"అస్సలు నమ్మలేకపోతున్నాను. మన అన్వేషణ పూర్తి కాబోతోంది. నువ్వు హారం నకలు చూపిస్తే ఏదోలే అనుకుని బయలుదేరాం. కానీ నిజంగా… అమ్మో అంత పెద్ద వజ్రం. లేదా మణి… ఆ పాతకాలపు బంగారం. ఆ డిజైను చాలా చాలా ప్రాచీనమైనదని తెలుస్తోంది. బయట మార్కెట్ లో చాలా విలువ ఉంటుంది. మనం ఊహించిన దానికంటే ఎక్కువ. చాలా ఎక్కువ." ఉద్విగ్నుడైపోతూ అన్నాడు విక్టర్.
"నిజమే జేమ్స్. మనం ఈ రాత్రికే ఆ హారం చేజిక్కించుకుని పారిపోవాలి. బొంబాయి చేరుకోవాలి. అక్కడ నుండి ఇంకెక్కడికైనా…" అన్నాడు డేవిడ్.
ముగ్గురూ తమ వసతి వైపు నడవసాగారు. విక్టర్, డేవిడ్ నగ గురించి, రాబోయే సంపద గురించి మాట్లాడుకోసాగారు. కానీ జేమ్స్ మాత్రం నగేష్ గురించి ఆలోచిస్తున్నాడు. గతవారం ఎడారిలోకి బయలుదేరేముందు నగేష్ నుంచి ఫోన్ వచ్చింది. "నసీర్ బృందం దారుణ హత్య గురించి తెలియజేశాడు. అనుచరులు ఎక్కువ లేకుండా, హడావుడి లేకుండా జేమ్స్ చేసే ప్రయాణం నచ్చిందని, విజయం సాధించాలని కోరుకుంటున్నానని" చెప్పాడు నగేష్. విజయన్ చేస్తున్న వ్యాపారం కూడా చెప్పాడు. ప్రయాణంలో జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నగేష్. ఎక్కడా ఎవరూ తనని అనుసరిస్తున్నట్లే లేదు. కానీ తాను చేస్తున్న పని ఎలా తెలిసింది నగేష్ కి? ఇప్పుడు హారం కనిపెట్టిన విషయం కూడా తెలిసిపోయిందా? అలా అయితే తాను సాహసం చేద్దామనుకున్నాడే… ఈ విషయం కూడా తెలిసిపోతుందా? వెన్నులో నుంచి వణుకు పుట్టింది జేమ్స్ కి.
జేమ్స్ రాత్రి హారం అపహరించడానికి ప్రణాళిక వేస్తున్నాడు అనుకున్నారు విక్టర్, డేవిడ్. అందుకే అతని ఆలోచనలకు భంగం రాకుండా కాస్త దూరంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తండా పెద్ద వచ్చాడు. భోజనం సిద్ధమైందని చెప్పేడు. జేమ్స్ ని పిలిచి, ముగ్గురూ పెద్ద వెనుక బయలుదేరేరు. కాస్త దూరంలో ఆరుబయట కొందరు స్త్రీలు, పురుషులు కూర్చుని ఉన్నారు. వారి ముందు నాలుగైదు పెద్ద పాత్రలు, కొన్ని చిన్న పాత్రలు ఉన్నాయి.
వారిని చూస్తూనే విక్టర్, డేవిడ్ ఆగిపోయారు. జేమ్స్ వారివైపు ప్రశ్నార్థకంగా చూసాడు. తాము నోరు నొక్కి తీసుకెళ్లిన అమ్మాయిలు ఆ గుంపులో ఉన్న విషయం రహస్యంగా చెప్పాడు డేవిడ్. వారి నుంచి ఏమైనా ప్రతిఘటన వస్తుందేమో అని భయపడ్డాడు.
"వారు ఆ విషయం చెప్పినట్లు లేదు. చెప్తే, ఇంత సామరస్యంగా భోజనానికి పిలవరు" అన్నాడు జేమ్స్.
