మధ్యాహ్న సమయం. ఆకాశమంతా మబ్బులుపట్టి ఉన్నాయి. అప్పుడే పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన గణపయ్యకు వేడివేడిగా భోజనం వడ్డించింది అతడి భార్య నరసమ్మ. గణపయ్య భోజనం మొదలుపెట్టగానే ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం మొదలయ్యింది.
"ఆమ్మో! అమ్మ!!", అంటూ చేస్తున్న భోజనం మధ్యలోనే ముగించి, హడావుడిగా చేతులు కడుక్కుని, గొడుగునూ, ఒక పెద్ద కంబళినీ తీసుకుని, పరుగులాంటి నడకతో తమ ఇంటికి కాస్త దూరంలో ఉన్న గుట్ట వైపుకి బయలుదేరాడు గణపయ్య.
"అయ్యో నీ చాదస్తం! నే చెబితే నా మాట వింటావా పెడతావా?? డెబ్భైయేళ్ల వయసులో ఇరవయ్యేళ్ళ యువకుడిలా బయలుదేరి పోతున్నావ్. జాగ్రత్తగా పోయిరా! బురదలో కాలు జారేను!", గణపయ్యతో అంది నరసమ్మ.
"ఆఁ ఆఁ ! నాకేం కాదులేవే! అన్నిటికీ ఆ అమ్మోరుతల్లే ఉంది! నేను తొందరగా వెళ్ళకపోతే ఈ వర్షానికి అమ్మ తడిసిపోతుంది!", అన్నాడు గణపయ్య.
"అవున్లే! నువ్వో పెద్ద అమ్మకూచివి కదా!", అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది నరసమ్మ. గణపయ్య వర్షంలో నడుస్తూ కాసేపటికి గుట్టమీదున్న ఒక పెద్ద చెట్టు దగ్గరకు చేరుకున్నాడు.
తన చేతిలో ఉన్న గొడుగును ముడిచి పక్కన పెట్టి, ఆ చెట్టు కిందున్న అమ్మవారి విగ్రహానికి భక్తితో దణ్ణం పెడుతూ, "ఏంటోనమ్మా! ఎంత పరిగెత్తుకుంటూ వచ్చినా నాకు ఇక్కడికి రావడానికి చాలాసేపే పట్టింది. ఇదిగో! నీ చెట్టుకి కట్టడానికి ఈ గుడ్డ పట్టుకొచ్చా. ఈ గుడ్డ కడితే ఇక నువ్వు తడవవు!", అన్నాడు గణపయ్య.
ఆ తర్వాత కొద్దిసేపు కష్టపడి తను తెచ్చిన గుడ్డను గుడారంలా అమ్మవారి విగ్రహం చుట్టూ కట్టి, 'హమ్మయ్య!' అని ఆయాసపడుతూ తన భుజంపైనున్న తుండుగుడ్డతో ముఖం తుడుచుకున్నాడు గణపయ్య. అంతలో అతడికి గుడారం పక్కనుండీ ఘల్లుఘల్లుమని గాజుల చప్పుడు వినపడింది. ఉలిక్కిపడి ఆ చప్పుడు వచ్చిన వైపుకి చూశాడు గణపయ్య.
అక్కడ ఎవరో ఒక ముసలావిడ కూర్చుని ఉండటం గమనించి, "ఎవరమ్మా? ఎవరదీ?", అడిగాడు గణపయ్య.
ఆ ముసలావిడ వర్షానికి తడిసిపోయిన తన జుట్టునూ, ముఖాన్నీ తన చీర కొంగుతో అద్దుకుంటూ, "నేనా?? నా పేరు గౌరమ్మ. నువ్వెవరయ్యా? గణపయ్యవేనా?", అడిగింది.
"నా పేరు నీకెలా తెలుసూ? ఇంతకీ నీదే ఊరు?", కుతూహలంగా అడిగాడు గణపయ్య.
"అదేం ప్రశ్నా?? నా ఊరూ మీ ఊరూ ఒకటే కదా! నన్నెప్పుడూ చూడలేదా?", అడిగింది గౌరమ్మ కొంచెం అసహనంగా.
"చూసిన జ్ఞాపకం రావట్లేదే!", అంటూ బుర్ర గోక్కున్నాడు గణపయ్య.
"అదేంటి గణపయ్యా? మరీ విడ్డూరంగా మాట్లాడతావ్? నేను నిన్ను చిన్నప్పటినుండీ చూస్తూనే ఉన్నా. నువ్వు ఈ చెట్టు దగ్గరకి రోజూ వస్తూ ఉంటావు, నేను చూస్తూనే ఉంటాను. ఇంతకీ ఈ అమ్మోరి విగ్రహం నువ్వే పెట్టావా?", అడిగింది గౌరమ్మ.
