అమృతాంజన్
మన భారతీయులకు తలనొప్పి అంటే వెంటనే గుర్తుకువచ్చేది అమృతాంజన్. తలనొప్పిని నివారించడానికి అమృతాంజన్ వాడేవారు. ఇప్పుడు రక రకాల బ్రాండ్లు వచ్చాయి గాని ఒకప్పుడు అమృతాంజన్ మాత్రమే ఉండేది. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు అమృతాంజన్ బామ్ అంటే బహుశా అతిశయోక్తి కాదేమో! అందుకే ఎన్ని క్రొత్త బ్రాండ్లు వచ్చినా అమృతాంజన్ నేటికీ మంచి లాభాలతో అందరికీ చేరువుగానే ఉంది. మరి ఈ నొప్పులు హరించే ఔషధం తయారీలో ప్రముఖ పాత్ర పోషించిన వారెవరు? అనే సందేహం రావచ్చు. దాని సృష్టికర్త, అత్యంత భాషాభిమానం ఉన్న ఒక తెలుగువాడు, మన తెలుగు వాడు అంటే మాత్రం ఆశ్చర్యం కలుగక మానదు. కానీ అది నిజం.
తెలుగు భాష మీద మక్కువతో, 1909 వ సంవత్సరంలో ఆంధ్రపత్రిక అనే వార పత్రికను బొంబాయి అంటే నేటి ముంబయ్ లో స్థాపించి పిమ్మట దినపత్రికగా మద్రాస్ నగరం నుండి అంటే నేటి చెన్నై నడిపిన తెలుగువాడు, అందరికీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగా పరిచయం అయిన కాశీనాధుని నాగలింగం గారు. ఆయనే మొట్ట మొదటగా అమృతాంజన్ ఉత్పత్తిని ప్రారంభించారు.
మరొక్క ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ అమృతాంజన్ అమ్మకాలపై వచ్చిన లాభాలన్నింటినీ నాగేశ్వరరావుగారు పేదవిద్యార్థుల చదువుకే హెచ్చించారు. అందుకే ఆయనకు “దేశోద్ధారక, విశ్వదాత” అని బిరుదులు సంపాదించారు. ఆయన పేరుమీద ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల అయ్యింది.
ఒక పత్రికాధిపతిగా, పాత్రికేయుడుగా, వ్యాపారవేత్తగా, స్వాతంత్ర్య్ర సమరయోధుడుగా, సంఘసంస్కర్తగా ఇలా ఎన్నో సామాజిక అంశాల పరిధిలో కాశీనాధుని నాగేశ్వరరావుగారు తెలుగుప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన స్థాపించిన ఈ అమృతాంజన్ నేటికీ తమిళనాడు, తెలుగు రాష్టాలలో నొప్పి నివారించే ఔషధాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.