Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 24
సత్యం మందపాటి

స్పందన

నా జీవితకాలంలో ఇప్పటివరకూ 1960, 1970, 1980 దశకాలు తెలుగు పత్రిక, పుస్తక పఠనాలకు స్వర్ణయుగం. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ప్రజామత, జ్యోతి, యువ, భారతి, స్వాతి వారపత్రిక, స్వాతి మాసపత్రిక, విజయ, నీలిమ, జయశ్రీ, కల్పన, వాణిశ్రీ, విశ్వరచన, పద్మప్రియ, ప్రగతి, నిర్మల, ప్రభవ, అపరాధ పరిశోథన, చందమామ, బాలమిత్ర, బాల మొదలైన ఎన్నో పత్రికలుండేవి. తెలుగునాట తెలుగు భాషకి ఆరోజుల్లో అక్షరాభిషేకం చేసిన పత్రికలవి. కొన్ని చిన్న పత్రికలు పెద్ద పత్రికల ధాటికి తట్టుకోలేకపోయినా, ఎన్నో సంవత్సరాలు సజీవంగా నిలిచాయి. గ్రంథాలయాలు కూడా పాఠకులకు ఎంతో దగ్గరై పత్రికల, పుస్తకాల పఠనంలో ఎంతో సహకారం అందించాయి. తర్వాత 1980 దశకంలో ఆనాటి ఒక తెలుగు ముఖ్యమంత్రి గ్రంథాలయాలకి ప్రభుత్వ సహాయం ఆపివేసి, కొన్నిటిని పూర్తిగా మూసేయటంతో చాల పత్రికలు మూతపడ్డాయి. ఇంకొక ముఖ్యమంత్రి ఆంగ్ల మాధ్యమ చదువుల కొనుగోలు తీసుకువచ్చి, తెలుగు భాషనే చివరి బెంచీలో కూర్చోబెట్టాడు. అందువల్ల తెలుగు చదివేవారు, వ్రాసేవరూ తగ్గిపోయారు. దానితో పైన చెప్పిన పత్రికలలో ఒకటి, రెండు పత్రికలు తప్ప మిగతావన్నీ, తర్వాత వచ్చిన తెలుగువెలుగు, విపుల, చతురలాటి ఎన్నో పత్రికలతో సహా మూతపడిపోయాయి. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఆనాటి కథలు అప్పటి సమాజ చరిత్ర గుర్తుచేస్తుంటే, ఆనాటి సాహిత్యాన్ని ప్రోత్సహించిన పత్రికల చరిత్ర చూపిద్దామని.

సినీ నటుడు నాగభూషణంగారు ‘రక్తకన్నీరు’ నాటకం కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన సంగతి నాటకాలను చూసేవారికి తెలిసిందే. ఆయన ఆ నాటకంలో అక్కడక్కడా కొన్ని జోకులు అప్పటికప్పుడు కల్పించి చెప్పటం కూడా నాబోటి ప్రేక్షకులకు తెలుసు. నేను చూసిన ఒక ప్రదర్శనలో ఆయన వేసిన ఒక జోకుని ఆధారం చేసుకుని సరదాగా వ్రాసినది ఈ కథ. ఇది ‘నీలిమ’ మాసపత్రికలో ప్రచురింపబడింది. చదివి ఎలావుందో చెబుతారు కదూ!

ఇది ఈ “అనగనగా ఆనాటి కథ” శీర్షికలో చివరి కథ. రెండు సంవత్సరాలు ఈ శీర్షికను ప్రోత్సహించి, నా ఆనాటి కథలను ఈ తరం వారికి మళ్ళీ చవిచూపించిన ‘సిరిమల్లె’ నిర్వాహకులు, సంపాదకులు మధుగారికీ, ఉమగారికీ, ఈ కథలు చదివి అనుకున్న దానికన్నా ఎక్కువగా స్పందించి తమ అభిప్రాయాలు తెలిపిన పాఠక మిత్రులందరికీ ఎన్నో, ఎన్నెన్నో ధన్యవాదాలు.

