
సాయంత్రం ఐదు కావస్తోంది. వీధిలో కారు ఆగిన శబ్దానికి సుధ లేచి, వెళ్లి చూసింది. టాక్సీ లో నుంచి మోహన్ దిగాడు. వెనుక తలుపు తెరుచుకుని మధు, లక్ష్మి దిగారు. "రండి, రండి… ప్రయాణం బాగా జరిగిందా?" చేతిలో బేగ్ అందుకుంటూ కుశల ప్రశ్నలు అడిగింది సుధ. వీధి గుమ్మంలోనే మోహన్, మధు, లక్ష్మీ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నాక, నలుగురూ ఇంట్లోకి నడిచారు. మధు పెళ్లి అయిన తర్వాత లక్ష్మి తో సహా రావడం ఇదే ప్రథమం. లక్ష్మి మధు కి మేనమామ కూతురు. ఎప్పుడైనా వ్యాపారం పై ఇటు వచ్చినపుడు ఒకసారి సుధ ని, మోహన్ ని చూసి వెళ్తూ ఉంటాడు మధుమూర్తి. ప్రస్తుతానికి మధు ఒక్కడే వాళ్ళకి ఆప్తుడైనా, చుట్టమైనా.
సుధ, మోహన్ ల పెళ్లి అయ్యాక, ఇరువురూ తమ తల్లిదండ్రులకు, తమకు పెళ్లి అయిన విషయం స్నేహితుల ద్వారా తెలియజేసారు. వాళ్ళు మన్నించినట్లయితే, ఇంటికి వస్తామని చెప్పేరు. కానీ ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.
రెండు కుటుంబాలకు దూరంగా విశాఖపట్నం వచ్చేసారు సుధ, మోహన్. అక్కడ నుండి పరిస్థితుల్ని వివరిస్తూ తమ తల్లిదండ్రులకు మళ్ళీ ఉత్తరాలు కూడా రాసారు. వారి నుంచి జవాబు రాలేదు. ఒక కంపెనీ లో ఉద్యోగిగా చేరాడు మోహన్. ఆర్ధిక ఇబ్బందులు లేవు. కానీ ఆర్ధికంగా కాస్త స్థిరపడిన తర్వాతే పిల్లల విషయం ఆలోచించాలి అనుకున్నారు సుధామోహన్ లు.
*****
తొలిసారిగా తమ ఇంటికి వచ్చిన లక్ష్మిని సాదరంగా ఆహ్వానించింది సుధ. మధుమూర్తి తమను ఎలా ఆదరించి, పెళ్లి జరిపించాడో వివరించాడు మోహన్. సుధ అందరికి ఫలహారాలు పెట్టింది. కాఫీ ఇచ్చింది.
"మధు, ఇవాళ అందరం సినిమాకి వెళదాం. అటునుంచి బయట భోజనం చేసి వద్దాం." అన్నాడు మోహన్.
"ఏం నాయనా! ఆ సినిమాలో పాటలన్నీ కంఠతా పట్టేసావా అప్పుడే?" అన్నాడు హాస్యంగా మధుమూర్తి.
"లక్ష్మీ! వీడికి మహా పాటల పిచ్చి. కొత్తగా ఏ సినిమా వచ్చినా ఆ పాటలన్నింటిని ఓ పట్టు పట్టేస్తాడు" అన్నాడు మధు, మోహన్ ని చూస్తూ…
"అయితే మోహన్ గారు మంచి గాయకుడన్నమాట" అంది లక్ష్మి.
"అదేం కాదమ్మా… ఏదో కూనిరాగం అంతే. నాకు పాటల్లోని సాహిత్యం అంటే ఇష్టం. అంతే." అన్నాడు మోహన్.
"ప్రతి సందర్భానికి ఓ పాట సిద్ధంగా ఉంటుంది మా మోహన్ దగ్గర." అన్నాడు మధు.
