది నుండి ప్రారంభమయింది. విలాసరావు చేసిన కొనుగోళ్లు 10 కోట్లకు పైనే ఉన్నాయి. స్వంత బావమరిదని, విలాసరావును శంకించకపోవడం, తన తెలివితక్కువని, తనని తాను నిందించుకొన్నాడు. కాని చెయ్యి దాటిపోయింది. విలాసరావు కొన్ని లక్షలు కాజేసి ఉంటాడనుకొన్నాడు. అవి ఎక్కడ ఉంచి ఉంటాడు. అంత సొమ్ము ఇంట్లో ఉంచడు. తప్పక బ్యాంకులో పెట్టుంటాడు. కోటి తన ఎకౌంటెంటును బ్యాంకుకు వెళ్లి, క్రింది లెవెల్ ఉద్యోగులను మేనేజ్ చేసి, విలాసరావు బ్యాంకు ఎకౌంట్ వివరాలు సేకరించమన్నాడు. ఎకౌంటెంటు కావలిసిన ఆరా తీసేడు. విలాసరావు దఫదఫాలుగా చేసిన ఫిక్సిడ్ డిపాజిట్ల విలువ 52 లక్షలని తెలిసింది. అది విన్న కోటి, ఆలస్యం చేయకూడదనుకొన్నాడు.
విలాసరావుకు చూచాయగా, బావగారు తనను అనుమానిస్తున్నారని తెలిసి, రెండు గంటల ముందుగానే ఇల్లు చేరేడు. అక్కతో తను అర్జెంటు పనిమీద పలాస వెళ్లాలని చెప్పి, తొందరగా ప్రయాణ సన్నాహాలవుతున్నాడు. అక్కతో తన ఫ్రెండుకు సీరియస్ గా ఉందన్నాడు. కోటి తన కేబిన్ నుండి నేరుగా సైటుకు వెళ్ళేడు. విలాసరావు చాలా సేపటి క్రితమే ఇంటికి వెళ్లేడని తెలిసి, హుటాహుటిన ఇల్లు చేరుకొన్నాడు.
తలుపుతీసిన అనసూయను, "ఆ విలాస్ గాడు ఎక్కడున్నాడు." అని బిగ్గరగా అడిగేడు. అనసూయకు భర్త ప్రవర్తన బోధపడలేదు. "వాడి గదిలో ఉన్నాడు. అర్జెంటు గా పలాస వెళ్ళాలిట."
"వాణ్ణి నేను పంపిస్తాను. పలాసకు కాదు. జైలుకి." అని అంటూ, విలాసరావు గది చేరుకొన్నాడు. విలాసరావు పెట్టి పట్టుకొని తయారుగా ఉన్నాడు: పలాస పయనానికి.
"ఒరేయ్, ఆ పెట్టి ఓపెన్ చెయ్." అని, గట్టిగా అరిచేడు.
"అదేమిటండి, అలా మాట్లాడుతున్నారు." అని, అనసూయ అనగానే,
"నువ్వు నోర్ముయ్. ఇవాళ నీ సంగతి కూడా తేలుస్తాను." అని అనడంతో అనసూయ కిక్కురుమనకుండా ఊరుకొంది.
"నువ్వు మర్యాదగా పెట్టి ఓపెన్ చేస్తావా, లేక, పైన పోలీసులున్నారు: వాళ్ళ చేత చేయించమంటావా." అని, వార్నింగ్ ఇచ్చేడు, బావమరిదికి.
తప్పనిసరై, విలాసరావు పెట్టి ఓపెన్ చేసేడు. కోటి పెట్టిలోని బట్టలన్నీ తీసి కింద పడేసేడు. వాటినుండి ఒక కవరు కిందకు జారింది. కోటి దానిని తీసుకొని ఓపెన్ చేసేడు. అందులో విలాసరావుకు చెందిన ఫిక్సిడ్ డిపాజిట్ల రశీదులున్నాయి.
"ఎక్కడినుండి వచ్చింది, నీకీ సొమ్ము." అని దమాయించి అడిగేడు కోటి.
జవాబు లేదు.
"విలాస్, అదేదో బావగారికి చెప్పు." అని సలహా ఇచ్చింది, అనసూయ.
"వాడేమిటి చెప్తాడు. నేను చెప్తాను విను, నీ తమ్ముడి ఘనకార్యం." అని, జరిగినదంతా వివరంగా చెప్పేడు.
