
"మీ ఇంటికి ఎప్పుడు వెళతారు మోహన్?" అడిగాడు మధు టీ తీసుకుంటూ.
"అమ్మ, నాన్న వస్తామన్నారు కదా, వాళ్ళు రానీ, చూద్దాం." అన్నాడు మోహన్.
"అంత నిరాసక్తంగా చెప్తున్నావేంటి మోహన్?" అన్నాడు మధు.
"నన్ను చూసినప్పుడు మాత్రమే మా నాన్నకు నేను గుర్తొచ్చానటరా? ఇన్నేళ్లు ఒక్క ఉత్తరమైనా రాయలేదు… ఎలా ఉన్నామని పలకరింపు లేదు. ఇక్కడ నాకేం లోటు లేదు. నిజానికి ఇక్కడే బాగుంది. జీవితం అంటే ఏమిటో తెలుస్తోంది. అవసరమైన సందర్భంలో ఆపద్బాంధవునిలా నువ్వు ఆదుకున్నావు. మాకు ఆసరాగా నిలబడ్డావు. చాలు" అన్నాడు మోహన్.
"తప్పురా. అప్పుడు కోపగించుకున్నంత మాత్రాన వదిలేసుకుంటామా? అమ్మ, నాన్న కాకపోతే మన పెళ్లి విషయంలో ఆగ్రహించేది, ఆనందించేది ఇంకెవరుంటారు చెప్పు? ఎలాంటి సంకోచాలు పెట్టుకోకు." అన్నాడు మధు మందలింపుగా.
"అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని" విషాదగీతం ఎత్తుకుంది సుధ.
"హఠాత్తుగా నీకేమైంది? ఇప్పుడు ఆ విషాద గీతమేమిటి? అయినా పాటలు పాడే అలవాటు నాది. నీది కాదు. ఇప్పుడెందుకు పాడేవు?" అన్నాడు మోహన్ చిరాగ్గా చూస్తూ…
"సాయంత్రం కైలాసగిరి వెళ్ళాలి అనుకున్నాం. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. వెళ్లేదేమైనా ఉందా ఇలా కబుర్లతోనే గడిపేద్దామా?" వాతావరణాన్ని తేలిక చేస్తూ అడిగింది సుధ.
"ఓ అదా.. పద పద… నిజమే… ఆలస్యమైతే తిరిగిరావడానికి చీకటయిపోతుంది." అని హడావుడి పడ్డాడు మోహన్.
అరగంటలో నలుగురూ సిద్ధమై, కైలాసగిరి, బీచ్ చూడటానికి బయలుదేరారు.
'కైలాసగిరి' పేరుకు తగినట్లే భువిపై ఉన్న కైలాసంలా ఈ ప్రాంతం అనిపిస్తుంది. విశాఖ నగరానికి ప్రధాన ఆకర్షణగా, ఏ మూల నుంచి చూసినా విశాఖపట్నం కనిపించే విధంగా ఈ పర్వత ప్రాంతం ఉంటుంది. కొండపైన శివపార్వతుల యొక్క పెద్ద విగ్రహం పర్యాటకులను ఆకర్షిస్తుంది. కైలాసగిరికి దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి ఎప్పుడూ అధికంగా ఉంటుంది. అంతగా దేశవ్యాప్తంగా ఈ ప్రాంతం పేరు గాంచింది. అయితే కైలాసగిరికి మరో పేరు కూడా ఉంది. అదే 'థామస్ ఫొల్లీ'. ఇది చాలా మందికి తెలియని విషయం. విశాఖపట్నం జిల్లాలో స్కాటిష్ జడ్జి అయిన జాన్ రెయిడ్ థామస్ పేరు మీద ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. 1830 కాలంలో ఆయన ఇక్కడ బంగ్లాను నిర్మించి నివాసం ఏర్పరుచుకున్నట్లు విశాఖపట్నం జిల్లా గెజిటీర్ ద్వారా తెలుస్తుంది. ఆయన తరువాత అనేక మంది బ్రిటిష్ అధికారులు ఈ నివాసాన్ని వినియోగించుకున్నారు. దీంతో ఈ ప్రాంతం 'థామస్ ఫొల్లీ'గా అప్పట్లో ప్రసిద్ధి చెందింది.
కైలాసగిరి ప్రకృతి అందాలు ఎంతటి వారినైనా ముగ్ధులను చేస్తాయి. అలాగే కైలాసనాధుడి ఆలయం వలన ఈ ప్రాంతానికి కైలాసగిరిగా పేరు వచ్చిందని చెబుతారు. ఓంకార స్వామీజీ తన తపో శక్తిని ధారపోసి 1951 జనవరి 21న కైలాసనాధుని శివలింగాన్ని ప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇక్కడ పరమశివుణ్ణి మనసారా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం ఉంది.
