మధు, లక్ష్మిలు వెళ్లిన రెండు రోజుల తర్వాత మోహన్ కు ఫోన్ వచ్చింది. మోహన్ తల్లితో కలిసి బయలుదేరి వస్తున్నట్లు తండ్రి చెప్పాడు. సుధ, మోహన్ రైల్వేస్టేషన్ కు బయలుదేరి వెళ్లారు. రైలు పెట్టెలన్ని వెదుకుతూ వస్తుండగా, "మోహన్" అనే పిలుపు వినిపించి, తిరిగి చూసాడు మోహన్. మోహన్ అమ్మ, నాన్న విజయ, ప్రభాకరరావు. "అత్తయ్యా" అంటూ సుధ, "అమ్మా, నాన్నా" అంటూ మోహన్ గబగబా వెళ్లి, కాళ్లకు నమస్కరించారు. పెళ్లి అయ్యాక ఇదే మొదటిసారి సుధ వారిని, వాళ్ళు సుధని చూడటం. పెద్దవాళ్ళ చేతిలోని బేగ్ లను అందుకున్నారు ఇద్దరూ. ఆటో ఎక్కి ఇంటికి చేరుకున్నారు.
"నువ్వు ఇక్కడ ఉన్నావని మీ నాన్న చెప్పగానే నాకు మనసాగలేదురా మోహన్. వెంటనే బయలుదేరి వెళదాం అన్నాను. అక్కడ కొన్ని పనులు పూర్తిచేసుకుని ఇదిగో నిన్న రాత్రి బయలుదేరాం. ఆ సమయానికి ప్యాసింజర్ ఒకటే ఉంది. సరే లెమ్మని అదే ఎక్కేసాము" అంది విజయ, మోహన్ తల నిమురుతూ.
"కాసేపటి తర్వాత ఒక ఎక్స్ ప్రెస్ రైలు ఉందిరా… ఇంతసేపు రైల్వేస్టేషన్ లో కూర్చోడం నా వల్ల కాదు, ఏదో ఒక రైలు ఎక్కాల్సిందే అని పట్టుబట్టి ప్యాసింజర్ ఎక్కించేసింది మీ అమ్మ. రైలులో కూర్చున్నాక, 'ఏవండీ, రైలు ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచేస్తే, మనం ఇంకొంచెం తొందరగా విశాఖపట్నం వెళ్లిపోవచ్చు కదూ' అని కూడా అడిగింది" అన్నాడు ప్రభాకరం. సుధ ముసిముసిగా నవ్వుకుంది, అత్తగారికి కనబడకుండా…
ఇంటికి చేరుకున్నాక, అటూ ఇటూ వెతికింది విజయ.
"ఎవరికోసం చూస్తున్నావమ్మా?" అడిగాడు మోహన్.
"పిల్లలు… " నసిగింది విజయ.
"ఇంకా లేరమ్మా… ఆర్ధికంగా కొంచెం స్థిరపడేవరకు వద్దనుకున్నాం" అన్నాడు మోహన్.
"ఆర్ధికంగా స్థిరపడటం ఏమిటిరా వెధవా? మేం చచ్చామనుకున్నావా? మన ఆస్తిపాస్తులు వద్దనుకున్నావా?" ఖయ్యిమన్నాడు ప్రభాకరం.
"అదేం లేదు నాన్నా… మీరు ఇలా రోడ్డు మీద అరవకండి. లోపలకు పదండి, అన్ని విషయాలు మాట్లాడుకుందాం" అన్నాడు మోహన్.
అప్పటికే తాళం తీసి, లోపలికి వెళ్లి, కాఫీ పెట్టింది సుధ. మామగారి కేకలు లోపలికి వినబడుతున్నాయి. ముగ్గురూ కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి కూర్చోగానే, కాఫీ, మంచినీళ్లు అందించింది.
"ఏమిటమ్మాయి మీ వరస? నువ్వైనా చెప్పొద్దూ వీడికి?" అన్నాడు ప్రభాకరం. ఇంకా సుధ మాట్లాడకుండానే "అయినా నువ్వేం చెప్తావులే. వీడొట్టి మొండిఘటం. వీడు అనుకున్నదే చేస్తాడు కానీ ఒకరు చెప్పేది వినడు." అన్నాడు ప్రభాకరం.
కాఫీలు తాగేక, "మీరు స్నానం చేసి రండి. ఈలోగా టిఫిన్ చేసి ఉంచుతాను." అంది సుధ.
