స్పందన
ఆనాటి ప్రధానమంత్రి దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, నిరంకుశ పాలన చేస్తూ తన పదవిని శాశ్వతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు భారతదేశం స్థంభించిపోయింది. ‘ఎంతోమంది నిస్వార్ధంగా దేశభక్తితో తమ ఆస్తులూ, జీవితాలు స్వరాజ్య సంపాదన కోసం త్యాగం చేసి, స్వతంత్రం తెచ్చింది ఇందుకా?’ అని ఎంతో బాధపడ్డ వారిలో నేనూ ఒకడిని. ముందుగా తురుష్కులు, తరువాత బ్రిటిష్ దొంగలు దోచుకున్నంత దోచుకున్నాక, మరి మనం ఎటువంటి ‘మనవాళ్ళ’ చేతుల్లో దేశాన్ని పెట్టామో చూసి, ఆ ఆవేదనతో వ్రాసినదే ఈ కథ. ఈ కథ ప్రచురింపబడి నలభై ఎనిమిది సంవత్సరాలు దాటింది. ఐనా దేశంలో పరిస్థితి మారకపోగా కులగజ్జి, మత పిచ్చి, ధనదాహం, స్వార్ధపరత్వం, పదవీ వ్యామోహం విపరీతంగా పెరిగుతుంటే, మనమెందుకని ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా వాడుకోవటం చేతగాని వాళ్ళం అయ్యాము అనిపిస్తుంటుంది. మనిషికీ మనిషికీ మధ్య ఉండవలసిన పరస్పర గౌరవం, సామరస్యం, ప్రేమానురాగాలు ఎందుకని మాయమైపోయాయి? ఈనాటి మన ప్రజాస్వామ్యం, కేవలం గంతులు వేయటం తప్ప ఇంకేమీ చేతగాని కోతికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, ‘జాగ్రత్త, అలా గంతులేస్తూ కొబ్బరికాయను పగలగొట్టద్దు’ అన్నట్టుగా ఉంది. నేను ఆరోజుల్లో కలం పేరుతో వ్రాసిన నా కథల్లో ఇదొకటి. చదివి ఎలా ఉందో చెబుతారు కదూ!
(ఈ కథ ‘ఆంధ్ర సచిత్ర వారపత్రిక’ జనవరి 23, 1976 సంచికలో ప్రచురింపబడింది.)
“బోలో… భారత్ మాతాకీ”
“జై”
“బోలో… మహాత్మా గాంధీకీ”
“జై”
“బోలో సర్దార్ పటేల్‍కీ”
“జై”
౦ ౦ ౦
“ఏమిట్రా అబ్బాయ్! ఆ జై జై ధ్వానాలూ… అవీనూ?”
“గాంధీగారూ వాళ్ళు సత్యాగ్రహం చేస్తున్నారే బామ్మా”
“అదేం ఆగ్రహంరా నాయనా?”
“బ్రిటిష్ వాళ్ళు మనల్నీ, మన దేశాన్నీ బానిసలుగా చేసి, ఇన్నాళ్ళూ మన ఆస్తుల్ని దోచుకుని పరిపాలించారు కదా. వాళ్ళని దేశం వదిలి వెళ్ళిపొమ్మనీ, మన దేశానికి స్వరాజ్యం ఇవ్వాలనీ సత్యాగ్రహం చేస్తున్నారు”
“అదేమిట్రా నాయనా, సీమ దొరలు మనల్ని బాగానే పరిపాలిస్తున్నారు గదా!”
“ఆఁ! బాగానే పరిపాలిస్తున్నారు? ఏమిటి మనల్ని బానిసలుగా వాళ్ళ బూటు క్రింద తొక్కి పట్టటమా? మన కష్టం మీద వాళ్ళ ఖజానా నింపుకోవటమా? ఇంతకుముందు మనల్ని పీక్కుతిన్న తురుష్క దయ్యాలలాటి వారే వీళ్ళు కూడా. వీళ్ళు దేశానికి పట్టిన పిశాచాలు. వీళ్ళు మన దేశం వదిలేదాకా నిద్రపోము. స్వరాజ్యం మన జన్మహక్కు!”