"భోజనంలో ఏమైనా కలిపి పెడతారేమో?" సందేహం వ్యక్తం చేశాడు విక్టర్.
"మాట్లాడకుండా ఏమీ జరగనట్లే రమ్మని" చెప్పాడు జేమ్స్.
వీళ్ళ రాక చూసి, అందరూ వృత్తాకారంగా సర్దుకుని కూర్చున్నారు. పెద్ద, జేమ్స్, విక్టర్, డేవిడ్ వారితో పాటు కూర్చున్నారు.
*****
తెల్లారింది. బయట దినపత్రిక చదువుకుంటున్న ప్రభాకరరావు దగ్గరకు వచ్చాడు మోహన్. "నాన్నా! మీతో ఓ విషయం మాట్లాడాలి" అన్నాడు.
"ఉద్యోగం విషయమా? మీ అత్తగారింటికి వెళ్లడమా?" ప్రశ్నించాడు ప్రభాకరరావు దినపత్రిక ముడుస్తూ.
"నిన్న మధు ఒక వ్యాపారం గురించి చెప్పేడు నాన్నా…" అన్నాడు పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ.
"ఏ వ్యాపారం? నిన్ను కూడా కిరాణా కొట్టు పెట్టుకోమంటాడా?" అడిగాడు ప్రభాకరరావు.
"అదేం కాదు నాన్నా. మధు చిన్నాన్న రాఘవరావు ఏదో వ్యాపారం విజయవాడలో మొదలుపెడతాడట. ఆ వ్యాపారానికి సుమారు 200 మంది అవసర పడతారట. నేను అతనికి సహాయంగా ఆఫీస్ తెరవాలట. 'ఉద్యోగులు కావలెను, శారీరక దృఢత్వం కలిగి, చెప్పిన పని చెప్పినట్లు చేయగలిగిన, చురుకైన యువకులు కావలెను. చదువుతో పనిలేదు' అని పేపర్లో ప్రకటన ఇవ్వాలిట. వచ్చిన యువకులకు జీత భత్యాల వివరాలు చెప్పి, వారికి నచ్చితే, ప్రకటనలో చెప్పిన లక్షణాలు గల యువకులను ఎంపిక చేసి, వారికి ప్రొఫైల్ తయారు చేసి మధు కు అప్పగించాలట. వారిని నియమించే వరకు నాకు నెలకు 5000 జీతం, 200 మందిని చేర్చాక, అప్పుడు మరొక పని అప్పగిస్తూ, జీతం పెంచుతారట. మీ ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుందామని అడుగుతున్నాను" అన్నాడు మోహన్.
"యువకులను చేర్చుకోవడం కూడా వ్యాపారమేనటరా? ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్లుంది." అన్నాడు ప్రభాకరరావు.
ఈలోగా విజయ టీ తీసుకువచ్చింది. "సుధ ఇంకా నిద్ర లేవలేదుట్రా?" అని అడిగింది.
"లేదమ్మా! లేపాను. నీరసంగా ఉంది, కాసేపు అయ్యాక లేస్తానంది. నాన్నగారితో మాట్లాడాలని ఇలా వచ్చేను." అన్నాడు మోహన్.
"ఇంకా బడలిక తీరలేదా? నాకేదో అనుమానంగా ఉంది. వస్తానుండు," అంటూ మోహన్ గది వైపు బయలుదేరింది విజయ.
*******
"సుధా.. సుధా…" బయటి నుంచే అరుస్తూ లోపలికి వచ్చింది విజయ.
సుధకు అత్తగారి గొంతు విని లేవాలని ఉన్నా లేచి కూర్చోలేకపోయింది. కూర్చుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఒంట్లో ఉన్న శక్తినంతా ఎవరో పీల్చినట్లుంది. విజయ వచ్చి సుధ నుదురు తాకి చూసింది. చేయి పట్టుకుని చూసింది.
