స్పందన
నా చిన్నప్పుడు, అంటే ఏడున్నర దశాబ్దాల క్రితం, బిచ్చగాళ్ళకు సమాజంలో ఒక రకమైన గుర్తింపు వుండేది. ఆ రోజుల్లో ఏ మధ్య తరగతి కుటుంబంలోనూ రిఫ్రిజిరేటర్లు వుండేవి కావు. మిగిలిన కూరలూ, పప్పూ, అన్నం కొంత పనివాళ్ళకి ఇచ్చినా, బిచ్చగాళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళు. ఆ పదార్ధాలు బయట వుంచితే మర్నాటికి పాడైపోతాయి. అవి బాగున్నప్పుడే ఇస్తే వాళ్ళ కడుపూ నిండుతుంది. అలాగే గుడి దగ్గర కొబ్బరిచిప్పలు, అరటిపళ్ళు వారి ఆకలి కొంతవరకూ తీర్చేవి. కాకపోతే నాకు మాత్రం అలాటి దివ్యాంగులకి ఇచ్చినప్పుడు వుండే తృప్తి, అన్ని అవయవాలు సరిగ్గా వున్నవారికిచ్చి వారిని బద్ధకిస్టులుగా తయారుచేయటం ఇష్టముండేది కాదు. ఆరోజుల్లో బస్సుల్లోనూ, రైళ్ళలోనూ బిచ్చమెత్తుకునే వారినీ, వారికి సహాయం చేసే కొంతమందిని, చేయని ఎంతోమందిని చూశాక నాలో కొన్ని ఆలోచనలు ప్రారంభమయాయి. పుట్టేటప్పుడు అందరం ఒకటే. అమాయక హృదయంగల అందమైన పసిపాపలం. కానీ డబ్బున్న ఇంట్లో పుట్టేవారికీ, ఒక పేదవాని ఇంట్లో పుట్టేవారికీ ఎంతో తేడా వుంది. అలాటి నిరుపేదలకు ఎలాటి అవకాశాలు సమాజం ఇస్తున్నదో చూసి బాధపడి వ్రాసిన కథే ఇది. కాకపోతే అలాటి నిరుపేదలకు, దివ్యాంగులకూ నాకు చేతనైన సహాయం నేను సైతం చేస్తూనే వున్నాను. మీరూ ఆలోచించండి. చదివి ఎలా ఉందో చెబుతారు కదూ!
(ఈ కథ ‘జ్యోతి’ మాసపత్రిక ఏప్రిల్, 1975 సంచికలో ప్రచురింపబడింది.)
“నేసెబితే యిన్నావుగాదే పిచ్చమ్మా. దొర కొడుకెప్పుడూ దొరే అవుతాడు. ముష్టోడి కొడుకెప్పుడూ ముష్టోడే అవుతాడే. అదంతే మరి, దానికి తిరుగునేదే” కుంటికాలవటం వల్ల కర్రపోటుతో నడుస్తూ అన్నాడు చింపిరయ్య.
“ఎహే, నువ్వొకింతసేపు నోరు మూసుకో మావా. పెతిదానికీ ఇంతే నువ్వు. ఆ కాలం పోనాది. రాజుగోరి కొడుకే రాజవాలని, మంతిరిగోరి కొడుకే మంతిరవాలనీ… అదేదీ పనికిరాదీ కాలంలో”. పట్టపగలు విరగబడుతున్న ఎండ, ఎండలోని తీక్షణం ఆమె గుడ్డి కళ్ళకి చీకటిగా కనపడటం వల్ల, చింపిరాయి భుజం మీద చేయి ఆసరాగా వేసి నెమ్మదిగా నడుస్తోంది పిచ్చమ్మ.