“అయితే సత్యాగ్రహం చేస్తే వాళ్ళు దేశం వదిలిపోతారా?”
“ఆహాఁ! వెళ్ళి తీరాలి. మహాత్మా గాంధీగారి నాయకత్వంలో జరుగుతున్న ఈ స్వరాజ్య పోరాటం ఆగదు. సర్దార్ పటేల్, టంగుటూరి ప్రకాశం, కాశీనాధుని నాగేశ్వర్రావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, నెహ్రూ, సరోజినీ నాయుడు, అజాద్, రాజన్‍బాబు మొదలైన మహామహులు వారి ప్రాణాలు కూడా లెఖ్క చేయకుండా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. నిస్వార్ధంతో, ప్రజా క్షేమం, దేశ భవిష్యత్తు కోసం చేసే ఏ ఉద్యమాన్నీ ఎవరూ ఆపలేరు”
“అలాగా! మరి స్వతంత్రం వస్తే మనకేమిటిరా లాభం?”
“లాభమా? భలేదానివే బామ్మా. మన దేశాన్ని మనమే పాలించుకుని ఆనందంతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో తులతూగుతాం. దేశంలో పేదా సాదా అంటూ ఉండరు. ప్రతివాళ్ళకీ ఉద్యోగాలు, కావలసినంత తిండీ, బట్టా, ఉండటానికి ఇల్లూ... అన్నీ ఉంటాయి. నిరుద్యోగులనే వాళ్ళే ఉండరు. ఈ తెల్లదొరల ఆఫీసుల్లోలాగా లంచాలు, అవినీతీ, బంధుప్రీతి, విభజించి పాలించటం... ఇలాటివేవీ ఉండవు. ప్రతివాడూ ఈ పాడు ఇంగ్లీష్ చదువులు మానేసి, చక్కగా తెలుగు, తమిళ్, హిందీ, సంస్కృతం మొదలైన మన భాషల్లోనే చదువుకుంటారు. దేశంలోధర్మం నాలుగు పాదాలా నడుస్తుంది. ఈ దేశం మన ఇల్లు. చిన్న చిన్న గొడవలున్నా, మన ఇల్లు మనమే సర్దుకుంటాం. మన దేశ ప్రజలందరం బానిసత్వం నుండి బయటపడి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటాం”
“అయితే ఈ స్వతంత్ర పోరాట ఉద్యమాన్ని మనం కూడా ప్రోత్సహించాల్సిందే నాయనా!”
“అంతే కాదు, ఈ త్యాగధనుల నిజాయితీని గ్రహించి ప్రతి భారతీయుడూ తన బాధ్యతను గుర్తించి స్వతంత్ర పోరాటంలో పాల్గొనాలి”
“అవునురా నాయనా. నువ్వు చెప్పింది నిజమే. మన దేశం సుఖ సంతోషాలతో తులతూగాలంటే మనకి స్వతంత్రం రావాలి. స్వపరిపాలన కావాలి.”
“బోలో స్వతంత్ర భారత్‍కీ”
“జై”
౦ ౦ ౦
“బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టేశాం బామ్మా. మన దేశానికి స్వతంత్రం వచ్చేసింది.”
“నిజమా నాయనా. ఇంతమంది పడ్డ శ్రమా, చేసిన ప్రాణ త్యాగాలు ఫలించాయన్నమాట”
“అవును. ఈరోజు మన ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప రోజు. అటు చూడు. చిన్న చిన్న చీమలన్నీ అక్కడున్న పురుగూ పుట్రలను బయటకు తోలేసి, భద్రంగా, సుఖంగా ఉండాలని చక్కటి పుట్టలు కట్టుకున్నాయి”
“అవున్నాయనా. మనం కూడా అలాగే శత్రువులను బయటకు తోలేసి, స్వరాజ్యం సంపాదించుకున్నాం. మరి ఇక నవభారత నిర్మాణం చేసుకుందాం. సుఖంగా బ్రతుకుదాం!’
