Menu Close
Garimella Venkata Lakshmi Narasimham
అన్నా చెల్లెళ్ళ అనుబంధం (కథ)
-- గరిమెళ్ల వెంకట లక్ష్మి నరసింహం --

బ్రహ్మన్నపురం ఒక చిన్న పట్టణం. ఆ ఊళ్ళో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధాకరరెడ్డి వద్ద ముఖలింగం ఎకౌంటెంటుగా పని చేస్తున్నాడు. అతడు సుధాకరరెడ్డికి బాగా నమ్మకస్తుడు. ఆఫీసు వ్యవహారాలు అన్నీ గోప్యంగా ఉంచుతాడు. ఆ విషయాలు ఇంటివద్ద ఎప్పుడూ మాట్లాడడు. ముఖలింగం భార్య గంగమ్మకు దైవభక్తి ఎక్కువ. రోజూ సాయంత్రం దేవాలయానికి వెళ్లి గుళ్లో ఉన్న ఆరుగురు దేముళ్ళకు వంగి నమస్కరించి, ప్రవచనాలు చెబుతున్న పూజారిగారి సమక్షంలో ఆశీనురాలవుతుంది. ఆ గోష్ఠి అయ్యేక ఆయన ఇచ్చిన ప్రసాదం, ఓ అరటిపండు అందుకొని ఇంటికి వెళుతుంది. రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ముఖలింగం ఇల్లు చేరి, ఇల్లాలు పెట్టిన వేడి వేడి భోజనం ఆరగించి పక్కమీద వాలుతాడు. ముఖలింగం, గంగమ్మ దంపతుల సంతానం; ఒక మగ, ఒక ఆడ. కొడుకు కోటేశ్వరరావు పనుల్లో చురుకు; చదువంటే బెరుకు. లెక్కల చిక్కులు విప్పలేక, తొమ్మిది దాటలేక, చదువులతల్లి వద్ద శలవు తీసుకొన్నాడు. అమ్మాయి అన్నపూర్ణ, తెలివయినదే గాని, ఏడవ తరగతిలో నుండగా రజస్వల అయిన కారణంగా పెద్దలు ఇక వద్దన్నారు. తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ, పాకశాస్త్రంలో తరిఫీదు పొందుతోంది.

ముఖలింగం దంపతులకు ఇద్దరు పిల్లల భవిష్యత్తు విషయంలోను ఆందోళన ప్రారంభమయింది. కొడుకు కోటీశ్వరరావుకు చదువు అబ్బలేదు. వాడి చదువుకు ఏ ఉద్యోగమూ దొరకదు. వాడు ఎలా బ్రతుకుతాడని బెంగ. అమ్మాయి అన్నపూర్ణకు చిన్నప్పుడు మసూచికం సోకి ముఖం నిండా స్ఫోటకం మచ్చలు ఏర్పడ్డాయి. అది దాని పెళ్ళికి పెద్ద ఆటంకం అవుతుంది. ఆర్థికంగా పెద్ద కట్నాలు ఇచ్చే స్థోమతు లేదు. రెడ్డిగారిని బ్రతిమలాడితే ఏదో కొద్దిపాటి సాయం చెయ్యొచ్చు. దానితో పెళ్లి నడవదు. ఒకరోజు భర్త తీరికగా ఉన్న సమయం గమనించి, గంగమ్మ ఆయన దరి చేరి,

"ఏమండీ, మన కోటిగాడి విషయం ఏమయినా ఆలోచించేరా. వాడికేదో బ్రతుకుదారి చూపించాలికదా.” అని అడిగింది.

"గంగా, నేనూ ఆలోచిస్తున్నాను. వాడి చదువుకు ఏ ఉద్యోగమూ దొరకదు. ఏమిటి చెయ్యడమా అని. ఏదీ పాలుపోడం లేదు."

"రెడ్డిగారిని బ్రతిమలాడితే ఆయన ఆఫీసులో ఏదయినా చిన్న పనిలో పెడతారేమో."

"మా ఆఫిసులోని ఏ పనులూ వాడికి చేతకావు గంగా. ఇంగ్లీషులో ఉత్తరాలు రాయాలి. రోజూ లెక్కలన్నీ రాసి, సార్ కి ఖాతాలన్నీ చూపించాలి. అవి తప్ప మరే చిన్నపనులూ ఉండవు. అయినా నువ్వు అన్నట్లు వాడికో బ్రతుకుదారి చూపాలి గదా. ఆలోచిస్తాను. బెంగపడకు." అని భార్యకు ధైర్యం చెప్పేడు ముఖలింగం.