‘దైవాంశ సంభూతులు’

(ఈ కథ ‘నీలిమ’ మాసపత్రిక డిసెంబరు, 1977 సంచికలో ప్రచురింపబడింది.)

Daivamsa Sambhuthulu story image

“ఎంతవరకూ చెప్పాను?” దేవదాసు అడిగాడు, సీసాలోని బ్రాంది ఇంకొంచెం గ్లాసుల్లో పోస్తూ.

“ఎంతవరకూ చెబితేనేం కానీ, తాగేటప్పుడు రామాయణం, మహాభారతం కథలు చెప్పవద్దని తాగుతున్న ప్రతిసారీ చెబుతున్నాను. ఏనాడన్నా వినిపించుకుంటేనా నువ్వు” సణుగుతున్నాడు కబీరు.

“తాగేటప్పుడు ఏ కథయితేనేం? వాడి నోటి దురద తీరేదాకా వాగుతుంటాడు. తర్వాత ఎలాగూ గుర్తుండదు కదా!” అన్నాడు వైనతేయుడు.

“మీరు నోరు మూసుకోండోయ్. నువ్వు చెప్పరా దేవదాసూ. అప్పుడు రాముడూ, సీతా, ఆ మూడోవాడెవరు… లక్ష్మణుడేనా? వనవాసానికి వెడుతూ నదిని దాటుతున్నారు. అప్పుడేమయింది?” అన్నాడు సా.రా. (అతని పూర్తి పేరు సామర్లకోట రామారావు)

“ఆఁ! ఏం చెప్పాను? వాళ్ళు సరయూ నదిని దాటబోతున్నారు. పడవ సిద్ధంచేసి, సిద్ధంగా ఉన్నాడు మిస్టర్ గుహుడు” గ్లాసులోని బ్రాందీని ఇంకో గుటకవేసి, “ఎంత వరకూ చెప్పాను?” అడిగాడు దేవదాసు.

“నువ్వు చెబితే చెప్పు లేకపోతే లేదు. మధ్యలో వెథవ ప్రాంప్టింగ్ అడక్కు. నాకసలే తలనొప్పి” విసుక్కున్నాడు కబీరు.

“యస్, చెబుతున్నాను. శ్రీరాముడు పడవెక్కబోతూ ఒడ్డున నుంచుని సెండాఫ్ ఇవ్వటానికి వచ్చిన ప్రజావాహిన్ని చూశాడు. వారి మనసులో బాధని గ్రహించాడు. దగ్గరకు వచ్చి ‘సోదర, సోదరీమణులారా! మీరు నా మీద చూపుతున్న ప్రేమని, ఆప్యాయతని మరచిపోలేకుండా వున్నాను. మీకందరికీ ధన్యవాదాలు. దయచేసి వెనక్కి తిరిగి అయోధ్యకి వెళ్ళి సుఖంగా జీవించండి’ అని దీవించి పడవ ఎక్కాడు. పడవ భారంగా కదిలింది” ఆగాడు దేవదాసు.

“అంతమంది పడవ ఎక్కాక భారంగా కాకపోతే తేలిగ్గా కదులుతుందా భగవాన్లూ” అన్నాడు వైనతేయుడు.

“కానీవోయ్” అన్నాడు తను కానిస్తూ సారా.

“తర్వాత రామాయణం ఇరవై నాలుగు రీళ్ళ తెలుగు సినిమాలా పథ్నాలుగు ఏళ్ళు వనవాసం చేస్తూ, బోలెడు మలుపులూ, సందులూ తిరిగింది. రాముడు కూడా తిరిగీ తిరిగీ, తన పని కానిచ్చి, సీతా, లక్ష్మణ, హనుమలతో వెనుతిరిగాడు. మళ్ళీ సరయూ నదీతీరానికి వచ్చారు. పడవ ఎక్కి ఆనందోత్సాహాలతో నదిని దాటి, ఈవల ఒడ్డున అడుగుపెట్టారు. అప్పుడే చూశాడు రాముడు. నది ఒడ్డున ఇరవై ముఫై మంది పెద్దమనుష్యులు నుంచుని వున్నారు. గడ్డాలూ మీసాలూ పెరిగిపోయి, గుబురుగా నేల మీద వేలాడుతున్నాయి. చూడగా చూడగా వాళ్ళు పధ్నాలుగేళ్ల నించీ అక్కడే నిలుచుని వున్నట్టు అనిపించింది. స్నానపానాదులు లేవేమో, వాళ్ళ దగ్గర బాగా దుర్గంధం వేస్తున్నది. ఆహార పానీయాలు కూడా లేవేమో ఎండిపోయి బక్కచిక్కిపోయారు.

