Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 23
సత్యం మందపాటి

స్పందన

నేను ఈ ‘అనగనగా ఆనాటి కథ’ ధారావాహిక మొట్టమొదటి కథ స్పందనలో వ్రాసినట్టు, క్రికెట్ టెస్ట్ మేచిలోలాగానే నా సాహిత్య ప్రస్థానంలో కూడా రెండు ఇన్నింగ్సులున్నాయి. భారతదేశంలో 1950 దశకం చివరలో చిన్న కథల రచనలతో మొదలై, 1960, 1970 దశకాల్లో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ మొదలైన ప్రముఖ వారపత్రికల్లోనూ, జ్యోతి, యువ మొదలైన ప్రముఖ మాసపత్రికల్లోనే కాక, ఆనాటి ఎన్నో పత్రికల్లో ఎనభై పైన నా కథలు ప్రచురింపబడి నేను సైతం సాహితీ పాఠశాలలో కొద్దిపాటి చోటు సంపాదించాను. అది నా మొదటి ఇన్నింగ్స్. 1980 దశకం మొదట్లో అమెరికాకి వచ్చాక, రెండవ ఇన్నింగ్స్ కథలు, వ్యాసాలు, నవలలు, కవితలు, నాటికలు, పాటలతో నా రెండవ ఇన్నింగ్సు ఇంకా నడుస్తూనే వుంది. ఈ ధారావాహికలో ఇది ఇరవై మూడవ కథ. దీనితో పాటు, ఇంకొక్క కథ కూడా మీ ముందుకు తెచ్చి ఆగస్టు సంచికతో ఈ శీర్షికను ఆపుదామని నా కోరిక. ఆ మాటే “సిరిమల్లె” సంపాదకులకు కూడా తెలిపాను. వారూ అంగీకరించారు. నాకెంతో ఇష్టమైన “మానవత్వమే దైవత్వం” అనే విషయం మీద ఆనాడే అంటే 1977లో వ్రాసినదీ కథ. ఆనాటి రచయిత, పత్రికా నిర్వాహకులు, చలనచిత్ర నిర్మాత, దర్శకుడు విజయ బాపినీడుగారి ‘విజయ’ మాసపత్రికలో ప్రచురింపబడింది. చదివి ఎలావుందో చెబుతారు కదూ!

‘అజ్ఞాతవాసం’

(ఈ కథ ‘విజయ’ మాసపత్రిక ఫిబ్రవరి, 1977 సంచికలో ప్రచురింపబడింది.)

Ajanatavaasam story image

ఆకాశం కన్నీళ్ళు పెట్టుకుని, ఉరుములతో వెక్కి వెక్కి ఏడుస్తున్నది.

యాదగిరి నవ్వుతున్నాడు. యాదగిరి ఏడవలేక నవ్వుతున్నాడు. వర్షం కుండపోతగా పడుతున్నది.

యాదగిరి కడుపులో ఆకలి మండిపోతున్నది.

యాదగిరి జీప్ డ్రైవర్. ఆఫీసర్ భూషణం ఆఫీసు పనుల మీదే కాక, స్వంత పనుల మీద కూడా విహారాలు చేసే ఆ జీప్ డ్రైవర్ యాదగిరి.

యాదగిరికి నలుగురు పిల్లలు, ఒక పెళ్ళాం, ఒక తల్లి. వాళ్ళందరూ అతని దుస్థితికి తార్కాణం.

పెళ్ళి చేసుకునే తాహతు లేని వయసులో వున్న ఒక చెల్లెలు. అతని కర్మకు కారణం. యాదగిరి తండ్రి తను కూడా కొడుకుకి భారమవటం ఇష్టం లేక, పరలోకం చేరుకుని తమాషా చూస్తున్నాడు.

వీళ్ళందరినీ పోషించటానికి అతనికి వచ్చేది అక్షరాలా నూట పంథొమ్మిది రూపాయలు. అవి కూడా సరిగ్గా నెలనెలా రావు. రాకపోవటానికి కారణం ఆఫీసర్ భూషణం.