“నీకేదీ తెల్దే పిచ్చి పిచ్చమ్మా. నోకం సంగతి నీకేటి తెల్సు. నాను సెబుతాను యినుకో. రోజూ ఈరిగాడు ఆడు పంజేసే ఓటేల్లో అందరూ చెబుతుంటే యింటుంటాట్ట. ఆడే మనంటోల్లందరికీ నోకగ్నానం సెపుతుంటాడు. ఆడేం సెప్పాడో తెలుసా? రాజ్జాలు పోయినా, రాజులు పోయినా అదేం మారలేదంట. మంతిరిగోరి కొడుకులూ, కూతుల్లూ, అల్లుడ్లే మంతురులవుతారంట. చినిమావోల్ల పిల్లలే మల్లా చినిమాల్లో ఏసాలేత్తారంట. పెద్ద పెద్ద యాపారాలు సేసేవోరి పిల్లలే మల్లా ఆ యాపారాలు సేత్తారంట. డబ్బులున్నాల్లే ఇంకా డబ్బులు సేసుకుంటారంట. మనలాంటోల్లంతా ఇట్టాగే వుండిపోవాలంట. కనక ఆమాట ఇక అనబోకు. ముష్టోడి కొడుకు ముష్టే ఎత్తుకోవాల. దేవుడు మన కొడుకేగానీ ఆడేదో సదూకోవాలనీ, వుద్దేగాలు సేయాలనీ అంటావేటే ఎర్రిమొగవా…” అన్నాడు చిపిరయ్య.
“ఏవో మావా. నీకున్నంత నోకజ్జానం నాకు నేదు. అయినా దేవుడు సదూకోవాల, వుద్దేగం సేయాల. ఆడికి సదువంటే బోలెడు యిట్టం మావా. అక్కడా యిక్కడా అచ్చరాలు నేరుచుకుని ఏదో రాత్తుంటాడు. ఆడి తెలివీ, సురుకూ ఎంతమందికుంటది మావా? ఆడు మాత్తరం నా కంటంలో పానముండగా ముస్టికి పోకూడదు. ఆడికా కరమేంటి మావా. కాలూ, కల్లూ మనలా కాకుండా సక్కంగా వున్నోడు. ఆడు ముట్టెత్తుకోటం ఏటి?” అంది పిచ్చమ్మ.
పెద్దగా నవ్వాడు చింపిరయ్య. “ఆడు పుట్టిన్నాడే సెప్పినా, ఆడికి ఏ పిచ్చి సన్నాసో, ఎర్రి నాగన్నో అని పేరు పెడదామే అని. నువ్వే కాదూ కూడదని, దేవుడని పేరెట్టావ్. అందరూ నవ్వుతున్నారు. పిచ్చమ్మ కొడుకు దేవుడేటని. నేనప్పుడే సెప్పలా, ఆడికీ పుట్టిన మర్నాడే కాలో చెయ్యో తీచేస్తే, ఆడూ మనలాగానే ముట్టెత్తుకుని బువ్వ తినేవోడని. నువ్వూరుకుంటేనా? ఆడి ముగం సూడు మావా, ఆ సిన్నసిన్న చేతులు సూడు మావా అని కతలు సెప్పావుకందే! ఆడిని ముస్టెత్తుకోటం నేరుసుకోమను, ఆడికో బతుకుతెరువు సూపించినట్టుంటాది” అన్నాడు.
“ఛ… నోరు మూసుకో మావా. నీకేదీ తెల్దు…” సణిగింది పిచ్చమ్మ.
“అదిగో అయిదారాబాదు బస్సు వస్తుండాది. పద పద, నాలుగు డబ్బుల్దొరకాలంటే ఆడే” గబగబా కర్రతో నేల మీద కొడుతూ ముందుకు అడుగులు వేశాడు చింపిరయ్య.
బస్సులోకి అడుగుపెట్టిన చింపిరయ్య అలవాటు ప్రకారం, “బలి బలి బలి బలి దేవా” అంటూ పాట ఎత్తుకోలేదు. ఆసక్తిగా చూశాడు.
“యా, యు ఆర్ కరెక్ట్ ఎల్సీ” అంటున్నాడు భారతదేశం చూడటానికి సతీసుత సమేతంగా వచ్చిన రాబర్ట్ అనే ఆ అమెరికన్ అతను, తనని ఆనుకుని సుఖంగా కూర్చున్న ఎలిజబత్ అనబడే ఎల్సీ అను తన భార్యతో.
ఆమె నవ్వింది. నవ్వుతూనే తల ఊపింది. ప్రక్కనే వున్న వారి ఐదేళ్ళ లోపు ఇద్దరు పిల్లలూ వాళ్ళలో వాళ్ళే ఏవో మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు.