"సుధా, నా చేయి పట్టుకుని లేచి కూర్చో." అని చెప్పింది. సుధ తప్పనిసరై అత్తగారి చేయి పట్టుకుని లేచి కూర్చుంది. నెమ్మదిగా మంచం మీదనుంచి దింపి నీళ్లగది వైపు తీసుకువెళ్లింది విజయ.
"మొహం కడుక్కో"
సుధ మొహం కడుక్కొని వచ్చింది. ఆ కాసేపటిలోనే వాంతి రాబోయింది. కానీ నీళ్లు మాత్రమే వచ్చాయి. మళ్ళీ నోరు కడుక్కుని వచ్చింది. విజయ సుధను జాగ్రత్తగా మంచం దగ్గరకు తీసుకువచ్చి కూర్చోబెట్టింది. దిండు సరిచేసి నడుముకు వెనక పెట్టింది. 'ఇప్పుడే వస్తానుండు' అని చెప్పి, వెళ్లి, ఒక ట్రే లో మూడు గ్లాసులు తీసుకొని వచ్చింది. ఒక గ్లాస్ లో కాఫీ, ఇంకో గ్లాస్ లో మజ్జిగ, మరో గ్లాస్ లో నిమ్మకాయ నీళ్లు. సుధ కాఫీ గ్లాస్ తీసుకుంది. కానీ ఆ వాసనకు మళ్ళీ కడుపులో తిప్పింది. కనీసం నోటివరకు కూడా కాఫీ తీసుకోలేక పోయింది. బేలగా అత్తగారికి చూస్తూ, కాఫీ గ్లాస్ ట్రే లోపెట్టి మజ్జిగ అందుకుంది. కాస్త తాగగానే మొహం వికారంగా పెట్టింది. ముసిముసిగా నవ్వుకుంటూ, గ్లాసును అందుకుని ట్రేలో పెట్టి, ఈసారి నిమ్మకాయ నీళ్ల గ్లాస్ సుధ నోటికి అందించింది విజయ. ప్రాణం లేచి వచ్చినట్లై గబగబా తాగేసింది సుధ. మెల్లగా సుధ చెవిలో ఏదో అడిగింది విజయ. కాసేపు తెల్లబోయి, కాస్త ఆలోచించి చెప్పి, సిగ్గుపడింది సుధ.
సుధ తలచుట్టూ వేళ్ళు తిప్పి మెటికలు విరిచి, బుగ్గలు పుణికి "కాసేపు అలా నడుం వాల్చు, మళ్ళీ వస్తాను" చెప్పి బయటకు వెళ్ళింది విజయ. "మీ ఆవిడ నీళ్ళోసుకుందిరా" అంది మోహన్ తో…
"అదేంటి, అప్పుడే నిద్రలేవడం, స్నానం కూడా అయిపోయిందా" అంటూ కుర్చీ లో నుంచి లేవబోయాడు మోహన్.
"నీళ్ళోసుకోవడం అంటే స్నానం కాదురా వెధవాయ్… నువ్వు తండ్రివి కాబోతున్నావు" ఆనందంగా చెప్పింది విజయ.
"అదేమిటి ఇంకా మొన్ననే కదా శోభనం చేశాము" ఆశ్చర్యంగా అడిగాడు ప్రభాకరరావు.
"మీ మొహం. ఏడ్చినట్లుంది వ్యవహారం. మనం చేసింది వేడుక. పెళ్లి, శోభనం వాళ్లే ఎప్పుడో చేసుకున్నారు." అంది విజయ.
"అవును కదూ…" తలకొట్టుకున్నాడు ప్రభాకరరావు.
అక్కడ ఉండాలో, సుధ దగ్గరకు వెళ్ళాలో అనే సందిగ్ధంలో ఉండిపోయాడు మోహన్.
"వెళ్లరా, వెళ్ళు. సుధ దగ్గరకు వెళ్ళు. నేను పాయసం చేసి తీసుకువస్తాను. రేపు మీ అత్తగారింటికి శుభవార్తతో సహా వెళ్లుదువులే." అంది విజయ.