“బాగా చెప్పావు బామ్మా!”
౦ ౦ ౦
“తాతయ్యా! ఏమిటి ఆ అరుపులు?”
“చిన్నపిల్లవి నీకు సరిగ్గా అర్థంకావమ్మా. అవి ఒకళ్ళు అరుస్తున్న అరుపులు కావమ్మా. రకరకాలమంది రకరకాలుగా అరుస్తున్న అరుపులు”
“అవును, నాకు అసలేమీ అర్థం కావటం లేదు. సరిగ్గా చెప్పు”
“చెబుతాను. కులాల పేరుతో చదువులకు, ఉద్యోగాలకూ ఎక్కువ కోటాలు కావాలని ఆ గుంపు అరుస్తున్నారు. మరి క్లాసుల్లో, చదువుల్లో ఎంతో ముందున్న వాళ్ళకి అవకాశాలివ్వకుండా వదిలేస్తే వాళ్ళేమైపోతారని ఇంకొకళ్ళు అరుస్తున్నారు. విద్యార్థులేమో పరీక్షలొద్దనీ, చదువుకోకుండానే అందరూ పాసవాలనీ అరుస్తున్నారు. చదువులు అయిపోయినవాళ్ళు ఉద్యోగాలు కావాలని అరుస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు జీతాలు ఇంకా పెంచమని అరుస్తున్నారు. ఆ పక్కన అరుస్తున్న ఆడవాళ్ళేమో నిత్యావసరాల ధరలు తగ్గించమనీ, అవినీతిని అరికట్టమనీ అరుస్తున్నారు”
“మరి ఆ ప్రక్కనే మాట్లాడకుండా చూస్తూ నుంచున్నదెవరు తాతయ్యా?”
“వాళ్ళేనమ్మా ఈ దేశాన్ని నాశనం చేస్తున్నవాళ్ళు. కల్తీ వర్తకులేమో చక్కటి పదార్థాలలో రాయీ రప్పా, నానా చెత్తా కలిపి సామాన్యుల్ని పీల్చి రక్తం త్రాగుతున్నారు. వాళ్ళే మళ్లీ నిత్యావసరాలన్నీ అందకుండా దాచేసి, నల్ల బజార్లో అమ్ముకుని ఎంతో డబ్బు చేసుకుంటున్నారు”
“మరి వాళ్ళను ఎవరూ పట్టుకోరా తాతయ్యా?”
“లేదమ్మా, పట్టుకోరు. వాళ్ళు ఆ పట్టుకునే ప్రభుత్వ యంత్రాంగాన్ని కొనేశారు. ప్రభుత్వోద్యోగుల్లో చాలమంది లంచాలతో లక్షాధికారులూ, కోటీశ్వరులూ అయిపోయారు. మరి వాళ్ళని పట్టుకుంటే, వీళ్ళ లాభాలు పోతాయి కదా!”
“ఏమో, అవేమీ నాకు అర్థం కావటం లేదు తాతయ్యా!”
“నీకే కాదు, నాకూ అర్థంకావటం లేదు. పెద్ద జీతాలూ, ప్రతి సంవత్సరం జీతాల పెంపులూ, మళ్ళీ లంచాలు, ఆఫీసుల్లో సరిగ్గా పని చేయరు, ఎవరు ఏ పని మీద కలిసినా చుట్టూ తిప్పుకోవటమేగానీ పని చేయరు. అవన్నీ కొంచెం పెద్దయాక నీకు తెలుస్తాయిలే!”
“మరి అక్కడ బస్సులు తగలబెడుతున్న వాళ్ళెవరు తాతయ్యా?”
“వాళ్ళని దురభిమానులంటారమ్మా. కొందరు ప్రాంతీయాభిమానులు. వాళ్ళకేగానీ, ఇంకో ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలివ్వకూడదట. అలాగే కుల దురభిమానులు, మత దురభిమానులు, భాషా దురభిమానులు… “
“అదేమిటి తాతయ్యా, మరి అందరూ ఒక దేశం వాళ్ళే కదా! ఎందుకిలా కొట్టుకుంటున్నారు?”