విజయ, ప్రభాకరం స్నానం చేసి వచ్చేసరికి పెసరట్టు, ఉప్మా చేసి ఉంచింది. మళ్ళీ కాఫీ పెట్టి ఫ్లాస్కులో పోసి ఉంచింది.
"అన్నీ మంచి శకునములే… కోరిక తీరే సూచనలే… మనసున మంగళ వాద్య మాహా మోగెనే" సన్నగా పాడుకుంటూ, వంటింట్లో సుధకు సహాయం చేయసాగాడు మోహన్.
"మోహన్, ఇలారా!" తండ్రి పిలుపుకు, సుధ బుగ్గ మీద చిటికేసి, చేతిలో పని పక్కన పెట్టి, తండ్రి పిలుపు వినబడిన వైపు వెళ్ళాడు మోహన్.
"ఇదిగో, మీ అమ్మకు కోడలిని ఇంటికి తీసుకువచ్చేవరకు కూడా ఆతృత ఆగదు. నీ భార్యకు ఇవ్వాలనుకున్న నగలు ఇవిగో.. తీసుకెళ్లు" అన్నాడు ప్రభాకరం.
"నేను సుధని పిలుస్తాను. మీరే ఇవ్వండి అమ్మా, నాన్నా" అన్నాడు మోహన్.
"సుధా" అక్కడనుంచే కేకేశాడు. చేతులు తుడుచుకుని సుధ వచ్చింది. విజయ, ప్రభాకరం ఇద్దరూ కలిసి నగలున్న పెట్టె సుధకు ఇచ్చారు. "ఇంటికి వచ్చే కోడలికి పెళ్లిలో పెట్టాలని కొన్న నెక్లెస్, వంశ పారంపర్యంగా కోడలికి పెట్టే చంద్రహారాలు ఈ పెట్టెలో ఉన్నాయి. తీసుకో సుధా." అని చెప్పింది విజయ. పెట్టె అందుకుని అత్త, మామల కాళ్ళకు నమస్కరించింది సుధ.
"కోడలి మెడలో వెయ్యరా అబ్బాయ్!" అన్నాడు ప్రభాకరం
మోహన్ సిగ్గుపడుతూ "అబ్బే నేనెందుకూ… తనే వేసుకుంటుంది నాన్నా.. "అన్నాడు.
"తర్వాత మెలికలు తిరగొచ్చు, ముందు చెప్పిన పని చెయ్యి" గదమాయించాడు ప్రభాకరం.
ఈలోగా పెట్టెలో నుంచి పట్టుచీర, సంచిలో నుండి పువ్వులు పండ్లు కూడా తీసి ఒక పళ్ళెంలో పెట్టి బొట్టుపెట్టి సుధకు అందించింది విజయ.
తండ్రి గదమాయించడంతో తప్పనిసరై చంద్రహారం గొలుసు సుధ మెడలో వేసాడు.
"ముందు టిఫిన్ తినడానికి రండి మామయ్య గారూ, తర్వాత ఇవన్నీ వేసుకుంటాను" అంది సుధ. "సరే"నని డైనింగ్ టేబుల్ వైపు బయలుదేరారు ముగ్గురూ.
టిఫిన్లు అయ్యాక, "మోహన్ సాయంత్రం రైలుకు విజయవాడ వెళ్లిపోదాం అందరం." అన్నాడు ప్రభాకరం.
"అదీ… నాన్నా… ఆఫీస్ లో సెలవుకు చెప్పలేదు." నసిగేడు మోహన్.
"ఎలాగూ వదిలేసేదే కదరా…ఏమైంది ఇప్పుడు…మన ఇంటికి వచ్చేస్తే ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో ఏదో ఒకటి చేసుకుందువులే" అన్నాడు ప్రభాకరం.
"అమ్మా! నువ్వైనా చెప్పు నాన్నకి, ఇన్నాళ్లుగా నాకు తిండిపెట్టిన, ఉద్యోగం ఇచ్చిన సంస్థ కి చెప్పకుండా ఎలా మానేస్తాను? ఇంటికి వస్తానని చెప్పేను కదా… కొంచెం ఓపిక పట్టమనమ్మా." తల్లిని బతిమలాడేడు మోహన్.
