
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల... ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.
ముందుమాట:
"అనామిక" అనే ఈ నవల 90' లలో మొదలైన ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? అనామిక ఎవరు? ఆ ప్రేమ జంటకి అనామికకు సంబంధం ఏమిటి? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది.
దైవిక శక్తులతో ఆటలాడడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాంటి వారిని శిక్షించే పని భగవంతుడే వివిధ రూపాలలో పూర్తి చేస్తారు. అలా జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ నవల రూపు దిద్దుకుంది.
ఈ నవల మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ....మీ అభిప్రాయాలను, సూచనలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ.. "అనామిక" నవలను సీరియల్ గా ప్రచురిస్తున్న సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమప్రియ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ...
- నాగమంజరి గుమ్మా, శృంగవరపుకోట
అనామిక - మొదటి భాగం
"సుధా! రాగసుధా! అనురాగ సుధా!" చరవాణి మోగుతోంది. వంటింట్లో చేస్తున్న పని ఆపి, చరవాణి దగ్గరకు వచ్చింది సుధ. సుధ చరవాణి లో ఏరి కోరి పెట్టాడు తన భర్త మోహన్ ఆ పాటను. మోహన్ ఫోన్ చేస్తే ఆ పాట వినిపిస్తుంది.
"చెప్పండి శ్రీవారు..."
"ఇప్పుడే మధు మాట్లాడాడు సుధా! సాయంత్రం వస్తాడట, లక్ష్మిని కూడా తీసుకురమ్మని చెప్పేను. రేపు ఎటూ ఆదివారమే కదా" ఉపోద్ఘాతాలేవీ లేకుండా అన్నాడు మోహన్.
"సరే, సాయంత్రం కదా, చాలరోజులైంది వాళ్ళిద్దరిని చూసి. ఈలోగా కాస్త చిరుతిళ్ళు చేసి పెడతాను లెండి." అంటూ చరవాణి పెట్టేసింది సుధ.
"సుధా! రాగసుధా! అనురాగ సుధా!" మళ్ళీ మోగింది.
"ఏం మర్చిపోయారు మళ్ళీ?" అడిగింది సుధ పచ్చ మీట నొక్కి.
"నువ్వు ఉంటే చాలు గుండెల్లోనా... నవ్వు కుంటూ రాదా వెన్నెల వానా..." పాడుతున్నాడు మోహన్.
ముసి ముసిగా నవ్వుకుంది సుధ. "చెప్పండి బాబూ..." అంది మురిపెంగా...
"అదేనోయ్... సాయంత్రానికి చిరుతిళ్ళు మాత్రమే తయారు చెయ్యి. వాళ్ళు వచ్చాక బయటకు వెళదాం... వేరే వంట పనులు వద్దు." అన్నాడు మోహన్.
"సరే... ఇంకేమైనా మర్చిపోయారేమో ... మళ్ళీ చేస్తారా?" అడిగింది సుధ.
"నీ పేరే పలవరించే నా లోని ఆశలు... మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు... ఇంకేమి లేవు గానీ... ఉంటా..." ఓ చిన్న ముక్క పాడి చరవాణి పెట్టేసాడు మోహన్.
భర్తకి ఉన్న పాటల పిచ్చి, సందర్భానుసారంగా వాటిని ఉపయోగించడం గురించి ఆలోచిస్తూ, కాసేపు నిలబడిపోయింది సుధ.
సాయంత్రానికి పూర్తి చేయవలసిన పనులు గుర్తొచ్చి, గబగబా వంటింట్లోకి వెళ్ళింది. "అందాల ఓ చిలకా.. అందుకో నా లేఖ..." పై నున్న సౌండ్ బాక్స్ లో నుండి సన్నగా వినిపిస్తోంది. పని చేసుకుంటున్నా పాటలు వినడం తన అలవాటు. ఆ అభిరుచే తనని మోహన్ ని కలిపింది. ఇద్దరిని ఒక్కటి చేయడానికి మధుమూర్తి కాస్త సహాయం చేసాడు.
వంటపని చేస్తున్నా ఆలోచనలు ఐదేళ్ల వెనుకకు పరుగెత్తాయి.
