Menu Close
Bandaru-Vidhyullatha
అంపశయ్య (కథ)
-- బండారు విద్యుల్లత --

ఎంతో మత్తుగా ఉంది, స్పృహ తెలియటం లేదు. ఏదో బాధగా ఉంది, ఏమీగుర్తు రావటం లేదు. ఏమి జరిగిందో తెలియడం లేదు. దూరంగా మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెం స్పృహ తెలుస్తోంది కానీ కళ్లు తెరచి చూడలేక పోతున్నాను. దూరంగా మాటలు వినిపిస్తున్నాయి.

‘పిల్లలెవరూ రానే లేదు, వదిలిపెట్టలేక నేనే వస్తున్నాను. నాకింట్లో ఎన్నో పనులు. కానీ ఏం చెయ్యను? చెల్లెలిని కదా? తప్పదుగా?’ అరుణ మాటలు గుండెల్ని మెలిపెడుతున్నాయి.

అదన్నది నిజమే. దాని కొడుకుకి అమెరికన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చెయ్యడానికి సీటు వచ్చింది. అత్తగారు పెద్దావిడ ఉంది. కూతురు డెలివరీకి వచ్చింది. పాపం దానికి ఎన్నో పనులు. నేను సాయం చేయక పోగా దాని మెడకు చుట్టుకున్నాను. ఏం చేయను? నా పిల్లలిద్దరూ అమెరికాలోనే ఉన్నారు. కొడుకూ, కోడలు నా పైన అలిగారు. నా కోడలికి జబ్బు చేసి పిల్లలను చూసుకోవాల్సిన సమయంలో నా కొడుకు నన్ను రమ్మని ఎంతో అడిగాడు. కానీ నేను వెళ్లలేని స్థితి. నా భర్త రాఘవకు తోడుగా ఉండాలని, నా అసమర్ధతను తెలిపాను. అప్పటినుంచీ నాపై అలక. రాఘవకి షుగర్ వ్యాధికి తోడు సిగరెట్ అప్పుడప్పుడూ మందు అలవాటుండటంతో నేను దగ్గరుండి ఆయనని చూసుకోవలసిన అవసరం ఉండేది. ఆ తరువాత ఏడాదికే గుండె పోటుతో రాఘవ పోయారు. ఇప్పుడు తను ఒంటరిది. తనని తీసుకెళ్లడానికి, ఉంచుకోవడానికి కోడలు ఒప్పుకోక పోవటంతో రాజా కూడా మిన్నకుండి పోయాడు. ఒంటరితనం ఎంత బాధ పెడుతున్నా, నలుగురు పిల్లలకి పాఠాలు చెబుతూ చుట్టుపక్కల వారికి సాయం చేస్తూ నా జీవితాన్ని వెళ్లదీస్తున్నాను.

మా కూతురు కల్యాణి కూడా అమెరికాలోనే ఉంది. దాని కొడుకుకి కార్ ఆక్సిడెంట్ అయ్యి ఆసుపత్రి లో ఉండటంతో తనకోసం పేపర్లు పంపి టికెట్ కొని ఎదురు చూస్తోంది. దానికి ఇద్దరు ఆడ పిల్లలు చిన్న వాళ్లు ఉండటంతో వాళ్లని, పిల్లాడిని చూసుకోవడం కష్టంగా ఉన్నది, దానికి తోడు ఉద్యోగం, ఇంటి పనులు. మా అల్లుడు మురళీకి మాకు అంత సయోధ్య లేదు. అతని తల్లికి ఆపరేషన్ అయ్యి అవసరానికి మేము ఐదు లక్షలు తన అన్నకి సర్దలేదని అతనికి మాపై కినుక. పొలం అమ్మి సర్దుదామని నా భర్తకి ఎంత నచ్చ చెప్పినా వినలేదు. తన తండ్రి గుర్తుగా ఉన్నది అది ఒక్కటేనని అది అమ్మనని పట్టుపట్టి కూర్చున్నాడు. ఉద్యోగ విరమణై వచ్చిన డబ్బంతా వేరు వేరు చోట్ల పెట్టి పోగొట్టుకున్నాం. పెన్షను డబ్బులతో ఎలాగో బ్రతికేస్తున్నాం. కానీ అతనికి అవేమీ పట్టలేదు. మేము ఇవ్వలేదన్నదే మనస్సులో పెట్టుకున్నాడు. రాఘవ పోయినప్పుడు కూడా రాలేదు, పలకరించలేదు. అందుకే అక్కడికి వెళ్లాలంటే మొహమాటంగా అనిపిస్తుంది. కానీ రానని చెప్పే కారణాలు కూడా లేక పోవటంతో వెళ్దామని నిర్ణయించుకున్నాను. ఒంటరిదానిని అవ్వటంతో సర్దుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, పిల్లల దగ్గరికి వెళుతున్నానని వొడియాలు, ఊరగాయలు పెడుతున్నాను. వాన రాకతో కంగారుగా అన్ని మేడపైనుంచి తెస్తూ కాలు మడతపడి మెట్ల మీదనుంచి క్రిందకు పడిపోయాను. ఎప్పుడో అటుగా వచ్చిన అరుణ చూసి అంబులెన్స్ పిలిచి ఆసుపత్రికి తెచ్చినట్లుంది. ఎన్ని రోజులైందో కూడా నాకు తెలియదు.