గొడ్డులా పనిచేస్తున్నా యాదగిరి భూషణం ప్రాపకాన్ని పొందలేకపోయాడు మరి.

యాదగిరికి మూడు నెలలనించీ జీతం రావటం లేదు. ఆఫీసర్ని అడిగితే, ఇంకా పైనించీ ఎల్.ఓ.పి. రాలేదు అంటాడు. అంటే అప్పుడే జీతాలు రావని తెలుగులో అర్థం.

అడ్వాన్సు అడిగితే, “నువ్వు టెంపరరీ గాడివి. నీకు అడ్వాన్సు ఇవ్వరు” అని జవాబు.

మరి ఎలా?

ఎలా ఏమిటి? పస్తులుండటమే దానికి జవాబు.

అందుకే, అతనితోపాటు అతని మీద ఆధారపడ్డ వాళ్ళందరూ పస్తులుంటున్నారు.

యాదగిరి బయట వర్షంలో తడుస్తూనే ఆలోచిస్తున్నాడు. తన గుడిసెలో కూర్చున్నా ఈ వాన తగ్గదు. ఎక్కడైనా తను తడవక మానడు. వానలో తడిస్తే అతని ఆకలి మంటలు చల్లారవని తెలుసు.

కడుపులో మంటల కన్నా, ఇంకా ఎక్కువగా అతన్ని దహించేవి అతని మనసులో రేగుతున్న దావాగ్ని జ్వాలలు. ఆఫీసర్ భూషణం యాదగిరిని పెట్టే బాధలు.

తన జీతం గురించి పట్టించుకోడు. అడ్వాన్సులు ఇప్పించడు. ఆఖరికి తను ఎలా బ్రతకాలో కూడా తేల్చడు.

తనకి వేరే దిక్కులేకనే కదా ఈ ఉద్యోగంలో చేరింది.

రాత్రింబగళ్ళూ చాకిరీ. ప్రొద్దున్నే ఆఫీసర్ గారి పిల్లల్ని స్కూలు దగ్గర దించటంతో తన డ్యూటీ మొదలు. రాత్రి అమ్మగారిని సినిమా హాలునించీ ఇంటికి చేర్చటంతో తన డ్యూటీ ఆఖరు. అప్పటివరకూ పెళ్ళాం లేదు. పిల్లలూ లేరు. ఏమీ లేదు. అయ్యగారూ, అమ్మగారూ రాత్రి హోటల్లో తింటుంటే, అతనికి మిగిలేది కడుపులో పేగుల సంగీతం. బాధా.

వాళ్ళు భోజనం చేస్తున్న హోటల్ ముందు నుంచుని ఆ వాసనలు పీల్చుకోవలసిందేగానీ, ఏ తిండీ వుండదు. ఎన్నడూ ఒక్క రూపాయి ఇచ్చి, తనని ఏదన్నా తినమని అన్న రోజు లేదు.

ఆయన కడుపునిండా తింటే, తన ఆకలి కూడా తీరుతుందని ఆయన ఉద్దేశ్యం కావును.

చెట్టు క్రింద నెమ్మదిగా గడ్డి మేస్తున్న మేకపిల్లను, పరుకెత్తుకుంటూ వచ్చి పొడవబోయింది ఒక దున్నపోతు.

అప్రయత్నంగా నవ్వు వచ్చింది యాదగిరికి.

మేకపిల్ల ఏంచేసిందని అలా పొడుస్తున్నది దున్నపోతు?

అక్కడే అజ్ఞానానికీ, వివేకానికీ తేడా కనపడేది.

అయినా ఇక్కడ ఒక మనిషే ఇంకొక మనిషిని అనవసరంగా, అన్యాయంగా హింసిస్తున్నాడు.

దానికి ముఖ్యకారణం, అమ్మగారు వూళ్ళో లేని నెల రోజుల్లో ఆఫీసర్ భూషణం అవసరాలు తీర్చటానికి తన చెల్లెల్ని పంపించమన్నాడు. అలా అయితే ఆకలి తీర్చుకోవచ్చు అన్నాడు. ఎవరి ఆకలి?