"లేదమ్మా. అది ఎవరు పెట్టారో తెలీదు కానీ, నాకు ఊహ తెలిసినప్పటినుంచీ అమ్మోరు ఇక్కడే ఉంది. ఎండా.. వానా ఏదొచ్చినా.. ఇక్కడే ఇలాగే ఉంటుంది పాపం! ఈ అమ్మకు గుడి కడితే బాగుంటుంది. ఆవిడను కోవెలలో చూడాలని నా కోరిక!", గాలికి చెదిరిన అమ్మవారి పూలమాలను సరిచేస్తూ అన్నాడు గణపయ్య.
ఆ మాట విని పగలబడి నవ్వింది గౌరమ్మ. ఆమెవంక చిత్రంగా చూస్తూ, "ఏంటి నవ్వుతావ్? నేనేమైనా తప్పుగా అన్నానా?", అడిగాడు గణపయ్య.
"అమ్మోరికి గుడి కట్టడం మాటలా? నీ దగ్గర ఏదో కొద్దిగా పొలం, ఒక పెంకుటిల్లు ఉన్నాయి. అంతేగా? నిన్ను చూస్తే బక్కచిక్కి, బొమికలు బయటపడి, రేపోమాపో పోయేట్లున్నావ్. ఇంక నీ కోరిక ఎప్పటికి తీరేనూ?!", అంది గౌరమ్మ.
"నువ్వేమనుకున్నా పర్వాలేదు. ఆ అమ్మోరంటే నాకు ప్రాణం! ఆవిడకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి! ఆవిడే నాచేత చేయిస్తుంది!", అన్నాడు గణపయ్య అమ్మవారివంక చూస్తూ.
"అబ్బో! నువ్వు గొప్ప భక్తుడిలాగున్నావ్. ఇంతకీ ఆ అమ్మ నీకేమిచ్చిందీ?", అడిగింది గౌరమ్మ.
"అన్నీ ఇచ్చింది. ఉండటానికి ఒక ఇల్లూ, కడుపునింపటానికి ఒక పొలం.. నన్ను బాగా చూసుకునే భార్యా.. ఇంకేం కావాలి?", అన్నాడు గణపయ్య.
"మరి నీకు పిల్లలు లేరటగా?", అడిగింది గౌరమ్మ.
"ఆ బాధ నాకు లేదమ్మా. ఎందుకంటే నా తమ్ముడు సుబ్బయ్య మనవడు రాముడు నా ఒళ్లోనే పెరిగాడు! వాడి ఆటపాటలు, ముద్దూమురిపాలూ అన్నీ నావే!", బోసినవ్వులు నవ్వుతూ అన్నాడు గణపయ్య.
"అలాగా! ఆ రాముడు ఇప్పుడెక్కడున్నాడూ?”, అడిగింది గౌరమ్మ ఆకాశంవంక చూస్తూ.
"వాడు చదువు పూర్తిచేసుకుని పట్నంలో పని చూసుకుంటానని వెళ్ళాడు. వాణ్ణి చూసి చాలా కాలమైంది. ఏంటో! వాడి గురించి చెబుతూ ఉంటే వాడినోసారి చూడాలనిపిస్తోంది!", అన్నాడు గణపయ్య.
"సరే గణపయ్యా! వాన తగ్గింది. మా ఆయన నాకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనం మళ్ళీ కలుద్దాం", అంటూ లేచి గబగబా గుట్ట దిగుతూ చిటికెలో కనుమరుగైపోయింది గౌరమ్మ.
గణపయ్య ఇల్లు చేరగానే, "ఆలస్యమయ్యిందేంటీ? ఎక్కడైనా పడ్డావో ఏమో అని కంగారు పడుతున్నా!", అంది నరసమ్మ.
"గౌరమ్మ కలిసిందే! ఆమెతో మాట్లాడుతూ ఉండేసరికి ఆలస్యమయింది", చెప్పాడు గణపయ్య.
"గౌరమ్మా?! గౌరమ్మ ఎవరూ??", ఆశ్చర్యంగా అడిగింది నరసమ్మ.
"గౌరమ్మ ఎవరో నీక్కూడా తెలియదా?? ఆవిడకు నువ్వూ నేనూ ఇద్దరం బాగా తెలుసట!", అంటూ గౌరమ్మతో జరిగిన సంభాషణ చెప్పాడు గణపయ్య.
"నువ్వు చెప్తున్నది చిత్రంగా ఉందే! గౌరమ్మ పేరు నేను కూడా ఎప్పుడూ వినలేదు. ఇంతకీ ఎలా ఉంటుందావిడ?", అడిగింది నరసమ్మ.
