"అది సరే కానీ, కొండమీద కనిపించని తుమ్మెదలు వేలాదిగా వచ్చి దాడి చేయడం తెలుసా మీకు? ఈ స్వామికి ఉన్న నిదర్శనాలలో ఇదొకటి. విజయరామరాజు గజపతి అధికారములో ఉన్నప్పుడు ఒక విశిష్ట సంఘటన జరిగింది. మొగలాయీ సైన్యము దండయాత్రలతో దేశం అల్లకల్లోలముగ ఉంది. తురుష్క సైన్యం దేవాలయాలను ధ్వంసం చేసేవారు. సింహాచల క్షేత్రాన్ని కూడా సేనలు చుట్టుముట్టాయి. కొంతమేర కళ్యాణమండప స్థంభాలను పగలగొట్టారు. కోవెల తలుపులను కూడా విరగ్గొట్టి, లోనికి ప్రవేశించబోయారు. అప్పటికే లోపల ఇద్దరు భక్తులు ఉన్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడిన ఆ భక్తుల పేర్లు గోకులపాటి కూర్మనాథ కవి, హరిహరదాసు. వారిరువురు ముఖద్వారం తలుపులు మూసుకుని స్వామివారి మీద ఆశువుగా శతకమును చెప్పసాగారు. కూర్మనాథకవి పద్యాలను చెప్తూంటే, హరిహరదాసు వ్రాయసాగాడు. వేదవ్యాసుని నుడువులుగా “మహాభారతము” అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన హిందువుల ఇతిహాసమైన “జయం” ను తన దంతముతో వినాయకుడు రాసి పెట్టిన మహత్తర సంఘటన మాదిరిగా ఇక్కడ జరిగింది. “వైరిహరరంహ సింహాద్రి నార సింహ” అనే మకుటముతో సీసపద్య హారము వెలసింది.
బయట ముష్కరుల సైన్యము ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ముట్టడిచేసారు. అప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. వేలాది తేనెటీగల దండు ఒక్కుమ్మడిగా ఆ ముష్కరులపై దాడి చేసాయి.
గుంపులు గుంపులుగా ఆ తేనెటీగలు దుష్టబుద్ధి కల ఆ దుర్మార్గులను తరిమికొట్టాయి. విశాఖ పట్టణములోని “తుమ్మెదల మెట్ట” దాకా శత్రువులను పారద్రోలాయి." చెప్పాడు మోహన్.
"భలే ఉందిరా… కొత్త విషయం చెప్పావు. సర్లే నీ ఆఫీసుకు టైమ్ అవుతోంది కాబోలు, వెళ్ళిపోదాం పదండి." అన్నాడు ప్రభాకరరావు.
మోహన్ తో పాటు అందరూ బయలుదేరారు. మోహన్ తన ఆఫీసుకు కొద్ది దూరంలో దిగిపోయాడు. కారు పైనాపిల్ కొలనీ మీదుగా ముడసర్లోవ ఉద్యానవనం వైపు వెళ్ళింది. అక్కడ నుంచి కైలాస గిరి, వుడా పార్కు తిరిగి, సాయంత్రం రామకృష్ణ బీచ్ కు వచ్చారు. మోహన్ కూడా ఆ సమయానికి అక్కడికి వచ్చాడు. సుధ విజయకు, ప్రభాకరరావుకు బాగా నచ్చింది. ఆ రోజు సోమవారం కావడంతో జూ కి సెలవు. కాబట్టి మరునాడు జూ కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. రాత్రి వరకు తిరిగి, మధ్యాహ్నం సుధ చేసిన ఆహారపదార్థాలు తిని, ఇంకా అక్కడక్కడా దొరికే చిరుతిళ్ళు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింకులు మొదలైనవి కడుపులో తోసేసి, మరి రాత్రి భోజనాలు అవసరం లేదనేటట్లు ఇంటికి వచ్చి వాలిపోయారు నలుగురూ.