మనిషి బీదయితే, మనసు కూడా బీదే అనుకున్నాడు కాబోలు. కాదన్నందుకు కాటు వేస్తున్నాడు.

తన అసహాయత వల్లనే భూషణంని ఏమీ అనలేకపోతున్నాడు. అతను ఎప్పుడు దెబ్బతీస్తాడో అని అనుక్షణం భయపడుతున్నాడు.

అయ్యగారికి కావలసినవాడు, తనను తీసివేస్తే వచ్చే ఖాళీలో చేరటానికి సిద్ధంగా వున్నాడు.

వాన తగ్గిపోయింది. కానీ అతని ఆకలి మాత్రం తగ్గలేదు.

స్వచ్ఛమైన ఆకాశం తేటగా వుంది. కానీ దెబ్బతిన్న అతని హృదయం బరువుగా వుంది.

వాన వెలిసిన తర్వాత వచ్చే ఎండ చాల అందంగా వుంటుంది. ఎంత బాధనైనా ఇట్టే నయం చేసి, మనసుని ఆహ్లాదపరిచే గొప్పదనం వుంది ఆ నీరెండలో.

యాదగిరి గుండెల నిండా గాలి పీల్చుకుని, ఒక్కసారిగా వదిలాడు.

ఆదెమ్మ లోపలినుండి అరుస్తున్నది, ‘ఇవాళ తిండి గింజలు తేకపోతే, పిల్లలూ తనూ ఆకలితో చచ్చిపోతామని’ గుర్తు చేస్తూ.

తనకీ బియ్యం తెచ్చిపడేయాలనే వుంది. కానీ ఎలా?

తిండిగింజలు లేకపోతే ఆకలి బాధతో తనతో సహా అందరూ చచ్చిపోతారు. పీడ విరగడవుతుంది.

తను చనిపోతేనే మంచిది. తన భార్యా, పిల్లలూ, చెల్లెలూ కాలే కడుపులతో, కన్నీళ్ళతో అలా దీనంగా చూస్తుంటే భరించలేడు.

దానికి పరిష్కారం ఒక్కటే! తలా కాస్తా విషం తీసుకోవటం. బ్రతకటంలో లేని సుఖం చావటంలో వుంటుందేమో!

కానీ తనకి ఆపని చేసే ధైర్యం వుందా? అతనిలో ఏదో వణుకు ప్రారంభమైంది.

యాదగిరి ఏదో ఆలోచిస్తూ లేచి నుంచున్నాడు.

అయ్యగారి ఇంట్లో అమ్మగారి పనులు చేసిపెట్టే ఆఫీస్ ప్యూన్ తనవేపే వస్తున్నాడు. అతను అమ్మగారి ద్వారా అయ్యగారి ప్రాపకం సంపాదించాడు. ఏ ఇబ్బందీ లేకుండా బ్రతుకుతున్నాడు.

“అయ్యగారు పిలుస్తున్నారు” చెప్పి వెంటనే వెనక్కి తిరిగాడు.

ఎందుకో యాదగిరికి తెలుసు, హైద్రాబాదుకి కేంపుకెళ్ళాలి.

ఆరోజు ఆదివారం. అయినా సరే, పోయిన ఆదివారం అక్కడ దిగబెట్టిన అమ్మగారిని వెనక్కి తీసుకురావాలి కదా మరి!

ఈ ప్రభుత్వోద్యోగులకి రాష్ట్ర ప్రగతి కోసం కేటాయించిన ప్రభుత్వం సొమ్ము, సంపదా స్వంతానికి వాడుకోవటానికి సిగ్గెందుకు వుండదో అర్థం కాదు. తినే లంచాలు చాలక కాబోలు, బస్సు చార్జీలు కూడా ఆదా చేయటానికి కక్కుర్తి. అంతేకాదు, కేంప్ మీద అత్తగారింటికి ప్రభుత్వంవారి జీపుల్లో వెళ్ళటం, ఆపైన రోజూ భత్యాలు కూడా లాభం. ఇలాటివారు ప్రభుత్వానికే అల్లుళ్ళు.