*********
కళాశాల ఆవరణలో పున్నాగ చెట్టుకింద కూర్చున్నారు సుధ, ఆమె స్నేహితురాళ్లు. సాయం సమయం, ఆఖరి క్లాస్ కి మేడం రాలేదు. కాలేజి బస్ రావడానికి ఇంకా సమయం ఉంది. అవకాశం వస్తే సన్నని పరిమళాలు వెదజల్లే ఆ పున్నాగ చెట్టు దగ్గర కూర్చోవడం ఆ మిత్రబృందానికి అలవాటు. గాలికి రాలే పూవులు అభిషేకిస్తున్నట్లు అనిపిస్తాయి.
కొత్తగా వచ్చిన చిత్రంలో పాటలు కూనిరాగాలు తీస్తోంది సుధ. ఆ చిత్రం లో కథానాయిక ఎన్ని దుస్తులు మార్చిందో చెప్తోంది ఒక స్నేహితురాలు.
"నువ్వేం మాయ చేసావో కానీ... ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని" పాడుతూ ఉండగానే మరో గొంతు జత కలిసింది. మోహన్ అటువైపు నుండి పాడుకుంటూ వస్తున్నాడు.
"చచ్చాం పో... పాటల పిచ్చోడు వస్తున్నాడు" లేచిపోబోయింది ఒక స్నేహితురాలు.
"అబ్బాబ్బా... ఉండండే.." కసిరింది సుధ.
"చెప్పవే చిరుగాలి... చల్లగా జతగూడి" "ఎలా ఉన్నారు సుధ గారు..." పాటని, మాటలను కలిపేస్తూ అడిగాడు మోహన్.
"ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతోంది చాలక, మళ్ళీ ఈ గారు ఏమిటండీ?" ప్రశ్నించింది సుధ స్నేహితురాలొకామె.
"దేవతండీ... ప్రణయదేవత... ఒసేయ్... నువ్వు... అంటామా? తప్పు కదూ..." అన్నాడు మోహన్ కూర్చుంటూ.
"ఇప్పుడు ఇలాగే అంటారు లెండి. పెళ్లయ్యాక అందరు మొగుళ్ళూ పెళ్లాలని రాక్షసిలా చూస్తారు." అంది మరో స్నేహితురాలు.
"అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే... మీరు చెప్పండి సుధ గారూ... ఇన్నాళ్లుగా అడుగుతున్నాను, నా ప్రేమ మీకు సమ్మతమైతే... నోటితో చెప్పక్కర్లేదు... రేపు మంచిరోజట, పచ్చని చీర కట్టుకుని రండి. 'పచ్చందనమే పచ్చదనమే' అని నేను పాడుకుని మురిసిపోతాను. అన్నట్లు మీ దగ్గర పచ్చచీర ఉందో లేదో... ఆకుపచ్చలో ఏ వన్నె అయినా సరే సర్దుకుంటాను. ఇష్టం లేకపోతే ఎరుపు చీర కట్టుకుని రండి. 'నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే' అని పాడుకుంటూ మీకు దూరంగా ఉండిపోతాను. నా భవిష్యత్తు మీ చేతిలో పెట్టేసాను." అంటూ గబగబా, ఆగకుండా చెప్పేసి,
'ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి" పాడుకుంటూ వెళ్ళిపోయాడు మోహన్.
మోహన్ మాట్లాడుతున్నంత సేపు రాలిన పున్నాగ పూలు ఏరుకుని పైట చెంగులో పోసుకుంటూ కూర్చుంది సుధ. మోహన్ వెళ్లిపోగానే,
"ఏమిటే మోహన్ సంగతి? నువ్వు కూడా ప్రేమిస్తున్నావా? లేదా?" అడిగారు స్నేహితురాళ్లు.
"ఈ ప్రేమలు గీమలు మా ఇంట్లో ఒప్పుకోరే... ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు..." దిగులుగా చెంగులోని పూలను ఒక్కొక్కటిగా బయటకు వేస్తూ అంది సుధ. ఆఖరి పువ్వు బయటకు వేసి, కొంగు దులిపి లేచి నిలబడగానే "సక్సెస్" అంది గట్టిగా ఒక స్నేహితురాలు. అందరూ తుళ్ళిపడ్డారు ఒక్కసారిగా...
"ఏమయ్యిందే?" అడిగింది సుధ.