******
ఉదయాన్నే సుధ లేచి పూరి, కూర, దద్యోజనం, చక్రపొంగలి చేసి కేరేజీల్లో సర్దింది. మంచి నీళ్ళు నింపి ఉంచింది. ఉదయం తొమ్మిది గంటలకల్లా అందరూ తయారై ఫలహారాలు చేసి, మోహన్ ఆఫీసుకు, సుధ, విజయ, ప్రభాకరరావులు జూ కి బయలుదేరారు. దారిలో పండ్లు కొని, కారులో పెట్టాడు మోహన్. ఇవాళ ఆఫీస్ వ్యవహారాలు పూర్తి చేసేస్తానని, రేపు ఎల్లుండిలో బయలుదేరుతామని చెప్పేడు. జూ అంతా తిరిగి, అనేక జంతువులను చూసి, సాయంత్రానికి ఇల్లు చేరుకున్నారు ముగ్గురూ. మర్నాడు ఆఫీస్ లో సహోద్యోగులకు చిన్న విందు ఇచ్చాడు మోహన్. అందరూ మంచి ఉద్యోగి ఆఫీస్ విడిచి వెళ్తున్నందుకు బాధపడ్డారు. తమ జ్ఞాపకార్ధం తోచిన కానుకలు మోహన్ కు ఇచ్చారు వారందరూ. విందు పూర్తయ్యాక, సుధ, మోహన్ తల్లిదండ్రులతో సినిమాకి వెళ్లి వచ్చారు. తర్వాత ఇంట్లో సామాన్లు అన్ని అట్టపెట్టెలలో సర్దిపెట్టి, మరో పదిహేను రోజులలో ఇల్లు ఖాళీ చేస్తామని యజమానికి చెప్పి వచ్చాడు మోహన్.
మర్నాడు ఉదయాన్నే అవసరమైన కొద్ది వస్తువులను, దుస్తులను తీసుకుని తల్లిదండ్రులు, భార్యతో విజయవాడ బయలుదేరాడు మోహన్. తన తల్లిదండ్రులతో ఫోన్ లో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంది సుధ. వీళ్ళు విజయవాడ బయలుదేరడంతో త్వరలో విజయవాడ వచ్చి వియ్యలవారిని కలుస్తామని, సుధని, మోహన్ ని తమ ఇంటికి ఆహ్వానిస్తామని చెప్పారు సుధ తల్లిదండ్రులు ఉమ, మహేశ్వరరావులు. మోహన్ తల్లిదండ్రులు కూడా సుధ తల్లిదండ్రులతో మాట్లాడారు. అందరూ విజయవాడలో ప్రభాకరరావు ఇల్లు చేరుకున్నారు. ముందుగా ఫోన్ చేసి ఉండడంతో కొంతమంది దగ్గర బంధువులు వచ్చి, ఇంటిని అలంకరించారు. పెళ్లి అయ్యి ఐదేళ్లయినా ఇంటికి తొలిసారి కోడలు అడుగుపెట్టే వేళ ఘనంగా స్వాగతమిచ్చారు. మంగళ తోరణాలు, ముత్యాల రంగవల్లులు, మేళతాళాలు, హారతులతో నూతన దంపతుల్లా మోహన్ ను, సుధని లోపలికి ఆహ్వానించారు. కొత్త పెళ్లికూతుర్లా సుధ సిగ్గుపడింది. మోహన్ కూడా ఇంత ఘన స్వాగతానికి ఆశ్చర్యపోయి, తర్వాత సిగ్గుపడ్డాడు. ఛలోక్తులతో వరుసైన వారు అందరూ కాసేపు ఇద్దర్నీ ఆటపట్టించారు.
"అయితే ఇప్పుడు వీరిద్దరికి మళ్ళీ శోభనం చెయ్యాలా?" అడిగింది ఓ పెద్ద ముత్తైదువ.