ఈమాటే పూర్వం తను మనసులో అనుకోబోతూ ప్రక్కనున్న డ్రైవరుతో అంటే, అది సరాసరి అయ్యగారికి చేరింది. ఆయన తనని ఉద్యోగంలోనించీ తీసివేయాలని చూడటానికి అది ఇంకొక కారణం.

యాదగిరి లేచి నుంచున్నాడు. వెంటనే అయ్యగారి ఇంటికి బయల్దేరాడు.

అప్పటికే భూషణం సిద్ధంగా వున్నాడు. వాకిట్లో ఎదురు చూస్తున్నాడు.

“ఏం చేస్తున్నావు ఇంట్లో?” అన్నాడు.

“నిన్ను పిలిపించి గంటయింది” విసుక్కున్నాడు.

“బుద్ధిలేకపోతే సరి. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే” కోప్పడ్డాడు.

యాదగిరికి కోపం వచ్చినా ఎదురు చెప్పలేదు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అయినా ఎదురు చెప్పకూడదు కనుక తల వంచుకుని నిలబడ్డాడు.

“ఆలస్యంగా వచ్చి కూడా మొద్దులా నిలబడతావేం? పద” అన్నాడు భూషణం కసురుతూ.

జీప్ బయల్దేరింది.

ఎక్కడికో ఆయన చెప్పడు. అయినా యాదగిరికి తెలుసు ఎక్కడికో. ఎప్పుడూ జరిగేది అదే కదా. అందుకే అమ్మగారి అమ్మగారింటికని హైద్రాబాదు రోడ్డెక్కాడు. జీప్ వేగంగా వెడుతున్నది.

ఆయన ధోరణి ఆయనదేగానీ, తన పాట్లు పట్టించుకోడు. తన జీతం, ప్రయాణపు ఖర్చుల బిల్లులు అన్నీ సంతకాలు చేయటానికి కూడా ఆలస్యమే. అంతేకాదు నరసిమ్మూర్తి అనే బిల్సు చూసే గుమాస్తా లంచాలు తినటంలో దిట్ట. ఆమ్యామ్యా పడితేగానీ కాగితం కదలదు. కదలకుండా అతనే దాని మీద భద్రంగా కూర్చుంటాడు. అతని పక్కనే కూర్చునే క్లర్కు దగ్గరనించీ కూడా ముష్టి పడకపోతే, ఇక యుగాలే పడతాయి బిల్లు చేతికి రావటానికి. అతనికి ఉద్యోగధర్మం చేయటానికి కూడా లంచమివ్వాలి.

ఆఫీసర్ గారి దొంగ బిల్లులన్నీ అతనే పాస్ చేస్తాడు కనుక, ఆయనకి రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోడు.

దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవటం అంటే ఇదే.

ఏమిటో ఈ జీవనసరళి! తనకి వేరే ఉద్యోగాలు ఎక్కడా ఇప్పించే తెలిసిన వారెవరూ లేరు కూడాను.

మరేం చేయాలి? ఈ అసమర్ఢుడి జీవితం ఎలా నడుస్తుంది?

అందుకే… తను హైద్రాబాదు వెళ్ళగానే ఎరువుల దుకాణానికి వెళ్ళాలి. ఏ ఎండ్రినో తమందరికీ సరిపడా తీసుకుని, ఊరు చేరగానే అందరూ తలాకాస్తా తిని…

కానీ తను ఆ పని చేయగలడా? యాదగిరికి భయమేసింది. చెమటలు పట్టాయి. దాని బదులు ఇలాగే బ్రతుకు ఈడవటం నయమేమో.

“నీకు ఈ ఉద్యోగం పోతే ఏమౌతుందో తెలుసా?” హఠాత్తుగా అడిగాడు భూషణం.

యాదగిరి గుండె ఒక్క క్షణం ఆగింది. నోట మాట రాలేదు.