మోహన్ మెలికలు తిరిగాడు. వెంటనే గబగబా గదిలోకి దూరిపోయాడు.
విజయ, ప్రభాకరరావు నవ్వుకున్నారు. విజయ వంటింట్లోకి నడిచింది. ప్రభాకరరావు మడిచిన దినపత్రిక తిరిగి విప్పాడు.
*****
తండా పెద్ద కూడా జేమ్స్ బృందంతో కూర్చున్నాక, అందరికి రెండేసి చిన్న పాత్రలు పంచారు. ఒక పాత్రలో గంజి లాంటి పదార్థం, మరో పాత్రలో కాల్చిన మాంసం వేశారు. జేమ్స్ బృందానికి, తండా పెద్దకు ప్రత్యేకంగా మరో పాత్ర ఇచ్చి అందులో వేరే పానీయం పోశారు. అందరితో పాటే తమకు కూడా ఆహారం అందించడంతో సంశయించకుండా స్వీకరించారు జేమ్స్ బృందం. గంజి లాంటి పదార్థం మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తాగారు. తండా పెద్ద తాగిందీ లేనిదీ చూడకుండానే పానీయం కూడా తాగేశారు. కడుపు నిండా తిని, తాగి, లేచి తండా పెద్దకు కృతజ్ఞతలు చెప్పారు. తమకు ఇచ్చిన వసతి వైపు కదిలారు. వాళ్ళు అటు వెళ్ళగానే తండా పెద్ద తనకు ఇచ్చిన పానీయాన్ని బయట పారబోశాడు. మిగతా వాళ్లకు సైగ చేసాడు. దృఢకాయులైన పదిమంది యువకులు ఈటెలు పట్టుకుని, భగవతి అమ్మవారి ఆలయం వైపు సాగిపోయారు. మిగతా పురుషులందరూ పొదల చాటున ఇద్దరిద్దరుగా సర్దుకున్నారు. స్త్రీలు, పిల్లలు గుడిసెలలోకి వెళ్లిపోయారు.
****
జేమ్స్, విక్టర్, డేవిడ్ ముగ్గురూ తమని వదిలిపోగానే కట్టి పడేసిన అమ్మాయిలు ఒకరికొకరు దగ్గరగా జరిగి అతి ప్రయత్నం మీద తమ బంధనాలను వదిలించుకున్నారు. తండా పెద్దను కలిసి, తమ మీద జరగబోయిన అఘాయిత్యాన్ని గురించి వివరించి, భగవతి అమ్మ హారం గురించి వారు మాట్లాడుకున్న విషయాలు వివరించారు. ఇంతలో ఆలయం దగ్గర నుండి ఇద్దరు స్త్రీలు పరుగున వచ్చి, ముగ్గురు పురుషులు చెప్పులతో ఆలయ ప్రవేశం చేసిన విషయాన్ని చెప్పారు. తండా పెద్ద కోపంతో ఊగిపోయాడు. వచ్చిన అతిధులు దిద్దుకోలేని తప్పులు చేశారు. మొదటిది తమ తండా అమ్మాయిలపై అఘాయిత్యం చేయబోవడం, రెండవది భగవతి అమ్మ హారం దొంగతనం చేయాలనుకోవడం, మూడవది, అతిపెద్దది అయిన తప్పు, చెప్పులతో ఆలయప్రవేశం చేయడం. తండా పెద్ద ఆలోచించాడు. తమకు తెలియనట్లే, ఏమి జరగనట్లే వ్యవహరించమన్నాడు. తండాలోని పురుషులందరిని పిలిచి వారు చేయవలసిన పని వివరించాడు. స్త్రీలను పిలిచి వారు చేయవలసిన పని చెప్పాడు. క్షణాల్లో అందరూ సర్దేసుకున్నారు. తండా పెద్ద సూచనల ప్రకారమే పానీయంలో మత్తుమందు కలిపారు. అది నెమ్మదిగా పనిచేస్తుంది. పానీయం ప్రభావమే అనుకుంటారు కానీ ప్రత్యేకంగా తెలీదు.