తండ్రి దగ్గర మోహన్ కు గల భయభక్తులకు అశ్చర్యపోతూనే, "అవునత్తయ్యా… రెండు రోజులుండి ఈ ఊరి విశేషాలు చూడండి. మీ అబ్బాయి ఉద్యోగం విషయం పూర్తిచేసుకుని వస్తారు. అందరం కలిసి శనివారం నాడు వెళ్లిపోదాం." అంది సుధ.
"ఏమంటారు?" అన్నట్లు చూసింది విజయ భర్త వైపు. "ఏదో ఒకటి తగలడండి" అంటూ హాల్ లోకి వెళ్లిపోయాడు ప్రభాకరం. టివి పెట్టి, వెళ్లి వస్తానని సుధకు, తల్లిదండ్రులకు చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు మోహన్.
అత్త, కోడలు కుటుంబాలకు చెందిన కబుర్లు చెప్పుకుంటూ వంటపనిలో పడ్డారు.
****
విజయన్ మద్రాసు వెళ్ళగానే తన అన్వేషణకు సంబంధించి ఒక పథకం వేసాడు. స్థానికంగా ఉన్న ధనవంతులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, వ్యాపారస్తులు మొదలైన వారితో ఒక విందు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. 'నేను కొత్తగా బంగారు నగల వర్తకంలోకి దిగుతున్నాను. ప్రాచీన ఆభరణాల మోడల్స్ అన్నీ కొత్తగా పరిచయం చేయదలచుకున్నాను' అని చెప్పి, రూపొందించిన కొన్ని పాతకాలపు ఆభరణాల డిజైన్లను ప్రదర్శించాడు. సమావేశ మందిరంలో మూడడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పు చిత్రాలతో సుమారు యాభై డిజైన్లు ప్రదర్శించాడు. చాలా గొప్పగా, విలక్షణంగా ఉన్న ఆ ప్రాచీన కాలపు డిజైన్లను చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు.
"వందల ఏళ్ల కిందట నిర్మితమైన దేవాలయాల మీద ఉన్న శిల్పాల నుండి స్వీకరించిన డిజైన్లు ఇవి"అని తెలియజేశాడు.
అందరూ ఆ డిజైన్లను చాలా మెచ్చుకున్నారు. "ఇంకా ఎవరి దగ్గరైనా రకరకాల ప్రాచీన డిజైన్లు లేదా ఆభరణాలు ఉంటే చూపించవచ్చని" కోరాడు. చాలామంది ఆభరణాల డిజైన్లను పరిశీలించారు. కొంతమంది తమ దగ్గర ఉన్న వారసత్వంగా వచ్చిన ఆభరణాలను చూపిస్తామని చెప్పారు. తన అన్వేషణ ఫలించనున్నదని పొంగిపోయాడు విజయన్. ఆసక్తిగా చూస్తున్న వారి మధ్య తిరుగుతూ, వారి మాటలను వింటూ కొందరిని గుర్తు పెట్టుకున్నాడు. విందు ముగిసిన తర్వాత తన ప్రణాళికకు తుది రూపం ఇచ్చుకున్నాడు.
*****
నసీర్, జేమ్స్ కూడా తమ తమ ప్రయత్నాలను ప్రారంభించారు. వారికి దైవ భీతి లేదు కాబట్టి మొదటగా వందల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయాలను ఎంచుకున్నారు. వాటి వివరాలు సేకరించమని తమ అనుచరులను ఆదేశించారు.
నసీర్ తూర్పు రాష్ట్రాలైన బెంగాల్, బీహార్ లతో సహా ఈశాన్య రాష్ట్రాలలో తన అన్వేషణ ప్రారంభించాడు. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అస్సాం, మేఘాలయ, త్రిపుర, అరుణాచలప్రదేశ్, (సిక్కిం ను కలుపుకొని) లలో చిక్కని అడవులు, కొండ ప్రాంతాలు చాలా ఎక్కువ. అక్కడ క్రైస్తవ మత వ్యాప్తి కూడా ఎక్కువే. ఇక్కడి గిరిజన జాతుల వారు క్రైస్తవంలోకి మారినా, త్రిపుర లో ఉన్న పురాతన కాలం నాటి రాజవంశానికి చెందిన రాజమహలు, అస్సాంలో ఉన్న కామాఖ్య దేవి శక్తి పీఠం మొదలగు ప్రదేశాలు, ఇంకా లోయల్లో ఆదిమ జాతులకు సంబంధించిన స్థానిక దేవతల కొలువులు ఎన్నో ఉన్నాయి. కొన్ని పట్టణాలుగా మారిపోయాయి. ఏదీ విడిచిపెట్టకుండా అనేక శ్రమలకోర్చి తాను కూడా కొన్ని ప్రదేశాలలో స్వయంగా అన్వేషణ కొనసాగించాడు నసీర్.