"నువ్వు ఏరిన పువ్వులు ఒక్కొక్కటి బయట వేస్తున్నపుడు నేను, నువ్వు మోహన్ ని ప్రేమిస్తావు, ప్రేమించవు అని లెక్కపెడుతూ వచ్చాను. నీ ఆఖరి పువ్వు వేసేసరికి 'నువ్వు మోహన్ ని ప్రేమిస్తావు' అని వచ్చిందే. కంగ్రాట్యులేషన్స్" అని చెప్పిందామె.
చిన్నగా నవ్వి నెత్తిమీద ఒక్క మొట్టికాయ వేసింది సుధ. ఈలోగా కాలేజి బెల్ కొట్టడం, బస్సు రావడం తో అందరూ నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ బస్సువైపు కదిలారు.
****
పక్షుల కిలకిలా రావాలతో, సూర్యుని నులివెచ్చని కిరణాలతో, పిల్ల తెమ్మెరలతో కొత్తరోజు ప్రారంభమయ్యింది. గబగబా నిద్ర లేచి "ఏ గీత గీసినా నీ రూపమే..." పాడుకుంటూ తయారై కాలేజీకి బయలుదేరాడు మోహన్.
'కన్నుల్లో నీ రూపమే... గుండెల్లో నీ ధ్యానమే' పాడుకుంటూ ఆతృతగా బస్సు కోసం ఎదురు చూడసాగాడు. అమ్మాయిలను తీసుకువచ్చే బస్ అదొక్కటే మరి. ఇంతలో రంగు రంగుల పూల రధంలా బస్సు వచ్చి ఆగింది. ఆకుపచ్చని కొంగు కనబడేసరికి గుండె ఒక్కసారి ఆగినట్లయ్యింది మోహన్ కి. చూస్తే... సుధ కాదు. ఆకుపచ్చ చూడిదార్ ధరించిన ఒక అమ్మాయి బస్ లో నుంచి దిగింది. ఆ వెనుకే పచ్చ షర్టు ధరించిన మరో అమ్మాయి. ఇంతలో ఎర్రని కొంగు చూసేసరికి గుండె నూటొక్కటి కొట్టుకుంది మోహన్ కి. "హమ్మయ్య ఈ అమ్మాయి కూడా సుధ కాదు." స్వగతం గా అనుకున్నాడు. ఒకరొకరుగా బస్ దిగుతున్నారు అమ్మాయిలు. ప్రతీ ఒక్కరూ ఎరుపు లేదా ఆకుపచ్చలే ధరించారు. అందరూ కలిసి తనని ఆటపట్టిస్తున్నారు అనుకున్నాడు మోహన్. ఇంతలో ఎరుపు అంచు ఉన్న ఆకుపచ్చ చీరతో బస్సు దిగింది సుధ. మోహన్ ఆనందానికి మేర లేకపోయింది. అమ్మాయిలందరూ వీరిద్దరి చుట్టుముట్టి కేకలు వేశారు. సుధ చెవులు మూసుకుంది. ఒక్కసారిగా సుధ చేయి పట్టుకుని, పరుగున పున్నాగ చెట్టు కిందకు తీసుకువెళ్లాడు మోహన్.
"థాంక్యూ సుధ గారు. కానీ ఈ ఎరుపు అంచు కట్టి మళ్ళీ నన్ను సస్పెన్స్ లో పడేసారు..." అన్నాడు కొంచెం గాభరాగా.
"మన విషయం మా అమ్మ, నాన్నలతో చెప్పాను. వారికి ఈ ప్రేమలు, ప్రేమ వివాహాల పట్ల అంత నమ్మకం లేదు. అందువలన 'పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీకు రేపే కాలేజి ఆఖరు రోజు అవుతుంది. బుద్దిగా చదువుకుంటే ఈ సంవత్సరం పరీక్షలు అవగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. నిర్ణయం నీదే' అన్నారు. ఏం చేస్తాను. చదువు మానలేను. మిమ్మల్ని వదులుకోలేను. నా దగ్గర పచ్చచీర లేదు. పక్కింటమ్మాయిని అడిగాను. సందర్భానికి తగినట్లు ఎర్ర అంచు ఉన్న పచ్చ చీర ఉందని ఇచ్చింది. ఇక అంతా మీ చేతిలోనే ఉంది" అని విషయమంతా వివరించి చెప్పింది సుధ.