భూషణం కూడా కొంతసేపు మాట్లాడలేదు.

“అదేమిటి సార్?” అన్నాడు నెమ్మదిగా, మళ్ళీ గుండె పనిచేయటం ఆరంభించాక.

అదోరకంగా నవ్వాడు భూషణం. “నీకు తెలీదా ఏం చేశావో’ అన్నాడు గట్టిగా.

యాదగిరి మాట్లాడలేదు. తను మాట్లాడితే అనవసరంగా మాటలు పెరగటం తప్ప లాభం లేదని తెలుసు.

“నేను ఈ నెలాఖరుకి నిన్ను పంపించేద్దామని ఆలోచిస్తున్నాను” సిగరెట్టు పొగ తాపీగా వదులుతూ అన్నాడు భూషణం.

“సార్” గాభరాగా అన్నాడు యాదగిరి.

తను చావలేడు. తనకా ధైర్యం లేదు. కానీ ఈయన బ్రతకనీయడు. ఎలా?

“పుల్లయ్య అని ఒక కొత్తతను వస్తున్నాడు!” అన్నాడు భూషణం.

“నా మీద చాలమంది ఆధారపడున్నారు సార్. నా నోటి దగ్గర కూడు తీసేయకండి సార్. నన్ను అన్యాయం చేయకండి సార్” గబగబా అన్నాడు యాదగిరి ఆయన్ని బ్రతిమిలాడుతూ.

“ఇందులో నిన్ను అన్యాయం చేసిందేముంది?” అన్నాడు భూషణం తాపీగా.

“ఇంతకీ నేను చేసిన తప్పేమిటి సార్” అడిగాడు యాదగిరి.

“పై ఆఫీసర్ల మాట వినకపోవటం. తలతిక్కగా మాట్లాడటం.” కసిగా అన్నాడు భూషణం.

“సార్...” అంటున్న యాదగిరి మాటలు వినపడలేదు,

పెద్ద శబ్దమయింది. వేగంగా పోతున్న జీప్ టైర్ ఒకటి బరస్టయింది.

యాదగిరి జీపుని కంట్రోల్ చేయటానికి ప్రయత్నం చేశాడు. అయినా కుదరక ప్రక్కనున్న రాళ్ళ మీదుగా వెళ్ళి, అక్కడే వున్న పెద్ద రాళ్ళ గుట్ట మీద తల క్రిందులుగా పడిపోయింది.

యాదగిరికి ఏం జరిగిందో తెలుసుకునే లోపలే కళ్ళు బైర్లుకమ్మాయి. స్పృహ తప్పింది.

కళ్ళు తెరిచేసరికీ తను పెద్ద బండరాళ్ళ మధ్య ఇరుక్కుని వున్నాడు. శరీరం అతని స్వాధీనంలో లేదు. ముఖం మీదనించీ రక్తం కారుతున్నది. బాధగా మూలుగుతూ లేచి కూర్చున్నాడు. చుట్టూ చూశాడు.

అది ఏదో రెండు ఊళ్ళ మధ్య ప్రదేశం. చెట్లూ, రాళ్ళ గుట్టలూ తప్ప జనసంచారం ఏమాత్రం లేదు. ఒళ్ళు విరుచుకున్నాడు. అప్పుడే చూశాడు జీపు క్రింద పడివున్న భూషణాన్ని.

యాదగిరి నెమ్మదిగా నడిచి భూషణం దగ్గరకు వెళ్ళాడు. నడుస్తుంటే కాళ్ళల్లో సత్తువ లేక. మళ్ళీ కళ్ళు తిరిగినట్టయింది. ఒక్క క్షణం అలా రాయి మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. తల మీదనించీ కారుతున్న రక్తం కంటికి తడిగా తగిలింది. ఒక్క క్షణం ఆగి కళ్ళు తెరిచాడు.

భూషణం జీపు క్రింద అలానే పడివున్నాడు. స్పృహ లేదు. ఇంకా దగ్గరికి వెళ్ళి చూశాడు యాదగిరి.

