Menu Close
Lingamneni Sujatha
అమ్మ అంటే.... అమ్మే (కథ)
-- లింగంనేని సుజాత --

తన ఆప్త మిత్రురాళ్ళు సుధ, రమ లను చూసిన వెంటనే, మీరు నా పెళ్ళికి రాక పోతే ....ఆ తర్వాత మీరు నా చెవుల్లో అరిచి గీపెట్టినా మీతో మాట్లాడను. అంతే... అంటూ నిష్టూరాలు వేసింది లత.

ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావు? నీ పెళ్లికి రాకుండా ఎలా ఉంటాం?....తప్పకుండా వస్తాం.

కాక పోతే నాకు ఒకటే భయం. నీ పెళ్లి సమయానికి నాకు ఎమ్.ఏ. అడ్మిషన్ ఉంటే ఎలా?... అని ఆలోచిస్తున్నాను అంది సుధ.

నాకు కూడా అదే భయం అంది రమ.

మీకు ఎమ్.ఏ. అడ్మిషన్ ఉంటే మీమీద నేను ఎందుకు కోపగించుకుంటాను.? నేను చదువు కోలేక పోయినా మీరు చదువుకుంటే నాకు సంతోషమేగా..అంది లత.

మరి నీవు కూడా ఎమ్.ఏ .లో చేర వచ్చుగా....

నేను ఎమ్.ఏ.లో చేరతానంటే మా బావ ఊరుకోడు. నేను డిగ్రీ ఎప్పుడు ముగిస్తానా? అని ఇన్నాళ్లూ ఎదురు చూశాడు. మన పరీక్షలు ముగిసాయిగా...వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాడు.

ఎంత సేపూ బావ పెళ్లికి తొందర పడుతున్నాడు అంటావు? నీకు లేదా? అని స్నేహితురాళ్ళు ఇద్దరూ లతను ఆట పట్టించారు.

నాకూ బావ అంటే చాలా ఇష్టం. అతను మా మేనత్త కొడుకు. వాళ్ళు మాకంటే ధనవంతులు. మా మేనత్త కు నేనంటే వల్ల మాలిన ప్రేమ అభిమానం. అందుకే చదువుకు స్వస్తి పలికి...బావకు ఇల్లాలై పోదామని ఉంది.

తప్పకుండా నా పెళ్లికి రావాలి అంటూ స్నేహితురాళ్ళకు వీడ్కోలు పలికింది లత.

&&&&

అమ్మా! నీవు వేసిన ముగ్గు చాలా బాగుంది. నాకు కూడా నేర్పవా?.....

అలాగే..

అమ్మా! నాన్నా! నేను ముగ్గు వేశాను చూడండి...తల్లి స్వాతి, తండ్రి శ్రీధర్ వచ్చి చూసి బాగుంది అన్నారు.

ఇక నుండి నేనే గుమ్మం ముందు ఊడ్చి నీళ్ళు జల్లి ముగ్గు వేస్తాను అంది పది సంవత్సరాల వయసున్న లత. లత వేసే రకరకాల ముగ్గులు చూసి, ఆ దారిలో నడిచే వాళ్ళందరూ ఆనందించి వెళ్ళేవారు.

అమ్మా! నాకు కాఫీ పెట్టడం నేర్పవా?...

ఎందుకమ్మా నిన్నటి వరకు పదవ క్లాసు పరీక్షలు అంటూ కష్టపడి చదువుకున్నావు. సెలవులు హాయిగా గడుపు.....

నాకూ, నాన్నకు శని, ఆది వారాలు సెలవులు ఉంటాయి. నీకు మాత్రం ఎప్పుడూ సెలవులు ఉండవు. నేను కూడా చిన్న పనులు నేర్చుకుని నీకు సాయం చేస్తే...నీకు కొంత విశ్రాంతి దొరుకుతుంది గద అమ్మా!...

నా తల్లే! ... నా బంగారమే... నిండా పదిహేను సంవత్సరాలు లేవు. అమ్మ కష్టం తెలుసుకున్నావు.

సెలవుల్లో అమ్మ వెనకే తిరుగుతూ....వంట నేర్చుకుంటూ...

లత కాలేజి తెరవగానే చదువులో మునిగిపోతూ... ఇంటరు ముగించింది.