"అవును! ఇందాక రైలు దిగగానే మోహన్ గారు ఎదురొచ్చి 'రండి రండి రండి దయచేయండి… తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ' అంటూ ఉంటే సరదాగా అనుకున్నాను. అదా విషయం." అని నవ్వేసింది లక్ష్మి.
"పదండి సినిమా టైం అవుతోంది. మళ్ళీ టికెట్లు దొరకవు." తొందర చేసింది సుధ.
నవ్వుకుంటూ నలుగురూ బయలుదేరారు. సినిమా చూసి, దారిలో హోటల్ లో భోజనం చేసి ఇంటికి చేరారు. మధు, లక్ష్మి లకు వారి గది చూపించి, సుధ, మోహన్ కూడా పడకగది చేరారు.
****
నీలిరంగు పరదాలను తొలగించి బంగారు వన్నె కిరణాలను ప్రసరిస్తూ బాల భానుడు తూర్పు వేదిక మీదకు వస్తున్నాడు. వెచ్చని కిరణాల సందేశాన్ని అందుకున్న పూమొగ్గలు నును సిగ్గుగా ఒక్కొక్క రేకు విప్పుకుంటున్నాయి. అందాల పూవులు ఎప్పుడు విరబూస్తాయా? ఎప్పుడు తేనె విందులు చేసుకుందామా అని తేటి రాయుళ్లు జుమ్మని సంగీతాలు పాడుతూ మొక్కల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. నేనున్నాను సుమా అన్నట్లు పిల్ల తెమ్మెర ఒకటి సన్నగా వీచి హాయి గొలుపుతూ ఉంది.
అరుణోదయ వేళ విరిసె
అరుణారుణ వర్ణ విరులు హాటకమవగన్
పరిసరముల హరితాంశము,
మెరిపించె హరి కిరణములు మేదిని నిండెన్
గాలి అలలపై ఎక్కడి నుండో తేలి వస్తోంది పద్యగానం. లక్ష్మి నిద్ర లేచి బాల్కనీ లోకి వచ్చింది. నీలివర్ణ ఆకాశం కెంపురంగుగా మారే వరకు ప్రకృతి సోయగాలను అలా చూస్తూ నిలుచుంది.
"ఏమిటి లక్ష్మీ.. అంత పరవశంగా చూస్తున్నావు?" అడిగింది సుధ కాఫీ కప్పులు తీసుకువచ్చి, లక్ష్మి కి ఒకటి అందిస్తూ…
"ఈ సూర్యోదయం, ఈ ప్రశాంత వాతావరణం ఎంత బాగున్నాయో సుధా. పెళ్లి కాక మునుపు మా పల్లెలో ఉన్నట్లు అనిపించింది" అంది లక్ష్మి.
"అవును లక్ష్మీ, ఈ ప్రశాంత వాతావరణం, ఈ సమయం, ఈ స్థలం నాకు చాలా ఇష్టం. రోజంతా పనిచేయడానికి కావలసిన శక్తిని ఇస్తుంది." చెప్పింది సుధ.
మరి కాసేపు పిచ్చాపాటి మాట్లాడి, ఇద్దరూ అక్కడ నుంచి లేచి వచ్చారు. బాల్కనీ ని ఆనుకుని ఒక నడవా (కారిడార్) ఉంది. నడవాకు అటు ఇటు ఉన్న గదులు పడక గదులు. నడవా లో చెక్కతో చేసిన ఒక అరమర. ఆ అరమర నిండా పుస్తకాలు. ఉదయం మసక చీకటిలో లక్ష్మి అంతగా గమనించలేదు. పుస్తకాలను చూస్తూనే ఒక్క క్షణం ఆగింది లక్ష్మి. ఒక పుస్తకం చేతిలోకి తీసుకుంది. ప్రఖ్యాత రచయిత రాసిన పుస్తకం అది.
"సుధా! పుస్తకాలు చదివే అలవాటు ఎవరికి ఉంది?" ప్రశ్నించింది లక్ష్మి.