"ఆలోచించాలి అయితే. సరేలెండి. క్లాస్ కి టైం అవుతోంది. సాయంత్రం మాట్లాడుకుందాం. పదండి." అని సుధని క్లాస్ కి పంపించి, తాను కాలేజి బయటకు నడిచాడు మోహన్.
మోహన్, మధుమూర్తి ప్రాణ స్నేహితులు. ఇంటర్మీడియెట్ వరకు కలిసి చదువుకున్నారు. చదువు అంతగా ఒంటబట్టడం లేదని తండ్రి వ్యాపారంలో సహాయంగా ఉన్నాడు మధుమూర్తి. మధుని బయటకు రమ్మని, తన విషయం అంతా వివరించి చెప్పాడు మోహన్.
కాసేపు ఆలోచించాడు మధుమూర్తి. "గడచిన కాలం కంటే, మీరిద్దరూ కలిసి జీవించబోయేది ఎక్కువ కాలం. ఈ ఏటి తో చదువు అయిపోతుంది. కాబట్టి బుద్దిగా ముందు ఇద్దరూ చదువు పూర్తి చేయండి. భవిష్యత్తుకు ఢోకా ఉండదు. తర్వాత మీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే నేనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను." అని హామీ ఇచ్చాడు మధుమూర్తి.
"సరే"నని కాలేజీకి వెళ్లి, సుధతో ఈ విషయం చెప్పాడు. ఇద్దరూ చదువు పూర్తి చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈలోగా మోహన్ ఒకరోజు తన తల్లిదండ్రులతో తన ప్రేమ విషయం చెప్పేడు. మోహన్ తల్లిదండ్రులు రాబోయే కోడలి నుంచి పెద్ద కట్నం ఆశిస్తున్నారు. "సుధ వాళ్ళ అమ్మ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోలేదని, అందుచేత సుధ కట్నం తీసుకురాదని" చెప్పేడు మోహన్. దానితో మోహన్ తల్లిదండ్రులు కూడా సుధతో మోహన్ పెళ్లికి నిరాకరించారు.
మోహన్, సుధల పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఇచ్చి, వాళ్ల పెళ్లికి దరఖాస్తు చేసాడు మధుమూర్తి. పరీక్షల ఆఖరి రోజున ఉదయం, రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళ్లి, సంతకాలు పెట్టి, సుధ మెడలో మూడు ముళ్ళు వేసాడు మోహన్. మెడలో పచ్చని తాళితో పరీక్షకు హాజరయ్యింది సుధ. చదువులో ప్రస్తుతానికి ఆఖరు పరీక్షను రాసి, జీవితంలో తొలి పరీక్షను ఎదుర్కోడానికి సిద్ధమయ్యారు ఇద్దరూ.
***
గతం లో నుండి వాస్తవం లోకి వచ్చింది సుధ. ఆనాటి నుండి ఈనాటి వరకు మధు వీరికి ప్రతి విషయం లోనూ అండగా నిలుస్తూ వచ్చాడు. ఇల్లు ఒకసారి శుభ్రం చేసి, స్నానం చేసి, ముస్తాబు అయ్యి, మోహన్, మధు, లక్ష్మిల గురించి ఎదురుచూస్తూ కూర్చుంది.
"హృదయం ఓర్చుకోలేనిదీ... గాయం
ఇకపై తలచుకోరానిదీ ... ఈ నిజం
పెదవులు విడిరాదా, నిలువవే కడదాకా" పరుగు చిత్రం లో పాట స్పీకర్ లో వినిపిస్తోంది.
మీ అభిమాని గా మి రచనలు నాకు చాల ఇష్ట ముగా చదువుతాను. మీ రచనలు చాల బాగుంటాయి .మీ అభిమాని.
ధన్యవాదాలండీ
ధన్యవాదాలు శేషాద్రి సోమయాజులు గారు
మేడం గారు! చాలా బాగా ప్రారంభించారు….పాటల సెలక్షన్ సందర్భ అన్వయం చాలా నచ్చింది.
ఇది మంచి నవలగా నిలుస్తుంది… శుభాకాంక్షలు