“గౌరమ్మ ముఖం ఎక్కడో చూసినట్లుగానే కనపడింది నాకు. ఆవిడకు సుమారుగా అరవయ్యేళ్ళుంటాయే. జుట్టు అక్కడక్కడా నెరిసి ఉంది. శరీర ఛాయ పచ్చటి పసుపు. మాటిమాటికీ ఆవిడ చీర కొంగుతో ముఖం అద్దుకుంటూ ఉంది. ఆ ఎరుపు రంగు చీరకు జరీ అంచు ఉంది. పెద్ద బొట్టు.. రవ్వల ముక్కుపుడక.. చేతికి బోలెడు గాజులూ.. కాళ్ళకి పసుపు.. నేనంతే గమనించాను", చెప్పాడు గణపయ్య.
"నువ్వు అమ్మోరు గురించి చెప్తున్నావా? గౌరమ్మ గురించి చెప్తున్నావా?", చిరునవ్వుతో అడిగింది నరసమ్మ.
"అమ్మోరు నా దగ్గరకెందుకొస్తుందే? నేనంత గొప్పోడిని కాదు కదా. గౌరమ్మ నాకు రాముడిని గుర్తుచేసిందే. వాణ్ణి చూడాలని ఆశగా ఉంది", అన్నాడు గణపయ్య.
"దిగులు పడకు. రాముడు రేపే మన ఊరు వస్తున్నాడట", సంతోషంగా చెప్పింది నరసమ్మ.
"నిజంగానా?! అంతా అమ్మోరు దయ!", అన్నాడు గణపయ్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ.
మర్నాడు రాముడు తన స్నేహితుడు దినకర్ తో గణపయ్య దగ్గరకు వచ్చాడు. అందరూ కాసేపు మాట్లాడుకున్నాక రాముడు గణపయ్యను ఆప్యాయంగా హత్తుకుంటూ, "తాతా! చిన్నప్పుడు నాకు నువ్వు బోలెడు కథలు చెప్పేవాడివి కదా?! ఇప్పుడొక కొత్త కథ చెప్పవా. వినాలని ఉంది!", అన్నాడు.
అందుకు గణపయ్య ఫక్కున నవ్వుతూ, "సరేరా బంగారూ! చెప్తా విను!", అంటూ ఒక కథను వినిపించాడు.
దినకర్ తన సంచీలోంచీ ఒక పుస్తకం తీసి అందులో గణపయ్య చెప్పిన కథను క్లుప్తంగా రాసుకున్నాడు. సాయంత్రం రాముడు, దినకర్ లు పట్నం బయలుదేరి వెళ్లిపోయారు. ఒక ఆరు నెలలు గడిచాయి. ఒకనాటి ఉదయం గణపయ్య పొలంలో పనులు చేస్తూ ఉండగా బస్సు దిగి అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు రాముడు.
రాముడిని చూసి అమితాశ్చర్యంతో, "ఏంట్రా నాన్నా? అనుకోకుండా వచ్చినట్లున్నావ్? ఏమిటీ విషయం?", అడిగాడు గణపయ్య.
"పెద్ద విశేషమే ఉంది తాతా!" అన్నాడు రాముడు.
"ఏంట్రా అదీ?", చేతులకంటిన మట్టిని నీళ్లతో శుభ్రం చేసుకుంటూ అడిగాడు గణపయ్య.
రాముడు తన సంచీలోంచీ ఒక చెక్కును తీసి గణపయ్యకు చిరునవ్వుతో అందించాడు. గణపయ్య పేరుతో అయిదు అంకెలున్న సంఖ్య ఉందందులో!
అది చూసి, "నాకిన్ని డబ్బులెక్కడివిరా?", ఆశ్చర్యంగా అడిగాడు గణపయ్య.
"నీ ప్రతిభకు జనం ఇచ్చిన కానుక తాతా! నువ్వు చెప్పిన కథతో దినకర్ ఒక చలనచిత్రం తీశాడు. అది అందరికీ నచ్చి, వాడికి బోలెడంత లాభం వచ్చింది. నీ వాటా నీకు పంపాడు", చెప్పాడు రాముడు.
"శ్రీ మహాలక్ష్మి వచ్చిందన్నమాట! అంతా ఆ అమ్మోరు దయ!", అంటూ చెక్కును కళ్ళకద్దుకుని తీసుకున్నాడు గణపయ్య.
గణపయ్య చేత మరో రెండు కథలు చెప్పించుకుని పట్నం వెళ్ళాడు రాముడు. మరో ఎనిమిది నెలలు గడిచేసరికి ఇంకో రెండు చెక్కులతో వచ్చి వాటిని గణపయ్య చేతిలో పెట్టాడు రాముడు.