“మొన్నటిదాకా చదువూ సంధ్యా లేకుండా బేవార్సుగా తిరిగిన వాళ్ళు ప్రజానాయకులు అవుతున్నారు. మన రాజకీయ నాయకులు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఒకటేనమ్మా, విభజించి పాలించు అని. ఓట్ల కోసం దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తేనే వాళ్ళకి గెలుపు, లాభం.”
“ఏమిటో నువ్వు చెప్పేది ఒక్క ముక్కా అర్థం కావటం లేదు నాకు. మరి ఆ పక్కన పార్కులో బెంచీల మీద కూర్చుని వాదించుకుంటున్న వాళ్ళెవరు తాతయ్య?”
“వాళ్ళేనమ్మా, చదువుకున్న మేధావులు. ఇలా ఎక్కడపడితే అక్కడ మన దేశం ఎందుకు పాడైపోయింది అని ఊసుపోని సొల్లు కబుర్లు చెప్పటం తప్ప, తమ చేతిలో ఉన్న ఓటుని కూడా సమర్థవంతంగా వాడుకోవటం చేతగాని దద్దమ్మలు. ఆకాశంలో నించి దిగి వచ్చి దేశాన్ని బాగుచేసే హీరో కోసం ఎదురు చూస్తున్న దేశానికి పట్టిన దరిద్రాలు”
“మరి ఆ పక్కన రిక్షా తొక్కుతున్న ముసలాయన ఎందుకలా నవ్వుతున్నాడు?”
“అతను కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడులే అమ్మా! బహుశా ఆ పోరాటంలో ప్రాణాలర్పించిన తన బంధుమిత్రుల్ని తల్చుకుని, ఏడవలేక నవ్వుతున్నాడేమో”
“సరిగ్గా చెప్పు తాతయ్యా, నాకు అంతా గందరగోళంగా ఉంది”
“నీకు అర్థం కాదులేగానీ, రేపు క్లాసులో అప్పజెప్పవలసిన పద్యం ఏదీ. చదువు”
“చీమల పెట్టిన పుట్టలు పాముల….”
సత్యం గారి ఈ కధ ఎప్పుడు రాసినదైనా.. ఇప్పటి దుస్థితికి అద్దంపట్టినట్టుగా ఉంది. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకీ అర్ధమయ్యేలా చెప్పిన కధనంలో ఎన్నో నిజాలు ఉన్నాయి.. మరో చక్కని కధ .. ఎంతో సమాచారం.. వాస్తవాలు..
ధన్యవాదాలు ఉమాభారతి గారు. ఆనాటి పరిస్థితులు మారకపోగా ఇంకా అలాగే ఉండటం మన దురదృష్టం.
చాలా బాగుందండి కథ. చూస్తున్నాం కదా! మీ అప్పటి కథలో చెప్పినట్లు ఇప్పటికీ పరిస్థితులు అలానే వున్నాయి మరి.
ధన్యవాదాలు శ్రీనివాసరావుగారు.
ధన్యవాదాలు మహాశయా! ఈ కథ మీకు నచ్చినందుకు సంతోషం.
కథ బాగుంది సత్యం గారు. ఈ కథ ఇప్పటికీ నిజం అవ్వడం మన దురదృష్టం. కాదంటే ఇప్పుడు ఉద్యమాలు తగ్గిపోయాయి. వాటి మీద అందరికీ చిన్న చూపే. మనం అందరం ప్రపంచం ఇలానే ఉంటుంది అన్న అంగీకారానికి వచ్చేసాము 🙂 ఇటీవలి కలిసినప్పుడు మీ దగ్గర ఈ కథ నేపథ్యం విన్నది నాకు ఇంకా గుర్తు వస్తూ ఉంటుంది. అభినందనలు.
ధన్యవాదాలు భాస్కర్ గారు. అవును, ఈ కథ ఇప్పటికీ నిజం అవ్వడం మన దురదృష్టం.
కథ చాలా బాగుంది.
ధన్యవాదాలు మహాశయా! ఈ కథ మీకు నచ్చినందుకు సంతోషం.