ఇంటర్ పరీక్షలు ముగిసిన అనంతరం తల్లి స్వాతి, తండ్రి శ్రీధర్ లతో లత బంధువుల పెళ్లికి గుంటూరు వెళ్ళింది.

శ్రీధర్: ఈమె మా పెదనాన్న కూతురు శాంతక్క. అతను శాంతక్క కొడుకు కిషోర్. డిగ్రీ పూర్తి చేశాడు, అన్నాడు లతతో.

శాంత.... లతను చూస్తూ లంగా ఓణీ లో చూడ ముచ్చటగా ఉంది. పెద్దల పట్ల ఎంతో వినయ విధేయతలతో మెలగుతున్న లత మా కోడలు అయితే బాగుంటుంది గదా! అనుకుంది మనసులో....

లత డిగ్రీ లో చేరింది. తాను శ్రద్ధగా చదువుకుంటూ చెల్లెలు వాణినీ చదివించేది.

సెలవు రోజున తన గదిలో కూర్చుని చదువుకుంటున్న లత ఊపిరి అందక ఆయాస పడుతోంది. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లారు.

డాక్టర్: లతకు ఒక వైపు ముక్కు రంధ్రం చిన్నగా ఉండి, బాగా గాలి పీల్చుకోలేక  పోతోంది. ప్రస్తుతానికి ముక్కులో వేయడానికి డ్రాప్స్, ఇన్హీలర్స్ వ్రాసి ఇస్తాను. లతకు ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముక్కు ఆపరేషన్ చేస్తాను....

ఇప్పుడు ముక్కు ఆపరేషన్ చేయకూడదా?...

డాక్టర్: ఇంకా ఇది ముక్కు ఎముకలు పెరిగే వయసు. ఇరవై సంవత్సరాల తర్వాతే ఆపరేషన్ చేస్తే మంచిది....

డాక్టర్ వ్రాసిన మందులు వాడుతూ, లత మామూలుగా ఉంది. కిషోర్, శాంత లు అప్పుడప్పుడు శ్రీధర్ ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉన్నారు.

లత డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోండగా...

శాంత... శ్రీధర్ తో, కిషోర్ కి లతను ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది....

మీకు తగినంత కట్న కానుకలు నేను ఇవ్వలేను..

నీవు ఇవ్వగలిగనది లత పేరున బ్యాంకులో వెయ్యి. నగలు లత కోరిక మేరకు నీకు శక్తి ఉన్నంతలో చేయించు. లత మా ఇంటి కోడలు అయితే చాలు....

బావగారు ఒప్పుకున్నారా?

మీ బావగారు కిషోర్ ఒప్పుకున్నారు.

నేను కూడా లతను ఒక మాట అడుగుతాను. లత కూడా పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంది.

&&&&&

కిషోర్, లతల పెళ్లి జరిగింది. లత స్నేహితరాళ్లు పెళ్లికి వచ్చి వెళ్లారు.

లత అత్త వారింట్లో అత్తని పని చేయనీయకుండా తానే అన్ని పనులు చేస్తూ...అత్త మామల భర్త అభిమానాన్ని ఆదరణను పొందుతోంది. సంవత్సర కాలం గడిచింది.

చలి కాలంలో ఒక రోజు లత ఊపిరి అందక ఇబ్బంది పడుతుంటే, డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్లారు.

డాక్టర్ : లతకు ఒక పక్క ముక్కు రంధ్రం చిన్నగా ఉంది. ఆపరేషన్ చేసి సరి చేయాలి.

లత తల్లి దండ్రి వచ్చారు. లతకు మా ఊరిలో ముక్కు ఆపరేషన్ చేయిస్తామంటూ లతను తీసుకు వెళ్లారు.

లతకు, మునుపు వైద్యం చేసిన డాక్టరు, లతకు ముక్కు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్. లతను ఇంటికి తీసుకుని వెళ్ళండి. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు ఇచ్చాము. లత ఇంకా మత్తులోనే ఉంది. సాయంత్రానికి మెలకువ వస్తుంది అన్నారు.