"ఏమండీ, వాడికి ఆఫీసు పని చేతకాకపోవచ్చు. ఎలక్ట్రికల్ పన్లు నేర్పిస్తే; వాటికి చదువులేవీ అక్కరలేదు కదా. అవి బాగా నేర్చుకొంటే బ్రతకడానికి ఇబ్బంది ఉండదు. మీదగ్గర చాలామంది ఎలక్ట్రికల్ వాళ్ళు పని చేస్తూంటారు గదా. వాళ్ళ దగ్గర మనవాడు పని నేర్చుకొంటే కొన్నాళ్ళకు వాడూ ఎలక్ట్రికల్ పనివాడయి వాడంతట వాడు బ్రతకగలడు. ఏమంటారు."

"నువ్వు చెప్పింది బాగుంది. ఉన్న పరిస్థితులలో నువ్వు బాగా ఆలోచించేవ్. వాణ్ణి అడిగి చూడు, ఏమంటాడో."

"అడగడానికి ఏమిటుందండి. అయినా అడిగి చూస్తాను." అని, ఆ సంభాషణకు తెర దింపింది గంగమ్మ.

గంగమ్మ కొడుకు వద్ద ఆ విషయం లేవనెత్తింది.

"అమ్మా, అది ఒక చోట కూర్చుని చేసే పని కాదు. బేగు పట్టుకొని ఇంటింటికీ వెళ్ళాలి. పని చేయించుకొన్నాక బేరాలాడతారు. నాకవన్నీ నచ్చవ్.” అని తన విముఖత కోటిగాడు తల్లికి చెప్పేడు.

"ఇంటింటికీ వెళ్లడం ఎందుకు. నాన్నగారు చెబితే రెడ్డిగారు ఆయన దగ్గరే వేసుకొంటారు." అని తన అభిప్రాయం చెప్పింది, గంగమ్మ.

"అమ్మా, నాకా పని ఇష్టం లేదమ్మా. నువ్వు, నాన్న బెంగపడకండమ్మా. ఏదో చేస్తాను కదా. నాకేదీ చేతకాకపోతే, నువ్వు చెప్పినట్లు ఎలెక్ట్రికల్ పని నేర్చుకొంటాను. సరేనా." అని, తల్లికి అభయమిచ్చేడు, కోటిగాడు.

కొడుకు అభిప్రాయం తండ్రికి చేరింది.

ముఖలింగానికి ఓ చెల్లెలు ఉంది. పేరు, నరసమ్మ. నవరంగపట్నం నివాసి. ఆవిడ భర్త గోవిందం పౌరోహిత్యంలో నాలుగు రాళ్లు సంపాదించేడు. పిత్రార్జితమయిన నాలుగు గదుల ఇంట్లో ఉంటూ, విశాలమయిన పెరట్లో క్రమ క్రమంగా వేరు వేరుగా మూడు గదులు కట్టించి అద్దెకిచ్చేడు. ఇంటివెనుకనున్న పెరడు, వెనకవీధి వరకు వ్యాపించి ఉంది. అందులో ఒక మామిడి చెట్టు, ఒక జామిచెట్టు, నాలుగు అరటిమొక్కలు ఉన్నాయి. అన్నా చెల్లెళ్ళ కుటుంబాలు తరచూ కలుస్తూ ఉంటారు. చెల్లెలి ఇంటికి ముఖలింగం ఉత్తిచేతులతో ఎప్పుడూ వెళ్ళడు. నరసమ్మ, అన్నయ్యను వదినను ఎక్కువగా గౌరవిస్తుంది. వారి పిల్లలిద్దరినీ అభిమానిస్తుంది. నరసమ్మకు పిల్లలు లేరు. మూడు సంవత్సరాల క్రితం గోవిందం ఓ రైల్వే ఏక్సిడెంటులో తనువు చాలించేడు. నరసమ్మకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ఆవిడ ఆ సొమ్మును బ్యాంకులో భద్రపరచుకొంది. తను నివసిస్తున్న ఇంట్లో కొద్దిపాటి మార్పులు చేసి, రెండు గదులు అద్దెకిచ్చింది. ఆ ఏర్పాట్లన్నీ ముఖలింగం సలహా మీదే జరిగేయి. ఆ మార్పులన్నీ ముఖలింగం దగ్గరుండి చేయించేడు.