హనుమంతవాక దగ్గర బయలుదేరి, నడకదారిలో మెట్ల మీదుగా కైలాసగిరి చేరుకున్నారు మోహన్, మధు దంపతులు. తూర్పు కనుమల్లో పుట్టిన నీటి గెడ్డలు రెండు పెద్ద ఏటి ప్రవాహాలుగా విశాఖ మీదుగా ప్రవహించేవి. వాటిలో ఒకటి *హనుమంత వాగు*. ఇది సింహాచలం కొండల్లో పుట్టిన గెడ్డల నుంచి ముడసర్లోవ మీదుగా 15 కి.మీ.ల దూరం ప్రవహించి లాసన్స్ బే వద్ద సముద్రంలో కలిసేది. 1902లో ముడసర్లోవ పార్కు/రిజర్వాయరు నిర్మించిన తరువాత ఈ ఏరు కనుమరుగైంది. ఇప్పటి హనుమంత వాక జంక్షన్ ఆ వాగు పేరుతొ వచ్చిందే. వాగు - వాక పర్యాయపదాలు. అక్కడక్కడ రాసి ఉన్న వివరాలు చదువుకుంటూ, తమకు తెలిసిన విశేషాలు పంచుకుంటూ, చిరుతిళ్ళు కొనుక్కుంటూ సరదాగా అంతా తిరిగారు. కైలాసగిరి లో విశేషాలు చూడటం అయిన తర్వాత తిరిగి మెట్ల దారిలోనే కిందకు వచ్చారు. అక్కడ నుండి బీచ్ కు బస్సులో బయలుదేరారు.
******
జేమ్స్, నసీర్, విజయన్, రాఘవరావులు సాయంత్రం వరకు తాగుతూ, తింటూ గడిపారు. అనంతరం ఎవరు ఎక్కడ వెతకాలో నిర్ణయించుకున్నారు. విజయన్ తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఉన్న ప్రాచీన అమ్మవార్ల దేవాలయాలు, కోనలు, కొండలు, అడవుల్లోని దేవాలయాలు, ధనవంతులైన రాజకీయనాయకులు, క్రీడాకారులు, జమీందారులు, పారిశ్రామిక వేత్తలు, బంగారు వర్తకుల దగ్గర హారం విషయంలో అన్వేషణ జరుపుతానని చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లలో అటవీప్రాంతాలు ఎక్కువ కాబట్టి ఆ మూడు రాష్ట్రాలు రాఘవరావు చూసుకుంటానన్నాడు.
పశ్చిమ భారత దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాలు జేమ్స్ చూసుకుంటానన్నాడు. ఇక తూర్పు రాష్ట్రాలైన బెంగాల్, బీహార్ లతో సహా ఈశాన్య రాష్ట్రాలలో తాను అన్వేషిస్తానని నసీర్ చెప్పాడు. మిగిలింది ఉత్తర భారతం, హిమాలయాలు. వాటి విషయం నాగేష్ ని చూసుకోమని చెప్తానని జేమ్స్ చెప్పాడు. నగేష్ మైక్రో ఫోన్ లో ఆ వివరాలు అన్ని విన్నాడు. తన పథకానికి అనువుగా ప్రణాళికను రూపొందించుకున్నాడు.
విమాన ప్రయాణానికి సమయం కావడంతో నసీర్, రైలు ప్రయాణానికి విజయన్ బయలుదేరారు. మరో గంట తర్వాత బయలుదేరుతానని జేమ్స్ చెప్పేడు. తాను ఆరోజు విశాఖపట్నం లో ఉండి, మర్నాడు బయలుదేరుతానని, అలా కాసేపు బీచ్ లో తిరిగి వస్తానని చెప్పి రాఘవరావు బయటకు నడిచాడు.
*****
సుధ, మోహన్, మధుమూర్తి, లక్ష్మి బీచ్ లో గవ్వలు, రంగు రంగుల రాళ్లు ఏరుకుంటూ, సముద్ర కెరటాల తో ఆడుకుంటూ చాలాసేపు గడిపారు. ముంత కింద పప్పు కొనుక్కొని తిన్నారు. పొద్దు చల్లబడే కొద్దీ బీచ్ లో జనాల తాకిడి ఎక్కువ కాసాగింది. ఆడి, పరుగెత్తి, అలిసిపోయి, ఇంక ఇంటికి తిరిగి వెళ్లిపోదాం అనుకున్నారు. ఇంతలో లక్ష్మి మధు భుజం పట్టి లాగి, "అటు చూడండి, రాఘవ మామయ్య లా ఉన్నారు" అంది.