*****
తండా మొత్తం నిశ్శబ్దం ఆవరించే వరకు జేమ్స్ బృందం సైగలతోనే తమ ప్రణాళిక నిర్ణయించుకున్నారు. కీచురాళ్ల రొద మాత్రమే వినిపిస్తోంది. అంతటా నిశ్శబ్దం అలుముకుంది. విక్టర్, డేవిడ్ వసతి లోని తమ సామగ్రి మొత్తం తీసుకొని, జీపు నిలిపిన వైపు నడిచారు. శబ్దం కాకుండా జీపులో సామాన్లు పడేసి, కొంత దూరం వరకు తోసుకుంటూ వెళ్లారు. అక్కడ కూర్చుని జేమ్స్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. జేమ్స్ ముఖానికి గుడ్డ కట్టుకుని, ఆయుధాలు సిద్ధంగా పట్టుకొని భగవతి అమ్మ ఆలయం వైపు నెమ్మదిగా బయలుదేరాడు.
చుట్టూ పొదల మధ్యలో ఉన్న తండావాసులలో ఆవేశం పెల్లుబుకుతోంది. కానీ తండా పెద్ద ఆదేశం వచ్చేవరకు అలాగే కూర్చోవాలి. తప్పదు. ముగ్గురూ అక్కడికి వస్తారనుకున్నాడు పెద్ద. కానీ ఒక్కడే రావడంతో కొంచెం ఆలోచనలో పడ్డాడు. జేమ్స్ నెమ్మదిగా ఆలయాన్ని సమీపించాడు. తల కొంచెం భారంగా ఉన్నట్లు అనిపించింది. అలవాటు లేని ఎడారి పానీయం వలన కాబోలు అనుకున్నాడు. ఆలయం పరిసరాల్లోకి వచ్చాడు. ఇంకా ధూపపు పొగలు ఆలయం లోపలినుంచి వస్తున్నాయి. ఒక్క క్షణం తన చెప్పుల వైపు చూసాడు. నవ్వుకుని లోపలకు అడుగుపెట్టబోయాడు. ధూపం వాసనకు తల తిరిగినట్లు అనిపించి, అలా కూర్చుండిపోయాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్లే స్పృహతప్పి పోయాడు.
జేమ్స్ కి తెలియని విషయం ఏమిటంటే మరకతమణి ఎర్రగా ఉండదని, ఆకుపచ్చగా ఉంటుందని. మీనాక్షి అమ్మవారి విషయం నగేష్ చెప్పినా, ఎప్పుడూ ఆ ఆలయాన్ని చూసి ఉండకపోవడం వలన, పరాకు వలన ఆకారం, నగ డిజైను చూడగానే అదే మరకతమణి హారం అనుకుని సంబరపడి పీకల మీదకు తెచ్చుకున్నాడు జేమ్స్. జేమ్స్ పడిపోయిన పది నిమిషాల వరకు దృఢకాయులు ఎదురుచూశారు. అప్పుడు జేమ్స్ దగ్గరకు వచ్చి, ముఖానికి కట్టుకున్న గుడ్డ విప్పి, చేతులు కట్టేశారు. జేబులు వెతికి ఆయుధాలు తీసుకున్నారు. డబ్బు, ఇతర విలువైన వస్తువులు తీసుకున్నారు. ఒంటిపై ఒక్క వస్త్రమే ఉంచి మిగతా దుస్తులు కూడా తొలగించారు.