సాయంత్రమైనా లతకు మెలకువ రాలేదు. డాక్టర్ కు ఫోను చేస్తే రేపు ఉదయము లోపు లేచి తిరుగుతుంది, అన్నారు. మర్నాడు ఉదయం కూడా లతకు మెలకువ రాలేదు.

డాక్టర్ కు ఫోను చేస్తే, ఇంటికి వచ్చి చూసి, లత కోమాలోకి వెళ్లిపోయింది. ఏ క్షణమైనా లేచి కూర్చోవచ్చు. అంతా దేవుడిదే భారం అంటూ...స్వాతి, శ్రీధర్, కిషోర్ లు దిగ్భ్రాంతులై చూస్తూ ఉండగా ...డాక్టర్ వెళ్లి పోయాడు.

&&&&

లతకు పళ్ళ రసాలు, అన్నం కూరలు మిక్సీలో వేసి జావ లాగా చేసి, స్పూన్ తో నోట్లో పోస్తున్నారు. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. లతలో మార్పు లేదు.

వేరే డాక్టర్లను పిలిచి చూపించారు. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు ఎక్కువగా ఇవ్వడం వలన లత కోమాలోకి వెళ్లి ఉండవచ్చని చెప్పారు.

లత స్నేహితురాళ్ళు ఎమ్. ఏ. పరీక్షలు ముగిసిన తర్వాత లతను చూడాలని వచ్చి, లతను చూసి నిశ్చేష్టులయ్యారు.

స్నేహితురాళ్లు లతకు చెరొక పక్కన చేరి...లత చెవుల్లో నీ స్నేహతురాళ్ళం వచ్చాం. కళ్ళు తెరిచి చూడు అంటూ లత చెవుల్లో అరిచి గీ పెడుతున్నారు. లతా! లే అన్న మాటలు ఆ గదిలో ఆగకుండా వినిపిస్తున్నాయి. లత లో ఏ కదలికా లేదు. స్నేహితురాళ్ళు మంచం మీద పడి ఉన్న లత శరీరాన్ని కుదుపుతూ,

లతా! లేమ్మా అంటూ ఏడుస్తున్నారు. వారు ఎంత ప్రయత్నించినా లతకు మెలకువ రాలేదు.

స్వాతి: మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో ...కిల కిల నవ్వుతూ, గల గల మాట్లాడుతూ, ఇల్లంతా చక చక తిరుగాడే లత మంచాన పడి పోతే , మేము చూసి భరించ లేక పోతున్నాం. "జీవితం ఎంత చిన్నది". ఇరవై సంవత్సరాలకే లత జీవితము ఇలా అయ్యింది అంటూ విలపించింది.

ఆంటీ! పెద్ద వారు మీరు ఇలా బాధ పడుతుంటే మేము ఏమి చెప్పగలం? మేము కొద్ది సేపు ఉండి లతను చూసి బాధపడి వెళ్లి పోతాము. కానీ మీరు మంచాన పడి ఉన్న లత ను చూస్తూ, తనకు పసిపాపకు చేసినట్లు సేవ చేస్తూ, మీ జీవితం అంతా గడపాలి అన్న ఊహ మమ్మల్ని భయపెడుతున్నది.

అలా అనకండమ్మా! లత పది సంవత్సరాల వయసు నుండి...అమ్మ ఇంట్లో ఎంతో కష్ట పడుతోంది. అమ్మకు సాయం చేయాలి ...అంటూ నాకు ఇంటి పనుల్లో సాయం చేసేది.

అలాంటి లత ఈ రోజు .... ఏ శాపవశానో మనందరినీ మరిచిపోయి కోమా లోకి వెళ్లి పోయింది. నా బంగారు తల్లి లత నా కళ్ళ ముందు బ్రతికి ఉందన్న ఆనందంతో, లతకు సేవ చేస్తూ బ్రతుకుతా...

ఆంటీ! అమ్మ అనే పదానికి రూపం వస్తె అది మీ లాగే ఉంటుంది. మీ లాంటి అమ్మలు ఉండబట్టే మన భారత భూమి ప్రపంచానికే తల మానికమైంది.

అమ్మంటే ...అమ్మే. అమ్మకు సాటి ఎవరూ లేరు, అంటూ రమ, సుధ లు, స్వాతికి పాదాభివందనం చేశారు.

********

Posted in May 2024, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!