అమ్మ మాత్రమే!
ఓరిమితో నిన్ను కనటం,
చెలిమితో నీ మాటలు వినటం,
కూరిమితో నీకు తగ్గట్టుగా మనటం,
చేయగలిగేది అమ్మమాత్రమే!
సవ్యంగా నిన్ను పెంచటం,
దివ్యంగా నిన్ను దీవించటం,
భవ్యంగా నీకై జీవించటం,
చేయగలిగేది అమ్మ మాత్రమే!
నోరారా నవ్వటం,
మనసారా ఇవ్వటం,
నీపై తన మమతలు రువ్వటం,
చేయగలిగేది అమ్మమాత్రమే!
తనివి తీరా నిన్ను లాలించటం,
ప్రేమ మీరా నిన్ను పాలించటం,
కడుపారా నిన్ను పోషించటం,
చేయగలిగేది అమ్మ మాత్రమే!
నివేదనగా నిన్ను సృష్టించటం,
ఆలోచనగా నీపై సదా తన దృష్టి ఉంచటం,
ప్రతి నిమిషమూ నీ అదృష్టాన్ని పరిరక్షించటం,
చేయగలిగేది అమ్మ మాత్రమే!
నీ గెలుపుకై తను ఓడిపోవటం,
నీ నిర్లక్ష్యానికి తను బలవటం,
నీ ఇష్టాలకై తను కష్ట పడటం,
చేయగలిగేది అమ్మ మాత్రమే!