జేమ్స్ ను మోసుకుని వసతి గృహానికి వచ్చారు. అక్కడ మిగతావాళ్ళు, సామాన్లు కనిపించలేదు. తండా పెద్ద అందర్నీ బయటకు రమ్మని సంకేతం ఇచ్చాడు. అందరూ నిశ్శబ్దంగా వచ్చి నిలుచున్నారు. ఒకడిని పోయి చూసి రమ్మని సైగ చేసాడు. వెళ్లిన వాడు క్షణంలో పరుగున వచ్చి, వాళ్ళిద్దరూ జీప్ లో నిద్రపోతున్నారని చెప్పాడు. జేమ్స్ ని మోసుకుని జీపు దగ్గరకి పోయి వెనుక భాగంలో కాళ్ళు కూడా కట్టేసి పడేసారు. మిగిలిన ఇద్దరికి కూడా ఒంటిపై ఒక్కొక్క వస్త్రమే ఉంచి మిగతా దుస్తులు తీసేసారు. ఒకడికి చేతులు కట్టి జీపు పైభాగంలో కట్టేశారు. కాళ్ళు కూడా కట్టేశారు. ఇంకొకడికి కాళ్ళు చేతులు కట్టి స్టీరింగ్ వీల్ కేసి కట్టేశారు. మొత్తం డబ్బు, వస్తువులు తీసుకున్నారు. జీప్ ని స్టార్ట్ చేసి, ఏక్సిలేటర్ నొక్కి వదిలేశారు. ముగ్గురికి మెలకువ వచ్చినా, ఒకరికొకరు సాయం చేసుకుని విడిపించుకోలేరు. ఎడారిలో తిండి నీళ్లు లేక మలమల మాడి, ఒంటిపై బట్టలేక దారుణంగా కాలిపోయి చావవలసిందే. జీపు గమ్యమైనా లేకుండా పరిగెడుతోంది.
జేమ్స్ బృందాన్ని సాగనంపి వచ్చిన తండా వాసులకు రెండు ఒంటెలపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు. వెంటనే ఈటెలు చూపించి వారిని నిలవేశారు. వచ్చిన వాళ్ళు జేమ్స్ బృందం గురించి ఆచూకీ అడిగారు. తండా పెద్ద తండావాసుల వైపు చూసాడు. ఇంకో మాటకు అవకాశం లేకుండా వారిద్దరి తలలు నరికి, మొండేలని, తలలను ఇసుకలో పూడ్చి, వారి వస్తువులు తీసుకుని, ఒంటెలను తమ ఒంటెల మందలోకి తరలించారు. ఇప్పుడు వచ్చిన వాళ్లిద్దరూ నగేష్ అనుచరులు. జేమ్స్ బృందానికి ఏ గతి పట్టిందో నగేష్ కి తెలియజేసే వారే లేరిప్పుడు.
*******
ఫోన్ లో విజయ చెప్పిన శుభవార్త విని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు ఉమ మహేశ్వరరావులు. వెంటనే నాలుగు రకాల స్వీట్లు, చలిమిడి చేయించి, నాలుగురకాల పండ్లు తీసుకుని కూతురి దగ్గరకు బయలుదేరారు.
****సశేషం****
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల... ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.
ముందుమాట:
"అనామిక" అనే ఈ నవల 90' లలో మొదలైన ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? అనామిక ఎవరు? ఆ ప్రేమ జంటకి అనామికకు సంబంధం ఏమిటి? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది.
దైవిక శక్తులతో ఆటలాడడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాంటి వారిని శిక్షించే పని భగవంతుడే వివిధ రూపాలలో పూర్తి చేస్తారు. అలా జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ నవల రూపు దిద్దుకుంది.
ఈ నవల మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ....మీ అభిప్రాయాలను, సూచనలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ.. "అనామిక" నవలను సీరియల్ గా ప్రచురిస్తున్న సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమప్రియ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ...
- నాగమంజరి గుమ్మా, శృంగవరపుకోట
ఏక బిగువున చదవగలిగేలా ఉంది. మంచి కథ.దైవ అపరాధము ,ప్రభావం బాగా చెప్పారు.కీచురాళ్ళ అనే కీటకాలు రెక్కల రాపిడి శబ్దం రాత్రులు ఎవరూ లేనపుడు వింటే భయం వేస్తుంది. ఇలాంటి సహజ అంశాలు పెట్టి రాయడం అద్భుతం. అంటే నిజ జీవితాలు కు దగ్గరగా ఉంది.