ముఖలింగానికి కేశవరావు అనే చిన్ననాటి స్నేహితుడున్నాడు. బ్రహ్మన్నపురంలోనే ఓ లాయరువద్ద గుమస్తాగా ఉన్నాడు. ఊరి పొలిమేరల్లో పిత్రార్జితమయిన ఓ చిన్న ఇంట్లో ఉంటున్నాడు. అతని భార్య, పద్మావతి ఆరవతరగతి వరకు చదువుకుంది. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు రాంబాబు. రెండోవాడు కృష్ణారావు. రాంబాబు, కోటేశ్వరరావు వయసువాడే. రెండోవాడు రెండేళ్లు చిన్నవాడు. కేశవరావు పిల్లలిద్దరూ డిగ్రీ చేసేరు. చాలా విషయాల్లో కేశవరావు మిత్రుని సలహాలు పాటిస్తాడు. పిల్లలిద్దరి ఉద్యోగ ప్రయత్నాలలో వీలయినంతవరకు గవర్నమెంటు ఉద్యోగాలే ప్రయత్నించమని ముఖలింగం సలహా ఇచ్చేడు. ఆ సలహా ఫలించింది. పెద్దవాడు రైల్వేలో గుమస్తాగా కోల్కత్తాలో పనిచేస్తున్నాడు. రెండోవాడు హిందూస్తాన్ షిప్యార్డు విశాఖపట్నంలో గుమస్తాగా ఉన్నాడు. కోటిగాడు చదువుకు స్వస్తి చెప్పినా, రాంబాబు, కృష్ణారావు వాడితో ఎప్పటివలె సఖ్యంగా ఉంటారు. ముగ్గురు స్నేహితులూ వీలయినప్పుడల్లా కలసి సరదాగా కాలం గడుపుతారు.

ఒకరోజు కేశవరావుకు ఛాతీలో విపరీతమయిన నొప్పి వచ్చింది. పద్మావతి ముఖలింగానికి ఫోను చేసింది. అతను దగ్గరలోనున్న డాక్టరు వద్దకు కేశవరావును తీసుకెళ్ళేడు. డాక్టరు చేసిన వైద్యంతో కేశవరావుకు ఉపశమనం లభించింది. విశాఖపట్నం వెళ్లి ఏదయినా ప్రయివేటు ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేయించుకోమని కేశవరావుకు ముఖలింగం గట్టిగా సలహా ఇచ్చేడు. మిత్రుని సలహా పాటించి కేశవరావు సతీసమేతంగా విశాఖపట్నంలోని రెండవ కొడుకు కృష్ణరావు దగ్గరకు వెళ్ళేడు. పేరున్న ప్రయివేటు ఆసుపత్రిలో పరీక్షలన్నీ చేయించుకున్నాడు. అతని దేహంలో కొవ్వు శాతం పరిమితికి మించి ఎక్కువగా ఉందని తెలిసింది. డాక్టరు తీసుకోవలసిన మందుల పేర్లు రాసిచ్చి, పాటించవలసిన జాగ్రత్తలు తెలియజేసేడు. తండ్రి ఆరోగ్య పరిస్థితి తెలిసేక, పిల్లలిద్దరూ ఉద్యోగం మానేయమని పట్టుపట్టేరు. వెంటనే మానేస్తే లాయరుగారికి ఇబ్బంది అవుతుంది గనక మానేయడానికి కొంత టైము పడుతుందని, కేశవరావు వారికి నచ్చచెప్పేడు.