వెనుక సీట్లో ఖద్దరు లాల్చీ కట్టుకున్న ఒకాయన, ఆయన ప్రక్కనే పట్టుచీర కట్టుకున్న భార్య కూర్చున్నారు. ఆవిడ ఆ పిల్లల వేపు చూసి నవ్వుతున్నది. వాళ్ళతో మాట్లాడాలని ఆవిడ తాపత్రయం. కాని వాళ్ళు ఆవిడ సంగతి పట్టించుకోకుండా ఆడుకుంటున్నారు. పక్కనే వున్న సంచిలోనుంచీ రెండు జామ పళ్ళు తీసి ఇవ్వబోయింది. ఆ ఇద్దరు పిల్లల్లో చిన్నవాడు బిత్తరపోయి ఆవిడ వేపు చూసి, అవేమిటో అర్ధంకాక మళ్ళీ తన ఆటల్లో పడిపోయాడు. పెద్ద పిల్లాడు ‘నో థాంక్యూ’ అన్నాడు.
“ఫరవాలేదు, తీసుకో బాబూ. వద్దనకూడదు” అన్నది పట్టుచీర ఆవిడ, ఆ ఎర్ర జుట్టు, నీలం కళ్ళ పిల్లాడితో.
“తెలుగులో చెబితే వాళ్ళకి అర్ధంకాదే సావిత్రీ. ఇంగ్లీషులో చెప్పాలి. టేకిట్ బాయ్ టేకిట్” అన్నాడు ఖద్దరు లాల్చీ చిన్నప్పుడెవరో చెప్పిన ఇంగ్లీషు మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ.
“నో, ఐ డోంట్ వాంట్ దెమ్” అన్నాడా పిల్లాడు.
ఎల్సీ, రాబర్ట్ తమ కొడుకు వేపు తృప్తిగా చూశారు. ఎల్సీ మాత్రం పట్టుచీర ఆవిడవేపు స్నేహపూర్వంగా చూసి చిరునవ్వింది.
“మగేసా పాప వినాసా నినే నమ్మినాను ఈసా వాసా” అంటూ పాడుతూ తమకన్నా ఆ బస్సులోకి ముందే వచ్చారు ఒక ముష్టికుర్రాడు, అతనితోపాటు ఒక చిన్నపిల్ల. ఇద్దరికీ ఐదేళ్ళ లోపే వయసుంటుందేమో. వాళ్ళని చూసి చింపిరయ్య ఆగాడు.
ఆ ఇద్దరు పిల్లలూ కూడా పట్టుచీర ఆవిడ దగ్గర ఆగారు.
చింపిరయ్యకి వాళ్ళిద్దరూ తెలుసు. ఆ పిల్లకి కళ్ళూ, చెవులూ, ముక్కూ అన్నీ కలిసి ముద్దగా వుంటాయి. ఏవో చిన్న చిన్న రంధ్రాలుగా తప్ప ఏ అవయవాలూ సరిగ్గా వుండవు. ఆ పిల్ల అలా ఎలా బ్రతుకుతున్నదో చెప్పటం కూడా కష్టమే. ఆ పిల్లలిద్దరూ కవలపిల్లలనీ, వాళ్ళుకు జన్మనిస్తూనే వాళ్ళమ్మ పురిటిలోనే చనిపోయిందనీ అంటారు. అంతకు కొద్దిరోజుల ముందే తండ్రీ చనిపోయాడుట. అప్పట్నించీ వాళ్ళు అలానే గాలికి పెరిగారు. ఇలా అడుక్కుంటూ తననీ, తనతోపాటు తన చెల్లినీ పోషించవలసిన దుస్థితి ఆ పిల్లాడికి అంత చిన్న వయసులోనే కలిగింది. అందుకే చింపిరయ్యకి ఆ పిల్లల్ని చూస్తే అంత జాలి.
ముష్టెత్తుకోవటంలో కూడా కొన్ని మెలికలున్నాయి. అలా ఒకే బస్సులో ఒకేసారి ఇంతమంది ముష్టివాళ్ళు వస్తే, బస్సులో దానం చేసేవాళ్ళు ఎవరికో ఒకళ్ళకి మాత్రమే వేస్తారు. అందరికీ వేయరు. అందుకే చింపిరయ్య ఆ పిల్లలకి అడ్డురాదలుచుకోలేదు. అక్కడే నుంచున్నాడు. అటే చూస్తున్నాడు.