"నేనే చదువుతాను లక్ష్మీ. ఇంట్లో పని అయిపోయాక తీరికే కదా. ఖాళీ దొరికితే పుస్తకం చదవడం వ్యసనం అయిపోయింది. అదిగో పై అరలోవి ప్రాచీన సాహిత్యం. రెండో అరలో 20 వ శతాబ్దం నాటివి. ఈ మూడో అరలో ఒకవైపు నవలలు, అటు నుంచి వివిధ నూతన సాహిత్య ప్రక్రియల పుస్తకాలు." వివరంగా చెప్పింది సుధ.
"నేను డిగ్రీ లో తెలుగు చదివాను సుధా. అయినా ఇలా ఇన్ని పుస్తకాలు చదవాలని కానీ, సేకరించి పెట్టుకోవాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు. చాలా మంచి అభిరుచి నీది. అపురూపమైన పుస్తకాలు ఉన్నాయి నీదగ్గర." అంటూ అభినందించింది లక్ష్మి.
"నీకు ఇంకో విషయం తెలుసా, ఇక్కడకు పని మీద వచ్చినపుడు మధుమూర్తి కూడా ఏదో ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చేవాడు." చెప్పింది సుధ.
"ప్రదర్శించేవా నీ పుస్తకాలయాన్ని! మాకు కూడా కాఫీ ఇచ్చేదేమైనా ఉందా… 'ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతే నయా…' అని పాడుకుంటూ కూర్చోవాలా?" వస్తూనే అడిగాడు మోహన్.
"అయ్యగారు నిద్రలేచి ఎంతసేపు అయ్యిందని? ఇదిగో చిటికెలో తెచ్చేస్తున్నా, మధు కూడా నిద్ర లేచారా?" అంటూ వంటింటి వైపు నడిచింది సుధ. లక్ష్మి అనుసరించింది. వంటింట్లో సన్నని స్వరం తో ఆదిత్య హృదయ స్తోత్రం వినిపిస్తోంది. చాలా హాయిగా అనిపించింది లక్ష్మి కి.
"మీ ఇంట్లో సాహిత్యం, సంగీతం ఎటు చూసినా కనిపిస్తూ, వినిపిస్తూ ఉన్నాయే" అంది లక్ష్మి.
"చదవడానికి, వినడానికి లోటు లేదు. రాయడం మాత్రం చేతకాదు, సరిగమలు అంతకంటే పలకవు." నవ్వేసింది సుధ.
మోహన్ కు, మధుకు కాఫీలు అందించి, "ఈ రోజు కార్యక్రమం ఏమిటి శ్రీవారు?" అడిగింది సుధ.
"మధు ఇక్కడ ఎవరినో వ్యాపారం గురించి కలవాల్సిన పని ఉందట. ఉదయం ఇద్దరం అటు వెళ్లి, మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చేస్తాం. సాయంత్రం బీచ్, కైలాసగిరి మొదలైనవి చూద్దాం" అన్నాడు మోహన్.
'సరే'నని కాఫీలు అయ్యాక ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఆడవాళ్ళిద్దరూ స్నానం, పూజ అయ్యాక వంటింట్లో ఫలహారాలు తయారు చేసే పనిలో పడ్డారు. మగవాళ్ళిద్దరూ తయారై వచ్చేసరికి వేడి వేడిగా వడ్డించారు. తర్వాత మోహన్, మధు పని మీద బయలుదేరారు. సుధ, లక్ష్మి ఫలహారం చేసి, పుస్తకాలు గురించి కాసేపు మాట్లాడుకుంటూ, వ్యక్తిగత, పుట్టింటి కబుర్లు మాట్లడుకుంటూ, వంట పనిలో పడ్డారు.
****
విశాఖపట్నం… అందాల ఉత్తరాంధ్ర నగరం. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, నౌకాశ్రయం ఇలా అన్ని విధాల ప్రయాణ సాధనాలు అందుబాటులో ఉన్న నగరం. శాస్త్ర సాంకేతిక రంగాలు, కళలు, సంస్కృతి, సంప్రదాయం, ఆధునికత, రక్షణ, విహారం, పర్యాటకం, సౌందర్యం దశదిశలా వెదజల్లే అద్భుత నగరం. పొట్టకూటికై వలస వచ్చేవారిని, కోటికి పడగలెత్తి ఇంకా పరుగులు పెట్టే వారిని ఒకే విధంగా ఆదరించే నగరం.