గణపయ్య ఆ చెక్కులను తీసుకుంటూ, "అమ్మోరి గుడికి కావలసిన సొమ్ము వచ్చేసింది!", అంటూ అమ్మవారి గుడి నిర్మాణానికి ఏర్పాట్లు చేశాడు.
కొద్దినెలలలో గుడి కట్టడం పూర్తి అయ్యింది. అమ్మవారికి జరిగే నిత్య పూజలను చూస్తూ, ఆవిడను తనివితీరా సేవించుకోసాగాడు గణపయ్య. గణపయ్య అమ్మవారి ఆలయంలో ఎక్కువసేపు గడపడం అలవాటు చేసుకోవడంతో నరసమ్మ కూడా రోజంతా గణపయ్య పక్కనే ఉంటూ ఆలయం శుభ్రం చెయ్యడం, అమ్మవారికి పూల మాలికలను అల్లడంవంటి పనులు చేస్తూ ఉండేది.
ఒక రోజు గణపయ్య అమ్మవారి ఎదురుగా కూర్చుని, ఆవిడవంక తదేకంగా చూస్తూ ఉండగా, "మొత్తానికి అనుకున్నది సాధించావే!", అన్నారు ఎవరో.
తలతిప్పి అలా అన్నవారివంక చూశాడు గణపయ్య. అక్కడ శివలింగానికి నీళ్లతో అభిషేకం చేస్తూ కనిపించింది గౌరమ్మ.
గణపయ్య చిరునవ్వు నవ్వి, "అంతా అమ్మోరిచ్చినదే! నాదేముందీ?", అన్నాడు.
"నీకొచ్చిన డబ్బులన్నీ గుడి కట్టించేందుకు వాడేశావని విన్నాను. నీకోసం ఏమీ ఉంచుకోలేదేం?", అడిగింది గౌరమ్మ.
"నాకేది కావాలన్నా ఇవ్వడానికి ఆ అమ్మ ఉందికదా! ఇక నాకెందుకు బెంగా?!", అన్నాడు గణపయ్య.
అప్పుడు గౌరమ్మ గణపయ్య పక్కనే ఉన్న నరసమ్మతో, "ఏమ్మా? నువ్వు నగలూ గట్రా కొనుక్కోలేదేం?", అని అడిగింది.
"నువ్వెవరో నాకు తెలీదుకానీ అమ్మా… నీకో విషయం చెబుతా! ఆ డబ్బుతో ఓ నాలుగు నగలు కొనుక్కుని నేను పెట్టుకునేదానికన్నా ఆ నగలు కొని అవి అమ్మోరికి పెడితేనే మా ఆయన ఎక్కువ సంతోషిస్తాడు. నగలు అమ్మోరికి అలంకరిస్తే నాకూ ఆనందమే! అందుకే అడగలేదు. నాకు మా ఆయనంటే ప్రేమ. మా ఆయనకేమో ఆ అమ్మోరంటే పిచ్చి ప్రేమ..! అదీ సంగతి!", అంది నరసమ్మ చిరునవ్వు నవ్వుతూ.
ఆ మాట విన్న గౌరమ్మ రెప్పపాటు కాలంలో గణపయ్య దగ్గరకు వచ్చి, "ఏమో అనుకున్నా గణపయ్యా! మీ ఆవిడన్నట్లు నువ్వు నిజంగా ఆ అమ్మకూచివేనే! మీలాంటి పిల్లల్ని ఆ అమ్మ ఎప్పటికీ విడిచిపెట్టదు!", అంటూ వడివడిగా నడుచుకుంటూ గర్భాలయంలోకి వెళ్లి అంతర్ధానమైపోయింది!
ఆ వచ్చింది సాక్షాత్తూ అమ్మవారే అని తెలుసుకున్న గణపయ్య ఒళ్ళు గగుర్పొడిచింది.
"మన కోసం వచ్చింది ఆ అమ్మోరు తల్లా?!! ఇది నిజమా?! ఆ అమ్మ కరుణను మనం నిజంగా పొందగలిగామా??!! ఈ జన్మకు ఇంతకన్నా ఏం కావాలీ?!", అంటూ ఆనందభాష్పాలు నిండిన కళ్ళతో అమ్మవారివంక చూస్తూ, నోటమాట రానంతగా పరవశించిపోతూ ప్రాణాలు విడిచిపెట్టింది నరసమ్మ.
"అమ్మా! నేను అమ్మకూచి అని తెలుసుకున్నావుగా?! మరి నీ బిడ్డడైన ఈ గణపయ్యను నీతో తీసుకెళ్ళిపో!", అంటూ అమ్మవారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఆవిడలో కలిసిపోయాడు గణపయ్య.
చాల బాగుండి