Menu Close
anna-chelleli-gattu

ధారావాహిక నవల

సమయం మధ్యాహ్నమైనా అప్పటికే సముద్రం మీద చీకటి అలముకొని ఉంది. ఆకాశాన్ని ఆక్రమించియున్న దట్టమైన మేఘాలు సూర్య కిరణాల వెలుగును పూర్తిగా అడ్డుకుంటున్నాయి. ఏకధారగా కురుస్తున్న వాన తెర కట్టినట్లయి బారెడు దూరాన ఏముందో కూడా కనిపించడం లేదు. గాలి రయ్యి రయ్యిన వీస్తూ గట్టిగా ఊళలు వేస్తోంది. అలలు అంతకంతకీ ఎత్తు పెంచుతూ ఎగిరెగిరి పడుతున్నాయి. తన ఈ చిన్న పడవను బోరగిలపడకుండా ఆపడం తన ఒక్కడివల్ల జరిగేపని కాదనిపించింది కన్నయ్యకు. అయినా కడదాకా పోరాడడానికి నిర్ణయించుకున్నాడు అతడు. తాడు పడవకు కట్టి చేపను దాని ఇఛ్చమేరకు విడిచిపెట్టి, రెండు చేతులతోటీ తెడ్డు పట్టుకున్నాడు, పడవ ఒండిగిలపోకుండా నిలువరించే ప్రయత్నంలో చేప మరో వలయం తిరిగింది. దాంతో పాటు పడవ కూడా తిరిగింది. తాడులాగి చేపను ఆపవచ్చు; కానీ, అలల తాకిడికి పడవ మునిగిపోవచ్చు- ఉసూరుమన్నాడు కన్నయ్య.

ఇదివరకుతో పోలిస్తే చేప వేగం చాలా తగ్గిపోయింది. అది దాని అందమైన తోకను నీటిమీదికంతా లేపి మరణవేదన పడుతూ ఉంది. దానికి చివరి ఘడియలు సమీపించినా అది ఇంకా ఏ అలజడి పడకుండా నీటిపైన గంభీరంగా ఈదుతూ, ఓపిగ్గా వలయాలు తిరుగుతోoది. మెరుపు వెలుగులో దానిని చూసిన కన్నయ్యకు దుఃఖం ముంచుకొచ్చింది. ఇంత అందంగా, ఇంత రాజసంగా ఉండి, ఎవరికీ ఏ అపకారము చెయ్యకుండా, తనదారిని తానూ బ్రతికే ఈ జీవిని చంపితే పాపం మూటకట్టుకోడమే ఔతుంది కదా - అన్నభావం కలిగింది కన్నయ్యకు. ఆ ఆలోచన అతనిచేత కంట తడి పెట్టించింది. మళ్ళీ అంతలోనే అతనిలోని అహంకారం తలెత్తింది...

"నేను బెస్తకులంలో పుట్టినోన్ని! నా కులవురుత్తి సేపలవేట, మరో బతుకుతెరువు తెలియనోన్ని. నాకు తెలిసిన విద్దె అదొక్కటే! మనిషి బతకడానికి ఎదో ఒక పని సెయ్యాలి గందా, నేను నా కులవృత్తి చేసి నా కుటుంబాన్ని పోసించుకుంటున్నా, అది తప్పేలాగౌద్ది? నన్ను రచ్చించినా, బచ్చిoచినా ఈ సముద్దరమే దిక్కు నాకు" అని మనసు కుదుటపరచుకునే ప్రయత్నం చేశాడు.

భయంకరంగా విజృంభించిన సముద్రం అతన్నింక ఆలోచించుకోనీలేదు. పడవ ఒక అలమీదుండగా మరో ఆల విరుచుకుపడుతోoది. పడవను నిలబెట్టి ఉంచడం కన్నయ్యకు చాలా కష్టమౌతొంది. పడవలోని సామానంతా , తెరచాపకొయ్యతోసహా అన్నీ, ఎప్పుడో నీటి పాలైపోయాయి. పడవలో మిగిలున్నవి కన్నయ్య, కన్నయ్య చేతిలోని తెడ్డు మాత్రమే!