"మనం శోభనం ఏర్పాటు చేస్తేనే కానీ పిల్లలను కనమని భీష్మించుకు కూర్చున్నట్లున్నారు కదా, చెయ్యవద్దా మరి?" అన్నాడు ఆమె భర్త.
అందరూ గొల్లున నవ్వారు. సుధ ముసిముసిగా నవ్వింది. మోహన్ కాస్త ఇబ్బంది పడుతూ నవ్వాడు. అక్కడ నుంచి లేచిపోబోయాడు. "ఆగు బావా ఎక్కడికి పారిపోతావు?" అంటూ చేయి పట్టుకుని తిరిగి కూలేశారు మరదలి వరుసైనవారు. ఇంతలో ఎవరో వస్తున్నారని వీధిలో ఆడుకుంటున్న పిల్లలు కేకేశారు. వచ్చి చూస్తే, సుధ తల్లిదండ్రులు ఉమ, మహేశ్వరరావులు చీర, సారెలతో వచ్చారు. సుధ తల్లిని చూసి పరుగున వచ్చి హత్తుకుపోయింది. అందరూ లోపలికి వచ్చారు. సుధని మళ్ళీ పెళ్లికూతురు గా ముస్తాబు చేశారు. అందరూ చేతులకు గోరింటాకులు పెట్టుకున్నారు. బంతి భోజనాలు చేశారు. ఆఖరిగా అందరూ కలిసి సుధ మోహన్ లను అలంకరించిన పడకగది లోకి తోసారు. అందరూ కిలకిలా నవ్వుకుంటూ తలుపులు మూశారు.
పెద్దవాళ్ళు అందరూ కూర్చుని వంశ పరిచయాలు, బాంధవ్యాలు కలుపుకోవడం, అటువైపు, ఇటువైపు తెలిసినవారు ఉంటే ఆ వివరాలు మాట్లాడుకున్నారు. మంచి సంబంధమే అయినందుకు ఇరుపక్షాల వారు ఆనందించారు. నిద్రవేళ కావడంతో వరుసగా హాలులో పక్కలు పరుచుకొని కొందరు, గదుల్లో కొందరు, వీధి వరండాల్లో కొందరు నిద్రపోయారు.
******
మరో రెండు రోజుల ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా గడిచిపోయింది నసీర్ బృందానికి. తేనెటీగల దాడిలో గాయపడిన వారు పూర్తిగా కోలుకున్నారు. దారిలో ఎక్కడా గిరిజన తండాలు కానీ, ప్రాచీన కట్టడాలు లేదా దిబ్బలు కానీ, దేవతా మూర్తులు కానీ వారికి కనబడలేదు. "అసలు సరైన దిశలోనే వెళ్తున్నామా?" అని అనుమానం వచ్చింది అనుచరులకు. ఒకడు ధైర్యం చేసి అడిగేసాడు నసీర్ ని.
"రెండు వందల సంవత్సరాల నాటి నిధి. అందరూ తిరిగే దారుల్లో ఉంటుందా? అప్పటి నగరాలు ఇప్పుడు ఇలా అడవుల్లా మారిపోయి ఉండొచ్చు. మనం కొంచెం ఓపిక పట్టాలి" అన్నాడు నసీర్. ఎక్కడా నిప్పు వెలిగించకుండా దొరికిన కాయ కసుర్లు, దుంపలు, పండ్లు లేదా తెచ్చుకున్న రొట్టెలు వీటితోనే కడుపు నింపుకుంటున్నారు. నోరు చచ్చుపడినట్లు ఉంది. నాలుక మొద్దుబారినట్లుంది. మధ్యాహ్న సమయానికి ఒక కొండవాగు ప్రాంతానికి చేరారు. కాస్త మైదాన ప్రాంతం, పలుచగా గడ్డి ఉంది. దూర దూరంగా చెట్లు ఉన్నాయి. వీరు వచ్చిన దారికి ఉత్తర దక్షిణాలుగా అడవి వ్యాపించి ఉంది. కొండవాగు కొంతదూరం ప్రవహించి, రాళ్లలోకి ఇంకిపోతోంది.