"మామయ్య లా ఉండటం కాదు, ఆయన మా రాఘవ బాబాయే. పిలుస్తానుండు" అంటూ "బాబాయ్, రాఘవ బాబాయ్" అని గట్టిగా అరిచి పిలిచాడు మధు.
సాయంకాలపు నీరెండలో ఇసుకలో కూర్చుని, సముద్రంలో కేరింతలు కొడుతున్న పిల్లలను చూస్తున్న రాఘవరావు తనను ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి, వెనుదిరిగి చూసాడు. ఇంతలో మధు, లక్ష్మి రాఘవరావుకు దగ్గరగా వచ్చారు.
"బాబాయ్… మీరిక్కడ… వైజాగ్ లో ఉన్నారేంటి? ఎప్పుడు వచ్చారు?" ప్రశ్నించాడు మధు.
"ఉదయమే వ్యాపారం పని మీద వచ్చాను. మీరేంటి ఇలా వచ్చారు?" అడిగాడు రాఘవరావు.
"నా స్నేహితుడు, తన భార్యతో ఇక్కడే ఉంటున్నాడు. వాడిని చూడటానికి లక్ష్మి తో సహా నిన్న వచ్చాము. రేపు ఉదయం వెళ్లిపోతాము" చెప్పాడు మధు.
"సరే, నేను వెళ్లి వస్తాను." అని చెప్పి, లేచి, దుస్తులకు అంటిన ఇసుక దులుపుకొని వెళ్ళిపోయాడు రాఘవరావు.
వెళ్లిపోతున్న అతడినే చూస్తూ, సుధ, మోహన్ ల దగ్గరకు వచ్చారు లక్ష్మి, మధు.
"మా బాబాయి రా మోహన్. విజయవాడలో వ్యాపారాలు చేసింది సరిపోక, హైదరాబాద్ వెళ్లి, వ్యాపారం చేసి, తక్కువ సమయంలోనే కోట్లు గడించాడు. ఎప్పుడో కానీ విజయవాడ రాడు. వ్యాపారం పనిమీద వచ్చినా బయట హోటల్ లోనే దిగుతాడు. ఒకరోజు వచ్చి, మా అందర్నీ చూసి వెళ్తాడు. ఊళ్ళో అనుకోవడం ఏమిటంటే మా రాఘవ బాబాయి బయటకు చెప్పే వ్యాపారాలు వేరు, చేసే వ్యాపారాలు వేరు అని. పెద్ద పెద్ద వాళ్ళతో వ్యవహారాలు చాలా సులువుగా నడిపిస్తాడు." చెప్పాడు మధు.
"ఇంత ముక్తసరిగా ఎప్పుడూ లేరు కదా, నన్ను కనీసం పలుకరించనే లేదు." అంది లక్ష్మి.
ఇంతలో ఎవరో పిల్లలు విసిరిన బంతి అటుగా రావడంతో ఆ బంతి అందుకుని వాళ్లపై విసిరాడు మోహన్. ఆ పిల్లలు మళ్ళీ బంతి వీళ్ళవైపు విసిరారు. కాసేపు నలుగురూ పిల్లలతో ఆడి, బయలుదేరారు. దారిలో హోటల్ లో టిఫిన్ చేసి, రెండవ ఆట సినిమా చూసి ఇంటికి చేరుకున్నారు.
మరునాడు ఉదయమే రైలుకు బయలుదేరి వెళ్లిపోయారు మధు, లక్ష్మి. సుధ మధుకు, లక్ష్మి కి బట్టలు, పసుపు, కుంకుమ, పళ్ళు ఇచ్చింది. వెళ్లేముందు తండ్రి దగ్గరకు వెళ్లడం గురించి జ్ఞాపకం చేసాడు మధు. విజయవాడ వచ్చేస్తే అందరం తరచుగా కలుస్తూ ఉండొచ్చని చెప్పాడు. ఆలోచిస్తానన్నాడు మోహన్.