నాకు గట్టి నమ్మకం నా చివరి రోజులకి నేనే మిగిల్చుకోవాలని. ఎవరు పెట్టరని. రాఘవ మరణం తరువాత వచ్చే పెన్షన్ డబ్బులోనే కొంచెం మిగుల్చుకొంటూ ఆ డబ్బుని జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నాను. నా వద్ద నున్న డబ్బులోనే కొంత అరుణకు అవసరానికి అప్పుగా ఇచ్చాను. అరుణ ఎక్కువగా చదువుకోలేదు. దానికి తొందరగా పెళ్లి చేసెసారు. దాని భర్త రామారావు పెద్ద ఉద్యోగస్తుడు కాదు. కానీ మంచివాడు, నిదానస్థుడు. అరుణకూడా పొదుపుగా సంసారాన్ని నెట్టుకు వస్తుంది. కానీ పిల్లలు పెద్దవాళ్లైనకొద్ది వాళ్ల అవసరాలు పెరిగి సంపాదన పెరగక ఇబ్బంది పడుతుంటారు. అలాగని ప్రతిదానికి నా దగ్గర చెయ్యిచాచదు. దానికి ఏదైనా అవసరం వస్తే నా దగ్గరికి వస్తుంది. నేనే తెలుసుకొని సాయం చేస్తూ ఉంటాను. అందుకే అది నాకు సాయానికి వచ్చింది. లేకుంటే నా పుట్టింటివాళ్లెవరూ నాకు సాయం చెయ్యరు. రాఘవను నేను ప్రేమించి పెళ్లి చేసుకోవటమే అందుకు కారణం. అప్పట్లో రాఘవ ఒక హీరోలా ఉండేవాడు. ఎన్నో విషయాలు అనర్గళంగా మాట్లాడేవాడు. అందరికి సాయం చేయటానికి ముందుండే వాడు. ఎప్పడు ఎలా మా మాటలు కలిసాయో ఎప్పడు మా మనసులు పెనవేసుకున్నాయో నాకు గుర్తు లేదు. నాకు, తనకు ఉద్యాగాలు వచ్చాక, ధైర్యం చేసి నేనే నాన్నకు మా విషయం చెప్పాను. ఆయన ససేమిరాకుదరదన్నారు. మా అమ్మను బతిమిలాడుకున్నాను. ఛీ అంది, కులం తక్కువ వాడని, మాంసాహరి అని అసహ్యించుకుంది. కన్నీరు మున్నీరయ్యాను. శలబ్భయ్య అనే మా కులం వ్యక్తితో నా వివాహం జరిపించారు. మనసులేని మనిషితో జీవితం దుర్భరమయ్యింది. రోజు కొట్టేవాడు. సిగెరెట్టు తో కాల్చేవాడు. దానికి తోడు అతని కుటుంబ సభ్యులు అతనినే సమర్థించే వారు, అతనికి విపరీతమైన అనుమానం ఉండేది. బడి నుంచి రావడం కొంచెం ఆలస్యమైనా వీథి లోనే నిలబెట్టేవాడు. ఆ అలజడితో పిల్లలు పుట్టడం ఆలస్యమయ్యింది. దానితో ఇంటిల్లిపాదీ నన్ను ఆడిపోసుకునే వారు. అనుకోకుండా ఒక రోజు అతను బస్సు క్రింద పడి చనిపోయాడు. నన్ను పుట్టింటికి పంపేశారు. ఈ సారి విధవనైన నన్ను చేసుకుంటానని రాఘవ వచ్చాడు. ఇంటిల్లిపాదీ అవమానించారు. నాన్నగారు చెయ్యి చేసుకున్నారు. నన్ను వచ్చెయ్యమని అడిగాడు, నేను తన వెంట వచ్చేసాను. ఆ రోజునుంచి నా తల్లి తండ్రులు అన్నదమ్ములు నన్ను దూరం పెట్టారు. ఇదిగో ఈ అరుణకు పెళ్లయ్యాక ఇక్కడ పరిచయమేర్పడింది మాకు. దానికి అవసరమేదైనా వస్తే నా దగ్గరకు వచ్చేది, నేను నాకు చేతైన సాయం చేసేదాన్ని. అలా మా మధ్య రాకపోకలు ఏర్పడ్డాయి. మా అన్నగారబ్బాయి రవి మా స్కూల్లోనే చదివేవాడు. కానీ నాతో మాట్లాడేవాడే కాదు. నేను దూరంగానే ఉండే ధానిని. ఒక గొడవలో ఒక కుర్రాడు కొట్టిన దెబ్బకు వాడికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే నేనే ఆసుపత్రిలో చేర్చి మా అన్నకు కబురు పంపాను. వాళ్ళు నాకు ధన్యవాదాలు చెప్పకపోగా వస్తూనే నా వల్లే జరిగిందనీ అసలు నేనున్న చోట వాణ్ణి చేర్పించి తప్పు చేశామని గొడవ చేశారు. దండం పెట్టి వెనుతిరిగి వచ్చేశాను.