ఒక అనుచరుడు నసీర్ వైపు చూసాడు. "వంట మొదలుపెట్టండి" అన్నాడు నసీర్. వెంటనే ఉత్సాహంగా మూటలు విప్పి, పాత్రలు, పిండి తదితరాలు బయటకు తీశారు. సంచుల్లో నీరు నింపి తెచ్చారు. పుల్లల కోసం కొందరు, పిట్టలు లేదా కోళ్లు లేదా కుందేళ్లు ఏవి దొరికితే అవి వేటాడడానికి కొందరు పరుగెత్తారు. వెడల్పాటి ఆకులు కోసుకొచ్చి అప్పటికప్పుడు విస్తర్లు కుట్టారు. గబగబా పిండి కలిపి రొట్టెలు చేశారు. రాళ్లతో నాలుగు పొయ్యిలు పెట్టి రొట్టెలు కాల్చారు. తెచ్చిన జంతు, పిట్ట మాంసాలు శుభ్రం చేసి వెదురు గొట్టాలలో పెట్టి, మట్టి పట్టీ వేసి కాల్చి సిద్ధం చేశారు. వంట పూర్తయ్యింది. కడుపునిండా భోజనాలు చేశారు. అన్నీ శుభ్రం చేసి, ఎక్కడి సామాన్లు అక్కడ సర్దిపెట్టి, వాగు ఒడ్డునే చల్లగాలికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఉండుండి ఒక పిట్ట అరుపు మాత్రమే వినిపిస్తోంది. బహుశా దగ్గరలో చెట్లు లేకపోవడం వలన పిట్టల కూతలు ఎక్కువగా లేవేమో అనుకున్నాడు నసీర్. ఒక గంట విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ అందరూ బయలుదేరారు. మళ్ళీ పిట్టకూత వినిపించింది. ఇంతలో వారికి కుడివైపు అటవీ మార్గంలో ఏదో అలికిడి అయ్యింది. అందరూ ఆగిపోయారు. ఏదో గాడిద లాంటి జంతువు గడ్డి కొరుకుతూ వస్తోంది. కొత్త వాసన పసిగట్టి, ముక్కు ఎగబీలుస్తూ ఇటే వస్తోంది. "ఈ జంతువు ప్రమాదకరమైందో కాదో తెలీదు. కానీ గడ్డి కొరుకుతూ వస్తోంది కాబట్టి అంత ప్రమాదకరం కాదు అనిపిస్తోంది. భయపడకండి, కానీ సిద్ధంగా ఉండండి." అన్నాడు నసీర్.
ఆ జంతువు వస్తూనే వాసన చూస్తూ, అప్పటివరకు వండి, వడ్డించిన ఇద్దరి చుట్టూ తిరగసాగింది. వారికి తన వీపు రాసింది. ఆ చేష్టలు ఎవరికి అర్ధం కాలేదు. మిగిలిన వారిలో ఒక అనుచరుడు తిని పారేసిన ఆకుల నుంచి ఒక ఆకు తెచ్చి ఆ జంతువు ముందు వేసాడు. వాసన చూసి, ఎంతో ఇష్టంగా ఆ ఆకును తినేసింది. మోర ఎత్తి, సకిలించి, మళ్ళీ వచ్చిన దారినే వెళ్ళింది. వీళ్ళు ఇంకా పది అడుగులైనా వేయక ముందే మరో జంతువును తోడు తెచ్చుకుంది. ఇప్పుడు రెండూ కలిసి వీరి చుట్టూ తిరగడం ప్రారంభించాయి. మరికొన్ని ఎంగిలి ఆకులు తెచ్చి వేశారు అనుచరులు. మహదానందంగా తినేసాయి. ఒకటి దారి చూపిస్తున్నట్లు బృందానికి ముందు నడవసాగింది. మరొకటి వండిన వాడి పక్కనే నడుస్తోంది. వాడికి ఆలోచన వచ్చి, తన సంచి తీసి, ఆ జంతువు వీపుపై వేసాడు. బుద్దిగా అలాగే నడుస్తోంది. మరో ఇద్దరు తమ సంచులు కూడా వేశారు. బరువులు మోయడం తనకు అలవాటే అన్నట్లు నడుస్తోందది. వెంటనే తమ అందరి దగ్గర ఉన్న సంచులు రెండు జంతువుల మీద వేసి తాళ్లతో కట్టి, ఆ తాడు చేతితో పట్టుకుని నడవసాగారు. ఒక్క పిట్ట అరుపు, దాని జత అరిచిన అరుపు తప్ప వేరే కూతలు వినరావడం లేదు.