కేశవరావు తన ఆరోగ్య పరిస్థితి లాయరుగారికి తెలియజేసేడు. తత్కారణంగా పిల్లల అభిప్రాయం కూడా చెప్పేడు. ఆ పరిణామాల దృష్ట్యా వీలయినంత త్వరలో ఉద్యోగమునుండి విశ్రాంతి తీసుకోదలచినట్లు వినయంగా చెప్పుకొన్నాడు. లాయరుగారు కనీసం మరో రెండు మూడు నెలలు పనిచేశాక విశ్రాంతి తీసుకోవచ్చన్నారు. ఆ లోగా కేశవరావును జూనియర్లిద్దర్లకు అతడి పనిలో తరిఫీదు చెయ్యమని సలహా ఇచ్చేరు. మూడు నెలలు గడిచేయి. కేశవరావు వద్ద జూనియర్లు ఇద్దరూ పని నేర్చుకొన్నారు. లాయరుగారు సంతృప్తి చెందేరు. కేశవరావు విశ్రాంతి తీసుకొన్నాడు. పిల్లలిద్దరూ తల్లిదండ్రులను తమ వద్దకు శాశ్వతంగా కొనిపోవాలని నిశ్చయించేరు.

కేశవరావు దంపతులు శాశ్వతంగా బ్రహ్మన్నపురం వదలి వెళితే, తమ గృహాన్ని ఏమి చెయ్యాలని ఆలోచనలో పడ్డారు. అద్దెకివ్వదలచినా, అమ్మదలచినా దానికి ముస్తాబు చేయడం అవసరమనుకొన్నారు. వారందులో ఉంటూ ఆ పనులు చేయిస్తే తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని పిల్లల అభిప్రాయం. తల్లిదండ్రులు శాశ్వతంగా విశాఖపట్నానికి మారిపోయి ఇంటి రిపైరు పనులు కాంట్రాక్టుకు ఇవ్వడం ఉచితమనుకొన్నారు. ఆ విషయంలో ముఖలింగం సలహా కోరదలచుకొన్నారు. కేశవరావు ముఖలింగాన్ని కలసి సలహా కోరగా-

"కేశవా, కాంట్రాక్టర్ల పనుల క్వాలిటీ నమ్మలేం. పనులు జరుగుతున్నప్పుడు ఎవ్వరూ లేకపోతే మరీ అధ్వాన్నంగా చేస్తారు."

"పనులు జరుగుతున్నప్పుడు మేమిద్దరం ఇంట్లో ఉంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందంటున్నారు, పిల్లలు."

"వాళ్ళు చెప్పింది కరక్టే. కాంట్రాక్టర్లు పని తొందరగా ముగించేయడానికి ఎక్కువమంది పనివాళ్లను పెట్టి, ఇల్లంతటిలోను పనులు ఒకేమారు ప్రారంభిస్తారు."

"అయితే ఏమిటి చెయ్యాలంటావు."

"ఏ ఏ పనులు అవసరమో ముందుగా నిర్ణయించుకొని పని వాళ్ళను మాట్లాడుకొని, దగ్గరుండి పన్లు చేయించుకోడం బెస్టు. పనివాళ్లను నేను మాట్లాడుతాను. ఎవరయినా నమ్మకమయినవాడిని ఆ పనులు దగ్గరుండి చేయించడానికి మాట్లాడుకోవాలి."

"నాకెవరూ తెలీదు. ఆ సాయం కూడా నువ్వే చెయ్యాలి."

"మా వాళ్ళని ఎవరినయినా చూడమన్నా, వాళ్లు మేమిచ్చిన రేట్లు అడుగుతారు. అవి చాలా ఎక్కువగా ఉంటాయి. (కొంతసేపు ఆగి) మా వాణ్ణి అడిగి చూస్తాను. వాడికీ ఓ కాలక్షేపం అవుతుంది. ఈ మధ్య వాడి ఫ్రెండు ఇంట్లో రిపేర్లు అవుతూంటే ఆ  ఫ్రెండుతోబాటు ఉంటున్నానని చెప్పేడు."

"వాడితో మాట్లాడు. వాడు ఒప్పుకొంటే ఇంకేమిటి కావాలి. ఊరకనే కాదని చెప్పు. వాడు ఎంత అడిగితే అంతా ఇస్తానని చెప్పు."

"వాడికి వేరే డబ్బివ్వడం దేనికి, కేశవా."

"అలాక్కాదు. నా సంతోషం. కాదనకు."

"సరే. మొదట వాణ్ణి అడిగి చూస్తాను."

మిత్రులిద్దరూ అలా కొంతసేపు మాట్లాడుకున్నారు.