*******
రాఘవరావు హోటల్ గదికి వచ్చేసరికి జేమ్స్ వెళ్ళిపోయాడు. రూమ్ సర్వీస్ అబ్బాయిని పిలిచి భోజనం తెప్పించుకున్నాడు. తన వ్యాపారాలు తన కుటుంబసభ్యులకు తెలియక పోయినా, ఇలా మధు, లక్ష్మి విశాఖపట్నం లో కలవడం రాఘవరావు కు నచ్చలేదు. కానీ తప్పదుగా. హైదరాబాద్ వెళ్ళేక తాను అనుసరించాల్సిన వ్యూహం, విజయవాడకు మకాం మార్చాలా వద్దా? అని ఆలోచిస్తూ, భోజనం చేసి నిద్రపోయాడు రాఘవరావు. మర్నాడు ఉదయాన్నే విమానంలో హైదరాబాద్ వెళ్ళిపోయాడు.
హైదరాబాద్ చేరగానే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అటవీప్రాంతం భౌగోళిక చిత్రపటం తెప్పించాడు. ఆదిలాబాద్, దంతేవాడ, బస్తర్ ల మీదుగా దండకారణ్యం వ్యాపించి ఉంది. *(కథా కాలం నాటికి ఛత్తీస్ ఘడ్, తెలంగాణా వగైరా రాష్ట్రాల విభజన జరిగి ఉండలేదు. - రచయిత)* ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల పరిధిలో తూర్పు కనుమలు, అభుజ్మర్ కొండల నుండి ఈ పీఠభూమి ప్రాంతం దాదాపు 92000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.. ఇది ఉత్తరం నుండి దక్షిణానికి సుమారు 200 మైళ్ళు (320 కిమీ) మరియు తూర్పు నుండి పడమరకు సుమారు 300 మైళ్ళు (480 కిమీ) కొలతలు కలిగి ఉంది.
మహాభారతం, రామాయణం వంటి ఎన్నో పురాణ గాథలకు, వృత్తాంతాలకు ఈ అటవీ ప్రాంతం సాక్ష్యంగా నిలుస్తుంది. రామాయణంలో దండకారణ్యం (దండకుడు అనే రాక్షసుడి నివాసం)ఇదే. ఇది పురాతన కాలంలో నలలు, వాకటకులు మరియు చాళుక్యులచే వరుసగా పాలించబడింది. ఇప్పుడు గోండు ప్రజల నివాసంగా ఉంది. చాలా ప్రాంతం ఉత్తరం నుండి నైరుతి వరకు క్రమంగా క్రిందికి వాలుతో ఇసుకతో కప్పబడిన సమతల భూమి. దండకారణ్యంలో విశాలమైన అటవీ ప్రాంతం, పీఠభూములు, కొండలు మరియు మైదానాలు కూడా ఉన్నాయి. మహానది (దాని ఉపనదులతో సహా, టెల్, జోంక్, ఉదంతి, హట్టి మరియు సందుల్) మరియు గోదావరి నది (ఇంద్రావతి మరియు శబరి దాని ఉపనదులతో సహా) దండకారణ్యం గుండా ప్రవహిస్తున్నాయి. పీఠభూములు మరియు కొండ ప్రాంతాలు నేలల యొక్క పలుచని పొరను కలిగి ఉండగా, మైదానాలు మరియు లోయలు సారవంతమైన ఒండ్రు నేలలను కలిగి ఉంటాయి . ఈ ప్రాంతంలో సాల్ (షోరియా రోబస్టా) తేమతో కూడిన అడవులు ఉన్నాయి. ఇది దాని మొత్తం వైశాల్యంలో దాదాపు సగం ఆక్రమించింది.
బస్తర్, రాయపూర్ నుండి 264 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత దేశంలో అత్యంత పర్యావరణ హితమైన గమ్యస్థానాల్లో ఒకటిగా ఇది ఖ్యాతినార్జించింది. ఈ ప్రాంతంలో సమృద్ధిగా అడవులు, వన్యప్రాణులు, జలపాతాలతో పాటు పురాణ ప్రాముఖ్యత గల పురాతన దేవాలయాలు, రాజభవనాలు, అరుదైన గిరిజన తెగలు ఉన్నాయి
బస్తర్, దంతెవాడ పేరు చెప్పగానే పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరే కళ్ల ముందు మెదలాడుతుంది. కానీ ఈ కీకారణ్యంలోని ఓ కొండ మీద ప్రాచీన కాలం నాటి వినాయకుడి విగ్రహం ఉండటం విశేషం. దేశంలో ఎన్నో గణపతి ఆలయాలు ఉన్నప్పటికీ… దట్టమైన అడవుల్లో ఈ వినాయకుడి విగ్రహం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో అలరిస్తుంది. కొండ శిఖరాగ్రంలో డోలు లాంటి ప్రదేశంలో విఘ్నేశ్వరుడు మనకు దర్శనం ఇస్తాడు. అందుకే ఈ వినాయకుడిని దోల్‌కల్ గణేశ్ అని పిలుస్తుంటారు. ఈ విగ్రహం 1100 ఏళ్ల క్రితం నాటిది కావడం విశేషం. నాగవంశీయుల కాలంలో అడవి లోపల 14 కి.మీ. దూరంలో కొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నప్పటికీ, దట్టమైన అడవిలో ఉన్న కారణంగా ఆ విగ్రహం గురించి ఇటీవలి వరకూ ఎవరికీ తెలియలేదు. ఇలాంటి ఎన్నో విశేషాలు, నాగరిక ప్రపంచానికి తెలియనివి దండకారణ్యం లో ఎన్ని ఉన్నాయో!