జంతువులు వచ్చిన మార్గం, దిక్సూచి ఆధారంగా తాము వెళ్ళవలసిన మార్గం ఒకటే కావడంతో అటువైపే దారితీసాడు నసీర్. ఒక అరగంట నడవగానే ఒక ఎత్తైన దిబ్బ లాంటి ప్రాంతం కనిపించింది. అక్కడ కొండరాళ్లు ఒక క్రమంలో నిలబెట్టబడి ఉన్నాయి. ఒక పెద్దరాతికి ఏవో చెట్ల ఆకులు చుట్టబడి ఉన్నాయి. కొంత సంతోషం అనిపించింది నసీర్ కి. అంటే ఇటువైపు జనావాసం ఏదో ఉందన్నమాట. వారివే ఈ గాడిదల వంటి జంతువులు అయి ఉంటాయని అనుకున్నాడు.
మళ్ళీ అదే పిట్ట కూత. ఈసారి కాస్త దగ్గరగా వినిపించింది. కూతకు ప్రతిస్పందన గా నాలుగైదు పిట్టకూతలు ఒకేసారి వినిపించాయి. గాడిదల వంటి జంతువులు పరుగు అందుకుని దిబ్బపైకి వెళ్లిపోయాయి. అదే క్షణంలో సర్రు సర్రున వెదురు బాణాలు వచ్చి కొన్ని నేలలోనూ, కొన్ని అనుచరులు అందరి గుండెల్లోనూ దిగబడ్డాయి. నెత్తురోడుతూ ఉండగా అనుచరులందరూ ఒకేసారి నేలకూలారు. నసీర్ చుట్టూ వలయాకారంలో బాణాలు పడ్డాయి. దాడి చేసినవారు ఎవరూ కనిపించలేదు. బహుశా చెట్ల మీద నుండి బాణాలు వేస్తున్నారు అనుకున్నాడు. ఈ హఠాత్ దాడికి నసీర్ బుద్ధి నిశ్చలమైపోయింది. అనుచరులందరూ ఒకేసారి మరణించడంతో నిరుత్తరుడయ్యాడు. ఆయుధం చేతిలోకి తీసుకున్నా, ఎవరికి గురిపెట్టాలో అర్ధంకాలేదు.