“అడుక్కుతినే ఎదవ బతుకు తల్లీ. దరమం సేయండమ్మా. మరీ పసిపాపలం తల్లీ. మీ పిల్లాంటోలమమ్మా. నిన్న పొద్దుటాలనించీ ఏం తిన్లేదు తల్లీ. ఓ పైసా దరమం సేయమ్మా” పట్టుచీర ఆవిడని బ్రతిమిలాడుతున్నాడు ఆ పిల్లవాడు.
ఆ పిల్ల లోపలకు పీక్కుపోయిన పొట్ట మీద పుల్లల్లాటి తన చేతులతో టపటపా మద్దెల కొడుతున్నది.
“ఛీ, అవతలికి పో. వెధవ గోల. అడుక్కు తినకపోతే ఏదన్నా పనిచేసుకోకూడదూ” కసిరింది పట్టుచీర ఆవిడ.
ఖద్దరు చొక్కా ఆయన పిల్లలిద్దరి వేపూ అసహ్యంగా చూశాడు.
పట్టుచీర ఆవిడ అమెరికా పిల్లలతో ఇంకా అంటూనే వుంది, “టేకు ఇట్టు, టేకు” అని.
పెద్ద కుర్రాడు తన నీలం కళ్ళ రెప్పలు టపటపా ఆర్పి, “నో” అన్నాడు మళ్ళీ.
ఖద్దరు లాల్చీ ఆయన ఆ కుర్రాడిని బ్రతిమిలాడుతూ, అతని చేతిలో జామకాయలు పెట్టబోయాడు.
ఆ జామకాయల వేపే ఆత్రంగా, ఆకలిగా చూస్తున్నారు ఆ ముష్టిపిల్లలిద్దరూ.
“ముద్దుగా వున్నారుగదా ఇవ్వబోతే తీసుకోరేం ఈ తెల్ల పిల్లలు” సణిగుతున్నది పట్టుచీర ఆవిడ.
“నిన్న ప్రొద్దుటినించీ ఏమీ తిన్లేదమ్మా. కల్లు తిరుగుతున్నాయి అమ్మగోరూ”
“ఛా, వెధవ సంత. తిండికి వేళాపాళా లేదు” అంటూనే ఒక పండుని తన చేతిలో వుంచుకుని, మిగతావన్నీ తన బుట్టలో పడేసింది. చేతిలోని పండుని కసుక్కున కొరికింది. ఆ ముష్టిపిల్లల వేపు కళ్ళురిమి చూసింది.
“ఏటి మావా, కదలకుండా అగావ్. పద” అంది, వినటమేగానీ అక్కడ జరుగుతున్నదేవీ చూడలేని పిచ్చమ్మ.
“పదయే… ముందుకి కాదు ఎనక్కి. బస్సు దిగుదాం” అన్నాడు చింపిరయ్య.
“అదేటి మావా. ఆకలి మండిపోతున్నాది” అంది పిచ్చమ్మ అతనితోపాటూ బస్సు దిగుతూ.
“ఎవరో తెల్లాళ్ళు, బాగానే ఉన్నోళ్ళు. వద్దన్నా యినకుండా ఆళ్ళ చేతుల్లో జాంకాయలు పెడతావుంది ఆడ కూర్చున్నావిడ. ఆకలేసి సస్తున్న ఆ యిద్దరు పసికూనల్ని కసురుకుంటోంది. ఇదేనే నోకం తీరు. ఉన్నోళ్ళకే అన్నీ. లేనోళ్ళకేం లేదు. పద” అన్నాడు చింపిరయ్య తనూ బస్సు దిగుతూ.
“మరి మనం అడుక్కోకపోతే, మన ఆకలెలా పోతుంది మావా” అంది పిచ్చమ్మ అమాయకంగా.
“మనం ముస్టోల్లమే అయినా, మనసున్న మడుసులమే. ఆ పసికూనలకి ఎవరన్నా అక్కడ పైసలిస్తారేమో. ఆళ్ళ చిన్ని కడుపుకి ఎంత కావాల? కానీ ఆళ్ళకలా మనం అడ్డు రాకూడదే పిచ్చమ్మా” అన్నాడు చింపిరయ్య.
