అమ్మ మాట మకరందాల మధురిమ
అది కురిపించును అనురాగల ఉప్పెన
అమ్మ ప్రేమ అందాల హరివిల్లు
ఆ తల్లి మనసు మమకారపు తేనె జల్లు
అమ్మ అంటే ఇంటి ముందటి తులసి కోట
ఆ తల్లి దీవెన అనుక్షణం ఆయుష్షు పెంచే సంజీవిని
అమ్మ...
నీ ఆకలికి మృష్టాన్నమౌతుంది.
నువ్వు ఆదమరిచి నిదురించేవేళ కమ్మని కలనౌతుంది
నువ్వు అలసిపోయిన తరుణాన చల్లని పిల్లగాలినౌతుంది
నువ్వు కలత చెందిన క్షణాన నీ పెదవిపై చిరునవ్వువోలె
మనసుకు హాయినందిస్తుంది
నీకు నలత కలిగిన ఘడియలో మధుర గుళికనౌతుంది.
కూడు గుడ్డ నీడ ఇదే జీవితం అనుకున్న
అమ్మ మనసిప్పుడు..
గడిచిన గతం తలుచుకుంటు
ఆలోచనలతో దయ్యాల నిలయంగా మారింది
అమ్మ చేతి గోరుముద్దలు తిని పెరిగిన ఎన్నో
చిట్టి రూపాలు నేడు అవహేళనతో
మరణ మృదంగం మోగిస్తూ
అమ్మకు బతుకు భయం నేర్పిస్తున్నాయి.
ఎందరికో వెన్ను తట్టిన అమ్మకిపుడు
పలకరింపులే యమ పాశాలయ్యాయి.
పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని
ఆశ పడిన మాతృమూర్తులు
దిక్కులేని శవాలై వల్లకాటికి పయనిస్తున్నారు
అమ్మ కన్న బిడ్డలు విదేశీ తీరాలకు
వలస పక్షులై ఎగిరిపోయారు
డాలర్ల రెపరెపలో
అమ్మ రూపం మసక బారింది.
తలకొరివి పెట్టే తనయుడెవరో తెలియక
రాని వారికోసం గాజు కళ్ళలో ఆశగా
వాకిలి గుమ్మం వైపు ఎదురు చూస్తు
ఎముకల గూడులా
శవంలా బిగుసుకు పోయి
పడుకుంది అమ్మ
మాతృమూర్తి కంట నీరు
కనురెప్ప దాటితే, ఉప్పెనగా మారి
కష్టాల కడలిలో ఊగిసలాడి బలహీన పడిన గుండె
నీకు చెప్పకుండానే కన్నీటి ధారలో కొట్టుకుపోయి
తీరం చేరకుండానే ఆగిపోతుంది
అమ్మ కనీళ్లతో కలశం పాత్ర నిండితే,
అది గృహసీమకే అరిష్టం, సమాజానికి తీరని నష్టం.
అమ్మ గురించి కథలు కథలుగా
గొప్పలు చెప్పడమే గానీ
అమ్మ ఆలనా పాలనా
చూసుకునే దిక్కెవరు
బతికి వుందో లేదో ఎలా తెలుస్తుంది
అమ్మ ఇప్పట్లో కోలుకునే
సూచనలేవి కనిపించటం లేదు
చావు బతుకుల్లో
కొట్టు మిట్టాడుతున్న
అమ్మకు ఎవరు
నిజమైన వారసులు?
ముందుగా ఇది మీ స్వీయ మనోగతం కాకూడదని ఆశిస్తున్నాను.. ఆర్ద్రతగా కవితాగమనం సాగింది.. అమ్మంటేనే ఆర్ద్రత.. ప్రేమ.. అమ్మకు వారసులు ఎవరూ ఉండరు..దేవుడు అన్ని చోట్లా ఉండలేకే అమ్మను సృష్టించాడు. ఇక అమ్మకు ప్రత్నామ్యాయం.. వారసత్వం అన్నది లేదు.. దేవుడే ఆమె వారసుడు.. అమ్మ..అమ్మే.. ఆమెకు ఆమె వారసురాలు.. చక్కని కవితను అందించిన మీ సున్నిత హృదయానికి కరములు జోడించి నమస్కరిస్తున్నాను సుజాతగారు.. ధన్యవాదాలు!!
🙏మిత్రదత్త గారు
నమస్కారమండీ
మీ అత్యంత అమూల్యమైన
స్పందనకు మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు💐