అలాగే నాన్నగారు పోయినప్పుడు వెళితే నాన్న శవాన్ని కూడా చూడనియ్యలేదు. అమ్మపోయినప్పుడైతే అరుణ చెబితే దూరన్నించే చాటుగా దండం పెట్టి వచ్చేసాను. నేను చేసిన పాపమేమిటో కానీ, ఇష్టపడి పెళ్లి చేసుకున్న రాఘవ కూడా మారి పోయాడు. పిల్లలకి అమ్మవారు పోసి వాళ్ళకి ప్రాణాలు మీదకి వచ్చినప్పుడు నువ్వు ఉద్యోగం మాని ఇంట్లో ఉండి వాళ్లని చూసుకోమంటే సరేనని మానేశాను. మా అబ్బాయికి బ్రోననకైటస్ ఆస్థమ వచ్చి ప్రాణాల మీదకు వస్తే వాడి ప్రక్కనే దేముడ్ని ప్రార్థిస్తూ గడిపాను. ఏ రోజు ఇది ఉంది, ఇది లేదు, ఇది కావాలి అనకుండా తోడుగా నిలిచాను. అతని తల్లి తండ్రులని పెద్దతనం లో చూసుకొమ్మని అతని అన్నదమ్ములు పంపితే సంతోషంగానే ఒప్పుకున్నాను. నాకు మాంసాహార వండటం రాదని మా అత్తగారు సణిగినా చేతైనంత రుచిగా చెయ్యాలని తాపత్రయ పడేదాన్ని. అతని అన్నదమ్ములు ఆస్తుల కోసం పేచీ పెడితే వచ్చింది తీసుకొమ్మని, గొడవలు పడి వారిని పోగొట్టుకోవద్దని నచ్చ చెప్పాను. మొత్తానికి నా చేతుల మీదుగానే మా అత్తమామలు ఇరువురు పొయ్యారు. రాఘవకి నెమ్మదిగా చెడు వ్యసనాలు అలవాటయ్యాయి. మొదట తన తోటి ఉపాధ్యాయులు తనని మోసం చేస్తున్నారని బాధపడేవాడు. ఎంత నచ్చచెప్పినా సర్దుకోలేక పోయాడు. మనశ్శాంతి కని అలవాటు చేసుకున్నాడు. అదే వ్యసనంగా మారింది. పిల్లలిద్దరూ వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్లు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ల చదువులు కూడా వారి ఇష్ట ప్రకారం చదివించాము. ఇంట్లో అతనికి ఏ బరువు బాధ్యతలు మొయ్యాల్సిన అవసరం రాలేదు. అయినా తన ఆరోగ్యం కోసం నేను పెట్టే నియమాలు అతనికి ఆంక్షల్లాగా ఉండేవి. నన్నొక రాక్షసిని చూసినట్లు చూసే వాడు. చివరి రోజులలో నాతో మాట్లాడటం కూడా మానేసాడు. జీవితంలో నేను సాధించినదేమీ నాకు కనిపించటం లేదు. నా జాతక లోపమనుకుంటా ఎవరికీ ఏ సుఖాన్ని, తృప్తినీ ఇవ్వలేక పోయాను. పొయ్యేటప్పుడైనా ఎవర్ని బాధ పెట్టకూడదనిపించింది.

అతి కష్టం మీద కళ్లు తెరిచాను. అది చూసి నా చెల్లెలు పరుగెత్తొచ్చింది. “అక్కా, నీ పిల్లలు రాలేదే, నాకేమో” అది ఇంకా ఏదో చెప్పేలోపు కళ్లతో సైగ చేసి ఆపమని, నా బాగ్ తెమ్మని చెప్పా, అది మా ఇంటి నించి తెచ్చిన బాగ్ చూపించింది, పెన్నడిగి, ఏటీఎం అని వ్రాసి నంబర్ రాసాను. అందులో ఉన్నది వాడమన్నాను. ఒక లక్ష దాకా ఉంది. గొలుసు, గాజులు, ఉంగరం దాన్ని తీసుకోమన్నాను. ఇల్లు పిల్లలిద్దరికీ సమంగా రాసి ఒక వీలునామా ముందే చేయించి ఉంచాను. బరువు తీరినట్లయి నేను మెల్లగా చావమ్మ వొడిలోకి జారుకున్నాను.

****సమాప్తం****

Posted in February 2025, కథలు

2 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!