"నీ మంచికోరి, నీకొక దారి చూపించిన మాకే ఇంత నమ్మకద్రోహం చేస్తావనుకోలేదురా." అని తమ్ముని ఛీదరించుకొంది.
కోటి తనతోబాటు విలాసరావును బ్యాంకుకు తీసుకెళ్ళేడు. ఫిక్సిడ్ డిపాజిట్లన్నింటిని కేన్సిల్ చేసి, ఆ మొత్తం సొమ్మును కంపెనీ ఖాతాలోనికి జమ చేయడం జరిగింది.
జరిగినదంతా తండ్రికి తెలియజేసింది, అనసూయ. విలాసరావు పలాస చేరుకొన్నాడు.
విలాసరావు బ్రతుకు 'ఎక్కడ వేసిన గొంగళి, అక్కడే' అయింది.
బ్రహ్మన్నపురానికి కొత్తగా వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల పోటీకి కోటి తట్టుకోలేకపోతున్నాడు. దానికి తోడు, బావమరిది ధర్మమా అని, ఉన్న మంచిపేరు మంట కలిసింది. కొత్త ప్రోజెక్టు అవకాశాలు అగుపడడం లేదు. కట్టిన కట్టడాల రిపేర్లకు, దండిగా ఖర్చయింది. వాటన్నిటి దృష్ట్యా వ్యాపారం కోసం మరో ఊరుకు మారదలచుకొన్నాడు. చెల్లెలు ఏకాకి అయ్యేక, చూడడానికి నవరంగపట్నం నాలుగయిదు మార్లు వెళ్ళేడు. ఆ ఊరు పెరుగుదల కళ్లారా చూసేడు. వ్యాపారానికి అక్కడ మంచి అవకాశాలున్నాయనుకొన్నాడు. పెట్టుబడులే సమస్య. ఆలోచించేడు. ముందుగా, ఈ ఊళ్ళో మొదలుపెట్టినట్లు, ఇళ్ల రిపైరు వర్కులు కొన్ని చేసి, నాణ్యతకు పేరు తెచ్చుకోవాలి. దానివల్ల కొంత మదుపు కూడా సమకూరుతుంది. ఒక ఏడాది తరువాత, పరిస్థితిని బట్టి భవిష్యత్ప్రణాళికలు ఆలోచించవచ్చుననుకొన్నాడు. కొన్నాళ్ళు చెల్లెలి ఇంట ఉండవచ్చును. అలా ఆలోచించి, నవరంగపట్నం వెళ్ళ నిశ్చయించేడు.
కోటి గంపెడాశతో, నవరంగపట్నంలోని చెల్లెలి ఇంట అడుగుపెట్టేడు. అన్నపూర్ణ అన్నను ఆప్యాయంగా ఆహ్వానించింది.
"రా, అన్నయ్యా. వదిన, పిల్లలూ బాగున్నారా."
"అందరూ బాగానే ఉన్నారమ్మా.'' అని ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే ,
"అన్నయ్యా, తొందరగా కాళ్ళూ, చేతులూ కడుక్కొని రా. ఇప్పుడే వంట అయింది. వేడి వేడిగా తిందుగానివి. అనుకోకుండా నీకిష్టమయిన బంగాళాదుంపల మసాలా కూర చేశాను."
చెల్లెలి ఆప్యాయత, కోటిని సిగ్గులో ముంచేసింది. భోజనాలవద్ద చెల్లెలుతో మాట్లాడుతూ,
"చెల్లమ్మా, అత్త పోయిన తరువాత నీకు ఒంటరితనం బాధిస్తున్నాదనుకొంటాను."
"చాలా రోజులు ఏకాకినాయిపోయేనని బాధపడ్డాను. కాని, క్రమేణ అలవాటుపడ్డాను."
"నువ్వు కేటరింగు రెండుపూట్లా చేస్తావా."
"లేదు. ఒక్కపూటే."
"సాయంత్రం ఖాళీగా ఉంటావన్నమాట. సాయంత్రాలు నీకెలా ఊసుపోతుంది."
"దగ్గరలో దేవాలయమొకటుంది. సాయంత్రాలు అక్కడకు వెళుతూ ఉంటాను. అక్కడ, పూజారిగారు రోజూ ఏవో నాలుగు మంచిముక్కలు చెపుతూ ఉంటారు. అవి విని, ఇంటికొచ్చి భోంచేసి పడుకొంటాను."