చేపకు శక్తి సన్నగిల్లింది. పడవ చుట్టూ నెమ్మదిగా తిరుగుతోoది. చీకటి నిండిన ఆ వాతావరణంలో, కదలికవల్ల మెరిసే ఉప్పునీటి మెరుపులు, కన్నయ్యకు చేప ఉనికిని తెలియజేస్తున్నాయి. అంతకంతకీ అది పడవకు దగ్గరగా వస్తోంది. పడవని మునిగిపోనీకుండా ఆపడమే కష్టంగా ఉన్న ఈ సమయంలో ఇంక తానీ చేపని ఎలా చంపి, పడవలో ఉంచి, ఒడ్డుకి తీసుకెళ్లగలడు? చేప మీద ఆశ వదిలేసుకున్నాడు కన్నయ్య. అంత పెద్ద చేప వచ్చి పడవను ఢీకొంటే పడవ పగిలిపోవడం ఖాయం - అన్న ఆలోచన రావడంతో చేపను పడవకు కట్టి ఉంచిన తాడు ముడిని విప్పేశాడు కన్నయ్య.
కాలరుద్రుడు కోపంతో కళ్ళెర్రజేసినట్లు భీకరంగా మెరుస్తున్నాయి మెరుపులు. మహాకాళుడు చేస్తున్న ప్రళయతాండవానికి లయగా, ప్రమదులు వాయిస్తున్న మరణ మృదంగ నాదంలా భయంకరంగా వినవస్తున్నాయి ఉరుములు.

సాయంకాలమయ్యే సరికి అముక్త జీవుల ఆత్మఘోఘాలా సముద్ర గర్భం నుండి మూలుగులాంటి ఒక వింతశబ్దం వెలువడింది. ఈ భయంకర శబ్దసమ్మేళణానికి లయగా ఎగిరెగిరిపడుతున్న కెరటాలు చేసే వైచిత్త్ర విన్యాసాలూ - అన్నీ విలయాన్ని సూచిస్తున్నాయి.

ఆహా! ఏమిటీ భయానక పైశాచిక నృత్యం! ఒక చిన్న మానవ ప్రాణితో తలపడడానికి ఇంత హంగూ, ఆర్భాటం కావాలా - ఆశ్చర్యపోయాడు కన్నయ్య.

చాలా దూరంలో తిర్యగ్రేఖపైన మంటలు కనిపించాయి. అదేమిటో కన్నయ్యకు తెలుసు – కడలి రాజు యుద్ధాశ్వము కట్లు విప్పుకుంది. ఆ బాడబమ్ నోటినుండి వెలువడిన అగ్ని శిఖలు నీటిని మందిస్తాయి! అదే "బడబాగ్ని!" ఆ గుర్రం పరుగెత్తే వేగానికి తాడి ప్రమాణాన లేచిన సముద్రపుటలలు మహా వేగంతో వచ్చి భూమిపైన విరుచుకు పడతాయి. సముద్రం "అన్నాచెల్లెలిగట్టు"ను దాటి, ఎంతో ముందుకు వెడుతుంది. అలా జరిగినప్పుడు ప్రాణనష్టం, ధననష్టం విపరీతంగా ఉంటుంది. ఉప్పు కెరటం తాకిడికి కూలిన భవనాల్లో సముద్ర సర్పాలు కాపురముంటాయి, తాడిచెట్ల మొవ్వుల్లో నత్తలు గూళ్లు కడతాయి. పంటభూములు చౌడుబారి పనికిరాని వౌతాయి. అంతా సర్వనాశనం! ఈ మహా ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. ప్రకృతి విజృంభించి వీరవిహారం చెయ్యడం మొదలు పెట్టగానే, ప్రజ్ఞావంతుడననుకునే మానవుడు తలవంచుకోక తప్పదు కదా ...

తిర్యగ్రేఖ దగ్గర కనిపించిన వెలుగు క్రమంగా ముందు ముందుకి వస్తోంది. తలపై మిణుగురుల మెరుపులతో తరలివస్తున్న పెను అల అది!  ఉప్పెన అన్నా, ఉప్పు కెరటం (టైడల్ వేవ్) అన్నాఅదే!