శ్రీరాముడిని చూడగానే వారి కన్నులలో కాంతి కనిపించింది. చలనం వచ్చింది. గబగబా ముందుకు వచ్చి, రాముడి కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశారు” దేవదాసు ఆగాడు ఇంకొక చుక్క వేసుకుందామని.

“ఒరే దేవదాసూ! ఇదంతా నిజంగా రామాయణంలో వుందిట్రా?” అడిగాడు కబీరు.

“ఉంటే.. వాడు చెప్పటమూ, మనం వినటమూ ఎందుకురా అవధాన్లూ? నీ అనుమానాలు అవతల పెట్టి వాడు చెప్పేది విను. ఊఁ! నువ్వు చెప్పరా?” అన్నాడు సారా, ఇంకో సీసా మూత తెరుస్తూ.

“శ్రీరాముడు సంభ్రమంతో అడిగాడు వారిని. ‘ఎవరు బాబూ మీరు? దొంగ స్వాములా, సన్యాసులా, బాబాలా? మీరెందుకిలా (కంపుకొడుతూ) వున్నారు? వాట్ హాపెండ్ టు యూ?’ అని. వాళ్ళు ఒక్కసారిగా పైకి లేచి, మోకాళ్ళ మీద మందంగా అంటుకున్న మట్టిని దులుపుకున్నారు. అందరూ ఒక్కసారిగా గొంతెత్తి ఇలా అన్నారు. ‘శ్రీరామచంద్ర మహాప్రభూ! నువ్వు దైవాంశ సంభూతుడివి. మేమెవరో తెలియక నువ్వడగటం లేదు. మమ్మల్ని పరీక్ష చేస్తున్నావు. అయినా అడిగావు కనుక చెబుతున్నాము. పధ్నాలుగేళ్ళయిందేమో, నువ్వు వనవాసానికి వెళ్ళేటప్పుడు, మన ఊరి వారందరం నిన్ను కనురాలా చూద్దామని ఈ నదీతీరానికి వచ్చాము. నువ్వు వెళ్ళిపోతూ, ‘సోదర, సోదరీమణులారా! మీరు మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళి సుఖంగా వుండండి’ అన్నావు. అని అరణ్యానికి వెళ్ళిపోయావు. గుర్తున్నది కదా! అప్పుడు మాతో వచ్చిన పురుషులూ, స్త్రీలూ అందరూ వెనుతిరిగి అయోధ్యకు వెళ్ళిపోయారు. కానీ ఆ రెంటికీ చెందని మా సంగతి ఏమిటని నువ్వు ఆలోచించలేదు. నీ ఆజ్ఞ లేకుండా మేము వెనక్కి తిరిగి ఎలా వెళ్ళటం? అందుకే నిద్రాహారాలు లేకుండా ఇన్నేళ్ళూ, ఇలా ఇక్కడే, ఈ ఒడ్డునే వున్నాము. ఇన్నాళ్ళకు మమ్మల్ని కనికరించావు శ్రీరామచంద్రా!’ అని మళ్ళీ రాముడి కాళ్ళ మీద పడ్డారు వాళ్ళందరూ. అప్పుడు శ్రీరాముడు వారి ఆప్యాయతకూ, ప్రేమకూ, క్రమశిక్షణకూ మిగుల సంతోషించాడు. ‘స్నేహితులారా, మీ సేవా తత్పరతకి ఎంతో ఆనందంగా వుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత కలియుగం వస్తుంది. ఆ కలియుగంలో మీరందరూ ఐశ్వర్యానందాలతో సుఖపడేలా వరం ఇస్తాను. ఆ కలియుగంలో మీరంతా భారతదేశంలో ఫలానా వాళ్లుగా పుట్టి, మీరిప్పుడు ఎంత త్యాగం చేశారో అంతకన్నా

ఎన్నో రెట్ల సౌఖ్యాన్నీ, కోట్ల సౌభాగ్యాన్నీ, ఏమీ శ్రమ పడకుండా అనుభవించండి’ అని దీవించాడు” దేవదాసు చెప్పటం పూర్తిచేసి ఇంకో చుక్క వేసుకుంటున్నాడు.

