ఎక్కడికి ఈ పరుగు
మనిషి జీవన పయనంలో ఎన్నో శోధించాడు..ఎంతో సాధించాడు..ఎంతగానో పురోగమించాడు. అయితే ఈ పయనములో, జీవన శైలిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మన పూర్వీకులు (ఇదివరకటి రోజులలో) బ్రతకటానికి సరిపడా సంపాదించుకుని ఉన్నదాంట్లో తృప్తిగా తిని హాయిగా, సంతోషముగా జీవించారు. కానీ నేటి పరిస్థితి ఇందుకు భిన్నముగా ఉంది. విలాసవంతమై సుఖవంతమైన జీవనం గడపడానికి పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాము. పిల్లలకి ఖరీదైన చదువులు చదివిస్తున్నాము. వాళ్ళకి ఆస్తులు సంపాదించి పెడుతున్నాము. రేపు వాళ్ళు భవిష్యత్తులో కష్టపడకుండా ఉండడం కోసం మనం కష్టపడుతున్నాము. మా పిల్లలు విదేశాలలో చదువుకుంటున్నారు అని చెప్పుకోవడం కొఱకు ఎన్నో అవస్థలకు గురౌతున్నాము. చివరకు వారి దగ్గరకు వెళ్ళలేక, వెళ్ళినా మాతృభూమి మమకారం వదులుకోలేక మన పిల్లలకి అమ్మానాన్నలని దూరము చేస్తూ ఎక్కడో చదివిస్తూ అర్ధంల్లేని జీవనం గడుపుతున్నాము. అమ్మానాన్నలకి మనం దూరముగా ఉంటూ అనుబంధాలు, ఆప్యాయతలను మరచి సంపాదనే ధ్యేయముగా మరమనుషులుగా యాంత్రికమై పోయాయి మన బ్రతుకులు. పెళ్లిళ్లు, విందులు, వినోదాలు అన్నీ తమ పరపతిని చూపుటకై అన్నట్లుగా ఉంటున్నాయి. వేళకి తినక, కంటి నిండా నిద్రపోలేక ఒత్తిడిలతో సతమతమవుతూ అనారోగ్యాలు కోరి తెచ్చుకుంటున్నాము.
అయితే ఎందుకీ పరుగు...ఎక్కడివరకు...దేనికొఱకు..ఎప్పుడయినా ఆలోచించామా! ఉన్నంతలో తృప్తిగా జీవించలేమా?మన అమ్మానాన్నలు సంపాదించిన ఆస్తి తోనే మనం బ్రతుకుతున్నామా? ఈ రోజు మనం సంపాదించినట్లే మన పిల్లలు సంపాదిస్తారు కదా! మరి ఎందుకీ పరుగు?వాళ్ళకి ఆస్తి సంపాదించి ఇచ్చి సోమరిపోతులుగా తయారు చేసే కన్నా, సంపాదించడానికి సరిపడా విద్యాబుద్ధులు నేర్పిస్తే సరిపోతుంది కదా! ఇక పిల్లలకి చదువులు విషయానికి వస్తే ...ఖరీదయిన చదువులయితేనే, హాస్టల్ లలో పెడితేనే చదువు బోధపడుతుందా! సామాన్యమైన చదువు మనం చదవలేదా? స్వతహాగా వాళ్ళని ఎదగనిస్తే ఎన్నో అధ్బుతాలు సృష్టిస్తారు నేటి యువత. కానీ ఇరుకైన, ఖరీదయిన కారాగార చదువులు ఎందుకు? ఈ పరుగులు ఎంతవరకు? అన్న ఆలోచనకు అంకురార్పణ మనమే చేయాలి..దీనిని సమస్యగా మనము భావిస్తే.. అందుకు పరిష్కారము మన దగ్గరే ఉంది.అది ఎవరికి వారే తెలుసుకోవాలి.