ముఖలింగం కొడుకును కదిపి చూసేడు. వాడు సమ్మతించేడు. ఒకరోజు కొడుకును తీసుకొని పని వాళ్ళతో బాటు ముఖలింగం కేశవరావు ఇంటికి వెళ్ళేడు. పనివాళ్ల సలహాతో ఏ ఏ పనులు చేయించాలో ఒక నిశ్చయానికి వచ్చేరు. వాటికి అయ్యే ఖర్చు సుమారుగా ఎంతవుతుందో లెక్క వేసేరు. ముఖలింగం కొంత తక్కువ ధరకు కావలిసిన సామగ్రి సమకూర్చేడు. పనులు ప్రారంభమయ్యేయి. కేశవరావు దంపతులు విశాఖపట్నం లోని కొడుకు వద్దకు చేరుకొన్నారు. కోటిగాడు రోజూ ఉదయాన్నే వెళ్లి, దగ్గరుండి పనులు చేయించడం ప్రారంభించేడు. పాతబడిన కేశవరావు ఇల్లు కొత్త పెళ్ళికూతురిలా తయారవుతోంది. సుమారు అరవై ఏళ్ల ఒక ఆసామీ తరచూ వచ్చి ఆ పెళ్లికూతురు దర్శనం చేసుకు వెళుతున్నాడు.

ఒకరోజు ఆ ఆసామీ కోటిగాడితో ఆ ఇంటి విషయం మాట్లాడుతూ.

"బాబూ, ఈ ఇల్లు మీదా." అని అడిగేడు.

"కాదండి. మా నాన్నగారి ఫ్రెండుది."

"ఆయన ఎక్కడ ఉంటారు."

"ప్రస్తుతం వైజాగ్ లో ఉంటున్నారు."

"ఇది ఆయన స్వంతంగా ఉండడానికా."

"కాదండి. పనులన్నీ అయ్యేక, ఎవరయినా మంచి పార్టీ దొరికితే అద్దెకిస్తారండి."

"బాబూ, అయ్యగారితో మాట్లాడాలి. ఆయన నంబరు ఇవ్వగలవా."

"విషయమేమిటో చెప్పండి. ఆయన పనులన్నీ నేను చూస్తున్నాను."

"అయ్యగారు క్రయానికి ఇస్తారేమో కనుక్కోవాలి."

"ఆయన ఆ ఉద్దేశంలో లేరు. అయినా అడిగి చూస్తాను."

"చెక్కు, కేషు, ఎలా కావలిస్తే అలాగే ఇస్తాను అని చెప్పు బాబూ."

"అవన్నీ తరువాత విషయాలు. మొదట ఆయన అమ్ముతారో లేదో కనుక్కోవాలి."

"సరే. రేపు ఈ వేళకే కలుసుకొంటాను. ఈ లోగా ఆయన ఏమిటంటారో కనుక్కో బాబూ."

"ఆయన ఏ విషయమయినా పిల్లలతో మొదట మాట్లాడుతారు. టైమ్ పడుతుంది."

"మూడు నాలుగు రోజులయినా తొందర లేదు, బాబూ. అలాగే కానీ" అని చెప్పి, ఆ ఆసామీ తన దారిన పోయేడు.

ఒక ఆసామీ వచ్చి కేశవరావు ఇల్లు క్రయానికి అడిగిన విషయం, కోటిగాడు ఆ రోజు రాత్రి తండ్రితో చర్చించేడు. అది విన్నాక ముఖలింగం, "ఆ ఆసామీ పేరు, ఎక్కడ ఉంటున్నాడో, ఏమిటి చేస్తున్నాడో కనుక్కో. అవి తెలిసేక ఆలోచించవచ్చు." అని సలహా ఇచ్చేడు.

"ఆ ఆసామీని వచ్చి మిమ్మలిని కలియమని చెప్పమనండి. మీరు పెద్దవాళ్ళు. అటువంటి విషయం మీరు మాట్లాడ్డం మంచిది." అని తన వంతు సలహా గంగమ్మ ఇచ్చింది.

"మనవాడిని మాట్లాడనీ. అవసరమయితే నేను మాట్లాడుతాను." అని భార్య సలహాకు స్పందించి, "నేను చెప్పినట్లు మొదట ఆ ఆసామీ వివరాలు కనుక్కో." అని కోటిగాడితో చెప్పేడు.

మూడు రోజుల తరువాత ఆ ఆసామీ వచ్చేడు. కోటిగాణ్ణి కలిసేడు. "బాబూ, అయ్యగారితో మాట్లాడేవా." అని అడిగేడు.