తలకీ చేతులకీ బాగా దెబ్బలు తగిలాయి. రెండు కాళ్ళూ తలక్రిందులైన జీపు క్రింద వున్నాయి. ఊపిరి మాత్రం ఇంకా ఆడుతున్నది.

యాదగిరి చుట్టూ చూశాడు. జనసంచారం లేదు. దగ్గరలో ఎక్కడా ఇళ్ళు కూడా కనపడలేదు. ఆ సమయంలో రోడ్డు మీద వేరే కార్లుగానీ, బస్సులు కానీ వస్తున్న సూచనలు లేవు.

భూషణం ముఖంలోకి చూశాడు. స్పృహ లేకపోయినా అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తున్నది. గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి.

అయినా అతని ముఖంలో ఏదో కాఠిన్యం, ఏదో కుత్సితం కనపడింది యాదగిరికి. అతను తనని సర్వనాశనం చేయాలని చూస్తున్న మనిషి.

తను ఏతప్పూ చేయకపోయినా, అతని శారీరక అవసరాలు తీర్చనందుకు తనని శిక్షించబోతున్నాడు. తన నోటి దగ్గర కూటిని దూరం చేయాలనుకుంటున్నాడు. తనూ, తన కుటుంబం మలమలా ఆకలికి మాడుతుంటే చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.

తన జీవితాన్ని నలిపి, నాశనం చేయబోతున్నాడు. తన బ్రతుకుని కాలరాయాలని చూస్తున్నాడు.

అలాటివాడు… అలాటి వాడు… మృత్యుముఖంలో కొట్టుమిట్టాడుతున్నాడు.

తను తప్ప ఇక్కడతన్ని రక్షించేవారెవరూ లేరు.

అతని మీద కసి తీర్చుకోవాలంటే, తన ఉద్యోగం కొనసాగాలంటే ఇదే చక్కని సమయం. మంచి కథ అల్లవచ్చు.

వేగంగా వెడుతున్న జీప్ టైర్ బరస్టయి ప్రమాదం జరిగింది. ఇద్దరూ బాగా దెబ్బతిన్నారు. కాకపోతే ఆఫీసర్ భూషణం ప్రమాదవశాత్తూ మరణించాడు. యాదగిరి కొన ఊపిరితో వున్నాడు. తర్వాత రోడ్డు మీద వెడుతున్న కారు డ్రైవరో, లారీ డ్రైవరో చూసి ఆదుకున్నాడు. కనీసం యాదగిరి బ్రతకగలిగాడు. చక్కటి కథ!

తన కోపం చల్లారుతుంది. తనని నాశనం చేద్దామనుకున్నవాడిని తనే నాశనం చేయవచ్చు. ప్రక్కనే వున్న ఒక పెద్ద రాయిని తీసుకుని భూషణం తల మీద గట్టిగా ఒకే ఒక్క దెబ్బ వేస్తే భూషణం మరణిస్తాడు.

అనంత శయనం. దీర్ఘనిద్ర. భూషణంకి శాశ్వతమైన నిద్ర.

పెద్దగా నవ్వాడు యాదగిరి.

భూషణం బలహీనంగా కళ్ళు తెరిచాడు.

పెద్దగా నవ్వుతున్న యాదగిరిని దీనంగా చూశాడు.

“చావు, నీలాటి ఎదవలు చావాల్సిందే” వికటాట్టహాసం చేశాడు యాదగిరి.

భూషణం ముఖంలో మృత్యుభయం స్పుటంగా కనపడింది. కదలబోయాడుగానీ, కదల్లేకపోయాడు.

ఏదో అనబోయాడు. కానీ మాట బయటకు రాలేదు.

యాదగిరి ప్రక్కనే వున్న పెద్ద బండరాయిని అందుకున్నాడు. పైకి ఎత్తాడు.

భూషణం ముఖం నల్లబడింది.

“నా జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నావు. కానీ ఇప్పుడా అవకాశం నాకు వచ్చింది” నవ్వాడు యాదగిరి.