ఆ బస్ దిగి ఇంకో బస్సు ఎప్పుడొస్తుందా అని చూస్తున్న చింపిరయ్యకు అక్కడి దృశ్యం చూసి హృదయం కలుక్కుమంది. పట్టుచీర ఆవిడా, ఖద్దరు లాల్చీ ఆయనా జామకాయ ముక్కలు కొరికి, బాగాలేవేమో బయటకు ఉమ్మేస్తున్నారు. బస్సు లోపల ఏమీ ముష్టి దొరకని ఆ పసికూనలు మట్టిలోనించీ అవి ఏరుకుని ఆకలిగా, ఆత్రంగా తింటున్నారు.
గబగబా అక్కడికి వెళ్ళి, తన డబ్బాలో వున్న పధ్నాలుగు పైసలూ వాళ్ళ డబ్బాలో పడేశాడు, ఏమైనా కొనుక్కుతింటారనే ఉద్దేశ్యంతో.
వాళ్ళు కృతజ్ఞతగా చూసిన చూపు చింపిరయ్య కడుపులో అంతకుముందు రోజునించీ గూడు కట్టుకున్న ఆకలినంతా ఒక్క క్షణంలో మటుమాయం చేసింది.
యధావిధిగా చింపిరయ్య ముందు నడుస్తున్నాడు. అతని చేయి ఆసరాగా వెనకనే గుడ్డి పిచ్చమ్మ నెమ్మదిగా వెడుతున్నది.
చింపిరయ్య ‘బలి బలి బలి బలి దేవా’ పాట పాడకుండా నిశ్శబ్దంగా నడవటం పిచ్చమ్మకు ఆశ్చర్యంగా వున్నది. అదే అడిగింది చింపిరయ్యని.
అదోరకంగా నవ్వాడు చింపిరయ్య. ఒక్క క్షణం మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అన్నాడు. “నువ్వు సెప్పింది అచ్చరాలా నిజమేనే. మన దేవుడు కాలూ, సెయ్యీ, కన్నూ అన్నీ మంచిగా వున్నవాడు. ఆడు అడుక్కుతినకూడదు. ఆడు సదూకోవాల. ఉద్దేగం సేయాల. ఆడ్ని నా కంటంలో పానముండగా అడుక్కోనీను. సూత్తావ్ కదా”
అలా అంటున్నప్పుడు అతని స్వరంలో ఏదో ధృడనిశ్చయం ధ్వనించింది పిచ్చమ్మకు. ఆమె ముఖం వికసించింది. హృదయమంతా చల్లని వెన్నెల పరచుకున్నట్టు హాయిగా అనిపించింది. తన చేతిలో వున్న చింపిరయ్య చేతిని మృదువుగా, ప్రేమగా నొక్కింది.
“మంచిమాట సెప్పినావ్ మావా. ఆడు మనలా అడుక్కుతినకూడదు. సక్కంగా సదూకోవాల. ఉద్దేగం సేయాల. దేవుడు నిజంగా దేవుడనిపించుకోవాల!” సంతోషం పట్టలేకపోతున్నది పిచ్చమ్మ. అప్పుడే తన కొడుకు, మామూలు ముష్టివాడి కొడుకు, చదువుకుని ఉద్యోగం సంపాదించినంత ఆనందం అనుభవిస్తున్నది.
“మనకి తిండి లేకపోయినా పర్లేదు. పత్తులుంటాం. కానీ దేవుడు సదూకోవాల. ఆడ్ని బళ్ళో ఏయాల” మళ్ళీ అన్నది.
వారం రోజుల తర్వాత దేవుడిని బడిలో వేద్దామని చేసిన ప్రయత్నాలన్నీ అయాక, ఊసురోమంటూ కూలబడ్డ చింపిరయ్య దగ్గరకు చేరింది పిచ్చమ్మ.
“ఏటి మావా, ఏటయింది” అన్నది.
చింపిరయ్య ముఖం ఎర్రబడింది. కాసేపు మాట్లాడలేదు. తనలో తనే సణుక్కున్నాడు. తర్వాత మెల్లగా అన్నాడు.