"ఆ.. మాట్లాడేను. మీ పేరు...ఎక్కడ ఉంటున్నారో.. ఏమిటి చేస్తున్నారో ...కనుక్కోమన్నారు." అని జవాబు చెప్పేడు కోటిగాడు.

"బాబూ, నా పేరు గుప్తేశ్వరరావు. ఈ ఊళ్ళోనే గానుగ వీధిలో ఉంటున్నాను. నాకు పెద్ద బజారులో దుకాణం ఉంది. పప్పుదినుసులు, చింతపండు, మంచి క్వాలటీవి దొరుకుతాయని నా దుకాణానికి మంచి పేరుంది." అని, సగర్వంగా చెప్పేడు గుప్తేశ్వరరావు.

"సారీ అండి. వ్యాపారస్తులకి అమ్మనని అన్నారండి అంకుల్."

"ఇది నా కోసం కాదు బాబూ. మా దగ్గర బంధువు ఒకాయన; బొరిగుమ్మపల్లిలో ఉంటారు. ఆయన గవర్నమెంటులో ఏదో పని చేసి రిటైరు అయిపోయేరు. మన ఊళ్ళో వైద్యం అవీ బాగుంటాయని నేనే చెప్పి మన ఊరు వచ్చేమని ఆయనకి సలహా ఇచ్చేను."

"సరే, ఆయనకి ఈ విషయాలు చెప్తాను. ఆయన ఏమిటన్నదీ మీకు రెండు రోజుల్లో చెప్తాను.” అని, సంభాషణకు తెర దించేడు, కోటిగాడు.

గుప్తేశ్వరరావు, ఇళ్ళు కొనడం అమ్మడం వ్యాపారం చేస్తున్నాడని కేశవరావు ఇంట్లో పని  చేస్తున్న ఒక తాపీమేస్త్రీకి తెలుసు. ఆ విషయం కోటిగాడికి చెప్పేడు. అది తెలిసేక వాడు బేరాలాడి వీలయినంత తక్కువకే కొనడానికి ప్రయత్నిస్తాడని కోటిగాడు గ్రహించేడు. రెండు రోజులు తరువాత గుప్తేశ్వరరావు వచ్చేడు. కొన్నాళ్ళు ఈ ఇల్లు స్వంతానికే ఉంచుకోదలిచేరని చెప్పి కోటిగాడు అతణ్ణి సాగనంపేడు. జరిగినదంతా వివరంగా తెలుసుకొని, కొడుకు వ్యాపారంలో రాణిస్తాడన్న తన అభిప్రాయాన్ని భార్యతో పంచుకున్నాడు, ముఖలింగం.

కేశవరావు ఇల్లు సరికొత్త అవతారం ఎత్తింది. విశాఖపట్నం నుండి వచ్చిన కేశవరావు అది చూసి ఆశ్చర్యపోయేడు. కోటిగాణ్ణి ఎంతగానో మెచ్చుకొన్నాడు. ఎంతవద్దన్నా, వాడి చేతిలో ఐదువేలు పెట్టేడు. అది కోటిగాడి మొదటి ఆర్జన. కేశవరావు ఇల్లు అమ్మదలిచేడు. ఆ ఇల్లు అమ్మగా వచ్చిన సొమ్మును బ్యాంకులో వేసుకోడం మంచిదని కేశవరావు పిల్లలు సలహా ఇచ్చేరు. వారి సలహాతో ముఖలింగం ఏకీభవించేడు. కేశవరావు ఆ నిశ్చయానికి వచ్చి అమ్మే బాధ్యత కోటిగాడికి అప్పగించేడు. ఒక నెల వ్యవధిలో కోటిగాడు కేశవరావు ఇంటిని ఒక లాయరుగారికి మంచి రేటుకు అమ్మిపెట్టేడు. ఇరుపక్షాలవారు కోటిగాడి కష్టం ఉంచుకోలేదు. ఆ వ్యవహారం కోటిగాడి జీవితంలో ఒక పెద్ద మలుపు తిప్పింది. ఇళ్ళు కొనడం, అమ్మడం చేయగలనని నమ్మకం కుదిరింది. తల్లిదండ్రుల ఆశీర్వచనాలతో ఆ వ్యాపారానికి శ్రీకారం చుట్టేడు. మొదట్లో పాత ఇళ్ల రూపురేఖలు మార్చి విలువయిన ధరలకు అమ్మిపెట్టడం, అందులో ఇరుప్రక్కలవారినుండి కమిషను పొందడం ప్రారంభించేడు. క్రమక్రమంగా తగిన ఆదాయం సమకూరేక, తానే పాత ఇళ్లను కొని, కొత్తవాటిగా మార్చి లాభానికి అమ్మడంలో స్థిరబడ్డాడు. బ్రహ్మన్నపురం త్వరితగతిని పెరుగుతూ, కోటిగాడి వ్యాపారం త్వరగా పెరగడానికి దోహదపడ్డాది. ముఖలింగం, గంగమ్మలకు, కొడుకు బెంగ తీరింది.