అన్నా, చెల్లెళ్ళ భోజనాలయ్యేయి. ఇద్దరూ ముందుగదిలో సోఫాలో కూర్చున్నారు. అన్నతో కలసి భోజనం చేస్తూ మాట్లాడుకోడంతో అన్నపూర్ణ మనసు వికసించింది. వచ్చినప్పటినుండి, అన్న ఎప్పటివలె హుషారుగా లేకపోవడం అన్నపూర్ణ గమనించింది. ఏదో పరాకుగా ఉన్నట్లు తోచింది.
"అన్నయ్యా , నువ్వు ఏమిటి కొంత డల్ గా ఉన్నావు. ఒంట్లో బాగానే ఉందా." అని అనుమానం తీర్చుకోబోయింది. కోటేశ్వరరావు కళ్ళ నీళ్లు కారేయి.
అన్నపూర్ణ, గాభరాపడి, అన్న దరి చేరి, పైట కొంగుతో కన్నీళ్లు తుడిచి,
"అన్నయ్యా , ఏమిటయింది. వదిన, పిల్లలు క్షేమంగానే ఉన్నారా. చెప్పన్నయ్యా , ఏమిటయిందో." అని అన్నను ఓదారుస్తూ అడిగింది.
"అందరూ బాగానే ఉన్నారమ్మా. నా రోజులే బాగులేవు."
"రోజులు బాగులేకపోవడమేమిటి. బిజినెస్ లో ఏవయినా ఇబ్బందులొచ్చేయా."
"అవునమ్మా బిజినెస్ నాశనమయిపోయిందమ్మా." అని మళ్ళీ కంట తడిపెట్టుకొన్నాడు.
"ఏమిటయిందన్నయ్యా ." అని ఓదారుస్తూ, కళ్లనీళ్లు తుడిచి, అన్నయ్య అరచేతిని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని అడిగింది.
కోటి జరిగినదంతా చెల్లెలుకు వివరంగా చెప్పేడు. బ్రహ్మన్నపురంలో తన బిజినెస్ కు అన్ని ద్వారాలు మూసుకుపోయేయన్నాడు.
"అన్నయ్యా, బెంగ పడకు. నీ బిజినెస్, బ్రహ్మన్నపురంలో కాకపొతే, మరో ఊర్లో చేసుకోవచ్చును. నీది చాలా పెద్ద బిజినెస్. నేను ఏ చిన్న సాయం చేయగలిగినా తప్పక చేస్తాను."
"ఆ ధైర్యంతోనే వచ్చేనమ్మా.”
"నేను ఏ సాయం చేయగలనో చెప్పన్నా."
కోటి తన ప్రణాళిక చెప్పి, "వ్యాపారంలో నిలదొక్కుకునే దాకా కొన్నాళ్ళు నీ దగ్గర ఉందామనుకొంటున్నాను. నీకు వీలవుతుందా, చెల్లెమ్మా." అని, ఏదో తప్పు చేసినవాడిలా సంకోచిస్తూ అడిగేడు.
"ఏమిటన్నయ్యా, అలా అడుగుతున్నావ్. నేను నీకు పరాయి దానినా. ఇది నీ చెల్లెలి ఇల్లు అనుకోకు. ఇది మన ఇల్లు. నువ్వు నా దగ్గర ఉంటే, నాకంతకన్నా కావలసినదేమిటి. నువ్వు నా దగ్గరే ఉండు." అని నొక్కి చెప్పింది.
అన్నపూర్ణ, అన్నకొరకు, ఒక గది శుభ్రపరచి, కావలిసిన సదుపాయాలన్నీ సమకూర్చింది. చెల్లెలి ఆప్యాయతకు సంతసిస్తూ, ఆమె విశాలహృదయానికి, మనసులో జోహార్లు చెప్పుకొన్నాడు.
