Menu Close
mg

అమ్మ... ప్రేమకు మారు పేరు

‘అమ్మ’ అనే రెండక్షరాల మాట ఎన్నో లక్షల భావాలు పలికించగలిగిన ఒక అద్భుత శక్తి. ఆ మాటను వివరించడానికి ఎన్ని గ్రంథాలు వ్రాసినను సరిపోదు. ఎందుకంటే అది మనసుతో పలికే మమకారపు మూట. అమ్మ ప్రేమను మించిన ఆయుధం ఈ ప్రపంచంలో మరేదీ లేదు. అటువంటి అమ్మ ప్రేమను నిర్వచిస్తూ సినారె గారి కలం నుండి జాలువారిన ఈ అద్భుతమైన పాట మీ కోసం.

చిత్రం: రామబాణం (1979)

సంగీతం: సత్యం

గీతరచయిత: సినారె

నేపధ్యగానం: బాలు

పల్లవి:

అమ్మ... ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు
అమ్మ ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు

ఆ పేరు నీడ సోకగానే... నూరు జన్మల సేదతీరు
అమ్మ... ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు

చరణం 1 :

మండువేసవిలో ముంగిట వెలసిన... మంచుకొండ మా అమ్మ
పవలురేయి ఆరక వెలిగే పరంజ్యోతి మా అమ్మ
ఆలనకైనా పాలనకైనా...
ఆలనకైనా పాలనకైనా... ఆదిదేవత మా అమ్మ

అమ్మ ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు

చరణం 2:

జన్మజన్మలా పున్నెము వలన... నీ కమ్మని కడుపున పుట్టాను
మళ్ళీ జన్మలు ఎన్నున్నా... నా తల్లివి నీవే అంటాను
కలలోనైనా మెలకువనైనా...
కలలోనైనా మెలకువనైనా... నీ దీవనలే కోరుకుంటాను

అమ్మ.. ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు
ఆ పేరు నీడ సోకగానే... నూరు జన్మల సేదతీరు
అమ్మ ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు

Posted in May 2021, పాటలు