ముఖలింగం, గంగమ్మ దంపతులకు, కూతురు అన్నపూర్ణ వివాహ విషయంలో చింత ఎక్కువయింది. ఏడాదికేడాది వయసు పెరుగుతోంది. దాని తోటివారికి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. స్ఫోటకం మచ్చల మూలాన్న అన్నపూర్ణకు తగిన సంబంధమేదీ కుదరడం లేదు. రెండో పెళ్ళివానికయినా చేయ నిశ్చయించి, ఆ ప్రయత్నాలు మొదలెట్టేరు. అవీ ఫలించడం లేదు. నవరంగపట్నంలో నున్న ముఖలింగం చెల్లెలు నరసమ్మ కూడా ప్రయత్నాలు చేస్తోంది. మేనకోడలు తన వద్ద ఉంటే ప్రయత్నాలకు పనికివస్తుందని భావించింది. అన్న, వదినగార్లతో ఆ విషయం చర్చించి అన్నపూర్ణను తన వద్దకు తెచ్చింది. అన్నపూర్ణ ఊరకనే కూర్చొనే వ్యక్తి కాదు. మేనత్త వద్ద కొత్త వంటకాలు నేర్చుకొంది. నరసమ్మ ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. కొన్నాళ్ళకు అన్నపూర్ణ మనసు తల్లిదండ్రులవైపు మళ్లింది. నరసమ్మ సాయంతో వాళ్ళను చేరుకొంది.

కోటేశ్వరరావు, క్రమక్రమంగా ఊళ్లోని ధనవంతుల జాబితాలో పడ్డాడు. ప్రస్తుతం నివసిస్తున్న ఇంట్లో మార్పులు చేసి, కావలసిన సదుపాయాలు సమకూర్చేడు. తల్లి, చెల్లెలుతో బజారుకు వెళ్లి, వారి సలహాతో వంటింటికి కావలసిన నూతన పరికరాలు కొనుగోలు చేసేడు. అన్న కొన్న తళతళ మెరుస్తున్న వంటసామగ్రి చూసి అన్నపూర్ణకు ఆనందమయింది. చెల్లెలి సంతోషాన్ని అన్న పంచుకున్నాడు. తల్లి సలహాతో, తండ్రికి వాలుకుర్చీ ఏర్పాటు చేసేడు. చెల్లి కోరిన, పంచతంత్రం మొదలగు పుస్తకాలు కొనిపెట్టేడు. చెల్లెలు కోరిన దుస్తులు కొంటున్నాడు. అన్నపూర్ణకు కూడా అన్నపై అమితమయిన ప్రేమ. అన్నకు ఇష్టమయిన వంటకాలు చేసిపెడుతోంది. కన్న పిల్లలిద్దరూ సఖ్యతతో నుండడం తల్లిదండ్రులకు మిక్కిలి సంతృప్తినిచ్చింది. అన్నా, చెల్లెలి అనురాగం ఇరుపొరుగు వారి మన్ననలు పొందింది. ఏ కొడుకు భవిష్యత్తు గూర్చి ఆందోళన చెందుతుండేవారో, ఆ కొడుకు ప్రయోజకుడై ఇంటి బాధ్యతలు భుజాన్న వేసుకోడం, ముఖలింగం, గంగమ్మ దంపతులకు సంతోషాన్ని కలుగజేసింది.