విజయమో, వీరస్వర్గమో! అంతేగాని క్షత్రియుడైనవాడు ఎప్పుడూ తేరగా ఓటమిని ఒప్పుకోడు. వీరుడికి వీరస్వర్గం వియ్యాలవారిల్లు కదా- అనుకున్నాడు కన్నయ్య.

ఆ రాకాసి అల, సముద్రపు నీటినంతటినీ తన వైపుగా తోడుకుంటూ అంతకంతకీ పెరుగుతోoది. విన్నవాళ్ళు గుండెలు అవిసిపోయేలా సముద్ర గర్భం నుండి ఒకవిధమైన మూలుగులాంటి భయంకర ధ్వని వస్తోంది. ఏదో అదృశ్య హస్తం నడిపిస్తున్నట్లుగా, అదుపుతప్పి కన్నయ్య పడవ దాని వైపుకే నడవడం మొదలుపెట్టింది. దానిని నిలువరించడం కన్నయ్యవల్ల అవ్వడం లేదు. చివరకు ఏది ఏమైనా, తనను మింగడానికి నోరు తెరుచుకుని వస్తున్న భయంకర పిశాచిలాంటి ఆ అలను ఎదిరించడానికే సిద్ధపడి ఉన్నాడు కన్నయ్య.

ఉరుములతో మెరుపులతో దద్ధరిల్లి పోతోoది ఆకాశం. సముద్రంలో ఉన్న నీరంతా ఒకే మహాశక్తిగా మారి తీరం మీద విరుచుకు పడే యత్నంలోఉంది. విధ్వంసానికి కంకణం కట్టుకుంది ఉప్పెన.

అంత భీభత్సం లోనూ ఆ రాకాసి అల శిఖరాగ్రాన తేలుతూ ఉంది ఒక చిన్న పడవ, దానిని గట్టిగా పట్టుకుని ఉన్నాడు, ఊపిరి బిగబట్టి ఆ పడవతో పాటుగా పైకితేలిన కన్నయ్య! అతడు ఒక్కసారి తల విదిలించి, ఊపిరి పీల్చుకుని, ఓపిక తెచ్చుకుని గట్టిగా కేకపెట్టాడు, "రాదమ్మా!" అంటూ.

### ### ###

సాయంకాలమయ్యేసరికి బెస్తవాడ మొత్తం ఖాళీ అయిపోయింది. విజృంభించి ఉన్న ఆ వాననీ గాలినీ కూడా లెక్కజెయ్యకుండా, అక్కడున్న యావజ్జనం ప్రాణాలు దక్కించుకోడం కోసం ఇల్లూ వాకిళ్ళూ వదిలేసి దూరంగా పారిపోయారు. వాళ్ళు పెంచుకునే కోళ్ళూ, మేకలలో కూడా కట్లు విప్పెయ్యడంతో పారిపోయాయి. వీధి కుక్కలు కూడా జనమంతా వెళ్లిపోతుండడం చూసి, అవీ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయాయి. ఆ ప్రదేశమంతా ఖాళీ అయిపోయినా కూడా ఒక్క రాధమ్మ మాత్రం ఎల్లమ్మ శవం పక్కన కూర్చుని ఉంది.

"అత్తమ్మా! నువ్వు గొప్ప అదృష్టవంతురాలివి, చితికిపోయిన నీ కుటుంబాన్ని గురించిన ఏ దుర్వార్తా వినకముందే స్వర్గానికి వెళ్ళిపోయావు. కన్నయ్య మనకిక లేడు. నీ కొడుకును పొట్టన పెట్టుకున్న ఆ సముద్రుడే నీకు అంత్యక్రియలు చేస్తాడు. అమాయకురాలివైన నీకు అక్షయ స్వర్గం దొరుకుతుంది. అత్తమ్మా! ఇక సెలవ్! నేను నా భర్తను కలుసుకోడానికి వెడుతున్నాను." అని అత్తగారి శవానికి నమస్కరించి, నిండుగా దుప్పటి కప్పి, అక్కడనుండి కదిలింది రాధమ్మ.