***
పదిమంది అనుచరులను వెంటబెట్టుకుని దట్టమైన నాగాలాండ్ అడవులలోకి అడుగుపెట్టాడు నసీర్. నడక తప్ప వేరే రవాణా సదుపాయం ఉండని, అసలు మార్గమే లేని దుర్గమారణ్యం అది. అనుచరులలో ప్రతివాడు దాదాపు పదిహేను కేజీల బరువైన బేగ్ ను వీపుకు తగిలించుకున్నాడు. వాటిలో ఒక వారానికి సరిపడా ఆహార పదార్ధాలు, మందులు, నీరు, కొన్ని అత్యవసర ఆయుధాలు ఉన్నాయి. తలకు బ్యాటరీ తో నడిచే లైటు ఉన్న ఇనుపటోపీ పెట్టుకున్నారు. చేతుల్లో కత్తి, గొడ్డలి, తుపాకీ వంటి మారణాయుధాలు ఉన్నాయి. కత్తి, గొడ్డలి పట్టుకున్న అనుచరులు ఇద్దరు ఎదురుగా ఉన్న తీగలు, లతలు, కొమ్మలు నరుకుతూ దారి చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. నసీర్ చేతిలో దిక్సూచి ఉంది. దాని ప్రకారం ముందుకు వెళుతున్న వారికి సూచనలు ఇస్తున్నాడు. అందరూ నిశ్శబ్దంగా నడుస్తున్నారు. ఎక్కడో కూస్తున్న పక్షుల కూతలు, చిమ్మెటల వంటి కీటకాల రొదలు, కాళ్ళ కింద పడి నలుగుతున్న పుల్లల చప్పుళ్ళు మాత్రమే వినిపిస్తున్నాయి.
'విదేశీయునికి కల వచ్చింది విశాఖపట్నం ప్రాంతంలో కావచ్చు. కానీ ఆ హారం అక్కడే ఉండాలనే నిబంధన లేదు. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ధగ్గులు, పిండారీలనే దారిదోపిడీ బృందాలు వర్తకుల గుంపులు మీద, ఊళ్ళ మీద పడి, దోచుకుపోయేవారు. ఎదురొచ్చిన వారిని హతమార్చేవారు. ఆ తర్వాత కాలంలో వారినందరిని అణిచివేసింది బ్రిటిష్ సైన్యం. అలాంటి దొంగల గుంపేదో అమ్మవారి ఆభరణం అపహరించి ఉండొచ్చు. వారిని తుపాకుల వంటి మారణాయుధంతో చంపి అవతలివారు హారాన్ని ఎత్తుకుపోయారు. ఆ శబ్దాన్ని పిడుగు శబ్దంగా దూరంగా ఉన్న గ్రామాల వారు భావించారేమో. బ్రిటిష్ వారితో, వారి యొక్క క్రైస్తవ మిషనరీలతో ఈశాన్య రాష్ట్రాల వారికి అనుబంధం ఉంది. కనుక ఆ ఆభరణం ఈ ప్రాంతాల్లో ఉండవచ్చు. లేదా వారిలో ఒకరు ఆ హారంతో పారిపోయి ఉండవచ్చు. ఆ హారం బయట పడితే తన ప్రాణాలకు కూడా ప్రమాదమని భావించి, రహస్యంగా దాచి ఉండవచ్చు.' అన్నది నసీర్ ఊహ. అందుకే మిగతా ప్రాంతాలకు అనుచరుల సమూహాలను పంపించి, తాను మాత్రం ఈవైపు వచ్చాడు.