భూషణం వణికిపోతున్నాడు. కళ్ళల్లో భయం తెలుస్తూనే వుంది.

యాదగిరి చేతిలోని బండరాయి పైకెత్తి సూటిగా మూర్తి తల మీద వేయబోయాడు.

భూషణం గొంతు చించుకుని “యాదగిరీ!” అని అరిచాడు పెద్దగా.

ఆ కేక భూమి నుంచి ఆకాశాన్నందుకునేంత కేక. అనంతాకాశం దద్దరిల్లే చావుకేక.

ఎదురుగా కనిపిస్తున్న మృత్యువు కౌగిలిలో చేరబోయే ముందు, మానవుడు పెట్టే చావుకేక. బ్రతుకు ఆఖరి క్షణంలో, మెడ మీద కత్తివేటు పడుబోతున్నప్పుడు బలిపశువు చేసే ఆఖరి ఆక్రోశన.

యాదగిరి కళ్ళకు మేకపిల్లను పొడవబోయిన దున్నపోతు కనపడింది.

అది పశువు. దానికి విచక్షణా జ్ఞానం లేదు.

కానీ తను? మనిషి. మానవత్వం వున్న మనిషి. ప్రతి మనిషిలోనూ అజ్ఞాతంగా వుండేదే ఆ మానవత్వం.

ఎంత దుర్మార్గుడైనా, ఆ మానవత్వం ఏదో క్షణంలో అతనిలోని అజ్ఞాతవాసం వదిలేసి, మనసుని తట్టి అతన్ని మేల్కొలుపుతుంది. అది లోపిస్తే తనకీ పశువుకీ తేడా లేదు. పైకెత్తిన బండరాయిని ప్రక్కకు విసిరేశాడు.

తూలి క్రింద పడిపోయి, పైకి చూశాడు.

పైన ఆకాశం నిర్మలంగా వుంది.

**********

Posted in July 2024, కథలు

6 Comments

    • సత్యం

      ధన్యవాదాలు ఉమగారు. ఆనాటినించీ ఈనాటిదాకా కుల, మత, ప్రాంతీయ బేధాలను ఏమాత్రం పట్టించుకోకుండా, మానవత్వపు విలువల మీదే నమ్మకం పెట్టుకున్నవాడిని నేను. మనం మనుష్యులుగా పుట్టినందుకు మనుష్యులుగా జీవించాలనేదే నా ప్రగాఢ విశ్వాసం. అదే ఈ కథలో కనిపిస్తుంది. మీకు నచ్చినందుకు సంతోషం.

  1. Rajani Katragadda.

    మంచి కథ ,సత్యం గారు.ఆకలి,అంతస్తులు,బెదిరింపులు, ప్రతీ కార భావన, సంఘర్షణ చాలా బాగా వ్రాసారు. అభినందనలు.

    • సత్యం

      ధన్యవాదాలు రజనిగారు. మీకీ కథ నచ్చినందుకూ, మీ దగ్గరనించీ మంచి స్పందన వచ్చినందుకూ సంతోషంగా వుంది.

  2. Bhaskar Pulikal

    సత్యం గారు చిర కాలం గుర్తుండి పోయే మంచి కథ. అది మంచిదనం గురించి. ఆకాశం నిర్మలంగా ఉందనటంలో ఆశావాదం నాకు తెగ నచ్చింది. మానవత్వం, ఆశావాదం గురించిన కథలు వ్రాయడం గొప్ప రచయితలు చేసే పని. మీరు ఆ జాబితాలో తప్పక ఉన్నారు.

    • సత్యం

      ధన్యవాదాలు మిత్రమా. మీరు మెచ్చుకోవటమే కాకుండా. మీ స్పందన కూడా వెంటనే తెలియజేసినందుకు సంతోషం. అవును మనమంతా ఆశావాదులమే! సాహిత్యవేత్త ఆరుద్రగారు “ఆశ మానవ జీవితానికి శ్వాస” అన్నారు కదా.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!