బెస్తవాడలో ఆ సమయంలో ఇక మిగిలివున్న, చెప్పుకోదగిన ప్రాణి ఆమె ఒక్కతే! సుఖదుఃఖాలకు అతీతమైన ప్రశాంతత తో నిండిపోయింది ఆమె మనసు. కన్నయ్య లేకుండా తను ఎక్కడికో దూరంగా వెళ్లి ప్రాణాలు నిలబెట్టుకోవాలని అనుకోడంలేదు రాధమ్మ. తన భర్తతోడిదే లోకం - అనుకున్న రాధమ్మ ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నది ...

"నన్నుఈ భూమికి కట్టిపడేసే ఏ బాధ్యతలూ లేవిక నాకు. చుక్క ఇంటిలో కన్నయ్య పిల్లలకి ఏ లోటూ ఉండదు. నేనింక వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు" అనుకుంది. తన ఒడిలో కన్నుమూసిన అత్తగారిని, సంతోషంగా చిన్నమ్మ వెంట బండెక్కి వెళ్లిన పిల్లల్ని తలుచుకుని. “ఇప్పుడింక తనకు ఏ బెంగలూ, భయాలూ లేవు. పరిపూర్ణమైన స్వేఛ్చా స్వతంత్రాలు దొరికాయి. ఇంక తనను తప్పు పట్టే వారెవరూ లేరిక్కడ" అనుకుని తనలో తాను నవ్వుకుంది.

రివ్వున వీచిన గాలి దాష్టీకానికి ఇంటి పైకప్పుమీది తాటాకులు చివ్వున లేచి ఎటో ఎగిరిపోయాయి. ఇల్లంతా వానతో తడిసిపోయింది. అంతలో పెద్దపెట్టున  చప్పుడు అయింది.

"ఎక్కడో ఏదో చెట్టు కూలిపోయింది కాబోలు" అనుకుంది రాధమ్మ.

ఆపై పతిని చేరడానికి వెళ్ళబోతున్న కులవధువులా ముస్తాబవడం మొదలుపెట్టింది. నున్నగా తల దువ్వుకుని, తీరుగా వాలుజడ అల్లుకుంది. ఇన్నాళ్లూ అపురూపంగా దాచుకున్న పెళ్ళిపట్టు చీర పైకి తీసి చక్కగా కాశ పోసి కట్టుకుంది, చేతులకు జరీ అంచున్న పట్టురవిక తొడుక్కుని గుత్తంగా కొసలు కలిపి ముడివేసింది. పైటకొంగు నిండుగా శరీరాన్ని కమ్మి ఉండేలా సవిరించుకుని, నడుముచుట్టూ తిప్పి ఊడకుండా బిగువుగా ఉండేలా దోపుకుంది. కన్నయ్య తనకు ప్రియమారా కొని బహూకరించిన గజ్జల పట్టీలు ఘల్లు ఘల్లుమని మోగుతుండగా తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది రాధమ్మ.

ఉధృతంగా ఉన్న గాలివానను లెక్కపెట్టకుండా, బలమంతా కూడదీసుకుని ఆ గాలి విసురును తట్టుకుంటూ ఆమె సముద్రం వైపుగా నడవడం మొదలుపెట్టింది. జరిగిన దారుణాన్నిగాని, ఇక జరగబోతున్న మహా దారుణాన్నిగాని పట్టించుకునేందుకు బెస్తవాడలో ఎవరూ లేరు. అన్నింటికీ కర్త ఆ సర్వేశ్వరుడే సాక్షి.

పరిసరాలను ఆవరించి ఉన్న కటిక చీకటిని గాని, విజృంభించి వీర విహారం చేస్తున్న గాలివానను గాని లెక్కజెయ్యకుండా, ఉండుండీ మెరుస్తున్నమెరుపుల వెలుగులో, తెలిసున్న దారివెంట సముద్రం వైపుగా నడిచి వెడుతోoది తన భర్తను చేరడం కోసం. కొంతదూరం వెళ్ళాక తలెత్తి చూసిన రాధమ్మ నిర్ఘాంత పోయింది.