కోయలు ఇంద్రావతి, గోదావరి, శబరి, సీలేరు నదుల ప్రాంతాల్లోను, బస్తర్, కొరాపూట్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరించియున్న దట్టమైన అడవులైన తూర్పు కనుమలలోను కనిపిస్తారు. మోరియా తెగ గిరిజనుల నివాసం దట్టమైన దండకారణ్యం. ఒరిస్సా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో నివసించేవారు. ఇలా ఎన్నో గిరిజన జాతులకు పుట్టినిల్లు దండకారణ్యం. వివరాలన్నీ చదివి, ఆలోచనలో పడ్డాడు రాఘవరావు. ఒక డైరీ తీసుకుని *అన్వేషణ* అని రాసి పెట్టుకున్నాడు. తన ప్రణాళికను పొడి పొడి అక్షరాలతో రాసుకున్నాడు. హైదరాబాద్ నుండి అయితేనే దండకారణ్యం ప్రాంతాన్ని అన్వేషించడానికి వీలుగా ఉంటుంది. అక్కడ అన్వేషణ లో హారం లభించక పోతే అప్పుడు విజయవాడలో మకాం వేసి కోస్తా జిల్లాల్లో మొదలుపెట్టాలి అనుకున్నాడు. ముఖ్య అనుచరులను పిలిచి, వారు చేయాల్సిన పనులను వివరించాడు. వారు అవసరమైన డబ్బు, వాహనాలు, మరికొందరు అనుచరులను తీసుకొని వివిధ ప్రాంతాలవైపు బయలుదేరి వెళ్లారు. వాళ్ళకి అప్పగించబడిన పని, ప్రాచీన దేవాలయాల అన్వేషణ. కనీసం వంద ఏళ్ళు పైబడి చరిత్ర ఉండాలి, అలాగే ఆ దేవీ, దేవతలకు సంబంధించిన నగలు, ఆభరణాల వివరాలు కనిపెట్టడం. తాను వేరేగా తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు.
రాఘవరావుకు రాజధాని ప్రాంతంలో అనేకమంది ప్రముఖులతో పరిచయం ఉంది. కాబట్టి వారి ద్వారా "పర్యాటక ప్రాంతాల అన్వేషణ మరియు అభివృద్ధి" అనే పథకానికి అంగీకారం, ఒప్పందం (కాంట్రాక్టు) పొందాడు. అధికారికంగా తన అన్వేషణ కు ఏ ఏ వర్గాల (అటవీ, పోలీస్ తదితర) సహకారం కూర్చుకోవచ్చునో ఆలోచించి, ఆ వైపుగా పనులు మొదలుపెట్టాడు. ఆయా ప్రాంతాల ప్రజల సహకారం కూడా ఉండేది.
****సశేషం****
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల... ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.
ముందుమాట:
"అనామిక" అనే ఈ నవల 90' లలో మొదలైన ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? అనామిక ఎవరు? ఆ ప్రేమ జంటకి అనామికకు సంబంధం ఏమిటి? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది.
దైవిక శక్తులతో ఆటలాడడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాంటి వారిని శిక్షించే పని భగవంతుడే వివిధ రూపాలలో పూర్తి చేస్తారు. అలా జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ నవల రూపు దిద్దుకుంది.
ఈ నవల మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ....మీ అభిప్రాయాలను, సూచనలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ.. "అనామిక" నవలను సీరియల్ గా ప్రచురిస్తున్న సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమప్రియ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ...
- నాగమంజరి గుమ్మా, శృంగవరపుకోట
మంచి ఉత్సుకత రేకెత్తించే విధంగా రాసారు …
బాగా వెళ్తుంది కధ గమనం. జాగ్రఫీ బాగా చెప్పేరు ఈ ఎపిసోడ్ లో. All the best.
Chaalaa baagundi
Eagerly waiting for next