“ఇది డబ్బున్నాళ్ళ నోకమే! ఆడిని బల్లో ఏసుకోటానికి డబ్బడిగినారు. మరి పెబుత్వం డబ్బు తీసుకోరని సెప్పింది కదా. అదే అడిగినా. అది పీజు కాదంట, లంచం కాదంట, బడికి ఇరాళమంట. ఇరవై రూపాయలు కావాలంట. మనం ఇరవై రూపాయలు ఎపుడన్నా కంటితో చూసామా? ఇంకోటి ఇంగిలీసు బడంట. లోపలికే రానీలేదు. ఇంకో బల్లో ఆయన కసురుకున్నాడు. మనలాంటి ముస్టాల్ల కొడుకుల్ని బల్లో ఏసుకుంటే బడి పరువే పోతుందంట. మిగతా పిల్లకాయలు సెడిపోతారంట. ఇంకో బల్లో దేవుడు పుట్టినట్టు సట్టిపికేటు కావాలంట. ఆడేమన్నా ఆసుపత్తిరిలో పుట్టాడా, మంతరసానొచ్చిందా? ఏడనించొత్తది ఆ సట్టిపికెట్టు? ఈనోకంలో బతకటానికి, పుట్టినట్టు దాకలా కావాలా ఏంది? ఆడి పుత్తకాల కరీదే పది రూపాయలంట. ఇదేదన్నా పెద్ద చదువా, అన్ని పుత్తకాలూ, కరుసూనూ” అన్నాడు.
“మరేటి సేద్దం?” సాలోచనగా అంది పిచ్చమ్మ.
“ఈరిగాడేం సెప్పినాడో తెల్సా? సదువుకున్నోళ్ళు కూడా ఉద్దేగాలు దొరకక సత్తున్నారంట. ఆల్లకి తెలిసినోల్లు ఎవరూ నేకపోయినా, ఆపీసర్లకి లంచాలివ్వకపోయినా ఏ ఉద్దేగం రాదంట. ‘ఆడికి సదువెందుకురా, సుబ్బరంగా అడుక్కు తినటం నేరుపు’ అన్నాడు. నాకూ అదే మంచిదనిపిస్త్తావుందే, పిచ్చమ్మా” చివరి మాట మెల్లగా అన్నాడు చింపిరయ్య.
పిచ్చమ్మ గాభరాగా చూసింది. “వద్దు మావా, వద్దు” అంది.
వేదాంతిలా నవ్వాడు చింపిరయ్య.
“ఓసి పిచ్చమ్మా! మనది కింద నోకమే. గొప్పాళ్ళ నోకం మీదుంటది. దాన్నందుకోటానికి పెయత్నం సేయటం బుద్ది తక్కువే. ఆడు ముస్టోడి కొడుకు. ఆడలా బతకాలసిందే. ఆడికి పని దొరికితే కూలో నాలో సేసుకుంటాడు. కాలూ సేయీ వున్నాయిగందా. అది దొరకపోతే, ఆడి బాబు సేసే పనే ఆడూ సేస్తాడు. అదేం తప్పుగాదే. నోక సగజమే. మనం దొంగతనమేమీ సేయటం లేదుగందా. మనలోటాళ్ళు పైకెగిరితే కింద పడతామే పిచ్చమ్మా! అదంతేనే” అన్నాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన దేవుడు, అయ్య వేపు చూస్తూ అడిగాడు.
“అయితే నేనూ ముస్టెత్తుకోనా, అయ్యా!” అని.
బాగుంది సత్యం గారు
ధన్యవాదాలు భాస్కర్ గారు. ఆరోజుల్లోనే కాదు, ఈరోజుల్లో కూడా ఇలాటి వైషమ్యాలు వున్నాయి. అవి పోతేగానీ మానవత్వం మళ్లీ వికసించదు. ఈ కథ మీకు నచ్చినందుకు సంతోషం. మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదాలు.
కథ చాల బాగుంది సత్యం గారు. బీద వారికి అవకాశాలు ఈ నాడు కూడా ఉన్నట్లు అనిపించినా, అవరోధాలకు కూడా తక్కువ లేదు. ఆ విధంగా కథకి ఈ నాటికీ relevance ఉంది.
నాకు ముఖ్యంగా నచ్చింది ముష్టివాడి కొడుకు పేరు దేవుడని పెట్టడం. అలా చేయడంతో మీరు మీ కథను ఆధ్యాత్మికంగా కూడా మరో కోణం చూపించ కలిగారు. ఇంకా మీ సాహిత్య క్షేత్రం లో మీరు మంచి కథలు పండించడం, చదివించ గలగడం చదువర్లు గా మేము చేసుకున్న భాగ్యం