ఒక వారం గడిచింది. ఇళ్ల రిపైర్లకొరకు తను చేస్తున్న ప్రయత్నాలు ఫలవంతం కాలేదు. ఒకరోజు పనిచేస్తూ, సావిత్రమ్మ తను ఉంటున్న ఇంటియజమాని, ఇల్లంతటిని రిపైరు చేయదలచేనని, అందువలన అద్దెకున్న నాలుగు కుటుంబాలను కొద్దిరోజులకొరకు, ఇల్లు ఖాళీ చేయాలని తెలియజేసేడని అన్నపూర్ణకు చెప్పి, తను ఇళ్ల వేటలో ఉన్నానంది. అన్నపూర్ణ ఆ విషయం అన్నకు చెప్పి, తక్షణం, సావిత్రమ్మ ఇంటి యజమానిని కలియమంది. కోటి ఆలస్యం చేయలేదు. తక్షణం సావిత్రమ్మ ఇంటి యజమాని కోదండరామయ్యను కలిసేడు. ఫలించింది. కోటేశ్వరరావు బేరాలకు తావివ్వక, రిపైరు పనులు పూర్తయ్యేక, తను ఇచ్చిన కొటేషనులోని మొత్తాన్ని ఎంత తగ్గించినా, ఆమోదిస్తానన్నాడు. పనులు ప్రారంభించేడు. ఆరు వారాలలో పూర్తి చేసేడు. కోదండరామయ్య ఇల్లు, నూతన నిర్మాణం లాగ తయారయింది. కోదండరామయ్య చాల సంతోషించేడు. కోటేశ్వరరావు కోరిన మొత్తం ఇచ్చినా ఎక్కువ కాదనుకొన్నాడు. ఒక వెయ్యి రూపాయిలు తగ్గించి ఇస్తానన్నాడు. కోటి సంతోషంతో పుచ్చుకొన్నాడు. కోదండరామయ్య మిత్రులు అతడి ఇంటిని చూసి ఆశ్చర్యపోయేరు. కోటి పని నాణ్యత నలుమూలలా ప్రాకింది. చేతినిండా పని దొరికింది. అతి త్వరలో అన్న పొందిన అభివృద్ధి, అన్నపూర్ణకు ఆనందాన్నిచ్చింది. కోటి ప్రతి ఆదివారము బ్రహ్మన్నపురం వెళ్లి, భార్యా బిడ్డలకు కావలిసిన సౌకర్యాలు సమకూరుస్తున్నాడు. చెల్లెలు తనయెడ చూపిస్తున్న అనురాగము, తరచూ అనసూయ, పిల్లల క్షేమసమాచారం తెలియగోరడం, అనసూయకు తెలియజేసేడు. అనసూయ మనసులో అన్నపూర్ణయెడ తాను తప్పు చేసినట్లు భావించింది.
కోటి, తను గడించిన ఖ్యాతి సద్వినియోగం చేసుకొని, డెవలప్మెంట్ దిక్కు అడుగు పెట్టాలనుకొన్నాడు. బావమరిది నుండి వసూలు చేసిన సొమ్ముతో కూడి, కోటి వద్ద సుమారు ఒక కోటి రూపాయిలున్నాయి. జాగా కొని, ఎపార్టుమెంట్లు కట్టనారంభిస్తేగాని, ఎవరూ ఎడ్వాంసిచ్చి బుక్ చేసుకోరు. కోటి రూపాయిలు దానికి సరిపోవు. ఆలోచించేడు. చెల్లినడిగి ఆమె సమ్మతిస్తే, ఆమె పెరడులో నున్న జాగాలో ఉన్న మూడు గదులు, చెట్లు నేలమట్టం చేసి, ఎనిమిది ఎపార్టుమెంట్లు కట్టవచ్చును. చెల్లికి నాలుగు ఎపార్ట్మెంట్లిచ్చి, తను నాలుగు తీసుకోవచ్చును. తన వాటా విలువతో చెల్లెలి జాగా విలువ చెల్లించవచ్చును. అలా చేస్తే, ముందుగా ఎక్కువ సొమ్మిచ్చి జాగా కొననక్కరలేదు. అది సక్సెస్ అయితే బ్యాంకునుండి అప్పు పొందడానికి అవకాశాలుంటాయి. చెల్లెలితో విషయం చర్చించేడు. అన్నపూర్ణ అన్నకు మద్దత్తు పలికింది. ఎట్టి పరిస్థితిలోను చెల్లెలకు అన్యాయం జరగకూడదని తలచి, లాయరు సహకారంతో తగు న్యాయపరమైన పత్రం తయారు చేయించి, చెల్లెలు, ఎంత వద్దన్నా, అందజేసేడు.