అనుబంధాలు, ఆప్యాయతలు ఎంత ఎక్కువగా ఉంటాయో అక్రమాలు, అన్యాయాలు కూడా అంత స్థాయిలోనే ఉంటాయి. మమతానురాగాలు ఎలా ప్రదర్శితమౌతాయో, మోసాలు, దోపిడీలు కూడా అలాగే కనబడుతూ ఉంటాయి.
ఇంతటి విఖ్యాతమైన విశాఖ నగరంలో సముద్రపు ఒడ్డున ఉన్న ఒక పెద్ద ఐదు నక్షత్రాల హోటల్ అది. నాలుగో అంతస్తులో సముద్రానికి అభిముఖంగా ఉన్న గదిలో సమావేశమై ఉన్నారు ఆ నలుగురూ. గది నిండా పొగ అలుముకుని ఉంది. నలుగురి మధ్యన ఉన్న బల్లపై మద్యం సీసా, గ్లాసులు తదితర సరంజామా ఉంది. సమావేశం ప్రారంభమై ఒక గంట పైగా అయినట్లుంది. (సంభాషణ ఆంగ్లం, హిందీలలో జరుగుతుంది. సౌలభ్యం కోసం తెలుగులో)
"ఏమిటిది జేమ్స్. హఠాత్తుగా రమ్మన్నావు. ఎక్కడి పనులు అక్కడే వదిలేసి హడావుడిగా వచ్చాను. తీరా వచ్చేక, తినండి, తాగండి అంటూ కూర్చోపెట్టావు. గంట పైనే అయ్యింది మనం వచ్చి. విషయం ఇప్పటికైనా చెప్తావా?" కొంచెం విసుగ్గా అన్నాడు విజయన్. మద్రాసు నుంచి వచ్చాడతను.
జేమ్స్ అనబడే నీలం సూట్ వాలా ఏమి మాట్లాడలేదు. మిగతా ఇద్దరూ రాఘవరావు, నసీర్ ముఖాలు చూసుకున్నారు. నలుగురూ దేశంలోని నాలుగు ప్రాంతాల వారు. జేమ్స్ నుండి మిగతా ముగ్గురికి విశాఖపట్నం లో కలుసుకుందామని కబురు వెళ్ళింది. విషయం ఏమిటో కనుక్కుందామని రాఘవరావు, విజయన్, నసీర్ వచ్చారు.
వాచీ చూసుకుంటూ, "మరొక్క పది నిమిషాలు" అని చెప్పి, బెల్ కొట్టి రూమ్ సర్వీస్ అబ్బాయిని రమ్మని చెప్పేడు జేమ్స్. రూమ్ సర్వీస్ అబ్బాయి వచ్చాక, కిటికీలు, తలుపులు తెరిపించి, గాలి ధారాళంగా వచ్చేలా చూసాడు. గదిలో పొగ కాస్త తగ్గింది. టీపాయ్ మీదకు కొత్త సరుకు చేరింది. చుట్టుపక్కల ఖాళీ అయిన ప్లేట్లు, సిగరెట్ పెట్టెలు, తదితర చెత్త అంతా తీయించి, శుభ్రం చేయించాడు. అంతలో గది తలుపులు తట్టిన చప్పుడు అయ్యింది. తెల్లని లాల్చీ, పైజామా ధరించిన వ్యక్తి లోపలకు వచ్చాడు.
"రండి, మిస్టర్ నగేష్. వీరు ముగ్గురూ నా స్నేహితులు. మీరు కోరినట్లే దేశం లోని నాలుగు ప్రాంతాలనుంచి మేం నలుగురం వచ్చాము. మీ రాక కోసమే చూస్తున్నాను. వీరికి ఇంతవరకు విషయం కూడా చెప్పలేదు." అన్నాడు జేమ్స్.