గొంతు పెగుల్చుకుని "ఎవరు?… ఎవరది? ఎవరు ఈ దాడి చేసింది? మేము దోపిడీగాళ్ళం కాదు. బాటసారులం" అన్నాడు. బిలబిల్లాడుతూ చెట్ల పై నుంచి దూకి, చెట్లు, పొదల చాటు నుంచి పాతికమంది కుర్రాళ్ళు వచ్చారు. అచ్చమైన నాగరిక వాసన సోకని ఆటవికులు వారు. చేతిలో విల్లమ్ములు ఉన్నాయి. శరీర వర్ణమో, రంగు పూసుకున్నారో తెలియనట్లు నల్లగా ఉన్నాయి శరీరాలు. తెల్లని, ఎర్రని గీతలు ముఖంపై, ఛాతిపై ఉన్నాయి. ఆకులు, కొమ్మలు నడుముకు చుట్టుకున్నారు కొందరు. కొందరు దిగంబరంగానే ఉన్నారు. కింద పెదవికి ఒక పుల్ల లేదా ఎముక వంటిది గుచ్చి ఉంది. పెదవి వేలాడుతూ ఉంది. కొందరి మెడలో పూలతీగలు ఉన్నాయి. ఈకలు పూవులతో ఉన్న కిరీటం లాంటిది కొందరి తలపై ఉంది. జుట్టు పొడుగ్గా ఉంది. విల్లమ్ములు ఎక్కుపెట్టి నసీర్ వైపు చూసారు. దిబ్బ మీద ఉన్న జంతువుల వైపు చూసారు.
ఆటవికులు రాగానే ఆ జంతువులు దిబ్బ మీద నుండి దిగి ఆటవికుల దగ్గరకు వచ్చాయి. వాటి వీఫు మీద నిమిరారు. నోరు వాసన చూసారు. గోలగోలగా అరుస్తూ ఒకరితో ఒకరు కీసరబాసర గా మాట్లాడుకున్నారు. అందరూ విల్లమ్ములు దించారు. నసీర్ కు ఆశ చిగురించింది. ఏదో చెప్పబోయాడు. ఒకడు విల్లెత్తి నసీర్ మీద ఒకే ఒక బాణం వేసాడు. సూటిగా నసీర్ గుండెల్లో దిగబడింది. మాట, పలుకు లేకుండా పడి చనిపోయాడు నసీర్. ఆ సరికే అనుచరుల దేహాలు నల్లగా మారిపోయి ఉన్నాయి. వెదురు బాణాలకు విషం పూయబడి ఉందేమో… పక్షి కూతను అనుకరిస్తూ ఒకడు కూసాడు. మరి కొన్ని కూతలు ప్రతిధ్వనిలా వినవచ్చాయి. మరికాసేపటిలో ఇంకొంతమంది ఆటవికులు వచ్చారు. అక్కడే వరుసగా తొమ్మిది శవాలను పేర్చి, మట్టి, ఆకులలములు, చెత్త, కొమ్మలు అన్నీ తెచ్చి పోశారు. దిబ్బ మరికాస్త వెడల్పు అయ్యింది. తొమ్మిది కొండ రాళ్లను తెచ్చి నిలబెట్టారు. పక్షి కూతలు కూస్తూ వాటి మీద ఉన్న సంచులతో సహా జంతువులను తోలుకొని వెళ్లిపోయారు.
నసీర్ కి పట్టిన ఈ గతి మిగతావారికి తెలియజేసేది ఎవరు? బయటి ప్రపంచానికి ఈ విషయం ఎలా తెలుస్తుంది? మరకత మణి హారం అన్వేషణలో ఒకరి పాత్ర ఇలా ముగిసింది.
****సశేషం****
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల... ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.
ముందుమాట:
"అనామిక" అనే ఈ నవల 90' లలో మొదలైన ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? అనామిక ఎవరు? ఆ ప్రేమ జంటకి అనామికకు సంబంధం ఏమిటి? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది.
దైవిక శక్తులతో ఆటలాడడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాంటి వారిని శిక్షించే పని భగవంతుడే వివిధ రూపాలలో పూర్తి చేస్తారు. అలా జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ నవల రూపు దిద్దుకుంది.
ఈ నవల మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ....మీ అభిప్రాయాలను, సూచనలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ.. "అనామిక" నవలను సీరియల్ గా ప్రచురిస్తున్న సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమప్రియ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ...
- నాగమంజరి గుమ్మా, శృంగవరపుకోట