ఆలోచిస్తూనే ముందుకు సాగుతున్నాడు నసీర్. అప్పటికి నాలుగు రోజులై ప్రయాణం సాగుతోంది. సూర్యోదయం తోనే అన్వేషణకు బయలుదేరు తున్నారు. మధ్యలో పది నిమిషాలు అల్పాహారం, భోజనాలు కోసం, విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశంలో ఆగుతున్నారు. ఐదోరోజు మళ్ళీ ప్రయాణం మొదలైంది. మిట్ట మధ్యాహ్నం కావస్తోంది అయినా అడవి దట్టంగా ఉండటం వలన ఎండ వేడిమి అంతగా తెలియడం లేదు. వెనుదిరిగి అనుచరుల ముఖాలు చూసాడు. ఏకబిగిని నడవడం వలన అలిసిపోయినట్లు ఉన్నారు. ఈ అన్వేషణ ఎన్నాళ్ళో తెలియదు. ప్రారంభించిన మొదట్లోనే అందరూ అలిసిపోతే ప్రయాణం ముందుకు సాగదు. అందరూ దృఢకాయులు గనుక బరువులు మోస్తూ కూడా నడుస్తున్నారు. దారిలో కనిపించే పళ్ళు కాయలు ఏరుకుని తింటూ, కొన్ని భద్రపరచుకొంటూ, మంచినీళ్లు కనిపిస్తే సీసాలలో నింపుకుంటూ నడుస్తున్నారు. మధ్యాహ్నం భోజనానికి, విశ్రాంతికి అనువైన స్థలం చూసి ప్రయాణాన్ని ఆపమని అనుచరులకు చెప్పాడు నసీర్.
చిన్న నీటి మడుగు కనిపించిన చోట కాస్త దూరంగా ఒక ప్రదేశాన్ని చదును చేశారు. తాము తెచ్చిన బేగ్ లలోనుంచి గుడ్డలు తీసి ఒక చిన్న తాత్కాలిక గుడారాన్ని నిర్మించారు. తమ బేగ్ లన్నీ ఒక పక్కన పెట్టారు. ఇద్దరు ఖాళీ అయిన మంచినీళ్ల సీసాలు మడుగులో నీటితో నింపుతున్నారు. మరో ఇద్దరు చుట్టుపక్కల ఏవైనా చిన్న చిన్న జంతువులు ఆహారానికి పనికొచ్చేవి, దొరుకుతాయేమోనని వెతకడానికి వెళ్ళేరు. పెద్ద పెద్ద జంతువుల జోలికి పోవద్దని నసీర్ ముందే హెచ్చరించాడు. ఇంకో ముగ్గురు చుట్టుపక్కల ఉన్న చితుకులు, ఎండుపుల్లలు ఒక చోట చేర్చే పనిలో పడ్డారు. మిగతా వాళ్ళు వంటకు, తినడానికి కావలసిన మిగతా ఏర్పాట్లు చూస్తున్నారు.
వెతకడానికి వెళ్లినవారు అడవి కోళ్లు, కుందేళ్లు తీసుకువచ్చారు. వెదురు పొదలు నరికి వెదురు బియ్యం, పొదలను తవ్వి, దుంపలు తెచ్చారు. మడుగులో ఉండే చేపలు, పీతలు పట్టారు. నిప్పు రాజేసి అవన్నీ నిప్పులపై కాల్చారు, కొన్నింటికి ఒండ్రుమట్టి పట్టించి మట్టితో సహా కాల్చారు, వెదురు బియ్యంతో గంజి కాచారు, సేకరించిన వెడల్పాటి అడవి ఆకులలో అన్ని వడ్డించుకుని తిన్నారు. పొద్దు కాస్త వాలే వరకు విశ్రాంతి తీసుకున్నారు. ఇంక బయలుదేరుదామన్నాడు నసీర్. మిగిలిన ఆహారపదార్థాలు మూటకట్టారు. గబగబా ఎక్కడివక్కడ సర్దేసారు. నిప్పు రాజేసిన గుర్తులు కూడా కనబడకుండా చెరిపేసి, ఆకులలములతో కప్పేసి, అందరూ బయలుదేరారు.
****సశేషం****
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల... ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.
ముందుమాట:
"అనామిక" అనే ఈ నవల 90' లలో మొదలైన ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? అనామిక ఎవరు? ఆ ప్రేమ జంటకి అనామికకు సంబంధం ఏమిటి? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది.
దైవిక శక్తులతో ఆటలాడడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాంటి వారిని శిక్షించే పని భగవంతుడే వివిధ రూపాలలో పూర్తి చేస్తారు. అలా జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ నవల రూపు దిద్దుకుంది.
ఈ నవల మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ....మీ అభిప్రాయాలను, సూచనలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ.. "అనామిక" నవలను సీరియల్ గా ప్రచురిస్తున్న సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమప్రియ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ...
- నాగమంజరి గుమ్మా, శృంగవరపుకోట