"మిత్రులారా! ఈయన నగేష్. మీలాగే నా స్నేహితుడు…" జేమ్స్ ఏదో చెప్పబోతుంటే, వారించాడు నగేష్.
నగేష్ ఒక సోఫా లో కూర్చుంటూ మిగతా ముగ్గురి వంక చూసి, "గుడ్ మార్నింగ్ జంటిల్మెన్. జేమ్స్ నాకు వ్యాపార స్నేహితుడు. మీకు కూడా స్నేహితుడే అంటే మనందరం ఒకే నావలో ప్రయాణిస్తున్నామని నా భావన. జేమ్స్ ముంబయి నగరంలో వ్యాపారం చేస్తున్నాడని మీకు తెలుసు, నసీర్ కలకత్తా, విజయన్ మద్రాసు, రాఘవ విజయవాడలలో వ్యాపారం చేస్తున్నారు. నేను సరిగ్గానే చెప్పేనా?" అన్నాడు.
జేమ్స్ తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. తమ పేర్లు, ఊర్లతో సహా చెప్పేసరికి. "మీరు అలా ఆశ్చర్యపోనవసరం లేదు భాయ్. సహజంగా ఎవరు ఎక్కడ ఏ వ్యాపారం చేస్తున్నా నా దగ్గర ఆ వివరం ఉంటుంది. నా సమాచార సేకరణ పద్ధతి అటువంటిది. నేను ఇప్పుడు కొత్తగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం నాలుగు ప్రాంతాల నుండి వ్యక్తులు కావాలని జేమ్స్ కు ఫోన్ చేసి, నా దగ్గర ఉన్న వివరాల ప్రకారం సమర్థులు ఎవరో నేను ఒక అంచనా వేసుకున్నాను. ఇక్కడ మీ ముగ్గురిని చూడగానే, జేమ్స్ ఎంపిక సరైనదని భావించాను. కనుకనే మీ వివరాలు అంత సులువుగా చెప్పగలిగాను" అన్నాడు నగేష్.
"ఇప్పుడు మీకు ఒక ముఖ్య విషయం చెప్పబోతున్నాను." అంటూ ఆపాడు నగేష్. "దక్షిణ భారతదేశంలో స్త్రీ పురుషులు బంగారు, వజ్రాల నగలు ఎక్కువగా ధరిస్తారు. ప్రాచీన కాలపు వజ్రాల నగలకు విదేశాలలో మంచి గిరాకీ ఉంది. కొన్ని ప్రత్యేకమైన నగలకు పోటీ కూడా ఉంది. ముఖ్యంగా ప్రాచీన కాలం నాటి దేవతా విగ్రహాలు, దేవతలకు సంబంధించిన నగలు అంటే విదేశీ మార్కెట్ లో కొనడానికి ఉత్సాహం చూపిస్తారు.
ఇప్పుడు నేను చూపించబోయే ఈ నగ దాదాపు రెండువందల సంవత్సరాల కిందటిది. బ్రిటిష్ వారు దక్షిణాది ప్రాంతంలో ఒకసారి దాడి చేసినపుడు, స్థానిక జమీందారు భార్య మెడలో ఈ హారం చూసారు. సొంతం చేసుకోవాలనిపించి, జమీందారును మాయోపాయంతో బంధించారు. ఆయన భార్యను, ఈ నగతో సహా రావాలని ఆదేశించారు. అయితే జమిందార్ కాస్త తెలివిగా వ్యవహరించడంతో, ఆయన భార్య, నగతో సహా పారిపోయింది. కోపించిన అధికారి జమిందార్ ను హత్య చేశాడు. ఎంత వెతికించినా ఆమె ఆచూకీ దొరకలేదు.