వేయి శిరస్సుల నాగేoద్రుడు, తన వేయి పడగల పైన దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న మణుల కాంతితో, తన నాలుకలు రెండువేలూ కదిపి ప్రచండాగ్ని జ్వాలలు కురిపిస్తూ, వల్లమాలిన పగతో నిలువునా తోకమీద లేచి బుసలు కొడుతూ కసికసిగా ముందుకు దూసుకు వస్తున్న మహాసర్పంలా కనిపించింది రాధమ్మకు సూటిగా ఒడ్డుపైకి దూసుకువస్తున్న ఆ పెనుఆల!

కసిపట్టిన కాలసర్పంలా ముందుకు మహావేగంతో వస్తున్న ఆ ఉప్పుకెరటానికి ఎదురుగా తలవంచి నమస్కరిస్తూ నిలబడిపోయింది రాధమ్మ. ఆ క్షణంలో ఆమె చెవులకు వినిపించింది, "రాదమ్మా" అంటూ ఆర్తితో కన్నయ్య పిలిచిన పిలుపు మాత్రమే!

### ### ###

రోజంతా విలయ తాండవం చేసిన తుఫాను నడిరాత్రితో సద్దుమణిగింది. వాతావరణంలో స్మశాన ప్రశాoతత చోటుచేసుకుంది. ఆకాశంలోని మేఘాలు తొలగిపోడంతో, వేయి వెలుగులతో వేగుచుక్క దర్శనమిచ్చింది. కానీ దానిని పట్టించుకునే మనుష్యులెవరూ లేరక్కడ! అసలు బెస్తవాడన్నదే లేదు. సమూలం తుడిచిపెట్టుకుపోయింది రాత్రి వచ్చిన ఉప్పెనతో.

నిన్నటివరకూ, జనుల కలకలంతో కళకళలాడుతూ ఉండే బెస్తవాడ నేడు నామమేగాని, రూపం లేకుండాపోయింది. బెస్తవాడ ఉండే చోట కేవలం ఒక ఇసుక పర్రగా మారిపోయింది. ఒకప్పుడు అక్కడ బెస్తవాడ ఉండేదన్న దానికి గుర్తుగా, ఇసుకలో సగం సగంగా కప్పబడివున్న ఛిద్రమైన వేట పడవల తాలూకు శకలాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి.

క్రితం రాత్రి వచ్చిన ఆ ఉప్పుకెరటం తీరాన్ని దాటి మూడుమైళ్ళవరకూ తన ప్రభావం చూపించింది. అది ఊరి పొలిమేరలో ఉన్న రామమందిరం దాకా వెళ్ళింది. దాని ధాటికి రామమందిరానికి వెళ్లే దారిలో ఉన్న రావి చెట్టు కూకటివేళ్లతో సహా కూలిపోయింది. కూలిన ఆ చెట్టుకొమ్మల్లో చిక్కుకుని ఉంది ఒక పెద్ద చేప! అది చచ్చిపోయి ఉంది. దాని నోటిలో చిక్కుకున్న గాలానికి కట్టిన బెండు చెట్టు కొమ్మల్లో చిక్కుకుని వేలాడుతూ ఉంది. హఠాత్తుగా వీచిన చిరుగాలి పెర ఆ బెండును కదిలించింది. దానిపై ప్రియమారా రాధమ్మ చెక్కిన "కన్నయ్య - రాధమ్మ" అన్న పేర్లు కింద మీదౌతూ గాలికి  కదులుతున్నాయి.

ఎప్పటిలాగే ఆరోజు కూడా తెల్లవారింది. ఆకాశంలో ఒక తీతువు హృదయవిదారకంగా కూస్తూ, తాను గుడ్లుపెట్టిన చోటు కోసం కాబోలు వెతుక్కుoటోoది.

"సముద్రం అన్నాచెల్లెలిగట్టు దాటిoదంటే రోజురోజుకీ భూమి మీద పాపభారం పెరిగిపోతోందన్నమాట!  చూస్తూ ఉండగానే విలువలు తారుమారౌతున్నాయి. అంతా కలికాలం మహిమ" అంటూ భారంగా నిట్టూర్చి ఆపై ఏకతారను మీటుతూ తత్వాలు పాడుకోడం మొదలుపెట్టాడు రామమందిరం బైరాగి.

 

(సంపూర్ణం)

Posted in December 2018, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!