Menu Close
Kadambam Page Title
అమ్మపై కురిసిన అతని కరుణ
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

ప్రయాణంలో కడవరకు నీతో ఉంటానని
ప్రమాణంచేసి మరీ తాళికట్టిన భర్త,
ఆ విషయం ఆయనకు కూడా తెలియకుండా
మధ్యలోనే మౌనంగా వెళ్ళిపోయినపుడు
అమ్మ వేదన చెందిందే తప్ప
జీవితంలో ఓడిపోయానని అమ్మ అనుకోలేదు.

ఆడపడుచులు, అత్తమామలు
ఆరళ్ళు పెట్టినా, అసహ్యించుకున్నా
ఓర్పుతో భరించిందే తప్ప
జీవితంలో ఓడిపోయానని అమ్మ అనుకోలేదు.

తనని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని,
తన ప్రేమను, సేవలను ప్రతి క్షణం పొందిన పిల్లలు
పెద్దవారై మైకం కమ్మిన వారిలా
తనని విడిచి వారి దారి వారు చూసుకున్నప్పుడు
అమ్మ దుఃఖంతో ఒంటరితనాన్ని అలవాటు చేసుకుందే తప్ప
జీవితంలో ఓడిపోయానని అమ్మ అనుకోలేదు.

సేవలు పొందిన మనుమలు, మనుమరాళ్ళు
పలకరిస్తే మొహంతిప్పుకొని వెళ్ళిపోయినప్పుడు
జీవన సహజతత్వమని అనుకుందే తప్ప
జీవితంలో ఓడిపోయానని అమ్మ అనుకోలేదు.

తనవాళ్ళనుకున్నవారు తప్పించుకున్నా,
మనవాళ్ళనుకున్నవారు మౌనం అయినా
నాడు వాడుకున్నవారు, తనతో ఆడుకున్న వారు
ఆనాడు వేడుకున్న వారు
ఇప్పుడు విడిచిపోయినా, తనను మరిచిపోయినా
జీవితంలో ఓడిపోయానని అమ్మ అనుకోలేదు.

కానీ...
చివరి రోజుల్లో తనను ఉంచుకోవటానికి
కసాయి కొడుకులు సాకులు వెదుకుతుంటే,
కర్కశపు కోడళ్ళు బాకుల్లాంటి మాటలతో
తన ఎదను తూట్లు పొడుస్తుంటే మాత్రం
అమ్మ గుండె తట్టుకోలేకపోయింది,
ఎక్కువ కాలం కొట్టుకోలేకపోయింది.

తను కనిపెంచిన, తనకు కనిపించిన....
వారి కరుణను పొందలేకపోయిన అమ్మ,
వారి మనఃస్థితులను ఆకళింపు చేసుకున్న అమ్మ,
శాశ్వతం గా వెళ్ళిపోదామని గట్టిగా నిర్ణయించుకుంది.
ఆ అనంతుడినది కదిలించివేసింది.
అతనికి భరించలేని చింతయ్యింది.
అతని మనసు స్పందించింది.
తన అనంతమైన ప్రేమను అమ్మకు అందించింది.

అంతే!......అప్పుడు జరిగినది నిజంగా వింతే!
ఎవ్వరూ ఉహించని విధంగా అతని ప్రేమ
అమ్మను ఒకమంచిరోజున పక్కకు ఒరిగిపోయేలా,
అతని కరుణలో అమ్మ ఆనందంగా కరిగిపోయేలా,
అకస్మాత్తుగా అమ్మ రూపం భువిపై చెరిగిపోయేలా చేసింది.
దేవతని మరోసారి దేవతగా అంగీకరించినట్లు అయ్యింది.

Posted in May 2024, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!