“నీ ముఖంలా వుంది. ఆ ఫలానా ఎవరో, ఏమిటో చెప్పి ఏడవరాదూ?” అడిగాడు కబీరు విసుగ్గా.

“ఏడుస్తాను. చెప్పే ఏడుస్తాను. నాకా శ్రీరామచంద్రుడే కలలో కనపడి చెప్పాడు ఆ ‘ఫలనా’ ఎవరో! ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో. కానీ నేను చెప్పేలోగా మీరే ఆలోచించి చెప్పాలి. యూస్ యువర్ బ్రైన్స్ అండ్ టెల్ మి” అన్నాడు దేవదాసు, ఇంకోసారి గ్లాసు నిండా బ్రాందీ పోసుకుని గుటకలు వేస్తూ తాగటం మొదలుపెట్టాడు.

“నేను చెబుతాను. దేవుడి పేరుతో మోసాలు చేసి ప్రజల్ని దోచుకుంటున్న దొంగ స్వాములూ, సన్యాసులూ, బాబాలూ” అన్నాడు కబీరు.

దేవదాస్ నవ్వాడు. “కాదు. యు ఆర్ రాంగ్” అన్నాడు.

“స్వార్థంతో, పదవీ వ్యామోహంతో, ధనాపేక్షతో ప్రజలని మోసం చేస్తూ, నమ్మినవారినే వెన్నుపోటు పొడుస్తూ, తమ వారసులకి పట్టాభిషేకం చేసే రాజకీయ నాయకులు” అన్నాడు వైనతేయుడు.

“కాదు. నువ్వు దాల్లో లెగ్గేశావు” అన్నాడు దేవదాసు ముద్ద ముద్దగా.

“తెలుగు సినిమాల్లో బూతు పాటలు, మాటలు వ్రాసేవాళ్ళు. సగానికి తక్కువ బట్టలు వేసి ఆడవాళ్ళ చేత బూతు డాన్సులు చేయించే సినిమా దర్శకులు. ఆ జన్మలో అనుభవించలేనిది ఈ జన్మలో అనుభవిస్తున్నారేమో” సారాగారి అభిప్రాయం.

“కాదురా నాన్నా, కాదు” అన్నాడు దేవదాసు ముద్దు ముద్దుగా.

“నేను చెప్పనా? అక్రమ వ్యాపారాలు చేసే నల్ల బజారుగాళ్ళు. కల్తీగాళ్ళు. లంచాలతో కుంచాలు నింపుకునే ఉద్యోగులు. దేశాన్ని ఎన్నో రకాలుగా నంజుకు తినే ఆరాచకం వెధవలు” అన్నాడు కబీరు.

“వీళ్ళెవరూ కాదు”

“కుల, మత, ప్రాంతీయ, భాషా బేధాలతో రెచ్చగొట్టి ప్రజలని విడదీసేవాళ్ళు”

“నో”

“పేదవాళ్ళని పీడిస్తూ పాతాళానికి తొక్కేసే ధనమదాంధులు”

“నో... నో”

“ప్రతిదానికీ నో నో అంటావేమిట్రా సన్నాసీ! అదేమిటో చెప్పి చావకూడదూ” అన్నాడు సారా కోపంతో.

“చెప్పనా.. చెబుతున్నాను వినండి. జాగ్రత్తగా వినండి” అంటూనే బాటిల్ ఎత్తి గడగడా త్రాగేశాడు దేవదాసు.

“చెప్పు!” అన్నాడు వైనతేయుడు.