కోటి పని ప్రారంభించేడు. కస్టమర్లకు తన పని నాణ్యత తెలియజేయడానికి, ముందుగా నమూనాగా ఒక ఎపార్ట్మెంటు నిర్మించేడు. తన ఆశయం ఫలించింది. తన వాటాకు రావలిసిన మిగిలిన మూడు ఎపార్టుమెంట్సు బుకింగు అయిపోయేయి. చేతిలో ఎడ్వాన్సు సొమ్ము పడ్డాది. చెల్లెలిని, ఆమె వాటా ఎపార్టుమెంట్లకు, ఇంకా మంచి ధర వచ్చేక అమ్మవచ్చునన్నాడు. ఎపార్టుమెంట్లు కొనదలచినవారు, కోటి చేబట్టే తరువాత ప్రోజెక్టుకు వేచి చూస్తున్నారు.
అన్నపూర్ణ ఇంటి వెనుక జాగాలో ఎనిమిది ఎపార్టుమెంట్సు వెలిసేయి. వాటి సింహద్వారం, వెనుక వీధినుండి ఏర్పడింది. అన్నపూర్ణకు, తను నివసిస్తున్న భాగంలో కూడా ఎపార్టుమెంట్లు నిర్మిస్తే, ఉండడానికి తనకు సౌఖ్యమవుతుందనుకొంది. అంతే కాక, అన్నకు కూడా మరికొన్ని ఎపార్టుమెంట్లు వస్తాయి. అన్నతో తన ఆలోచన పంచుకొంది. కోటికి ఆ ఆలోచన నచ్చింది. అన్నపూర్ణ ప్రస్తుతం ఉన్న ఇంటి జాగాలో ఆరు ఎపార్టుమెంట్లు కట్టవచ్చుననుకొన్నాడు. చెల్లెలి వాటాకు రావలిసిన మూడు ఎపార్ట్మెంట్లలో, రెండింటిని కలిపి, ఆమెకు కావలిసిన సకల సౌకర్యాలతో ఒకే ఎపార్ట్మెంటు నిర్మించదలిచేడు. అన్నపూర్ణకు ఆ ఆలోచన బాగా నచ్చింది. అన్నపూర్ణ తాత్కాలికంగా పెరటిలో తన ఎపార్ట్మెంట్లలో ఒక దానికి మారింది. తలచిన పని ప్రారంభమయింది.
ఒకరోజు అన్నపూర్ణ, "అన్నయ్యా, వదినా, పిల్లల్ని, ఎన్నాళక్కడ ఉంచుతావ్. వాళ్ళకీ నీతో గడపాలని ఉంటుంది కదా. నేను నీకు చెప్పేనంతటిదానిని కాదు. నా ఉద్దేశంలో నలుగురూ ఒకే చోట ఉండడం మంచిది. నీకు తగిన ఇల్లు కట్టుకొనేదాకా, నా ఎపార్టుమెంట్లు రెండింటిలో ఉండవచ్చు." అని అన్నయ్యకు నచ్చచెప్పింది. కోటికి ఆ సలహా నచ్చి, బ్రహ్మన్నపురం వెళ్ళేడు. అన్నపూర్ణ సలహా అనసూయకు చెప్పేడు. ఏ అన్నపూర్ణకు తాను అన్యాయం చేసిందో, ఆ అన్నపూర్ణ తన క్షేమం ఎంతగా కోరుకొంటూందో తెలిసి అనసూయ పశ్చాత్తాప పడ్డాది. కోటి చెల్లెలి సలహా అమలుచేసేడు. అనసూయలో మార్పు వచ్చింది. ఆడబడుచుతో, సరదాగా గడుపుతోంది. కోటి, చెల్లెలికి దగ్గరగా నివసించ ఆలోచించేడు. చెల్లెలుకు తలపెట్టిన ఎపార్ట్మెంటు పైన, తన వాటాలో రెండు ఎపార్టుమెంట్లు కలిపి, తనకు నచ్చినట్లు పెద్ద ఎపార్ట్మెంటు నిర్మించదలచేడు. అది తెలిసిన అన్నపూర్ణ ఆనందానికి అంతులేకపోయింది.
కోటి వ్యాపారం ఊపందుకొంది. అతిత్వరలో సంపన్నుడయ్యేడు. చిన్ననాటి రోజులు జ్ఞప్తికి తెస్తూ, చెల్లెలితో సరదాగా గడుపుతున్నాడు. అనసూయ, పిల్లలు కూడా ఆ సంతోషాన్ని పంచుకొంటున్నారు.