ఆ తర్వాత యాభై ఏళ్లకు ఈ నగ ఒక దేవాలయం లో దేవత మెడలో కనిపించింది. ఒక ఉత్సవం సందర్భంగా దేవతకు ఈ హారాన్ని అలంకరించారు. అయితే అనూహ్యంగా ఆ రాత్రి కొందరు దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించి దేవాలయాన్ని, దేవతా విగ్రహాన్ని నాశనం చేసి, మిగతా విలువైన వస్తువులతో పాటు, ఈ హారాన్ని కూడా దోచుకుని పోయారు. వీరు అటవీమార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉంటే, ఎలాంటి మబ్బులు లేకుండానే ఒక పిడుగు పడి, ఆ దొంగలందరూ మరణించారు. చుట్టుపక్కల గ్రామాలకు ఆ పిడుగు శబ్దం వినిపించిందంటే ఎంత భయంకరమో ఉహించండి. వారందరూ వచ్చి చూసేసరికి దొంగలందరూ, గుర్రాలతో సహా చచ్చిపడి ఉన్నారు. చేతుల్లో బంగారు నగలు, వెండి పాత్రలు, ధనం ఉన్న సంచులు కనిపించాయి. దేవాలయంలో దోచుకున్న సంపద అంతా దొరికింది. ఈ హారం మాత్రం కనబడలేదు. అదే ఆఖరుగా ఆ హారం ఆచూకీ తెలియడం. నేటి వరకు ఈ నగ ఎక్కడ ఉన్నదీ తెలియలేదు.
ఈ మధ్యనే ఒక విదేశీ వ్యక్తి ఆధ్యాత్మిక పర్యటనకు మన దేశం వచ్చాడు. ఒకరోజు దక్షిణ భారతదేశంలో ఒక నగరంలో నిద్రిస్తున్నప్పుడు ఈ నగ అతని కలలోకి వచ్చింది. తనదేశం వెళ్ళేక ఈ నగ చరిత్ర గురించి పరిశోధించాడు. చిత్రం, ఆధారాలతో సహా, తన పర్యాటక వివరాలు రాసి పత్రికలకు ఇచ్చాడు. ఆ వార్త, నగ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఆయనకు కల వచ్చిన ప్రాంతం ఇదే. విశాఖపట్నం. ఇప్పుడు ఈ హారం కోసం విదేశీ మార్కెట్ లో విపరీతమైన పోటీ ఉంది. ఎందుకంటే మధ్యలో ఉన్న మరకత మణి చాలా విలువైనది, అరుదైనది, అపురూపమైనది. అది ముడి మణి. కొద్దిపాటి మెరుగు పెట్టి నగతో పొందుపరిచారు. ఈ హారం ఇంకా ఈ ప్రాంతాలలోనే ఉండవచ్చని ఒక ఊహ. కనుక దక్షిణాది నుండి ఈ నగ వెతకడానికి ఇద్దరిని, హారం లభించిన తర్వాత ఎలాంటి ఆటంకాలు లేకుండా విదేశాలకు రవాణా చేయడానికి, నౌకా, విమాన మార్గాలు గల ముంబయి, కలకత్తా ల నుంచి ఇద్దరిని ఎంపిక చేయవలసి వచ్చింది." సుదీర్ఘమైన వివరణ ఆపి, చిత్రం యొక్క నకలులు అందరికీ పంచాడు నగేష్. అందరూ ఆ హారం చిత్రాన్ని ఆశ్చర్యంగా పరిశీలించారు.
****సశేషం****
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల... ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.
ముందుమాట:
"అనామిక" అనే ఈ నవల 90' లలో మొదలైన ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? అనామిక ఎవరు? ఆ ప్రేమ జంటకి అనామికకు సంబంధం ఏమిటి? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది.
దైవిక శక్తులతో ఆటలాడడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాంటి వారిని శిక్షించే పని భగవంతుడే వివిధ రూపాలలో పూర్తి చేస్తారు. అలా జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ నవల రూపు దిద్దుకుంది.
ఈ నవల మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ....మీ అభిప్రాయాలను, సూచనలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ.. "అనామిక" నవలను సీరియల్ గా ప్రచురిస్తున్న సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమప్రియ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ...
- నాగమంజరి గుమ్మా, శృంగవరపుకోట