“చె… బు… తు… న్నా… ను…” అంటూనే మైకం కమ్మి, తూలి ‘టప్’ మని క్రింద పడ్డాడు దేవదాసు.

“ఒరే.. దేవదాసూ…” అంటున్నాడు కబీరు.

“పీపాలకు పీపాలు త్రాగాక ఇక వాడేం లేస్తాడు? కథ ఎప్పుడు పూర్తి చేస్తాడు. తాగుబోతు వెధవ” అన్నాడు సారా, ఇంకో గుటక వేస్తూ.

“అయితే, ఇంతకీ ఎవరై వుంటారు ఆ ఫలానాగాళ్ళు?” వైనతేయుడికి జవాబు కావాలి మరి.

“ఎవరో.. దేవదాసులాటి తాగుబోతులే అయివుండాలి” అన్నాడు కబీరు, బాటిల్ ఎత్తి గడగడా తాగుతూ.

****ఈ శీర్షిక ఇంతటితో సమాప్తం****

Posted in August 2024, కథలు

6 Comments

  1. వెంకట్ నాగం

    ఆ ఫలానా ఎవరో, ఏమిటో తెలిసినవాళ్ళు నాకు తెలిసి ఇద్దరే ఇద్దరు ఉన్నారు.
    1. దేవదాసు
    2. సత్యం మందపాటి
    మొదటి ఆయన ఆ దేవదాసు నుండి ఈ విషయం కక్కించాలి అంటే కథ పొడిగించి మైకం కమ్మి, తూలి ‘టప్’ మని పడ్డ దేవదాసు బాబు హాంగోవర్ దిగేవరకు మనం వేచిఉండాలి – అప్పుడు ఆయనే చెబుతాడు లేదా సత్యం మందపాటి గారిని “బాబ్బబు” అని బ్రతిమలాడి ఆ ఫలానా ఎవరో తెలుసుకుంటే గానీ నాలాంటి పాఠకులకు నిద్రపట్టేట్టు లేదు సుమా!

    • సత్యం

      ధన్యవాదాలు మిత్రమా! ఇది నలభై ఏడేళ్ళ క్రితం వ్యంగ్యంగా నా ఆవేదన చూపిస్తూ వ్రాసిన కథ! ఆ దైవాంశ సంభూతులెవరో నేను కూడా మరచిపోయాను. నాకూ వయసొచ్చింది కదా మరి! దేవదాసు కూడా లేడు, శరత్‍బాబుగారి దగ్గరకి నాగేశ్వరావుగారితో కలిసి వెళ్ళిపోయుంటాడు. మనం ఇక కంచికి వెళ్ళి కనుక్కోవాలేమో! మన హాస్యాన్ని కొంచెం పక్కన పెడితే, ఆనాటికీ ఈనాటికీ ఇన్నేళ్ళయినా పరిస్థితులు ఏమాత్రం మారకపోగా, ఇంకా దిగజారిపోవటం చూస్తుంటే మనసులో బాధగా వుంటున్నది. త్వరలో మంచి కోసం మంచి మార్పు వస్తుందని ఆశిద్దాం.

  2. Bhaskar Pulikal

    It is difficult to write a story on gender as it is subject to multiple interpretations and often endup in controversy. By choosing an open ending, trail of humor and and an apt title, I guess the story comes out of those shackles. Congrats again on all the stories you wrote during that golden era. We all readers owe you a lot and will miss them for sure.

    • Satyam

      Agreed, particularly looking at the time I wrote this story about 47 years ago. I thought I should present it in a bit of humorous way in order get by from criticism on the content. I was glad at that time and glad now that readers received the story very well. Thanks for your comments, Bhaskar garu. Regards,

    • సత్యం

      ధన్యవాదాలు అన్నపూర్ణగారు. మీకు నా కథలు నచ్చినందుకు సంతోషం. అవునండి, నలభై రెండేళ్ళ క్రింద అమెరికా రాకముందు కన్నా ఇక్కడికి వచ్చాకే పధ్నలు అచ్చు పుస్తకాలు, అన్నే ఈ-పుస్తకాలు ప్రచురింపబడ్డాయి.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!