కోటేశ్వరరావుకు సంబంధాలు వస్తున్నాయి. ఆడపిల్ల పెళ్లి అయ్యేక వాడి పెళ్లి చేయదలచి, వాడి పెళ్లి కొన్నాళ్ళు వెనక్కి పెట్టేరు. పరిస్థితులు దానికి అనుకూలంగా లేవని తలచేక, వాడికి వస్తున్న సంబంధాలు ఆలోచిస్తున్నారు. పలాస వాసులు, రామచంద్రరావు, సుజాతల కుమార్తె అనసూయ సంబంధం నిశ్చయమయింది. ఓ సుముహూర్తాన్న కోటేశ్వరరావు అనసూయ మెడలో మూడు ముళ్ళూ వేసేడు. రామచంద్రరావు పెద్ద భూకామందే కాక పెద్ద జీడిపప్పు వ్యాపారి: సిరి గలవాడు. విశాలమయిన ఇంట్లో పుట్టి పెరిగిన అనసూయకు భర్త నివసిస్తున్న ఇల్లు చాలా చిన్నదిగా తోచింది. బాగా పెద్దదిగానున్న ఒక ఇల్లు కొనుక్కుని అందులోనికి మారుదామని భర్తపై ఒత్తిడి పెట్ట నారంభించింది. కోటి ఆ విషయం తల్లిదండ్రులతో చర్చించేడు. మారిన పరిస్థితిలో అది అవసరమని వారు భావించేరు. ముఖలింగం కుటుంబం ఒక విశాలమయిన ఇంట్లోకి మారేరు. ముఖలింగం దంపతులు వారు నివసిస్తున్న ఇల్లు తమ అధీనంలో ఉంచుకొన్నారు.

నిజానికి, మనసులో అనసూయకు అత్తా మామగారు తమతో కొత్త ఇంటికి మారడం ఇష్టం లేదు. భర్తకు ఆ విషయం చెప్పడానికి వెనుకంజ వేసింది. కోటి మూడు నాలుగు అంతస్తుల ఎపార్టుమెంటులు కట్టడం ప్రారంభించేడు. పనుల ఒత్తిడి మూలాన్న ఇంటినుండి ఉదయాన్నే బ్రేక్ ఫాస్టు చేసి, సైటుకు చేరుకొని స్వయంగా పనులను పర్యవేక్షించడం చేస్తున్నాడు. వీలు చూసుకొని రెండుగంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి తొందరగా భోజనం ముగించుకొని తిరిగి సైటుకు వెళిపోతున్నాడు. రాత్రి పని ముగించుకొని తొమ్మిది గంటల ప్రాంతంలో ఇల్లు చేరుకొంటున్నాడు. అనసూయ రోజల్లా తన గదిలో TV కి హత్తుకుపోతోంది. అత్త మామల విషయం పట్టించుకోవడం లేదు. భర్త ఆఫీసుకు వెళ్లిన తరువాత గంగమ్మకు ఒంటరి తనం ఎక్కువయింది. ఇదివరకు చుట్టుప్రక్కలవారితో బాగా కాలక్షేపమయ్యేది. అన్నపూర్ణ పరిస్థితి కూడా సుమారుగా అదే. తల్లితో ఎంతసేపు కాలక్షేపమవుతుంది. తల్లీ, కూతురు, నీటిలోనుండి బయటపడ్డ చేపలలా కాలం గడుపుతున్నారు. మారిన పరిస్థితి ముగ్గురకూ ఇబ్బంది కలుగజేస్తోంది. పనిలో మునిగి తేలుతున్న, కోటికి, అనసూయ మూలాన్న తల్లిదండ్రులు, చెల్లెలు పడుతున్న విషమ పరిస్థితి తెలియడం లేదు. వారున్నూ, ఇంట్లో శాంతిని కోరి, ఆ విషయం అతడికి తెలియజేయలేదు. ఎన్నాళ్ళు భరించగలరు. ఇల్లు, ఆఫీసుకు దూరంగా ఉండడం మూలాన్న ఇబ్బందిగా ఉందని చెప్పి, కొడుకును ఒప్పించి, ముఖలింగం దంపతులు, కూతురు అన్నపూర్ణతో బాటు తమ పాత ఇంటికి మారిపోయేరు. మనసులో అనసూయ సంబరబడ్డాది.

ఒక సంవత్సరం గడిచింది. కోటి తల్లిదండ్రులతో గడపడం అరుదయిపోయింది.

****ముగింపు నవంబర్ సంచికలో****

Posted in October 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!